23, జనవరి 2015, శుక్రవారం

చమత్కార పద్యాలు - 212

కాకమానిరాయ!
ఇది నేను చదువుకునే రోజుల్లో మా గురువు గారు శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు చెప్పిన కథ...
శ్రీకృష్ణదేవరాయల సభలో మూర్తికవిఉండేవాడు. (రామరాజభూషణునికి మూర్తికవి అన్న పేరుంది కాని ఈ మూర్తికవి వేరొకరు కావచ్చు). ఒకసారి అతని కవిత్వాన్ని మెచ్చుకొని రాయలు కాకమానుఅనే గ్రామాన్ని దానంగా ఇచ్చి ఇంద్రనీలమణులు పొదిగిన కుండలాలను బహూకరించాడు. మూర్తికవి రోజూ వాటిని ధరించి సభకు వచ్చి అష్టదిగ్గజాలకు సమీపంగా కూర్చునేవాడు. ఆ మణులనుండి పరావర్తనం చెందిన నలుపువల్ల కవులందరి ముఖాలు నల్లగా కనిపించేవి. అది గమనించిన రాయలు నవ్వుతూ అష్టదిగ్గజాల ముఖాలు ఎందుకో వివర్ణమయ్యాయిఅని పరిహాసం చేశాడట.
ఈ అవమానాన్ని కవులు భరించలేకపోయారు. ఎలాగైనా అతని దగ్గర ఆ కుండలాలు లేకుండా చేయాలని నిశ్చయించుకున్నారు. కాని ఆ పనికి ఎవరు పూనుకోవాలా అనేది సమస్య. చివరికి తెనాలి రామకృష్ణుడు ఆ కార్యభారాన్ని తాను స్వీకరించాడు.
ఒకరోజు మూర్తికవి తన ఇంట్లో భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నవేళ రామకృష్ణుడు వెళ్ళాడు.
ఓహో.. రామకృష్ణకవి గారా? ఏమిటిలా దయచేశారు?” అడిగాడు మూర్తికవి.
రామకృష్ణకవి వినయంగా రాయలవారి మెప్పు పొందిన మేటికవులు మీరు. ఏదో కుర్రవాణ్ణి! మీమీద ఒక పద్యం వ్రాశాను. మీకు వినిపించాలని ఉబలాటంగా ఉందిఅన్నాడు.
ఆలస్య మెందుకు? వినిపించుఅన్నాడు మూర్తికవి.
రామకృష్ణకవి వినిపించిన పద్యం ఇది....
అల్లసానివాని యల్లిక జిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాండురంగవిభుని పదగుంఫనంబును
కాకమానిరాయ! నీకె తగుర.
(కాకమాని గ్రామానికి అధిపతివైన ఓ మూర్తికవీ! అల్లసాని పెద్దన కవిత్వంలోని అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మన ముద్దుమాటలతో కవిత్వం చెప్పే నైపుణ్యం, పాండురంగమాహాత్మ్య కర్త తెనాలి రామకృష్ణుని కవిత్వంలోని పదగుంఫనం నీకే తగినట్టివి)
ఆ పద్యాన్ని విని మహదానందభరితుడైన మూర్తికవి ఏం కావాలో కోరుకోఅన్నాడు.
మీ కుండలా లివ్వండి చాలు!అన్నాడు రామకృష్ణుడు.
మూర్తికవి సంతోషంగా తన కుండలాలు తీసి ఇచ్చాడు.
మరునాడు కుండలాలు లేకుండా సభకు వచ్చిన మూర్తికవిని చూసి రాయలు ఈరోజు కుండలాలు లేకుండా వచ్చారేం?” అని ప్రశ్నించాడు.
రామకృష్ణకవి నామీద ఒక పద్యం చెప్పాడు. సంతోషించి బహుమానంగా ఇచ్చానుఅన్నాడు మూర్తికవి.
ఔనా? ఒక కవిని మెప్పించిన పద్యం అంటే అది చాలా గొప్పదై ఉండాలి. ఏదీ వినిపించండిఅని కోరాడు రాయలు.
నన్ను పొగడిన పద్యాన్ని నేనే చెపితే బాగుండదు. రామకృష్ణ కవి ఉన్నాడు కదా! అతణ్ణే చదవమనండిఅన్నాడు మూర్తికవి.
రాయల కోరికమీద రామకృష్ణుడు ఆ పద్యాన్ని చదివి వినిపించాడు. దాన్ని వినగానే రాయలతో సహా సభికులంతా గొల్లుమని నవ్వారు. ముఖం వివర్ణం కావడం ఈసారి మూర్తికవి వంతయింది.
చమత్కార మేమిటంటే...
మూర్తికవి వీపున తామర. అందుకని ఎప్పుడూ తన ఆసనాన్ని ఒక స్తంభం దగ్గర వేసికొని దురద పెట్టినప్పుడల్లా వీపును ఆ సంభానికి రాసేవాడు. రామకృష్ణుడు పద్యం చివరిపాదాన్ని కాక - మానిరాయ నీకె తగురఅన్న విరుపుతో చదివాడు. మాను అంటే స్తంభం. స్తంభానికి వీపురాయడం నీకే తగునుఅన్న అర్థం వచ్చేలా చదివాడు.
ఆ విధంగా మూర్తికవికి శృంగభంగం జరిగింది.

6 కామెంట్‌లు:

  1. మంచి చమత్కారాన్ని పరిచయం చేశారు గురువుగారూ.

    రిప్లయితొలగించండి
  2. మాన్యులు శ్రీ శంకరయ్యగారికి
    నమస్కారములతో,

    ఇది శ్రీకృష్ణదేవరాయల నాటి ఉదంతం కాదు. ‘మూర్తికవి’ అనే పర్యాయనామం కలిగిన రామరాజభూషణునితో దీనికెటువంటి సంబంధమూ లేదు. ఇది కాకమాని మూర్తికవి రచించిన ‘పాంచాలీ పరిణయము’ కావ్యం ప్రథమాశ్వాసంలోని పన్నెండవ పద్యం. కృతిపతి శ్రీరంగేశ్వరుడు కవికి కలలో సాక్షాత్కరించి కృతిరచన కావింపుమని ఆదేశించిన సందర్భం లోనిది.

    తెనాలి రామకృష్ణకవి రచించిన ‘పాండురంగమాహాత్మ్యము’ క్రీస్తుశకం 1575 నాటిది. కనుక, “పాండురంగవిభుని పద్యంబు హరువును” అని రామకృష్ణకవిని పేర్కొన్న మూర్తికవి పద్యం అంతకు కనీసం అయిదారేళ్ళకు తర్వాతిదై ఉండాలి. ‘రాజవాహన విజయము’ మూర్తికవి రచించిన మరొక కావ్యం. అంతర్గతసాక్ష్యాలను బట్టి రెండూ క్రీస్తుశకం 1580-1585 నాటివి. కాకమాని మూర్తి ఇంటిపేరు పెన్నేకుల వారని కొందరంటారు. కౌండిన్య సగోత్రులు రెండు ఇంటిపేర్లవారిలోనూ ఉన్నారు.

    క్రీస్తుశకం 1580లో రామకృష్ణకవి జీవించే ఉన్నాడు. తనతో సాటిరాగల కవినని మూర్తికవి చెప్పినందువల్ల కోపించి ఈ అవహేళనను నిజంగానే చేసిఉండవచ్చును. పైగా, తెనాలి రామకృష్ణకవి ‘పాండురంగమాహాత్మ్యమును’ను రచించినవాడే కాని, ‘పాండురంగవిభుడు’ కాడు. అందువల్ల కూడా అసందర్భపు ప్రశంస అని కోపించాడేమో. “పాండురంగ సుకవి పద్యంబు హరువును’ అన్న పాఠాన్ని కొందరు స్వీకరించారు. అది ఆ విధంగా ‘పాంచాలీ పరిణయము’లో లేదు. ఆ ప్రకారం చూసినా, ‘పాండురంగమాహాత్మ్యము’ను చెప్పినవాడు ‘పాండురంగ సుకవి’ కాడు. పెద్దన, తిమ్మనల పేర్లు చెప్పి తన పేరు చెప్పలేదని రామకృష్ణకవి ఆగ్రహించి ఉండవచ్చును.

    సదాశివదేవరాయలకు తర్వాతి కాలంలో నిజంగానే జరిగిన కథై ఉంటుంది. కవులిద్దరూ అక్కడివారే.

    ఉపాధ్యాయులు ఇటువంటి కథలను విద్యార్థులకు చెబుతుండటం వల్ల వారికి ఆసక్తి పెరిగి భాషాపరిజ్ఞానానికి తోడ్పడుతుంది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  3. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఆ పద్యంయొక్క పూర్వపరాలను సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
    ఈ పద్యాన్ని గురించి నేను చెప్పిన కథ మా గురువుగారు చెప్పినదే తప్ప ఇంకెక్కడా చదవలేదు. అందులోను విద్యార్థిదశలో విన్నది కదా.. మనస్సులో స్థిరంగా ఉండిపోయింది.
    అందరికీ ఉపయుక్తమైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మాష్టారి చమత్కార కధ, ఏల్చూరి మురళీధరరావు గారి సందర్భోచిత వివరణ ... క్లాస్ రూం అనుభూతి ...

    రిప్లయితొలగించండి
  5. సాహితీ వేత్తలు శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి