19, ఫిబ్రవరి 2014, బుధవారం

పద్య రచన – 512

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. సొగసులు పొంగగా ప్రణయ సుందరి కన్నుల నీరు జారగా
    వగచుట కేమి హేతువది వారిజ లోచన మోస బోయినన్
    మగడని మంచి వాడనుచు మౌనముగా తల వంచి తీవెగా
    తగదిది బేల గావలదు దాగదు వంచన తేట తెల్లమౌ

    రిప్లయితొలగించండి
  2. కలకంఠి కంట నయ్యరొ!
    జలబిందువు లొలుకుచుండె సాకతమేదో
    తెలియంగావలె నియ్యది
    యిలవారికి శుభములొసగ దేసమయమునన్.

    రిప్లయితొలగించండి
  3. ఆడువారిని అక్కగానాదరించు
    నీతి గలయట్టి బంగారు జాతి మనది
    కారుచుండెను కన్నీరు ధారవోలె
    ఎట్టి పశువుల చేతిలో పట్టువడెనొ
    భవ్య భారత దేశపు పౌరులార
    కన్నెపిల్లల మానమున్ కాల్చవద్దు
    మాత్రు దేశపు ఖ్యాతిని మరువవద్దు
    భావి భారత వృద్ధికి బాటలిడుడు







    రిప్లయితొలగించండి
  4. ఒకచెంప మోదమేదుర
    మొకచెంప విషాదబాష్ప మొలుకఁగ జేయన్
    వికసిత ముఖకమలమ్మును
    వికలమనము తెలుఁగుతల్లి వేదన గూర్చెన్.

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    ఇంత అద్బుతమైన వృత్తాన్ని మీనుండి ఆశించలేదు. ఆనందంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    చక్కని పద్యాన్ని రచించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ప్రణామములు గురువుగారు..ఫొటోకి తగ్గట్టుగా మీ పద్యం అద్బుతంగా వుంది..

    రిప్లయితొలగించండి
  7. అందమొలికించె ముఖమార యటను జూడు
    చిత్ర మందలి సుందరి చెలువు తోడ
    నేమి ? కన్నీ ళ్ళు కార్చెను నెడమ కన్ను
    అడుగ దలచితి గారణ మామెను మఱి


    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులు చాలా మంచి చిత్రమును పెట్టి,అద్బుత మైన పద్యము వ్రాసితిరి. మీ పలుకులు నిజము గురుదేవా.
    ==============*===============
    నేటి యువకు(తు)ల గని కన్నీరు గార్చి,
    నేటి పాలకులను గని నీవు బాధ
    పడ్డ నించుక నైనను ఫలిత మేమి
    తెలుగు తల్లి ముద్దుల బిడ్డ తెలుసు కొనుము!

    రిప్లయితొలగించండి
  9. కలకంఠి కంట కన్నీ
    రొలికిన నింట సిరి నిలువ నొప్పదు ధరణిన్!
    బలహీన మైన భావన
    నిలుపక ధైర్యముగ బ్రతుక నేర్వుము తల్లీ!

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    ‘కన్నీళ్ళు కార్చిన దెడమ నేత్ర/ మడుగ దలచితి..." అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    శైలజ గారికి, వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. నమస్కారములు
    ఎంతో బోలెడు సంతోషం .గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి

  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో...

    నవ వధువగు తెలగాణము
    యవనుల పాలాయెనేడు. ఆంధ్ర జననికీ
    యవసర మందున మిగిలెను
    జవముగ నశ్రువులు, విడువ జాలని మమతల్

    మరువకు మీ తల్లిని నా
    శిరమగు నిను వేరుజేసి స్థిరముగ నీయన్
    మురిసిరి కేంద్రపు యమరులు
    తరమా ఇక కాలగతిని దాటగ నరయన్

    రిప్లయితొలగించండి
  13. మమతల పైనను మంత్రాం-
    గమునదె పైచేయి నిలచె ఘనముగ, నిక కా-
    లము మన కేమిడునో గద
    అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో!

    నా సోదరి నెగ్గినదా
    నా సోదరు డోడి పోయెనా నా వారే
    చేసిరి మోదము ఖేదము
    నా సీమకు నెవరికెరుక నా బాధ కటా

    రిప్లయితొలగించండి
  14. వారును వీరును మరచిరి
    దూరము చేసేరునన్ను దుర్దినమిదియే
    కారెను కన్నులు నీరయి
    తీరము మారిన తనయుల తీరును జూడన్

    రిప్లయితొలగించండి
  15. ఒక కంటను మోదము మరి
    యొక కంటను ఖేదమిదియె నోహో! హా! హా !
    ఇక ఖేదము మోదంబును
    ప్రకటింపక సాగుమమ్మ ప్రగతిని గనుచున్.

    రిప్లయితొలగించండి
  16. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం వైవిధ్యంగా, చమత్కారంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘కేంద్రపు టమరులు’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    నా పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు

    రిప్లయితొలగించండి