30, ఏప్రిల్ 2015, గురువారం

శ్రీశ్రీ

నేడు శ్రీశ్రీ జయంతి


మత్తేభమాలిక
ధన శార్దూల నఖ ప్రహృష్ట నర రక్త క్రవ్య దివ్యాంజనా
రుణ రాజీవ సుమమ్ములున్ ప్రకట వర్ణోద్భాసితానంత దు
ర్జన సంపీడిత శ్రామికాళి ధృత ఘర్మాంభోభిషిక్త క్రియా
జనితేందీవరముల్, దయాకలిత విశ్వస్తుత్య సద్భావనా
ఘన సౌగంధ్య మరంద బిందు లహరీ కల్హార సంఘాతముల్
జన చైతన్య మనోజ్ఞ రమ్య కవితా సంచార సమ్మోహితా
ర్జన దిక్పూరిత సద్యశ స్సహిత రాజత్ పుండరీకమ్ములున్
ఘన వర్షానల పీడిత ప్రకర జన్మాసక్త శైవాలముల్
కనిపించున్ భవదీయ దివ్య కవితా కాసార నీరమ్మునన్
ఘన శైలాగ్ర ఝళంఝళత్ రవ ఝరీ గంగాపగా తుల్య గే
య నికాయాశ్రిత వాక్పటుత్వ పద విన్యాసాద్భుత ప్రాస ని
ల్చెను. ఝంఝానిల మారుతమ్మువలె. శ్రీ . శ్రీ . కావ్య మద్దాని నే
మని వర్ణించెద నందు గన్పడు సుధా మాధుర్య గేయమ్ము. హా
యిని కల్గించి రసాను భూతి నిడుచున్ హృద్వీథిలో ప్రీతి ని
ల్పిన యా శైశవగీతి. దుఃఖిత జనాళిన్ గాంచి నీ దివ్య లే
ఖిని చిందించెను యశ్రు తర్పణము దిక్కేలేక అల్లాడు ఆ
మనుజాళిన్ గని నేను సైతము ప్రపంచాగ్నిన్ జ్వలింపంగ వే
తును బాధాంచితమైన ఓ సమిధ, మ్రోతున్ గొంతు పోవంగ పా
వనమౌ యీ భువనంపు ఘోష కనుచున్ బ్రహ్మాండమే చిట్లగా
ధన మత్తేభ దురంత కుంభముల విధ్వస్తమ్ము గావించి వం
చనచే పీడిత కర్షక ప్రజల విశ్వాసమ్మునే దోచు దు
ర్జన భూస్వామ్య మదాంధ వర్తనుల దౌర్జన్యమ్ము ఖండించి జీ
వన వారాశిన బూర్జువా అలలు దుర్వారమ్ములై పేదలన్
అను నిత్యమ్మును ముంచి వేయ కవితా నావన్ ప్రసాదించి వా
రిని మేల్కొల్పిన నిన్ను నెన్న తరమా! శ్రీ. శ్రీ. కవీ! వాక్ఛవీ!

రచన:- శ్రీ మద్దూరి రామమూర్తి గారు

9 కామెంట్‌లు:



  1. పద్యం చాలా బాగుంది కాని.శ్రీశ్రీ కినివాళి ఇచ్చినప్పుడు వచనకవిత్వమైతేనే సమంజసం గా ఉంటుందనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  2. కమనీయం గారూ,
    ధన్యవాదాలు.
    శ్రీశ్రీ ‘ప్రభవ’ మొదలైన ఖండకావ్యాలలో ప్రౌఢ పద్యకవిత్వం వ్రాసినవాడే కదా!

    రిప్లయితొలగించండి
  3. కమనీయం గారూ,
    తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీది విశిష్టస్థానం. ఏమాత్రం ఉపేక్షించదగినవాడు కాదు. కాని ‘శంకరాభరణం’లో వచనకవిత్వానికి స్థానం లేదు కదా! అందుకని తప్ప(ప్పు)లేదు. అదన్నమాట సంగతి!

    రిప్లయితొలగించండి
  4. మద్దూరి మత్తేభం పాదపాదమున వేసిన చిందులు పసందుగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    శ్రీ శ్రీ వంటి ప్రముఖుల గురించి ఎంతచెప్పినా కొంత మిగులుతూనే ఉంటుంది మాకందించిన గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. నా రచనను సహృదయంతో స్వీకరించిన మాన్య మహోదయులు శ్రీ కంది శంకరయ్య గారికి సవినయ కృతజ్ఞతలు తమ అమూల్య అభిప్రాయములను అందించిన కవి పండితులకు కృతజ్ఞతాంజలి.
    సవినయ నమస్సులతో మద్దూరి. రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  7. నా రచనను సహృదయంతో స్వీకరించిన మాన్య మహోదయులు శ్రీ కంది శంకరయ్య గారికి సవినయ కృతజ్ఞతలు తమ అమూల్య అభిప్రాయములను అందించిన కవి పండితులకు కృతజ్ఞతాంజలి.
    సవినయ నమస్సులతో మద్దూరి. రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీరంగము వారయ మఱి
    శ్రీరాముని సేవ జేసి సిరులను మఱియున్
    వారసుడు శ్రీనివాసు గు
    మారుగ నిల బొంది రార్య !మంచిని జేయన్

    రిప్లయితొలగించండి
  9. తొత్తులు బూర్జువ దొరలని
    కత్తులు తా దూసి నట్టి కవి శ్రీశ్రీ పై
    మత్తేభమాలఁ జదవగ
    చిత్తంబుప్పొంగెనాకు సిరిసిరిమువ్వా!

    రిప్లయితొలగించండి