20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1602 (భాష రానివాఁడు పండితుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భాష రానివాఁడు పండితుండు

23 కామెంట్‌లు:

 1. పామరు డగు నార్య !పండిత లోకాన
  భాష రాని వాడు ,పండి తుండు
  ప్రస్తు తించ బడును పాండిత్య గరిమచే
  వంద నములు సేతు పండి తునకు

  రిప్లయితొలగించండి

 2. " చెట్టు లేని చోట చిట్టి యాముదమునే
  వృక్ష మందు " రనగ వృధ్ధు లపుఁడు ,
  మాతృభాష కన్ను మఱుగయె , యిప్పుఁడు
  భాష రాని వాఁడు పండితుండు !

  ( ఆంగ్ల మాధ్యమికాల ధర్మము !)

  రిప్లయితొలగించండి
 3. తెనుగు వ్రాయలేడు ఎనిమిది చదివియు
  కారణమ్ము చూడ కలగు మనసు
  పాఠ శాల లోన పరికింపగ తెలుగు
  భాష రానివాఁడు పండితుండు.

  రిప్లయితొలగించండి
 4. పలుకుల జవరాలు వసియించమదిలోన
  వ్రాసె రామచరిత వ్యాధుడొకరు
  డబ్జ యోని పత్ని యండతో నయ్యెను
  భాషరానివాడు పండితుండు

  రిప్లయితొలగించండి
 5. వేషముపరికింప భేషజముగ నుండు
  భూషణము ధరించు భుజదలమున
  భాషణమ్ము సేసి పలువురి దూషించు
  భాష రాని వాడు ,పండి తుండు

  రిప్లయితొలగించండి
 6. మృదు మధుర పలుకుల మేళవింపులతోడ
  ధర్మసూక్ష్మ కలిత మర్మములను
  తెలియఁజేయు నార్య ధీమంతుఁడితఁడు దు
  ర్భాష రానివాఁడు పండితుండు.

  రిప్లయితొలగించండి
 7. సకలదేశములను సంగీత సభలలో
  వారి వారి జంత్ర వాద్యములను
  వారు మెచ్చు రీతి వాయింప గల్ల్గిన
  భాష రాని వాడు ,పండి తుండు

  రిప్లయితొలగించండి
 8. మల్లెలవారి పూరణలు
  తాను పలుకు భాష తప్పులే పలుకగ
  గ్రామ్యభాషగానె రమణమైన
  మాట.నేయమర్ధ మదియ,కనెడు రీతి
  భాష రాని వాఁడు పండితుండు !
  2.భాషలెన్నొ గలవు బహుళమౌ దేశాల
  అన్ని భాసలంద రరయలేరు
  తనదు భాష తాను ధాటి నేర్చి యితర
  భాష రాని వాఁడు పండితుండు

  రిప్లయితొలగించండి
 9. కెఎస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  చెడిన చేదు వడిన చెరకు రీతిగ మారె
  పటిమ కోలుపోయి భాష నేడు
  మందమతి బహుమతి మండితుండు మరియు
  భాష రాని వాఁడు పండితుండు !

  రిప్లయితొలగించండి
 10. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. నిజమే... ఇప్పుడు పాఠశాలల్లో పనిచేసే చాలామంది తెలుగు పండితులకు ప్రాథమిక జ్ఞానం ఉండడం లేదు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  "వ్రాయలేడు + ఎనిమిది" అని విసంధిగా వ్రాశారు. `వ్రాయనేర డెనిమిది" అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  కె.యెస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పామరుండుగూడ ప్రావీణ్యతనుపొంది
  శంకరాభరణము చలువతోడ
  పద్యరచనజేయు భవ్యముగ-నగును
  భాష రానివాఁడు పండితుండు

  రిప్లయితొలగించండి
 12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు. (కానీ... కొంచెం ఎక్కువయిందేమో?!)

  రిప్లయితొలగించండి
 13. సంప్రదించ వచ్చు సహచరులను గాని,
  దెలియ గోరి వచ్చి కలియు వారి
  విసుగు జూపి వదరి కసరు యనుచితంపు
  భాష రాని వాడు పండితుండు.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారూ ధన్యవాదాలు. పొరబాటుకు చింతిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కట్నమాశచేతగయ్యాళిభార్యను
  పెళ్లిజేసుకొన్నపెద్దకొడుకు
  అమ్మ,యాలిచెంత?నలుసుగమాట్లాడు
  భాషరానివాడుపండితుండు|
  2పలుకలేడు,భాషరానివాడు|"పందితుడుగా
  మలచగలిగె|"తండ్రిమూగమంత్రములనునేర్పుతూ
  విలువనిలువలున్నచదువెవిశ్వమనుచుభావనన్
  పలుకులున్నకొడుకుమంచి-ప్రాజ్ఞుడవ్వ?గర్వమే|

  రిప్లయితొలగించండి
 17. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘పండితుండుగా’ అనండి. లేకుంటే గణదోషం. ‘నేర్పుతూ’ అనడం గ్రామ్యం. ‘నేర్పుచున్’ అనండి.

  రిప్లయితొలగించండి
 18. వెర్రి వెంగళాయి విద్యావిహీనుండు
  తెలివి లేనివాడు తెగువజూపి
  కాళికాంబగొల్చి కాళిదాసుండాయె
  భాషరానివాడు పండితుండు

  Kameswara Sarma Sriadibhatla

  రిప్లయితొలగించండి
 19. శ్రీ శంకరయ్య గారికి - అభివాదములతో , మీ అనుమతితో , మీ దృష్టిని తప్పించుకున్న విషయాలపై ఇతర కవిబృందానికి కొన్ని సూచనలు.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి పద్యంలో ' మృదు మధుర పలుకుల ' సమాసం మార్చవలసి ఉంటుంది.
  వారిదే పద్య రచన మూడవ పాదం చివర ' దీవ్యద్భాసితుండై మహా ' అంటే సరిపోతుంది. ( భాసితో తేజుడు సమసించదు కనుక )
  అలాగే గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పద్యం రెండవ పాదంలో ' దెలియగోరి 'కి మారుగా ' తెలియగోరి ' అనే అనవలసి ఉంటుంది. మూడవ పాదం ' విసుగుఁ జూపి వదరి కసరెడి యనుచిత ' అంటే సరిపోతుంది . ( ఉత్తునకు సంధి నిత్యం కనుక )

  శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి - పాల సముద్రము దుష్ట సమాసము కాదు, యథేచ్ఛగా వాడవచ్చు.

  శ్రీ సుబ్బారావుగారి నిన్నటి దత్తపది పూరణ ఉత్పలమాల పద్యం జాతి పద్యం, అందులో ప్రాసయతి ఉండదని గమనించ సూచన.

  అలాగే శ్రీమతి లక్ష్మీదేవి గారి నిన్నటి దత్తపది మొదటి పాదం యతి ప్రతిపాదనార్థమై మార్చవలసి ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 20. సైగ జేసి తగిన సంతృప్తి పడుచుండు
  భాష రాని వాడు;పండితుండు
  భావ జలధి చిలికి పదిమందికిని పంచి
  సేవ జేయుచుండు చిత్రరీతి

  రిప్లయితొలగించండి
 21. మాట మాట నడుమ మరికొంత పరభాష
  కలిపి కలిపి యాస బలుకు నటుల
  బట్లరింగిలీసు, బడబడ వాగెడు
  భాష రాని వాడు పండితుండు


  రిప్లయితొలగించండి
 22. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందలు.
  ****
  డా. విష్ణునందన్ గారూ,
  ధన్యవాదాలు. ఆదోషాలను గుర్తించకపోవడం నా పరిశీలనాలోపమే!
  సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణలో ‘మృదుమధురపదముల మేళవింపు...’ అంటే ఎలా ఉంటుంది?
  నిన్నటి దత్తపదిలో లక్ష్మీదేవి, సుబ్బారావు గారల దోషాలకు సవరణలను నిన్నటి పోస్టులోనే సూచించాను. గమనించండి.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. సరి యైన సవరణలు సూచించినడా.విష్ణునందన్ గారికి ధన్యవాదములు.
  సవరించిన పద్యం :
  సంప్రదించ వచ్చు సహచరులను గాని,
  తెలియ గోరి వచ్చి కలియు వారి
  విసుగు జూపి వదరి కసరెడు యనుచిత
  భాష రాని వాడు పండితుండు.

  రిప్లయితొలగించండి