27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1608 (టీవీ లుండెనట మునికుటీరములందున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
టీవీ లుండెనట మునికుటీరములందున్.
(ఆకాశవాణి వారి సమస్య ఆధారంగా) 

20 కామెంట్‌లు:

  1. తల్లి తనయుడిని హాస్టల్ కు బంపుతూ:

    ఆవుల దూడల చెంతనె
    పూవులతీవలు వరలెడు పొదరింటన్ మే
    లౌ విద్యలనేర్వగ, ప
    ట్టీ! వీలుండెనట మునికుటీరములందున్.

    రిప్లయితొలగించండి
  2. కావలెనట సెల్ ఫోనులు
    కావలెనట టీవిమరియు కంప్యూటరులే
    యవిలేక రాదె చదువే
    టీవీలుండెనటమునికుటీరములందున్?

    రిప్లయితొలగించండి
  3. ఆవెను కటియుగ ములలో
    నీవే లేతల చితివని నేపిలువంగన్
    భావన మందసము లవలె
    టీవీ లుండెనట ముని కుటీరము లందున్

    రిప్లయితొలగించండి
  4. పావన పురుషుల సన్నిధి
    సేవా భావముల తోడ శిష్య రికమ్మే
    యావేళల భాగ్యము, ఏ
    టీవీలుండెనటమునికుటీరములందున్?

    రిప్లయితొలగించండి
  5. శ్రీవిద్యల నిలయంబై
    గోవిందుని నామ జప,మకుంఠితదీక్షా
    భావంబులు పంచగ చం
    టీ! వీలుండెనఁట మునికిటీరమునందున్.

    రిప్లయితొలగించండి
  6. ఆ వెనుకటి కాలములో
    సేవలు జేయుచు గురువులు చెప్పినదంతన్
    చేవగ నేర్వగ మరి చి
    ట్టీ ! వీలుండెనట మునికుటీరములందున్.

    రిప్లయితొలగించండి
  7. భావకవిత్వము వేదము
    భావుకమౌనాట్య గాన పాటవములకున్
    భావితరాలకొసగ పో
    టీ,వీలుండెనట ముని కుటీరములందున్ !!!

    రిప్లయితొలగించండి
  8. ఏవో వాదములన్ దిగి
    వేవేల మునులు, తమంత వీరులు గలరే!
    యావిధముగ తమలో పో
    టీ, వీలుండెనట ముని కుటీరములందున్

    రిప్లయితొలగించండి
  9. ఆవేదకాలమున నే
    టీవీలుండెనట ముని కుటీరములందున్
    పావన చరితలఁగల ఘన
    సంవేదులుకలరుచెప్ప సంగతులు వెసన్

    రిప్లయితొలగించండి
  10. ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి వందనములతో........

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణలో ప్రాస తప్పినదనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  12. పూవుల్ దర్భలు సమిధలు
    గోవుల్ హోమాగ్ని వేద కోవిద చర్చల్
    గోవిందారాధన చే
    టీవీ లుండె నట ముని కుటీరము లందున్.

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి గారి పూరణ లో మూడవ పాదం మొదటి అక్షరాన్ని గురువుగా మార్చవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం మూడవ పాదంలో ప్రాస తప్పింది. అక్కడ ‘లేవా యిక రాదు చదువు’ అందామా? (మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యంలో నాల్గవ పాదంలో ప్రాస తప్పింది. అక్కడ ‘కోవిదులే కలరు చెప్ప గూఢవిషయముల్’ (సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

    రిప్లయితొలగించండి
  15. శ్రీవాణి ( ని పూజించగ
    పావన వేదాధ్యయనపు పాటవ మొప్పన్,
    భావింప నాడచట పో
    టీ వీలుండెనట మునికుటీరములందున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ణిని’ మధ్య అరసున్నా ఎందుకు వచ్చింది? ‘శ్రీవాణినిఁ బూజించగ’ అనవలసింది.

    రిప్లయితొలగించండి
  17. పెద్దలు మిస్సన్నగారికి సవరణ సూచించిన మాస్టరు గారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  18. ప్రాస దోషాన్ని గుర్తించిన పెద్దలు సంపత్ కుమార్ శాస్త్రి గారికి, సవరించిన పూజ్య గురుదేవులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీవాణి నిc బూజించగ
    పావన వేదాధ్యయనపు పాటవ మొప్పన్,
    భావింప నాడచట పో
    టీ వీలుండెనట మునికుటీరములందున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు27/02/15

    రిప్లయితొలగించండి
  20. స్మృతి ఇరాని ఉవాచ:

    "ఆ వేద కాలమందున
    పావనమగు దివ్యదృష్టి పడతుల కుండెన్
    కావలసినన్ని ఛానెల
    టీవీ లుండెనట ముని కుటీరములందున్"

    రిప్లయితొలగించండి