22, మే 2015, శుక్రవారం

పద్య రచన - 913

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30 కామెంట్‌లు:

  1. గుప్పున పొగవదలుచునే
    ముప్పును పసిగట్టలేక మురియుట తగదోయ్
    తప్పని గ్రహించుమీవిం
    కెప్పుడు పొగత్రాగబోకు కేన్సర్ వచ్చున్

    రిప్లయితొలగించండి
  2. నిన్నటి కుబ్జ కృష్ణ సంవాదముు
    క్షమాపణలతో
    సరససౌందర్య సల్లాప చతురుడగుచు
    గోపికా మనో హారుడు కుబ్జ గనుచు,
    చాన! భూదృక్కువై యిట్లు జనెడిదాన,
    కరము దావులీనెడు పసరు కరము బట్టి

    నెచటి కేగుచుంటివిటుల నెందు కొరకు
    సుందరి చూడవే నావంక చూడ్కులలర
    యనుచు దరిజేరి చుబుకమ్ము నంటి యెత్తి
    నంత నాకుబ్జ కడు మోహనాంగి యయ్యె

    ఘనుడ, ఘనఘనాఘన గర్వ ఘాతకుండ
    నిగమ నిగమాంత నిగదిత నిర్వికార
    సకల మునిజనగణమన స్సంస్థి తుండ
    నామ నంబని శంబునిన్ నమ్మి గొలుతు

    అనుచు పరిపరి విధములసన్నుతించె

    రిప్లయితొలగించండి
  3. ఈనాటి వర్ణన
    వదలక పొగల వదలుచు, వదనములును
    పొగల సెగల శకటముల మొగములవగ
    వివిధ విధముల రోగముల్ విరుచుకు పడ
    నరకమున కిదె రహదారి నమ్మకముగ

    రిప్లయితొలగించండి
  4. హంగుల కొఱకని పలువిధ
    రింగులు గాపొగను వదలి రేయింపవలున్
    భంగము కాదని విడచిన
    అంగజములు తొలగు నంట యానందింపన్

    అంగజములు = రోగములు

    రిప్లయితొలగించండి
  5. బాల్యమునందున పరమేశ! యిచ్చావు
    క్యాన్సరు భూతాన్ని కరుణ తోడ
    కౌమార దశలోన కరమగు ప్రేమతో
    స్కోలియాసిస్ నిచ్చి చూపితి(వి) దయ
    నవయవ్వనమునందున కృపతో నిచ్చావు
    పేసుమేకరిపుడు వెంకటేశ
    పదునెనిమిది సార్లు వరుసగా నాతల్లి
    కొండ పైకెక్కె నీ యండ గోరి
    గతపు జన్మపాపము లింక గడవలేద?
    తల్లి దండ్రుల నేకొల్చు తరుణ మెపుడొ?
    మనసు బాధతో నిత్యము మగ్గు చుండె
    కాచుమిపుడైన కమలాక్ష కైటభారి

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులతో...

    పొగత్రాగినఁ జెడిపోదుర
    నఁగ నింకయుఁ ద్రాగి త్రాగి నరకమునఁ బడన్
    నెగడుచు నటులే మఱిమఱి
    పొగత్రాగెడువాఁడు దున్నపోతై పుట్టున్!!

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    కుబ్జపై పద్యాలు, ఈనాటి పద్యం అన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పలువిధరింగులు’ అని సమాసం చేయరాదు కదా! ‘పెక్కగు రింగులు’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    కాని చిత్రానికి, మీ పద్యానికి లంకె ఏది?
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చెప్పిన వినవా ! నరుడా !
    గుప్పున వదిలేటి పొగను కోరకు ! నీకున్
    ముప్పే ! ప్రక్కన వారికి
    తిప్పలురా ! ధూమపాన తీరును గనుమా !

    రిప్లయితొలగించండి
  9. సిగరెట్టులు,పొగచుట్టలు,
    తెగ రింగులు వదలి వదలి దేహము చెడుగా
    తెగ దగ్గులు నెగ శ్వాసలు
    ముగియగ నూపిరులు భువిని మోక్షము దొరకున్

    రిప్లయితొలగించండి
  10. ఇష్టంబని పొగ త్రాగన్
    కష్టంబగుదేహమునకు గండము లొదవున్
    ముష్టిన్ ప్రాణం బిడుచు ని
    కృష్టపు బ్రతుకు గడుపుచు కృశియించునిలన్

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. రింగురింగుల పొగనూది రేయి పగలు
    పొంగి పోయెడు యువతకు పుండు పుట్టి
    భంగ పడుదురు; వారల వ్యసన మాప
    ఉద్యమించుడు భారత యువకులార!

    రిప్లయితొలగించండి
  13. పొగ నూదుచు రింగులుగా
    సిగరెట్టును కాల్చుచున్న చెడు నారోగ్యం
    బెగయుచు నీవారల కా
    పొగయే రోగములనిచ్చు పోనిడు మిత్రా!

    రిప్లయితొలగించండి
  14. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. సూర్య !చూడుమా సిగరెట్టు సొగసు ధనము
    నెంత యందము గలదియో యంత హాని
    గలుగ జేయును ద్రాగిన ,కనుము పొగను
    వలయ వలయము లుగ బైకి బయలు వెడలె

    రిప్లయితొలగించండి
  16. పొగ పీల్చకు భుగ భుగమని
    మగవాడ నటంచు నీవు మాయని రోగం
    బగుపడక మృత్యు శయ్యకు
    సుగుణ రహిత జేర్చు నిన్ను సుమి సిగిరేట్టే

    రిప్లయితొలగించండి
  17. భుగ భుగ మను సారాయము
    పుగాకు కిళ్ళి యొసంగు పొందగు మత్తున్
    వగరు వయసు మగువ పొగరు
    సిగరటు పొగ నున్న్న వనచు శ్రీ శ్రీ పలికెన్
    ఇది తిమ్మాజిరావు గారి పూరణ

    రిప్లయితొలగించండి
  18. భుగభుగ మనుసారాయము
    పొగాకు,కిల్లినొసంగు పొందుగమత్తున్
    వగరువయసు మగువపొగరు
    సిగరెట్టుపొగనిదలచకు శ్రీశ్రీ బలికెన్|
    ------------------------
    ఫైపూరణంశ్రీకేంబాయి తిమ్మాజీ రావుగారిది

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కిళ్ళీ యొసంగు’ అనండి, లేకుంటే గణదోషం.
    ******
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘యవ్వనంబునకు’ అనాలి. అక్కడ ‘యవ్వనానికి రాగ’ అనండి.
    ‘కామిత వెలయాలె’ అని సమాసం చేయరాదు. ‘కామితవేశ్యయె’ అనండి.

    రిప్లయితొలగించండి
  22. తగని సిగరెట్టు తలబట్టి తగల బెట్ట
    నదియు పగబట్టి పొగబెట్టు నందరకును
    మరియు కసిబట్టి క్షయనెట్టి మరణ మిచ్చు
    కనుక సిగరెట్టు వదిలేట్టు కట్టు బెట్టు
    తలబట్టి : పైన ఉండు పీక
    క్షయనెట్టి : క్షయ వ్యాధి కలిగించి (lungs కు T B)
    కట్టు బెట్టు : 1.నియమం పెట్టుకపెట్టుకో 2. ( బెట్) పందెము కట్టుకో

    రిప్లయితొలగించండి
  23. తగలేసి పీల్చు ధూమము
    నెగరేసుకుపోవు ప్రాణమెగయుచు పైకిన్!
    సిగరెట్టు కాలు చుండగ
    పొగ పై కెగసెడు విధంపు పోలిక సుమతీ!

    రిప్లయితొలగించండి
  24. సిగరెట్టును తను గాల్చగ?
    పగబట్టిన పాములాగ పంతము నందున్
    అగచాట్ల నంద జేసెడి
    తగువిధ రోగాలుబంచు దర్జాలందున్|

    రిప్లయితొలగించండి
  25. యవ్వనానికిరాగ?కవ్వించగలిగిన
    --------సిరి,కన్య,సిగరెట్టు చింత బెంచు
    కష్టించి పనిజేయు నిష్టను మాన్పును
    ---------సిగరెట్టు నలవాటు సిగ్గుదృంచు
    ఆరోగ్య భాగ్యంబు నణచగ జేయును
    --------మంచి మిత్రుడనగ?వంచనట్లు
    హృదయ రోగములన్ని అదనముగాబంచు
    --------ఆయువు తగ్గించు మాయజేయు
    పదవి,పెదవిని జేర్చిన?వదలనట్టి
    కంపువాసన పరులకు నింపగలుగు|
    అట్టి సిగరెట్టు ,వెలయాలి ఆటపట్టు
    మానవాళియుబ్రతుకును మసిగ మార్చు|

    రిప్లయితొలగించండి
  26. పెదవి మేడయందు ముదముగ సిగరెట్టు
    ముద్దు,ముచ్చటందు మురియునట్టి
    ధూమపానమన్న?కామిత వేశ్యయే
    రోగమంటజేసి?రోతబంచు|
    2,అంటురోగములను నంటించ గలిగిన
    అంటుగట్టగలుగు ఆదరాన|
    డబ్బు ఖర్చు జేయు ?డాంబిక ముంచును
    నిబ్బరంబు లేని నింద బంచు|
    మే 22, 2015 5:59 [PM]

    రిప్లయితొలగించండి
  27. గురువుగారికి నమస్సులు. ఈ పద్యం నా కుటుంబానికి సంభందించింది. నా ఏకైక పుత్రుడు పడుతున్న బాధలని పద్య రూపంలో మీకు తోటి కవి మిత్రులకు తెలియ జేస్తున్నాను. రెండు రోజుల క్రితం 29 సం. నా పుత్రునకు అపోలోలో పేసుమేకరు వేయించాము. యిప్పుడు ఆసుపత్రిలోనే ఉన్నాము.

    రిప్లయితొలగించండి
  28. మీరు త్వరలోనే బాధలనుంచి విముక్తులై సంతోషంగా పాల్గొనాలని ఆ కరుణామయుణ్ణి మనసారా కోరుతున్నాను
    ఓం శ్రీ వేంకటేశాయ. స్వస్తిర్భవతు

    రిప్లయితొలగించండి
  29. పొగలనూది రైలు మిగులదూరముజేర్చు
    నావ పొగలనూది రేవుజేర్చు
    రైలు నావ చొరని కాలుప్రోలికివేగ
    మీరు ఊదుపొగయె మిమ్ముజేర్చు.

    రిప్లయితొలగించండి
  30. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి