4, మే 2015, సోమవారం

సమస్యా పూరణము - 1665 (హార మొసఁగు శుభము లందఱకును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
హార మొసఁగు శుభము లందఱకును.

17 కామెంట్‌లు:

  1. సార భారతీయ సంసార సంస్కార
    ధార కిపుడు కీడు దాపురించె
    దాని నాపు దుర్విధాన సంధాన సం
    హార మొసఁగు శుభము లందఱకును

    రిప్లయితొలగించండి
  2. వేష భాష లందు వేయివి ధమువెఱ్ఱి
    భార తీయ నుడువు పనికి రాదు
    బ్రమను వీడి జనులు పరితాప మునసం
    హార మొసఁగు శుభము లంద ఱకును

    రిప్లయితొలగించండి
  3. జీవనమున గలుగు చిక్కుల నెదిరించ
    మితము గాను దినుట హితము గాదె
    సత్తు నిడుచు రుచిని సమగూర్చు సాత్వికా
    హారమొసఁగు శుభము లందరకును!!!

    రిప్లయితొలగించండి
  4. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మేలు గూర్చునట్టి మెండు విటమినులు
    మంచిపండ్లు ,పాలు,మాంస కృతులు
    కండ పుష్టి గూర్చు ఘనమైన సాత్వికా
    హార మొసఁగు శుభము లందఱకును.

    రిప్లయితొలగించండి
  5. కావలయును శ్రాంతి కర్షకజనులకు
    వేసవిసమయముల ప్రీతి కలుగ
    పండుగదినములను ప్రఖ్యాతపు వనవి
    హారమొసగు శుభము లందరకును

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకును మనఃపూర్వక నమస్కారములతో...

    విజయదశమినాఁడు వీరత్వమునుఁ జూపు
    జైత్రయాత్ర మనకు సంస్కృతియయె!
    మాయఁ దొలఁగఁ జేయు మహిష దైతేయ సం
    హార మొసఁగు శుభము లందఱకును!!

    రిప్లయితొలగించండి
  7. ఆడ వారి కెపుడు నందము సొబగును
    హార మొసగు, శుభము లంద ఱకును
    గలుగ జేయు శివుడు కడుభక్తి యుతులకు
    భక్త సులభు డా ర్య ! పరమ శివుడు

    రిప్లయితొలగించండి
  8. విశ్వ మంత నిపుడు పీడించు చున్నట్టి
    లంచగొండి తనము మించుచుండె
    ననచ వలెను దాన్ని యాయవినీతి సం
    హారమొసగు శుభములందరకును

    రిప్లయితొలగించండి
  9. పనియె ముఖ్యమనుచు పరులెత్తుచు నెపుడు
    బ్రేకు ఫాస్టు మాని వెళ్ళ వలదు
    ఉదయమందుఁ దినెడి ఒక్కప్లేటుడు ఉపా
    హార మొసఁగు శుభము లందఱకును

    PS: Breakfast is the most important meal, don't skip it అని ఇక్కడ వైద్యులు చెబుతూ ఉంటారు.

    PPS: సమయం అర్ధరాత్రయ్యింది. ఏదో పూరించాలన్న తపనతో ఆంగ్లపదాలు వాడవలసి వచ్చింది. క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  10. రాజధాని కొరకు పూజితులై వారు
    భూమి నీయ రాగ ప్రేమ తోడ!
    త్యాగ బుద్ధి నెరిగి తగినరీతిగ పరి
    హారమొసఁగు శుభము లందఱకును!

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్సులు...



    నా రెండవ పూరణము:

    కావ్యపఠనఁ జేయఁగా నొక్క కావ్యమ్ము
    ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
    లందఁజేయునట్టిదౌ పారిజాతాప
    హార మొసఁగు శుభము లందఱకును!
    (అపహారము=అపహరణము)


    నా మూఁడవ పూరణము:

    కావ్యకర్తయగు జగన్నాథపండిత
    రాయఁడందఁజే్సి ప్రథితకృతుల
    మురియఁ జేసినట్టి ముంగండ యనునగ్ర
    హార మొసఁగు శుభము లందఱకును!
    (ముంగండ అగ్రహారము=జగన్నాథ పండిత రాయనికి బహుమానముగా నీయఁబడిన గ్రామము)


    నా నాలుగవ పూరణము:

    మంత్రగాఁడ ననుచు మాయమాటలు వల్కి
    మోసగించి జనుల మూట లొలుచు
    ఖలులకెపుడు నిడెడు కఠినార్ధచంద్రప్ర
    హారమొసఁగు శుభము లందఱకును!
    (అర్ధచంద్రప్రహారము=మెడబట్టి త్రోయుట)


    నా యైదవ పూరణము:

    అవసరార్థములిడి యానంద దాయక
    మ్మైన సుకర మైన మార్గము నిడి
    సౌఖ్యదాయకమగు సక్రమమౌ వ్యవ
    హారమొసఁగు శుభము లందఱకును!
    (వ్యవహారము=వాడుక)


    నా యాఱవ పూరణము:

    మూఢనమ్మకమున మూర్ఖులై వర్తించు
    ప్రజల మానసములఁ బ్రబలమైన
    జ్ఞానము నిడునట్టి సవ్య నవ్య వ్యతీ
    హారమొసఁగు శుభము లందఱకును!
    (వ్యతీహారము=మార్పు)


    నా యేడవ పూరణము:

    మనుజులందుఁ జేరి మాన్యతలన్ డుల్ప,
    దుష్టమార్గము నిడఁ, గష్టము లిడ,
    వలచి గెల్వఁగ నరిషడ్వర్గపున్ సంప్ర
    హారమొసఁగు శుభము లందఱకును!
    (సంప్రహారము=యుద్ధము)

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. శాపమాయెను భూకంప సమయ మందు
    రూపురేఖలు –మారె |నరులకు” కలత
    లందు ప్రభుత దయదలచి ముందుగపరి
    హారమొసగు| శుభములందఱ కును.
    2.చదివిసంస్కార మంతయు వదలబోక
    నీతి నిర్మల తత్వంబు నెగడు నట్లు
    జాతి సంస్కృతి నిలిపెడి దూతయె|పరి
    హారమొసగు శుభము లందఱకును.

    రిప్లయితొలగించండి
  14. ఆ.వె:వేసవి సెలవులను వేడుక మీరంగ
    గడప నిశ్చయించి కడు ముదమున
    సతిసుతులను గూడి సలిపెడి నౌకా వి
    హారమొసగు శుభము లందరకును .

    రిప్లయితొలగించండి

  15. పాపభీతి లేక భ్రష్టులై జనములు
    ధర్మపథము వీడి తనరు చుండ
    వసుధ భార మింక బాపగ దుష్టసం
    హారమొసగు శుభము లందరకును .

    రిప్లయితొలగించండి

  16. ఏబి సీ విటమిను లైరను కూరల
    శుచియు శుభ్రత గల చోట రుచిగ
    వండి ప్రేమ తోడ వడ్డించు నట్టియా
    హార మొసఁగు శుభము లందఱకును.

    రిప్లయితొలగించండి
  17. రోడ్లపైన నమ్ము రుచికర మైనట్టి
    వంటకాల దిన్న వ్యాధులమరు
    వంట జేసి శుచిగ వండిన నింటి యా
    ​హార మొసగు శుభము లందరకును​!

    రిప్లయితొలగించండి