30, మే 2015, శనివారం

సమస్యా పూరణము - 1688 (కొరవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కొరవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ.

40 కామెంట్‌లు:

  1. కొరకొర చూడకు చెలియా
    మొరవిని యీ ప్రేమికునికి ముద్దులనిమ్మా
    వెరవకు కాదేమియు నే
    కొరవిని - గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  2. పరదేశవాసమున నను
    విరహము క్రాచెను మరుండు వ్రేల్చెను నీచేఁ
    దెరపిపుడగు నార్పఁగ నా
    కొరవిని - గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!

    [తెరపి- ఇపుడు-అగును]

    రిప్లయితొలగించండి
  3. కిరణపు తాపము నోపక
    వెరపున సంజ్ఞా సతియనె వేరొక రూపౌ
    తరి, ఛాయ 'నీవె నేనను
    కొ' రవిని, గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  4. విరహము నందున మండెడి
    కొరవిని , గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ
    మరువకు ప్రియమగు మారుని
    కరుణించుము కినుక మాని కాఠిన్య మునన్

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ‘కొరవిని కాను’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఊకదంపుడు గారూ,
    విరహమనే కొరవిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    విరహంతో మందే కొరవిని అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదాన్ని ‘కరుణించుము మాని కినుక కాఠిన్యములన్’ అనండి. బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  6. చిరకాలముగ రవిని ప్రే
    మరసాబ్ధిం దేల్చి యిపుడు మనువాడితివే
    మరి సందేహం బెందుల
    కొ? రవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులకు గమనిక...
    గుండు మధుసూదన్ గారు ‘కొరవి’ రూపాన్ని గురించి తెలియజేస్తూ కొఱకంచు అనే అర్థంలో కొఱవి అనేదే సాధురూపమని, కొరవి శబ్దానికి ఎఱ్ఱగోరంట అనే అర్థం ఉన్నదనీ తెలియజేశారు. బ్రౌణ్యం కొరవి, కొరివి రెండు రూపాలను (కొఱకంచు అర్థంలో) చూపించింది. అయితే సాధు శకట రేఫల వ్యత్యాసాన్ని ఈకాలంలో ఎక్కువగా పాటించని కారణంగాను, ఈ సమస్యకు ఆధారమైన ఒక ప్రసిద్ధ వృత్త సమస్య (కొరవిని గౌఁగిలించె నొక కోమలి దుస్సహకామదగ్ధయై) సాధురేఫంతో ఉన్న కారణంగాను మనం ‘కొరవి’ని స్వీకరిద్దాం.
    గుండు మధుసూదన్ గారికి కొరవిని గురించి తెలిపినందుకు, నా పూరణలో టైపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...

    శంకరయ్యగారూ! మీ పూరణము బాగున్నది. అభినందనలు.

    మీరు.. కొరవి, కొఱవి...యను రెండు రూపములునుం గొనుట కనుమతించినందులకుం గృతజ్ఞతలు.

    (ఒక ప్రియుఁడు తన ప్రియురాలితో ముచ్చటించు సందర్భము)

    "విరచించితి వన మిచ్చటఁ
    దరుణీ! నీ కొఱకు నేను; దరహాసముతో
    సురపొన్నలు నగ, వేగమె
    కొరవినిఁ గౌఁగిటనుఁ జేర్చుకొనుము లతాంగీ!"
    (కొరవి=ఎఱ్ఱగోరంట యని నంది తిమ్మనగారి ప్రయోగము)

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారూ,
    ‘కొరవి’ శబ్దానికి ఉన్న వాస్తవార్థంతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. వెరవకు చలిగాలికి నే
    కొరవిని;కౌగిటను జేర్చుకొనుము లతాంగీ!
    మరిమరి మదనుని తాపపు
    గరిమలు నీవంటి సొగసుగత్తెకు మేలా!

    రిప్లయితొలగించండి
  11. కిరణమ్ములు సోకగనే
    విరియుచు ప్రతిరోజు నన్ను ప్రీతిగ గనుచున్
    సరసిజమా! సిగ్గెందుల
    కొ, రవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!!!

    రిప్లయితొలగించండి
  12. మొరవిని మన్నించెనతడు
    వెఱపును వీడుము, కరమగు వేడుకతోడన్
    దరిచేరి, శంకయెందుల
    కొ? రవినిఁ గౌగిట నుజేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. విరహమున వేగు తరుణీ
    పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
    మరుని మాయని వలపుల
    కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  16. విరహమున వేగు తరుణీ
    పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
    మరుని మాయని వలపుల
    కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  17. విరహమున వేగు తరుణీ
    పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
    మరుని మాయని వలపుల
    కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  18. విరహమున వేగు తరుణీ
    పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
    మరుని మాయని వలపుల
    కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  19. నరహరి ! దరి రానీయకు
    కొరవిని, గౌగిటను జేర్చు కొనుము లతాంగీ !
    విరహము తోడను రగిలిన
    హరి కృష్ణకు నూ తమిచ్చి యనురాగమునన్

    రిప్లయితొలగించండి
  20. చిఱచిఱలాడకు వనితా!
    వరముగ నీకును నిడగను,బాగుగ పండన్
    సరగున తెచ్చితి నిదిగో!
    కొరవిని,-కౌగిటను జేర్చుకొనుము లతాంగీ!

    కొఱతయు లేదిక ప్రేమకు
    కొఱకొఱలాడంగ నీకు కూడదు సుమ్మా!
    యఱచేతి నిడగ దెచ్చితి
    కొరవిని,-కౌగిటను జేర్చుకొనుము లతాంగీ!

    అఱకొఱ సొమ్ములు దాల్చిన
    చిరమగు నందమ్మదంద చేరదు వనితా
    యఱచేతికి పెట్టుకొనుము
    కొఱవిని,-కౌగిటను జేర్చుకొనుము లతాంగీ!

    కొరవిని నూఱియు నిడగను
    నఱచేయది పండునెరుపు నందంబదియే
    మురియగ నీకిటు దెచ్చితి
    కొరవిని,-కౌగిటను జేర్చుకొనుము లతాంగీ!

    కొరవి=ఎఱ్ఱగోరింట;కొఱవి=నిప్పు కట్టె.

    రిప్లయితొలగించండి
  21. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. సవరించండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    కొరవి, కొఱవి రెండు శబ్దాలతోను చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. కుంతీ కుమారి తో సూర్యుడు...
    దరహాసమ్మున మంత్రము
    వరమును బొందగఁ బటించ, వచ్చితి భామా!
    వెరపులు సిగ్గులవెందుల
    కొ?, రవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!

    రిప్లయితొలగించండి
  23. విరసము మానుము ధవుపై
    ధరలో దుర్నీతి పరుల దర్పమడంచన్
    నిరతము పోరాడెడి యా
    కొరవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  24. సిరితో పల్కె హరి "వినుమ
    వరుడుగ"మంకెన" "కొరవిని"వధువుగ జేయన్
    ఎరుపును యెరుపును కలియగ
    "కొరవిని కౌగిలిని జేర్చు కొనెను" "లతాంగీ "

    రిప్లయితొలగించండి
  25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పఠించ’ టైపాటువల్ల ‘పటించ’ అయింది.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. విరహమున వేగు తరుణీ
    పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
    హరిసుతు మాయని వలపుల
    కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ.
    నమస్తేఅండీ శంకరయ్యగారూ
    "హరి సుతు"అంటే సరిపోతుందా అండీ.

    రిప్లయితొలగించండి
  27. విరహమున వేగు తరుణీ
    పరవశమున నను దలచుచు బాయని కాంక్షన్
    హరిసుతు మాయని వలపుల
    కొరవిని కౌగిటను చేర్చుకొనుము లతాంగీ.
    నమస్తేఅండీ శంకరయ్యగారూ
    "హరి సుతు"అంటే సరిపోతుందా అండీ.

    రిప్లయితొలగించండి
  28. గురుదేవులకు ధన్యవాదములు.
    టైపాటు సవరణతో :
    కుంతీ కుమారి తో సూర్యుడు...
    దరహాసమ్మున మంత్రము
    వరమును బొందగఁ బఠించ, వచ్చితి భామా!
    వెరపులు సిగ్గులవెందుల
    కొ?, రవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!

    రిప్లయితొలగించండి
  29. నిన్నటి సమస్యకు పూరణ:

    పల్ల మైన తలము బండతో నుండగా
    వాన కురిసి చేరె వరద మట్టి
    రైతు పంట వేయ రయమున పెరుగుచు
    బండ పైన జొన్న పైరు పండె!

    రిప్లయితొలగించండి
  30. మరులు గొలుపు రూపము గని
    పరవశమున నిచ్చుచున్న ఫల్యము నీకై
    కరములు జాచుచు నన్నును
    కొిరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ!

    రిప్లయితొలగించండి
  31. “వరమగు గ్రీష్మపుఎండల
    కొరవిని గౌగిటనుజేర్చుకొనుము-లతాంగీ”
    అరవిరిసిన సిరిమల్లీ
    దరిజేర్చక వాసనేది తరువుకు కరువే|

    రిప్లయితొలగించండి
  32. భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    వరమడిగితివి సుతునికై
    పరమానందమ్ము బొంది బలుకుచు మంత్రం
    బెరిగియొ మహిమలను యెరుగ
    కొ;రవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ.

    రిప్లయితొలగించండి
  33. ఉరికొయ్యలకూగవలెను
    చురుకుగ నుద్యమ పథమున జొచ్చుక పోవన్
    ఎరుపెక్కిన కన్నులతో
    కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  34. మొరవిని కరుగవదెందుల
    కొ ? రవియె ప్రేమించినాడు కొమ్మా నిన్నే
    అరవిరిసిన సిగ్గెందుల
    కొ ? రవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ.

    రిప్లయితొలగించండి
  35. అరకొర తప్పులు జేసిన
    మరులను వీడని పురుషుని మరువకు లలనా
    పురుషులు కొరివిలు చూడగ
    కొరవిని కౌగిటను జేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి
  36. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ సవరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు రోజుల పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ రెండవ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కవిశ్రీ సత్తిబాబు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  37. సరసపు వేళన తర్కము,
    బరబర మగడిని జిలేబి వాయించుట నీ
    కు రవణము కాదు సూ!అర
    కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  38. పిరియపు పలుకుల జతగను
    మురిసితి నినుగని జిలేబి, ముదముగ రమణీ
    సరసకు రమ్మ! వలదు కొర
    కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  39. అరెవో! మమతా దీదీ!
    మురిపించుచు నన్ను నేడు ముచ్చట మీరన్
    కొరగాని నాదు హృదయపు
    కొరవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ

    రిప్లయితొలగించండి