25, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1606 (కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము.

19 కామెంట్‌లు:

  1. ద్రౌపదినవమానపరచ దగదటంచు
    పల్కుచు సుయోధనాదుల ప్రతిఘటించి
    నట్టి కౌరవులందునున్నతుడయిన వి
    కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము

    రిప్లయితొలగించండి
  2. కుంతి భోజుని ముద్దుల కూతురు గద
    కర్ణునకు దల్లి,గాం ధారిగా నెఱు గుము
    ఖలుడు నైన దుర్యో ధను గనిన తల్లి
    యంధు రాలుగ మారిన యతివ యామె

    రిప్లయితొలగించండి
  3. ఆది దేవుని వరమున కుంతి సుతుడు
    కర్ణునకుఁ తల్లి , గాంధారి గానెఱుఁగుము
    పాండ వాగ్రజుని భార్య పరమ సాద్వి
    శతము సంతును బడసిన శాంతి శమము

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    వికర్ణుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కుంతి యయ్యెఁ| గర్ణునకుఁ దల్లి...’ అనండి. ‘శాంతి శమము’ను ‘శాంతమూర్తి’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. అర్ధ రాజ్యం బొసగినట్టి యాప్త బంధు !
    ప్రాణ మొసగ నెంచెగ తాను ప్రేమ తోడ !
    కన్న తల్లి కుంతి నిజమె , గాని దాన
    కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము !
    .........డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  6. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. దొడ్డ కురురాజునకు భార్య, దుశ్చలకు వి
    కర్ణునకుఁదల్లి గాంధారిగా నెరుగుము
    పెద్దలందరి ముందర పెదవి విప్పి
    యెత్తి చూపెఁ దప్పు వికర్ణు డెదురుతిరిగి
    నిండు సభలోన నందరి నెండ గట్టి

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. కుంతి భోజుని బుత్రిక కుంతి యగును
    కర్ణునకు దల్లి , గాంధారిగా నెఱుగుము
    శకుని సోదరి దృతరాష్ట్ర సతియె తాను
    జఱభులైన కౌరవులకు జనని యామె !!!

    రిప్లయితొలగించండి
  10. వాసు దేవుని మేనత్త వరుస జూడ
    కర్ణునకుఁ దల్లి , గాంధారిగా నెఱుఁగుము
    శకుని భగినిగా కాంధార సకియ గాను
    వావి వరసలు ముచ్చటౌ భార తాన !!

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి వారూ,
    మీరు దుశ్శలను దుశ్చల అన్నారు.
    -----
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కర్ణ, దుర్యోధనుల మైత్రి ఘనత తోడు
    నన్న దమ్ముల బంధము నెన్న దగును
    తోడి కోడలై కుంతి కుదుర, వరుసకు
    కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెరుఁగుము

    రిప్లయితొలగించండి
  13. మస్టారూ!అక్కయ్యగారి పూరణలో 'పాండవాగ్రజుని భార్య'అంటే ధర్మరాజు భార్య అవుతుంది కదా!

    రిప్లయితొలగించండి
  14. కర్ణు గన్న జనని కుంతి కాని రాధ
    కర్ణు బెంచిన మాతృక కరుణ చేత
    కర్ణు కిచ్చెను రాజ్య భాగము కురుపతి
    కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము.

    రిప్లయితొలగించండి
  15. రాజరాజనె గురువుతో రాజసభను
    కర్ణుడటు సూతసుతుడెట్లు?కౌరవునకు
    సఖుడు నౌటను నాతల్లె సఖుని తల్లి
    కర్ణునకు తల్లి గాంధారిగా నెరుగుము!

    కన్యగానున్న కుంతియే కనుట,నామె
    కర్ణునకు తల్లి,గాంధారిగా నెరుగుము
    కౌరవులకు తల్లిగా,కవల తల్లి
    మాద్రియౌగాదె?భారత మరయ గాను!

    రిప్లయితొలగించండి
  16. అవును చంద్రమౌళి గారూ ! మీరన్నది కరక్టే
    నేను తర్వాత గమనించి మరొకటి వ్రాసాను కానీ అప్పటికే గురువులు సరిజేసారు సరే అదే రైటేమో అనుకుని చెరిపి వేసాను .బహుశ గురువులు గమనించ లేదను కుంటాను .తెలిపి నందుకు
    ధన్య వాదములు సోదరా

    రిప్లయితొలగించండి
  17. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును నమశ్శతములతో...

    (కర్ణుఁడును దుర్యోధనుఁడునుఁ దోడఁబుట్టిన సోదరులవలె మెలఁగుటనుఁ గూర్చి శ్రీకృష్ణుఁ డర్జునునితో ముచ్చటించు సందర్భము)

    ఆ సుయోధను కోర్కెపై నంగరాజ్య
    పట్టమందియు నెయ్యుని భ్రాతృసముఁగఁ
    దలఁచి మసలెను కర్ణుండు! దాని కతనఁ
    గర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము!!

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నిజమే! నేను గమనించలేదు. ధన్యవాదాలు.
    అక్కడ ‘పాండురాజాగ్రజుని’ అంటే సరి!
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కర్ణున కొసంగె రాజ్యభాగము...’ అనండి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి