26, జూన్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1094 (కలఁ గాంచితి మోద మలర)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

36 కామెంట్‌లు:

  1. పలుకోర్కెలు కొనసాఁగఁగ,
    నిలు వీడియుఁ, దోటలోన నిష్ఠను బాద
    మ్ములు మోపియు, నెదురం జిలు
    కలఁ గాంచితి మోద మలరఁ గనుమూయకయే.

    రిప్లయితొలగించండి
  2. గుండు మధుసూదన్ గారూ,
    ఉదయాన్నే మొట్టమొదట తోటను, అందలి చిలుకలను చూపిస్తూ మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మధుసూదన్ గారూ ! మీ చిలుకల పూరణ బాగంది...

    ఇల లాటరి టిక్కెట్టును
    అలవోకగ కొంటి నేను హాయిగ నెలకే
    కలవానిగ మారుదునని
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పగటికల పూరణ బాగుంది. అభినందనలు.
    "టిక్కెట్టును + అలవోకగ" సంధి జరగాలి కదా... అక్కడ "ఇల నొక లాటరి టిక్కె/ట్టలవోకగ..." అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  5. మలయప్ప సామి జూచితి
    సెలయేరును కొండపైన స్వేచ్చగ దిరిగే
    పలు రకముల చిలుకలు జిం
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తిరుమల అందాలను మనోహరంగా వర్ణించారు. పూరణ బాగుంది. అభినందనలు.
    "తిరిగే" అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ "స్వేచ్ఛఁ దిరుగు నా/ పలురకముల" అందాం.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరుగారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణ తో...

    ఇల నొక లాటరి టిక్కె
    ట్టల వోకగ కొంటి నేను హాయిగ నెలకే
    కలవానిగ మారుదునని
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

    రిప్లయితొలగించండి
  8. మాస్టరుగారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణ తో...

    మలయప్ప సామి జూచితి
    సెలయేరును కొండపైన స్వేచ్ఛఁ దిరుగు నా
    పలు రకముల చిలుకలు జిం
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

    రిప్లయితొలగించండి
  9. వెలివెన్నెల తెగఁ గాయగఁ
    గలహంసలు గ్రాలుచుండ కలువల నడుమన్
    దళుకుల వీణాపాణిని
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే !!!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కంది శంకరయ్యగారికి, గోలి హనుమచ్ఛాస్త్రిగారికి ధన్యవాదములు. గోలివారూ...మీ రెండు పూరణములు బాగున్నవి.

    నా రెండవ పూరణ:
    ఇల వీడి ఖతలమునఁ జనఁ,
    దుల లేనటువంటి సద్వ్రతుల్ గంధర్వుల్
    పులకించి, నాకు నిడ, నెఱ
    కలఁ గాంచితి మోదమలరఁ గనుమూయకయే. ౨

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ ! నమస్సులు. ఇది సరదా పూరణే ! మిత్రులు చంద్రశేఖరుల కొఱకు ,

    పిలుపుల సవ్వడి వినరే !
    మల శ్రేణుల మధ్య యేను మలయుచు నుండన్
    గలికి వరూధినియట దను
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే!!

    రిప్లయితొలగించండి
  12. నెలవంక పొడిచిన నిశిని
    యిలవంకకు జూచి నపుడు ఈశ్వరు డెలమిన్
    తలనున్న శీత కిరణుని
    కలఁ గాంచితి మోద మలరఁ గనుమూయకయే. (కల=చంద్ర కళ )

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి (మూడవ) పూరణ....

    కలి మహిమఁ బేద నయ్యును
    నిలలో ధనవంతునైన నెటు లుందునొ చే
    తలఁ గాకుండిననుఁ బగటి
    కలఁ గాంచితి మోద మలరఁ గనుమూయకయే.

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ దేనికదే ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ తాజా పూరణలు రెండూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో చిన్నసవరణ.....
    ‘నిలవంకకు జూచి నప్పు డీశ్వరు డెలమిన్’ (యిలవంకకు అని యడాగమం, అపుడు + ఈశ్వరుడు అన్నచోట విసంధి దోషాలు)

    రిప్లయితొలగించండి
  15. అలకేదారముజని వర
    దలచిక్కినమమ్ముబ్రోచు దైవముగ జవా
    నులచిరు వైమానిక చిలు
    కలఁ గాంచితి మోదమలరఁ గనుమూయకయే!!!

    రిప్లయితొలగించండి
  16. ఓ రైతన్న ఆనందము:

    పలు కష్టంబులఁబడి వి
    త్తులఁదెచ్చి నాటినపిదప తొలకరి వర్షం
    బుల చిగురించిన చిరు మొల
    కలఁగాంచితి మోదమలరఁగనుమూయకనే ||

    రిప్లయితొలగించండి
  17. తెలవారకమునుపే తను
    కలఁ గన్న విధము తనయుడు కలకల నగుచున్
    సెలవీయగ , నేనాతని
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

    రిప్లయితొలగించండి
  18. రఘు రామ్ గారు,
    చిరు మొలకలను జూసి నాకూ ఆనందము కలిగినది.
    రెండవ పాదము సరి చూసుకోవాలేమో.

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీదేవి గారూ, మీ సవరణకు ధన్యవాదములు..
    క్రింది విధంగా మార్చిన దోషముండదు కదా..

    పలు కష్టంబులఁబడి వి
    త్తులఁగొనిదెచ్చి భువిఁనాటి తొలకరివర్షం
    బులఁజిగురించిన చిరు మొల
    కలఁగాంచితి మోదమలరఁగనుమూయకనే ||

    రిప్లయితొలగించండి
  20. అలవోకగ నిద్రించగ
    పలురకముల గలలు వచ్చి భయమును గొల్పన్
    మెలకువ రాగా మరలను
    కల గాంచితి మోద మలర గను మూ యకయే

    రిప్లయితొలగించండి
  21. ఉత్తరఖండ్ వరదలలో చిక్కుకొని ప్రాణాలతో బయట పడిన ఓ యాత్రికుడి మనోగతం :

    అలల విలయమున జిక్కితి
    తలచితి నే జజ్జితినని తత్క్షణ మందే !
    ఇల నాకై మిగిలిన నూ
    కల గాంచితి మోదమలర గను మూయకనే !

    కనుమూయు = చనిపోవు

    రిప్లయితొలగించండి
  22. తాను పడుకొనే ముందు అడవిలో తప్పిపోయి తిరిగొచ్చిన తన మేకలను చూచుకొని సంబర పడుతున్న ఒక గొల్లవాడి వైనం :

    విలపించితి రాత్రి పగలు
    పొలమున జను మేకలన్ని పోయిన వెటకో !
    తలుపులను దెరచి నా మే
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే !

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,

    గురువు గారికి ధన్యవాదములు
    ఈ రోజు శ్రీ గుండు మధుసూదన్ గారి, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి,శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి,శ్రీ లక్ష్మీదేవి గారి ,శ్రీ రఘు రామ్ గారి మొలకల, శ్రీ సుబ్బారావు గారి, మరియు శ్రీ నాగరాజు రవీందర్ గారి ఉత్తరఖండ్ వరదల పద్యములు బ్లాగుకు క్రొత్త శోభ నిచ్చినవి. గురువు గారి పద్యములను కుడా జుదవలె నని నా కోరిక
    =======*========
    కిలకిల రవములు జేయుచు
    గలగల సెలయేరు ఝరిని గని నిలచెను నా
    చిలుకల చేష్టల గను జిం
    కల గాంచితి మోదమలర గను మూ యకయే |

    రిప్లయితొలగించండి
  24. కలువలు తారలు కులుకుచు
    తొలి వెన్నెల పున్నమందు తూలగ హేలన్ !
    వలవేసెను నెలరాజని
    కలఁ గాంచితి మోదమలరఁ గను మూయకయే

    రిప్లయితొలగించండి
  25. గలగల మని సెలయేరులు
    వలపుల ఝరి మోసుకొనుచు బ్రాంతిగ బోవన్ !
    కలవర బడి పులకింతల
    కలఁ గాంచితి మోదమలరఁ గను మూయకయే 1

    రిప్లయితొలగించండి
  26. వెలకిల పరుండి యుండగ
    పొలమున నే మంచె మీద పున్నమి రాత్రిన్
    వెలిగెడు తెలి మబ్బుల తున
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే !

    రిప్లయితొలగించండి
  27. తత్త్వపరముగా నా యీ పూరణ:

    కల వంటిది సంసారము
    మెలకువయే మోక్షపదము మేదిని బహు జ
    న్మల నొందు చుంటి నివ్విధి
    కల గాంచితి మోదమలర గను మూయకయే

    రిప్లయితొలగించండి
  28. మంద పీతాంబర్ గారూ,
    ప్రస్తుత విషయంపై చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రఘురామ్ గారూ,
    మీ పూరణ (సవరించినది) చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మెలకువ వచ్చాక కలను గుర్తుకు తెచ్చుకున్నారన్నమాట! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా అలరిస్తున్నవి. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘పున్నమి + అందు’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘తొలి వెన్నెల వెలుగులందు...’ అందామా?

    రిప్లయితొలగించండి
  29. పండిత నేమాని వారూ,
    మీ పూరణలోని తాత్త్వికత జ్ఞానబోధాత్మకంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. మన మిత్రులు శ్రీ మిస్సన్న గారి పూరణ:

    ఒక కేదార్నాథ్ యాత్రికుని అనుభవము:

    కలవోలె కరగె సర్వము
    నిలబడితిని కొండపైని నీరసమున వే
    ల్పులవలె దిగు సైనిక మూ
    కల గాంచితి మోదమలర గనుమూయకయే

    రిప్లయితొలగించండి
  31. కలహంస నడకల,చెలగు
    గలగల నగవుల,మెరిసెడు కనుల,చిలుకప
    ల్కుల, లేజెక్కిళుల, పొలతు
    కలఁ గాంచితి మోద మలరఁ గనుమూయకయే.

    రిప్లయితొలగించండి
  32. మిస్సన్న గారూ,
    ఇంట్లో కంప్యూటర్ సహకరించకున్నా బ్లాగు పట్ల అభిమానంతో నేమాని వారి ద్వారా పూరణ పంపినందుకు ధన్యవాదాలు.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    నిజమే... ఏ దిక్కునుండి ఏ హెలీకాప్టర్ వస్తుందో, ఎటునుండి రక్షించే సైనిక మూకలు వస్తాయో అని కళ్ళల్లో వత్తులు వేసికొని చూసే చార్ ధామ్ యాత్రికుల స్థితి అటువంటిదే..!
    *
    రామకృష్ణ గారూ,
    పొలతుకలను చూపించిన మీ పూరణ సరసంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. మాష్టారుగారూ,
    చూడండి, ఈ మూర్తి గారు పక్క క్లాసునుంచి వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు:-) పేరేమో నాది వరూధిని అందాలు ఆస్వాదించిందేమో ఆయన.

    రిప్లయితొలగించండి
  34. పలుమారులు విసిగించెడి
    తలతిరుగుడు రోగమున్న ధనయంత్రమునన్
    కలవరమును దీర్చెడి రూ
    కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే

    ధనయంత్రము = ATM

    రిప్లయితొలగించండి