5, ఫిబ్రవరి 2015, గురువారం

పద్యరచన - 812

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. అరుణవర్ణమందు నలరారుచున్నట్టి
    యాంజనేయస్వామి నమ్ముకొనిన
    భక్త జనుల మదిని భయములన్ని తొలగి
    ధైర్యమొంది పొందు కార్యసిధ్ధి

    రిప్లయితొలగించండి
  2. సామర్ల కోట పురమున
    రాముని భక్తునిగ వెలయు రమ్యుడ ! హనుమా !
    రాముని భక్తుడ నేనును
    రాముని సేవించు విధము రక్షించు ననున్

    రిప్లయితొలగించండి

  3. లలిత నామంబు లన్నియు లహరి గాగ
    మానసంబున పరుగిడు మహతి లీ ల
    రమ్య మలరంగ సేతు పారాయ ణంబు
    నా మనంబున నుండుమా రామ భక్త

    రిప్లయితొలగించండి
  4. భక్తుల పాలిట కొలువై
    యుక్తిగ నీవచట నుండి యూరికి చివరన్
    ముక్తికి మార్గము జూపుచు
    శక్తులు ప్రసరించి హనుమ శాసించు టకై

    రిప్లయితొలగించండి
  5. దూరమున్నట్టి వారల నూరడించి
    దరికి జేర్చగ నూరంత పెరిగినావ
    కనుచు గొలిచిన నందరి గావు హనుమ !
    సుందరాకార సిందూర సూర్య తేజ !

    రిప్లయితొలగించండి
  6. నిన్నటి పద్య రచన.......


    కనగ ధారణ నతనికి ' గరిక పాటి '
    మరి సహస్రావధానమ్ము ' గరిక పాటి '
    గరిమ చాతుర్య భాషణ ' గరిక పాటి '
    ఘనుడు చూడగ నవధాని " గరికిపాటి "

    రిప్లయితొలగించండి
  7. రాముని కన్న ఆ హనుమ రామ భక్తుండు
    మేల్కాదే మనసా రామ రామ యన, మనంబు
    విశదీకరించే,వినుటకు చెవి లేకున్న అరణ్య
    వృక్షం నేలబాలౌ శబ్దం వినబుడునా జిలేబి ??

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    అది సామర్లకోట చిత్రమని తెలిపినందుకు ధన్యవాదాలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ******
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    గరికిపాటి వారిపై మీ పద్యం విలక్షణంగా ఉంది. సంతోషం!
    *****
    జిలేబీ గారూ,
    శుభోదయం!

    రిప్లయితొలగించండి
  9. అరుణ కాంతులొలుకు యంజనీనందన
    భయము బాపు నాకు భక్తినివ్వు
    రామదూత హనుమ రక్షించవేనన్ను
    దాశరథిని గొలుచు దాహమివ్వు

    రిప్లయితొలగించండి
  10. శ్రీవల్లి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దాశరథిని గొలుచు దారి చూపు’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  11. రామ భక్తి తోడ రంజిల్లు చున్నట్టి
    యంజన ప్రియపుత్ర ఆంజనేయ
    పార్థు సిడమునగల పవమాన సూనుడ
    సన్నుతింతు నిన్ను సంతతమ్ము

    రిప్లయితొలగించండి
  12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. సీత జాడ గనగ సింధువు లంఘించి
    ..........గురుతుమాత కొసగు కొడుకు నీవు
    లంకేశు భయపెట్ట లంకను గాల్చిన
    ........... రామరావణ యుద్ధ రచన నీవు
    సౌమిత్రి గావగ సంజీవి గొనిదెచ్చి
    ........ సంతస మందించు శక్తి నీవు
    రామనామ మహిమ రమ్యంబుగాజెప్పి
    ........భువిని భక్త జనుల బ్రోచినావు


    అట్టి నీరూపు స్మరియింతు నాంజనేయ
    నార్త రక్షణ సేయంగ నవని నిలచి
    లీల జూపగ రావయ్య గాలి చూలి
    శరణు వేడెద భక్తితో సంతతమ్ము !!!



    రిప్లయితొలగించండి
  14. చిన్న రూపము దాల్చి లంకను చిత్రముల్ దరిశించె భీ-
    మన్న యాకృతి తోడ నప్పుర మంతయున్ దహియించె తా-
    నున్న చోటునె రాక్షసాళిని యుగ్రుడై వధియించె చూ-
    డన్న యిచ్చట పెద్ద దేహము నంది మారుతి నిల్చె నే-
    నున్న తావుల భీతి లేదని యూరి కభయము నిచ్చుచున్.

    రిప్లయితొలగించండి
  15. శైలజ గారూ,
    మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ మత్తకోకిల బాగున్నది. అభినందనలు.
    ‘దరిశించె’...? ‘చిత్రముల్ రచియించె’ అంటే ఎలా ఉంటుంది?
    ‘ఊరి కభయము’ అన్నచోట గణదోషం. ‘ఊరికిన్ మను పిచ్చుచున్’ అందామా? (మనుపు = అభయము)

    రిప్లయితొలగించండి
  16. గురువుగారూ ధన్యవాదాలు. చిన్న రూపుతో లంకలోని చిత్రాలన్నీ చూశాడు హనుమ అని నా ఉద్దేశం. రెండవ సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    మీ ఉద్దేశం నాకు అర్థమయింది. కానీ ‘దర్శించు’ శబ్దం ఉంది కాని, ‘దరిశించు’ అని లేదు.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ ధన్యవాదాలు. సవరణకు ధన్యవాదాలు మరోసారి.

    రిప్లయితొలగించండి