11, డిసెంబర్ 2015, శుక్రవారం

సమస్య - 1881 (అరటిపండు ప్రాణహరము...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
అరటిపండు ప్రాణహరము విషము. 

33 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

అధిక పుష్టి నిచ్చు ఆరోగ్యమిచ్చును
బలము నిచ్చు కదళి ఫలము నిజము
హద్దు మీరి దాని నధికము గా తిన్న
నరటిపండు ప్రాణహరము విషము

విరించి చెప్పారు...

అమృత మైన నేమి యధికము గాగ్రోల
గరళ మగు ననుటయె మరువ రాదు
రుచిని మరిగి హద్దెరుగక భుజించినన్
అరటి పండు ప్రాణ హరము విషము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మరువ రాదు మనము మంగళ కరమంచు
నరటి పండు , ప్రాణ హరము విషము
పుడమి వరమ టంచు పుట్టిన ఫలములు
హితము గాను తినగ మితము మరచి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
అరటి పండు ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
అరటి పండు ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

పలు రసాయనములు వాడి పండించెడు
పండ్లనారగించ వలదు! వలదు!
కల్లకాదునిజము కార్బైడుతో మాగు
యరటి పండు ప్రాణహరము! విషము!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
మందు మానుడయ్య పొంద సుఖము
అరయ నాదుమాట ననుకోకు మాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
మంచిజెప్పుచుంటి మాను, మందు
అరయ నాదుమాట ననుకోకు మాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

భలె! భలే!

subbarao చెప్పారు...

చలువజేయునయ్య! సామి!యీ పచ్చని
యరటి పండు ప్రాణహరము విషము
కుళ్ళినట్టి పండు కొంచెమై నదినకు
మా,యెపుడును గలుగు మైకముయును

sailaja చెప్పారు...

పుష్కలముగ కదళి పుష్టినొసంగుచు
చాల మేలు చేయు జగతి కిదియె
అరటిపండు ప్రాణహరము విషముగాదు
అమృతమ్ము సమము నంటిపలము!!!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పుడమి పండ్ల శ్రేష్టము కదళీఫల మెంచ
స్వాదుతరము నమృత సమము నైన
మరులు కొనగ దగదు మధుమేహ రోగికి
నరటిపండు ప్రాణహరము విషము.

Unknown చెప్పారు...

చిన్ని,పెద్దకైన జీర్ణ శక్తిని బెంచు
అరటిపండు|”ప్రాణ హరము విషము
మాగజేయగలుగు మందులు వాడిన
కృతిమ గెలలపంటకీడుమనకు.
2.మాగినట్టి దైన మలబద్దకము మాన్పు
అరటిపండు|”ప్రాణహరము విషము
నౌషదాలు గొట్ట?దోషముగల్గిన
రోజు-తినగరాదు మోజటంచు”


A.Satyanarayana Reddy చెప్పారు...

సుగరు రోగులకును వగపు కలుగ జేయు
నరటి పండు ప్రాణ హరము, విషము
కావు లోన పెట్టు కార్బైడు కెమికలు
కాలుని దరి జేర్చు కరము వేగ

Unknown చెప్పారు...

.”మంచిబలము నింపు మనచెంతమిత్రుడు,
అరటిపండు|”ప్రాణ హరము,విషము
నమ్మినట్టి వాణ్ణి నట్టేట ముంచును
గ|మధు మేహము మరి ఘాతకుడును.”

Bhagavatula Krishna Rao చెప్పారు...

సర్వదేవతలకు చక్కనౌనైవేద్య
మరటి పండటంచు మాన్యులనిరి
సకలరోగులందు చక్కెర రోగుల
కరటిపండు ప్రాణహరము విషము.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నా అన్వయలోపం ఉంది. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
పూరణ బాగున్నది. కాని అన్వయలోపం ఉన్నట్టుంది. మీ భావాన్ని వివరిస్తారా?

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మాగు నరటిపండు...’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మైకముయును’ అనడం దోషం. ‘మైక మెంతొ’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమృతమ్ము ... అన్నప్పుడు ‘అ’ లఘువే. దానివల్ల గణదోషం. ‘గాదు అమృత’ అని విసంధిగా వ్రాసారు. ‘విష మనకు| డమృతసమము గాదె యరటిపండు’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కృత్రిమను కృతిమ అన్నారు. ‘కృత్రిమముగ పండ గీడు మనకు’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.
సవరించిన పూరణ:
పలు రసాయనములు వాడి పండించెడు
పండ్లనారగించ వలదు! వలదు!
కల్లకాదునిజము కార్బైడుతో మాగు
నరటి పండు ప్రాణహరము! విషము!

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కరము వేగ’ అన్నచోట ‘కడు రయమున’ అంటే బాగుంటుందేమో?

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మిత్రుడు అరటి’ అని విసంధిగా వ్రాయరాదు. ‘మిత్రుడౌ| నరటిపండు...’ అనండి. వాణ్ణి అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నమ్మినట్టి నరుని...’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరుగారూ ! ధన్యవాదములు.
సహదేవుడు గారూ ! మీ మెచ్చుకోలునకు ధన్యవాదములు

కంది శంకరయ్య చెప్పారు...

ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ.....

ఆత డేమి సేయు నని పల్క నాటలో
నరటి పండు ప్రాణహరము విషము
నగుచు నుండు నేత యది గమనించిన
రాజకీయ మందు తేజరిల్లు
(రాజకీయాలలో ఒక్కొక్క మారు " ఈ ఆటలో అరటిపండు లాంటి చిన్న లీడర్ నన్నేమి చేస్తాడులే!" అనే ధీమాతో ఉంటే అతడు ప్రాణాంతకంగా తయారౌతాడు.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

M]
సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
అరటి పండు: ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.
మనకు శక్తి నొసగు పండు అరటి పండు.ప్రాణాలనుతీసే ,విషాన్నిచ్చే పిచ్చిపళ్ళను తిని తిక్క (పిచ్చి)తెచ్చుకోవడమెందుకనే అర్థంలో వ్రాశాను .లేదంటే మరొకటి వ్రాస్తాను.