31, మే 2016, మంగళవారం

సమస్య - 2050 (వనితారత్నము మీస మంటి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్”
లేదా
“వనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు”

30, మే 2016, సోమవారం

సమస్య - 2049 (వ్రతపీఠమ్మున...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్”
లేదా
“వ్రతపీఠముపైనఁ బాదరక్షల నిడుమా”

29, మే 2016, ఆదివారం

సమస్య - 2048 (భరతుఁ డంపె రాముని...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భరతుఁ డంపె రాముని వనవాసమునకు”

28, మే 2016, శనివారం

సమస్య - 2047 (పద్యములను వ్రాయవలెను...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్”

27, మే 2016, శుక్రవారం

సమస్య - 2046 (కారణమేమి లేక నిజకాంతుని...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్”
(లేక)
“కారణము లేక దూఱును కాంత పతిని”
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

26, మే 2016, గురువారం

సమస్య - 2045 (పరమభాగవతులు సాని...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పరమభాగవతులు సానివాడ నుంద్రు”
(కవిమిత్రులారా, అనారోగ్యం కారణంగా ‘పద్యరచన, ఖండకావ్యము’ శీర్షికలను ప్రకటింపలేకపోతున్నాను. ఇస్తున్న సమస్యల పూరణలను సమీక్షించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే మిగిలిన శీర్షికలను కొనసాగిస్తాను. మన్నించండి).

25, మే 2016, బుధవారం

సమస్య - 2044 (నారికిఁ దన పుట్టినిల్లు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా”

24, మే 2016, మంగళవారం

సమస్య - 2043 (భీతిం జెందిరి ధర్మనందనుని...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్”
లేదా...
“భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే”
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

23, మే 2016, సోమవారం

ఖండకావ్యము - 28

కల
రచన : అమరవాది రాజశేఖర శర్మ

ఉదయమాదిగ చేసిన యూడిగములు
కలుగు కష్టాలు నష్టాల కలతమాని
నిదురపోయెడి వేళలో మధురమైన
కలను గంటిని దేవుని కనుల గంటి

ఓయి మానవా! కుశలమా! యుర్వి జనులు
శాంతి సౌఖ్యాల సౌభాగ్యశాలు రగుచు
నున్నతిని బొంది జీవించు చున్నవారె?
యనుచు హితమున ప్రశ్నించె నమర నుతుడు.

సౌఖ్య మననేమొ దానితో సఖ్యమునకు
బ్రతుకు బ్రతుకంత వ్యర్థమై చితికిపోయె
శాంత మనుమాట కర్థము సారసాక్ష
మనిషి కలనైన గనలేని ఖనిజమయ్యె.

అన్నదమ్ముల మధ్య నాత్మీయతలు లేవు
       తలి దండ్రుల నెవడు తలచుకొనడు
పొరుగు వారికి ప్రేమ నొరుగబెట్టుట లేదు
        ప్రాణ మైత్రిని సేయు ప్రజలు లేరు
నీతిగా జీవించు నియమ నిష్ఠలు లేవు
        చేటు మోసము లేని చోటులేదు
స్త్రీలను పూజించు శీల మెక్కడ లేదు
        పాప పుణ్యాలన భయము లేదు

కులము మతముల పేరిట కుమ్ములాట
క్షణములో కోట్లనార్జించ పెనగులాట
నాయకత్వము సాధించ మాయమాట
లవని నిండె నిదేలకో లలిత హృదయ.

అని విన్నవించ దైవము
తన కనులను సగము మూసి తడవును కొంతన్
మనసున యోచన సేయుచు
ననుగని చిరు నగవు తోడ ననియెన్ వినగన్

ఇన్నిటికి మూల మొక్కటై యున్నదేమి
స్వార్థపు పిశాచి మనిషిపై స్వారి చేసి
లోభమందున ముంచియు క్షోభ పెట్టి
రాక్షసునిగను మార్చిన సాక్ష మిదియె.

పరుల కుపకార మొనరించ వరము తనువు
మానవాళికి నొనరించు మహిని సేవ
మాధవార్చన యగునని మనసు నిండు
మంచి సూక్తుల నెన్నడో మరచినారు.

పరుల క్షేమము కాంక్షించి పనిని జేసి
వారి సంతసానికి తాము కారణముగ
తలచి సంతృప్తి నొందుట తపము గాదె
పరుల మోదమే పండుగై వరమునొసగు.

పందికొక్కులు తన  పొట్ట కింద దాచి
మనిషి కాదర్శమై నేడు మసలు చుండె
పరుల హితమును కోరెడి తరువు గుణమె
యేవగింపుగా మారిన దేమి పుడమి.

అన్ని ప్రాణుల హృదయాన నాత్మ నగుచు
నున్నవాడిని తెలుసుకో కన్నబిడ్డ
స్వార్థభావము విడి పరమార్ధ దృష్టి
అలవరచుకొనినను శాంతి నందగలవు.

మంచి బోధించి పరమాత్మ మాయ మయ్యె
తెల్లబోయితి నింతలో తెల్లవారె
కనులు తెరిచితి స్వప్నమే మనసు నిండ
దేవదేవుని బోధనల్ తేజరిల్లె.

సమస్య - 2042 (కనికరముం జూప...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్.

22, మే 2016, ఆదివారం

సమస్య - 2041 (లవకుశులు మేనమామలు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.

21, మే 2016, శనివారం

ఖండకావ్యము – 27 (విఘ్నేశ్వర జననము)

విఘ్నేశ్వర జననము
రచన : గుండా వేంకట సుబ్బ సహదేవుడు

కం.       అజునిన్ ఘోర తపమ్మున
నజరామరమౌ విధమ్ము నందెడుఁ గోర్కెన్
భజియించి వరముఁ బడయుచు
గజాసురు డుదరమున గొనెఁ గైలాసపతిన్!

సీ.         నాడు భస్మాసురు దాడినిన్ దప్పించి
యాదిదేవు నొసఁగి యాదుకొన్న
మోహనాకారుని పూజించి పార్వతి
యభయమ్ము నందగ నార్తితోడ
బ్రహ్మాది దేవతల్ వాయిద్యముల్ గూర్చ
నందీశ్వరుండట నాట్యమాడ
గంగిరెద్దుల వానిఁ గామిత మ్మడిగిన
దనుజునిన్ శివునికై వినతిఁ జేయ
తే. గీ.    హరియె యేతెంచెనని దెల్సి మరణమెంచి
తనదు చర్మమ్ము ధరియించఁ ద్ర్యక్షుఁగోరి
శిరము లోకమ్ము లర్చించు వరములంది
నందికొమ్ములఁ జీలె నా నరభుజుండు!

ఆ.వె.     సతియు నంత మురిసి ప్రతిమనొక్కటిఁ జేసి
జీవమందఁ జేసి కావలి నిడి
తానమాడఁ బోవ, ధవుని నిల్పగ వాని
దునిమి శివుఁడు గృహముఁ ద్రొక్కె నపుడు!

తే.గీ.     శిశువు మృతిఁజెంద వగచెడు శ్రీమతిఁగని
యా గజాసురుని శిరమ్ము నతుకఁజేయ
నాదిదేవుండు! పార్వతి మోదమందె!
విఘ్ననాయక జననమ్ము వినగరండు!

****************************

సమస్య - 2040 (ఉత్తరుం డర్జునునకంటె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

20, మే 2016, శుక్రవారం

ఖండకావ్యము - 26 (సక్తుప్రస్థుని కథ)

సక్తుప్రస్థుని కథ
రచన : అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి.

ఆ.వె.     అశ్వమేధ యాగ మసమానమని దేవ
తల పొగడ్త లంది, తమ్ములును  ము
దమున పొంగిపోవ, ధర్మరాజపుడు తా
దానములను సల్పె తనివితీర.

ఆ.వె.     ధర్మరాజు కీర్తి ధరలోన వెలుగంగ
విప్రు లంత పొగడ విశ్రుతముగ
కుసుమవర్షధార కురిపించ దేవతల్
పండు గాయె పురపు ప్రజల కెల్ల.

ఆ.వె.     ధర్మరాజు కంటె దానశీలుడటంచు
చెప్పె నకులమొకటి గొప్పగాను
సంతసమ్ము తోడ సద్విప్రుకథను తా
విప్రులంత పొంద విస్మయమ్ము.

క.         సక్తుప్రస్తుడను మహా
వ్యక్తి కొడుకు కోడలు ప్రియపత్ని సహితుడై
ముక్తిని పొందగ నిశ్చల
భక్తి నథితులన్  కొలుచుచు బ్రతుకుచు నుండెన్.

సీ.         అతడు కురుక్షేత్రమందున తిరుగుచు
పరిగ గింజల దిను బ్రతుకుకొరకు
విద్యతో  వినయమ్ము విలసిల్లు విప్రుడు
కోపతాపాలు లేకుండ దనిసి
గడుపుచున్నట్టి యా ఘనుడు తపోభూతి
తోడ వెలుగుచున్న దుర్బలుండు
వానలుకురవక పంటలు పండక
తినుటకేమియులేక కనలుచుండి
తే.         తిండి సమకూర్చు కొనునట్టి తీరుగనక
పస్తులుండుచు వారలు బ్రతుకు చుండ్రి
ఆకలినితీర్చు మార్గము లేక తాము
తిరుగుచుండిరి పొలముల పరిగె కొరకు.

సీ.         నాలుగు దినములు నల్గురు సభ్యులు
తినిటకేమియులేక తిరుగుచుండ
దొరికెనైదవరోజు పరిగె, యా దొరికిన
పరిగె గింజలనన్ని తిరుగలి నిడి
పిండిగ నొనరించి ప్రీతి తోడుత  వార
లారగించగ బోవ, నతిథి వచ్చె
నాకలి బాధతో, నయ్యతిథిని వారు
తోడ్కొని వచ్చిరి వేడ్క తోడ
తే.         బడుగు భూసురు డాతని భాగ మంత
పెట్టె నతిథికి మిక్కిలి ప్రేమతోడ
నారగించి మరల నాకలాక లనియె
నతిథి,భార్యయు తన భాగ మతిథి కిచ్చె.

ఆ.వె.     అతిథి మరల మరల ఆకలి యని వేడి
కొడుకు భాగముఁ గొని కుడిచె నపుడు
కోడలన్న మిచ్చె కోరగానె తుదకు
నతిథి మెచ్చె వారి యాదరమును.

ఆ.        వారి యాకలంత భరియించి, సక్తువు
నంత యతిథి కిచ్చి సంతసముగ
నన్ని దానములకు నన్నదానమె మిన్న
యన్న నిజము చూపి రున్నతముగ.

తే.         వచ్చెనప్పుడు భూమికి వారి కొరకు
దేవనాధుడు పంపగా దివ్యమౌ వి
మాన మొక్కటి వాయువేగాన, వారు
చనిరి స్వర్గ లోకమునకు తనివి తోడ.

ఆ.        అతిథి పాదములను నాపేద బాపడు
కడిగి నట్టి నీట దడిసినపుడు
స్వర్ణ మయ్యె సుమ్మ సగము శరీరమ్ము
పిదప తిరిగి నాను పెక్కు చోట్ల.

ఆ.        ధర్మరాజు యొక్క దాన ధర్మములను
తెలిసికొన్న నేను తృప్తితోడ
పాణి కడుగుచున్న పారుల చెంతకు
వెడలినాను కరము వేగముగను.

ఆ.        చేయి కడుగు నీట చెన్నుగా దొర్లితి
స్వర్ణమగు మిగిలిన సగమటంచు
రంగుమారలేదు రవ్వంతయైనను
తెలిసికొంటి నిచటి వెలితి నపుడు.

తే.         అనుచును నకుల మదృశ్యమయ్యె నపుడు
వినిన ధర్మనందనుడు తా ననియె నిట్లు
పేద బాపడు చూపిన వితరణమ్ము
కంటె నా స్వర్ణదానమ్ము కడు చులకన.

********************

సమస్య - 2039 (అనుమానించెడు పతి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అనుమానించెడు పతి గల యతివ సుఖించున్.

19, మే 2016, గురువారం

సమస్య - 2038 (దొంగ పదసేవఁ జేయ...)

కవిమిత్రులారా, 

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.

18, మే 2016, బుధవారం

ఖండకావ్యము - 25 (భృగుమహర్షి)

భృగుమహర్షి బృహత్శోధన

రచన : పోచిరాజు కామేశ్వర రావు

ధర్మతత్వజ్ఞులు దమలోనఁ దాము
మర్మ మెరుఁగ నెంచి మథియించి రిట్టు
లంభోజగర్భాచ్యుతాంబరాంబరుల
దంభవిహీనుఁడు దానెవ్వఁ డనుచు
శాంత మక్రోధము క్షమముల నెవరు
సంతత ముందురు సక్కఁగ ననుచు   
తర్కంబుఁ జేసిరి ధరణిసుర వరు
లర్కసదృశతేజు లన్యోన్య మంత
పరమపవిత్రుఁడు పాదాక్ష భృగు వ
డరెను శోధింప నటన్ సత్వగుణుని
నల్పకార్యం బని యాత్మలోఁ దలఁచి
సల్పెను మార్గణ సాహస యాత్ర   
కాంచెను సత్యలోకమున పద్మభవు
నంచిత వాణీ సమాశ్రిత లీలు   
నిజగురు ద్రుహిణుని నిలిచె మౌనముగ
నజుఁ గని వందన మాచరింపకనె
యవిధేయ మునిఁ గని యాగ్రహ మొందె
ను విరించి తనయుఁ డనుచు శాంతుఁడయ్యె
ధాత నిజ జనకు తాపముఁ జూచి
వీత సంభావన వెడలె భూసురుఁడు
హిమగిరి తదుపరి యేగెను ధృతిని 
ప్రమథాధిపతిఁ జూడ పౌరుష మొప్పఁ
గనియెన్ భృగుమహర్షి గరళోగ్రకంఠు
ననలాంబకు గిరీశు నంగజహరుని
భృగుఁ గని సోదరప్రేమ మూర్కొనఁగఁ
దగ నెదురేగె నథర్వుఁడు నంత
నల సత్వగుణముఁ దా నరయఁ దలంచి
యలసత్వమున నుండె నంత భూసురుఁడు
ద్విజు వర్తనముఁ గని తీవ్ర రోషమున
నజుఁడు శూలం బేయ నడర నాపె నుమ
రోషాకలితవేషు రుద్రునిఁ జూచి
భాషా విహీనుఁడై పఱగె ద్విజుండు
శీఘ్ర కోపోద్రిక్త చేతస్కుఁ గాంచి
శీఘ్రమ మరలెను శీతాద్రి నతఁడు
చనిచని కాంచెను సంయమీద్రుండు
వనజాక్ష విలసిత వైకుంఠమునను
వైకుంఠ పురవాసు వందిత శక్రు
లోకైక రక్షకు రుచిరాంతరంగు
ఘన నీలవర్ణుని కౌస్తుభాభరణు
ఘన చక్ర హస్తుని కౌశేయవస్త్రు
హర్యక్షనిభమధ్యు నఖిలాండనాథు
పర్యంక ఫణిరాజు పద్మాయతాక్షు
సురగణ సేవితు సుందరాకారు
హరిని రమావినో ద్యచ్యు తానంతుఁ
గని గుణశోధన కాంక్ష మీరంగ
ఘన వామపాద విఘాతోరుఁ జేసె
లక్ష్మీ నివాసస్థలం బది నేడు
సూక్ష్మీకృతం బయ్యె చోద్యముగఁ దృటి
పరమాత్మ గుణగణ పరిశోధన ముని
వరునకు తగునెట్లు వర గర్వ మకట
భాగవ తోత్తమ పావన గాథ
లీ గతి వింతలు హితకరములును
దరహాస వదనుఁడై తాపసిఁ జేరి
హరి శాంతుఁ జేసి ప్రేమాతిశయమునఁ
బలికెను భవదీయ పదము నాదయిన
పలుసంపు రొమ్మునఁ బడి కందె నేమొ
శాంతింపు మయ్య విశ్రాంతి నిచ్చోట
సుంత యేమరచితిఁ జూడ నే నిన్ను
మధుసూద నాస్య సుమధుర భాషల న
వధరించి ముద మొందె భట్టారకుండు
అగ్నిముఖుని గర్వ మణచ నెంచి హరి
భగ్నపాదాక్షుగ వానిఁ జేసె నిక
ముక్తాతిశయ ఘన ముదితాంతరంగ
భక్త శిఖామణి పద్మాక్షుఁ గొలిచె.

సమస్య - 2037 (యము నెక్కి లులాయములు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యము నెక్కి లులాయములు విహారము సల్పున్.
APRV ప్రసాద్ గారికి, తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలతో...

17, మే 2016, మంగళవారం

ఖండకావ్యము - 24 (అమ్మాయిలూ!...)

అమ్మాయిలూ!
విదేశ వస్త్రాలంకరణపై అత్యాసక్తి మానండి
రచన : గురుమూర్తి ఆచారి

అది యొక పె౦డ్లికార్య  మట యన్నుల మిన్నల కెల్ల మ౦గళ
ప్రదముగ కు౦కుమన్ - పసుపు - వస్త్రము లిచ్చెడు వేళ నిట్టులన్  
సుదతులు మాటలాడుకొనుచున్ నిలుచు౦డిరి  "చూడరే  యటుల్   
కుదిరెను బాలికా మణికి కు౦కుమ బొట్టు శశా౦కబి౦బమై.
నుదుటను శుభ్రమ౦దహస నూతన దీధితి ర౦గు వేయగన్
బెదవుల పైన ,   కాటుక -  వినీలపు రేఖల దిద్దె  రెప్ప ల౦
దుదనరు దీర్ఘ కేశముల దువ్వి  - జడన్ దగ వైచి   -  మల్లె పూ
ల దురిమెకర్ణ కు౦డలములన్ - కరక౦కణముల్  ధరి౦చెనా
పదముల క౦దియల్ దొడిగె; పద్ధతిగా నలరారు చు౦డి,   యే
కొదవలు  లేని   క౦చుకము,   కోకయు దాల్చెసతమ్ము  చన్గవన్
బదిల మొనర్చి దాచ గల పయ్యెద వేసెను; చూచి   న౦తనే  
మది తలకొల్పు  నా  రమణి   - "మా  సతి" యై;   మరి  యేమి  కాల దు
ర్విధియొ  గదా! యసహ్య మగు  వేషము  "ఫ్యాష" నట౦చు నె౦చుచున్.
ముదితలు కొ౦తమ౦ దెగసి పోయి  చరి౦తురు, సిగ్గు - లజ్జలన్
వదలుచు; చూడు చూడు మన వైపునకున్ జనుదె౦చు  జవ్వనిన్
పెదవుల ర౦గు నద్దుకొని, బెత్తెడు మ౦దము "క్రీము" రుద్ది,   పె౦
జిదుగు కురుల్ భుజాల పయి  చె౦పల మీదను వ్రేలుచు౦డ ,
య్యెద బరువౌ నట౦చు ధరియి౦పక, బాహువు లూచి,    గాలికిన్
వదలచు -  పొ౦గుచున్న కుచభా౦డములన్, జఘన౦బు పైన నా
భి  దిగువ య౦దు  "లెగ్గి" నను  విస్మయమున్ కలిగి౦చు  "ఫ్యా౦టు"లో
పొదిలి తళుక్కునన్ మెరయు  పుష్టి కరోరు  నిత౦బ యుగ్మమున్  
బదుగురు  చూడ,   తా   నిటుల వచ్చెను  పె౦డ్లికి స౦బరమ్ముగా "
సదమల మైన యట్టి మన స౦స్కృతి నెప్పుడు గౌరవి౦చుమా  ;
చదివితి  నన్న బి౦కమును చాట  విదేశపు "ఫ్యాష " నె౦దుకో  !
చదివిన దానికిన్ గురుతు  సభ్యత యే సుమ ! యేల నీ గతిన్
సదమద మ౦దగన్  రవికె   -  చక్కని చీర ధరి౦ప , కల్గ నే
రదు గద స౦ఘమ౦దు  జవరాలికి  లో టవి  గౌరవమ్ము  -    ని౦
డుదనము  -  నిశ్చలత్వము   - పటుత్వము  - మానము   -  గూర్చు  నమ్మరో  !

••••••••••••••••••••••••••••••••••••••

సమస్య - 2036 (పూలను సిగలోన...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

16, మే 2016, సోమవారం

ఖండకావ్యము - 23

పరమపద సోపాన పటము
రచన : గుండు మధుసూదన్

కం.      నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు నిక్కపుఁ గ్రీడన్,
శ్రమపడి యాడుచు నుండఁ,
రమపద సోపాన పటము రాగిలుచుండున్!

కం.      సుమతులకు నాట యందున
సమమగు నిశ్శ్రేణితతులు, ♦ సర్ప కబళముల్!
కుమతులనుఁ బాము మ్రింగును;
గమనింపఁగ నిచ్చెనలు ''♦కారమ్మె యగున్!

తే.గీ.     హితుల 'వైకుంఠ పాళి' హిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు నైక్య మంద
నీయఁ, డెంతయును ఘన పరీక్ష సేసి,
పిదప నెగ్గించి, తన దరిన్ వేగఁ జేర్చు!

ఆ.వె.     పిల్ల లాడు నాట, ♦ పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును పాము లిచ్చి పుచ్చు!
వారి వారి కర్మ పరిపాకమునుఁ బట్టి

ముందు వెనుకలుగను మోక్ష మొదవు!!

సమస్య - 2035 (భార్యకు మీసముల్ మొలిచె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.

పద్యరచన - 1223

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

15, మే 2016, ఆదివారం

ఖండకావ్యము - 23

జలరక్షణ
రచన : అమరవాది రాజశేఖర శర్మ

తే.         నీరు పంట కాధారము నీరు దేహ
దాహమును తీర్చి బ్రతికించు ధరణిలోన
నీరు లేకున్న నే ప్రాణి నిలువలేదు
కాన నీటిని కాపాడ గనుము దీక్ష

తే.         ప్రాణికోటి దాహము దీర్చి పాడిపంట
వృద్ధి సేయగ పుడమి నీరద్ది తడిపి
మే లొనర్చు నదీమాత జాలువారి
కడలి కలియంగ ఫలమేమి గానరాదె

తే.         మేఘమంబుధి జలములన్ మిగులదాచి
ప్రాణకోటికి జీవమై వాననిచ్చు
వాననీటిని భూమాత వాంఛదీర
గుండెలో దాచి కోరగా కూర్మి నిచ్చు

సీ.         వానలు గురియగా వలపులు చిలికించు
తరువులు భువిలోన పెరుగ వలదె
వనములు ఖండించి వాసము లేర్పర్చ
నింటింటి కొక వృక్ష మిమడ వలదె
నిత్యావసరమున నీడనిచ్చెడి చెట్టు
మమత వీడుచు గొట్ట మానవలదె
చెట్ల వైశిష్ట్యము చెవి చెవి నందించ
నడవులఁ గాపాడ నరుగ వలదె
తే.         తరువు గలదేని జనులకు కరువు లేదు
తరువు నాటక యేనాడు పరువు రాదు
తరువు ఫలముల సుమముల సిరులె గాదు
తరువు నీటికి మూలమౌ తరచి చూడ

తే.         ఒక్క బొట్టైన భూమిలో నొదిగిపోక
వాన నీరంత కాల్వగా పరుగు దీసి
యూరి బయటకు చేరిన కారణమున
నేడు నగరాలలో నుండె నీటికొరత

కం.       ఇంకుడు గుంతల గృహమున
నింకను మన వీథిలోన నేర్పడ సేయన్
శంకర గంగయు భువిలో
నింకిన భూగర్భ జలము హితమును గూర్చున్.
*********************


పద్యరచన - 1222

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

సమస్య - 2034 (క్రీస్తు పూజనీయుఁడు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు. 

14, మే 2016, శనివారం

ఖండకావ్యము - 23

పనస పొట్టు కూర
రచన : భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్

ఆ.వె.     ఆంధ్ర ప్రాంతమందు అదిరెడు కూరండి !
కోనసీమ రుచులు కోరుకొనిన
మోజుపడుచు తినగ భోజనప్రియు లెల్ల
పనసపొట్టు కూర మనసు నింపు!

ఆ.వె.     సన్న సెగల పైన సబబుగా నుడికించి
పుల్ల బెల్లమునకు పొట్టు కలిపి
పోపు కలుప చాలు పొట్టుపై ఘుమఘుమ
పనస పొట్టు కూర మనసు నింపు!

ఆ.వె.     మంచి దిటము మించి మటను కీమాలకు
మాంస క్రుత్తు లెల్ల మహతి గూర్చు
పుష్టి నిచ్చు గట్టి  పోషకాహారము
పనస పొట్టు కూర మనసు నింపు !

ఆ.వె.     శుభదినమ్ము లందు శోభగా వడ్డించ
బంధుకోటి కెల్ల బహు పసందు
జోడుగాను కలుప జీడి పలుకు గూడ
పనస పొట్టు కూర మనసు నింపు !

********