8, ఫిబ్రవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1593 (భారతయుద్ధమందు దశవక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భారతయుద్ధమందు దశవక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్.

17 కామెంట్‌లు:

  1. సారధి యయ్యె కృష్ణుడెట చక్కని నేర్పున సవ్యసాచికిన్
    తారకరాముడెవ్వరిని దారుణయుద్ధమునందు గూల్చెనో
    చీరె హిరణ్యకశ్యపుని శ్రీహరి యేయవతారుడైయనన్
    భారతయుద్ధమందు, దశవక్త్రునిఁ జంపె, నృసింహుఁ డుద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  2. ధీరత సన్నగిల్లగను దేశికుడై యనె గీత యిచ్చటన్
    దారను పొంద దాశరథి తా కపి సైన్యముతో వధించెగా
    భారము నీవెగా పలుక భక్తుని బ్రోవ హిరణ్య కశ్యపున్
    భారత యుద్ధమందు, దశవక్త్రుని, జంపె నృశింహుడుద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  3. భారత యుద్ధ మందు దశ వక్త్రుని జంపె నృసింహు డుద్ధతి
    న్నారయ రావణుండు మఱి భారత మందెచ టుం డె నే గనన్ ?
    భారత యుద్ధ మందతని భారము బోవుట వీలుగా నగున్ ?
    పారము బొందగో రుప్రజ సారము వేడును నార సింహు నిన్

    రిప్లయితొలగించండి
  4. వారధి దాటుచున్ వెడలి వానర మూకలు లంకగాల్చ గా
    మేరువు వంటిరా వణుని మేదిని గూల్చెను రాముడ న్నచో
    మారెయు గంబులం దునను మారణ హోమము లెన్నితీరులన్
    భారత యుద్ధమందు దశ వక్త్రుని జంపె నృసింహు డుద్దతిన్

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘హిరణ్యకశిపుడు’ సాధురూపం.
    *****
    టి.బి.యస్. శర్మ గారూ,
    మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘హిరణ్యకశిపుడు’ సాధురూపం.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ధన్యవాదములు మాష్టారు.. సవరించిన పూరణ....
    సారధి యయ్యె కృష్ణుడెట చక్కని నేర్పున సవ్యసాచికిన్
    తారకరాముడెవ్వరిని దారుణయుద్ధమునందు గూల్చెనో
    చీరెను కశ్యపాత్మజుని శ్రీహరి యేయవతారుడైయనన్
    భారతయుద్ధమందు, దశవక్త్రునిఁ జంపె, నృసింహుఁ డుద్ధతి

    రిప్లయితొలగించండి
  7. ఏరణమందునన్ నరుని కేర్పడ చెప్పెను గీతశౌరియే?
    కారణజన్ముడౌ హరియె కానల నుండగ చంపె నెవ్వరిన్?
    భారము దించ భూసతికి బాధ్యత తోడుత రక్కసాధమున్
    భారత యుద్ధమందు దశ వక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  8. కృష్ణ గీత :

    భీరుఁడవై చరింపకుము- వెఱ్ఱివె? చంపఁగ నీవెవండవో?
    పోరునఁ జావ వారెవరు ? పొందుము ధైర్యము , పుట్టిరెందరో
    వీరులు మున్ను ధాత్రిపయి , ప్రీతి స్మరింపుము మున్ను ధీరుఁడై
    భారత ! యుద్ధమందు దశ వక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్ !

    ( పురుష సింహుఁడు , రాజ సింహుఁడు వలె నరులలో సింహము వంటివాడని రాముని గూర్చి సాభిప్రాయ ప్రయోగము )

    రిప్లయితొలగించండి
  9. ఆరయ త్ర్యర్ధి కావ్యమున హాయిగ వర్ణన చేయ నొక్కెడన్
    తీరిచి దిద్దె శిల్పమిటు తేటగు మాటల విష్ణుభక్తి తో
    పేరును గాంచ నొక్కకవి వేగము లేఖిని నిల్పిపల్కె సూ!
    భారత యుద్ధమందు దశవక్త్రుని జంపె నృసింహుడుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  10. ప్రేరణ బొందెనర్జునుఁడు లీలగ గీతను జెప్ప కృష్ణుఁడా,
    వీర పరాక్రమోద్ధతిని బెంచుచు ద్రుంచెను రాముఁడాజిలో,
    చేరి హతాశు జేయుచు విశేషముగా దనుజేంద్రునంతటన్
    భారత యుద్ధమందు, దశవక్త్రుని, జంపె నృసింహుడుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  11. క్రమాలంకారము

    శూరత జూపకుండగను సొంపుగ సారధి కృష్ణు డేడయెన్?
    ధారుణి ధర్మమున్నిలుప దాశరధెవ్వని జంపె లంకలో?
    క్రూరుడు స్వర్ణ కశ్యపుని కోపము తోడను చీల్చెనెవ్వడో?
    1భారత యుద్ధమందు,2దశవక్త్రుని జంపె,3నృసింహుడుద్ధతిన్

    తోరపు ధర్మమున్నిలుప తోచెను నెయ్యెడ పార్ధసారధై?
    వీరత జూపి మానవుగ వెన్నుడు నేరిని జంపె లంకలో?
    కూరిమి బాలు,కాన నెటు క్రూరత జీల్చెను భక్త రక్షకై?
    1భారత యుద్ధమందు,2దశవక్త్రుని జంపె,3నృసింహుడుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  12. కోరగనర్జనుండుతగుకోరికమేరకు-కృష్ణ సారధే?
    నేరముబెంచగాతగిననేర్పునలంకకువెళ్లిరాముడే?
    ప్రేరణనింపుచున్మనసుబిల్వ?హిరణ్యునిసంహరించెగా?
    భారతయుద్ధమందు.దశవక్త్రునిజంపె.నృసింహుడుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ సవరణ బాగున్నది. సంతోషం.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో అన్వయలోపం ఉంది. ‘బాధ్యతతో నెటు చంపె రాక్షసున్’ అనండి.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ సర్వోత్తమమై ఔత్సాహికులకు మార్గదర్శకమై శోభిల్లుతున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    ఆ పాదానికి మూడర్థాలను మమ్మల్నే వెదుక్కోమంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ గారూ,
    మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    కొన్ని లోపాలున్నాయి...‘దాశరథి + ఎవ్వని’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘మానవుడుగ’ అనవలసినచోట ‘మానవుగ’ అన్నారు. ‘వీరత మానవాకృతిని వెన్నుడు...’ అనండి. ‘కావ నెటు’ టైపాటు వల్ల ‘కాన నెటు’ అయింది.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.
    కాని మూడు ప్రశ్నలు అసంపూర్ణంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  14. నేనూ క్రమాన్నే ఆశ్రయించాను.

    ప్రేరణ నిచ్చి గీత, యెట వీరుని జేసెను పోర పార్థునిన్
    మారగ గీత, దాటి జన మైథిలి యేమొన రించె రాముడున్
    మీరగ గీత, స్థంభమున మించి సురారిని జంపి రెవ్వరో
    భారతయుద్ధమందు దశవక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న అన్నా! మీరు గీత "క్రమాన్ని" దాటకుండా భలే పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. తీరుగ హస్తినాపురిని తియ్యగ జేరుచు రాజ్యమేలుచున్
    నోరును జార్చకుండ భళి నొక్కుచు వైరుల గొంతులన్ సదా
    పోరుచు రావణాసురుని పోలెడు దేశపు ఖేదనమ్మునున్
    భారతయుద్ధమందు దశవక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్

    రిప్లయితొలగించండి