15, మే 2016, ఆదివారం

పద్యరచన - 1222

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

47 కామెంట్‌లు:

  1. యమునా తటమున కృష్ణుని
    రమణీ మణులంత గలసి రాసక్రీడల్
    కమనీయ మైన నృత్యము
    శమనము గాజేయు చుండె సంతస మందున్

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘శమనముగా జేయుచుండ సంతస మెసగెన్’ అనండి. ‘రమణులు’ బ.వ., ‘చేయుచుండె’ ఏ.వ... అందుకని...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యమునా తటమున కృష్ణుని
      రమణీ మణులంత గలసి రాసక్రీడల్
      కమనీయ మైన నృత్యము
      శమనము గాజేయు చుండ సంతస మొసగెన్

      తొలగించండి
  3. గోపీ మానస చోరుని
    ప్రాపున నాడిరి నెలతలు రాగము లెగయన్
    దాపుం దమ ప్రియుని గనగ
    నోపెడి‌ యానంద హేల లూగిసలాడన్!

    రిప్లయితొలగించండి
  4. కన్నెలు కోరగ మనసున
    కన్నులకింపైన రీతి కన్నయ్యనటన్
    ఎన్నేని రూపములతో
    వెన్నెల విహరించుచుండె వెన్నుడు గనరే!

    రిప్లయితొలగించండి
  5. తెల్లని వెన్నెల రేయిని
    నల్లని యాగొల్లనయ్య నాట్యములాడన్
    చల్లల నమ్మెడు కన్నెల
    కుల్లములే పల్లవించి మొల్లలు విరిసెన్.

    రిప్లయితొలగించండి
  6. బృందావనమున గోపిక
    లందముగా జేయు చుండ్రి హాహా యనగ న్
    డెందము లలరగ నృత్యము
    నందుని నందనుని మ్రోల నవరసమొలుకన్

    రిప్లయితొలగించండి
  7. ఇందుగలడందు లేడను
    సందేహము వలదు. చక్రి చానలమధ్య
    న్నెందెందువెదకి చూచిన
    నందందేకలడు సామనాదాత్మకుడై.

    రిప్లయితొలగించండి
  8. విష్ణువు లోక రక్షకుడు ప్రేమ మయుండును నిత్య సత్య వ
    ర్ధిష్ణువు నిర్వికల్పుడును దేజము మీర దశావతార రో
    చిష్ణువు దైత్య మర్దనుడు చెన్నుగఁ గృష్ణుడు ద్వాపరంబునం
    గృష్ణుని లీల లెంచి మదిఁ గీర్తనఁ జేసిన ధన్యు లెల్లరున్

    రిప్లయితొలగించండి
  9. చల్లని సాయంకాలము
    నల్లరి కృష్ణయ్యతోడ నానందముతో
    నుల్లములలరగ వ్రేతలు
    ఘల్లుమనన్ హంసకమ్ము లాడెడు కనుడీ!

    రిప్లయితొలగించండి
  10. గోపాలుడు యమునా తటి
    గోపెమ్మల రాస కేళి కూటమిలోనన్
    తా పిల్లన గ్రోలూ దుచు
    శ్రీ పురుజిత్తాడు చుండె స్నేహోన్నతితో.

    రిప్లయితొలగించండి
  11. తాహత ఝంఝరిత తధిత్త తధిగిణ
    …………… త తధిగిణత యంచు తాళ మేయు
    సరిగమ పదనిస స్వరముల గానము
    ……………. వీణపై పలికించి ప్రణుతి చేయు
    పాదఘట్టనతోడ పాదముల్ కదుపంగ
    ……………..దరువుకు తగినట్లు తనరు చుండ
    తంబుర నందుచు తన్మయత్వముతోడ
    …………….చిన్మయ రూపుని శృతిని జేయు
    నయనమ నోహర నాట్యవి న్యాసముల్
    …………….చల్లవెన్నెలయందు సలుపు చుండ
    యమునయు మెరసెన యము జేయ సందడి
    ……………బృందావ నంబున బృంద మంత
    గోపికా మానస తపనుని బహురూప
    ……………విన్యాస మత్తరి విందు చేయ
    నానంద సాగర మందుము నకలిడి
    ……………రాసలీ లలదేలె రమణు లంత

    పకృతి పులకించి పరచెను పరవ శాన
    పూల పాన్పులొప్పారగ పుడమి యందు
    సుందర దరహాసంబున డెందమందు
    మోహనాంగుడు కృష్ణుడు మోదమిచ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. అన్న మిస్సన్న మహోదయుల సహృదయపూర్వక సూచనలకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు తెల్పుచూ కొద్ది మార్పులతో సవరించిన పద్యముః
      తాహత ఝంఝరిత తధిత్త తధిగిణ
      …………… త తధిగిణత యంచు తాళ మేయు
      సరిగమ పదనిస స్వరముల గానము
      ……………. వీనుల విందయ్యె వీణ పైన
      పాదఘట్టనతోడ పాదముల్ కదుపంగ
      ……………..దరువుకు తగినట్లు తనరు చుండ
      తంబుర నందుచు తన్మయత్వముతోడ
      …………….చిన్మయ రూపుని శృతిని జేయు
      నయన మనోహర నాట్యవి న్యాసముల్
      …………….చల్లని వెన్నెలన్ సలుపు చుండ
      యమునయు మెరసె నయము జేయ సందడి
      ……………బృందావ నంబున బృంద మంత
      గోపికా మానస కుంభీరు బహురూప
      ……………విన్యాస మత్తరి విందు చేయ
      నానంద సాగర మందు మునక లిడి
      ……………రాసలీ లలదేలె రమణు లంత

      పకృతి పులకించి పరచెను పరవ శాన
      పూల పాన్పులొప్పారగ పుడమి యందు
      సుందర దరహాసంబున డెందమందు
      మోహనాంగుడు కృష్ణుడు మోదమిచ్చె.

      తొలగించండి
    3. తమ్ముడూ చాలా బాగుంది పద్యం.

      తొలగించండి
    4. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు చక్కటి సీస పద్యమును వ్రాసారు. అభినందనలు. చిన్న సందేహము.
      1. సీస మాలిక సమ్మతము కాదేమో యని నా యనుమానము. మరియొక ఆటవెలది / తేటగీతి అవసరమని నా యూహ.
      2. “ రాసలీ లలదేలె రమణు లంత”: “తేలె” ఏకవచనము “రమణులు” బహువచనము.
      3. చిన్మయ రూపుని శృతిని జేయు” : ఇక్కడ “శృతిని జేయు” పదము సరిపడినట్లు లేదు.

      తొలగించండి
    5. విద్వత్కవిమిత్రులు బ్రహ్మశ్రీ పోచిరాజు కామేశ్వర రావుగార్కి నమస్సులు.
      కీ.శే. పండిత నేమాని రామజోగి వరేణ్యులు శ్రీమదధ్యాత్మరామాయణ కావ్యమందు 180 పాదాల సీసమాలికపై 1 ఆటవెలది లేదా తేటగీతి (గుర్తులేదు) వ్రాసినారు.
      పొత్తపి వెంకట రమణకవి ప్రణీతమైన “ లక్షణ శిరోమణి” కి వ్యాఖ్యానం చేయుచూ విద్వాన్ రావూరి దొరసామి శర్మ గారు ( చందశ్శాస్త్రాలను మధించినవారు) పేజి 53 నందు మాలికలు అన్న విషయంగా ఇలా వ్రాసినారు….…. పంచపాదులుగానే గాక కంద, సీస గీతములను, సమవృత్తములను మాలికలుగా రచింపవచ్చును. 10,12,18 పాదముల సీసమాలికలు వ్రాయవచ్చును.
      ప్రయొగమును బట్టి సీసమాలికల పాదములనియతములని తెలియుచున్నది.

      పొత్తపి వెంకట రమణకవి చెప్పినది (3.365) కందవృత్త సీసమాలిక లక్షణము

      వ. మఱియు నందు కందమాలికయు, వృత్తమాలికయు, సీసమాలికయు త్రివిధములాఈ వెలయు నీమూటుకిని లక్షణము
      కం. పది, పదిరెండును, బదునెని
      మిది సీసములందు గీతిమితి సరిపదముల్
      కుదురుప దగు నని దితిసుత
      మదగజ హర్యక్ష సీసమాలిక కృష్ణా!
      ( 10,12,18 ఇంకను నిచ్చవచ్చినన్ని పాదములతో మాలికగా రచింప బడినది సీసమాలిక పాదములు సరిసంఖ్యలో నుందవలెనను నియమము గలదు)
      కందమాలికల స్వరూప మిందు చెప్పబడలేదు. సగము కందమొకపాదముగా గ్రహించి యిచ్చవచ్చినన్ని పాదములు మాలికగా వ్రాయవచ్చునేమో? గీత వృత్త సీసమాలికలు తెలుగున ప్రచురములు.
      గణపవరపు వేంకటకవి ఆంధ్ర కౌముది యను వ్యాకరణ లక్షణ గ్రంథమున వేయిచరణముల (1000) సీసమాలిక సంతరించె.
      ఇది అంతయూ మీరు వెలిబుచ్చిన సందేహము ఇతర కవిమిత్రులకు కూడ ఉపయోగ పడునని పుస్తకములో ఉన్నదానిని యథాతథముగా వ్రాసినాను గాని మీ వంటి విద్వాంసులకు చెప్ప నసమర్థుడను.

      మిగిలిన దోషములను ఈ విధంగా సవరించినాను.
      శ్రీరాగ మందగ శృతిని జేయు
      రాసలీ లలనుండె రమణు లంత.
      తప్పులను తెలియజేసినందులకు మీకు ధన్యవాదములు.
      నా ప్రతిపూరణపై దోషవిచారణ చేయ మనవి. తప్పులు దిద్దుకొనుచూ నడక చేర్చుకొనువాడను.

      తొలగించండి
    6. శర్మ గారు నమస్సులు. సీస మాలిక పై సప్రామాణికముగ వివరణ యిచ్చినా సందేహమును నివృత్తి చేశారు. కడుంగడు ధన్యవాదములు. మీ సవరణలు కూడా బాగున్నవి.
      “రాసలీ లలనుండె రమణు డంత.” అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  12. రేపల్లె లోని రమణులు
    గోపాలుని భక్తితోడ కొలచెడు వేళన్
    గోపిక కో గోపాలుడు
    గా పడతులచెంత దాను గనిపించెనుగా.

    2.
    యమునా తటిలో కృష్ణ
    య్య మురళి రవళించినంతఠ యతివలు ముదమున్
    తమకముతో జేరెదరట
    కమనీయపు దృశ్యమదియె గాంచిన జాలున్

    3.
    నవనీత చోరు డతడ
    తివల మనసు దోచినట్టి ధీరుడు వాడే
    యవనిన ధర్మము నిలుపిన
    నవతార పురుషుడతడె యారాధ్యుడుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో ‘రవళించినంత నతివలు..’ అనండి.
      మూడవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘నవనీతచోతు డాత డ...’ అనండి.

      తొలగించండి
    2. విరించిగారూ! నమస్తే. 3వ పద్యం 1పాదంలో చివర 1 లఘువు తక్కువ. 4 పాదంలో 6వ గణం నల/జ లేదు. “అవనినధర్మము” అన్నచోట వ్యతేరేకార్థము. ( అధర్మము ) “ నిలుపిన” అసాధురూపం. “నిలిపిన” సాధురూపం. మీకభ్యంతరము లేనిచో ఇలా మార్చ వచ్చునేమో చూడండి.

      నవనీ త చోరు డాతడ
      తివల మ నసు దో చినట్టి ధీరుడు వాడే
      యవనిన్ ధర్మము నిలిపిన
      నవతా ర పురుషు డతండె యారాధ్యుడుగా

      తొలగించండి
    3. గురువు గారికి మరియు సుబ్రహ్మణ్య శర్మ గారికి నమస్కారములు రెండవ పద్యంలో యతివలు రాసాను మూడవ దానిలో డాతడనే వ్రాయబోయాను కాని టైపోటు ...క్షమించ గలరు

      తొలగించండి
  13. కరముల కంకణంబులు ముఖంబున వెన్నెలలొల్కునవ్వులున్
    శిరమున బర్హిబర్హమతసీ కుసుమద్యుతి నొప్పు దేహమున్
    దరదర విందనేత్రములుదార కృపారస మొప్ప మాధవా
    మురళి ధరించి నాకు కనుమూసిన విచ్చిన కానుపింపవే

    కలకల లాడు నెమ్మొగము కస్తూరి కాంచిత ఫాలభాగమున్
    మిలమిలలాడు కేశములు మేటి శిరంబున బర్హిబర్హమున్
    విలసిలు నిన్ను కన్నులకు విందుగ కంచగ దివ్యభాగ్యమున్
    కలుగగ జేయుమయ్య నవకంజదళేక్షణ భక్తరక్షనణా

    గజ్జలు ఘల్లు ఘల్లుమన గంతులు వేయుచు గాన వృష్టి చే
    సజ్జనచాత వ్రజము సంభ్రమ మొందగ మేనికాంతిచే
    ముజ్జగముల్వెలుగ నవమోహన దివ్య సుమంగళా కృతిన్
    సజ్జన వంద్య దర్శన మొసంగవె నీకిదె కేలు మోడ్చెదన్
    (మా తండ్రి గారు వడ్డూరి అచ్యుతరామ కవి గారు వ్రాసిన పద్యములు -రామకృష్ణ )

    రిప్లయితొలగించండి
  14. విలసిలు నిన్ను కన్నులకు విందుగ కాంచగ దివ్యభాగ్యమున్

    శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు కాంచగ బదులు కంచగ అని తప్పు పడింది సరిచేయ గలరని కోరుచున్నాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
      టైపాట్లున్నాయి.

      తొలగించండి
  15. పారవశ్యము తీరమందున పండు వెన్నెల పంచగన్
    శౌరి మోవిని వేణుగానము జాలు వారగ ముగ్దులై
    చేర వచ్చిరి గోప కన్యలు క్షీర చోరుని సందిటన్
    గూరె నొక్కడె వారలందరి కోర్కె దీర్చగ పెక్కురై!

    రిప్లయితొలగించండి
  16. శారద రాత్రుల యందున
    నారదవంద్యుడు రమణుల నచ్చోటన్ కూ
    డి,రహించెను ముదమున కం
    సారియు యమునా తటమున పంబర మొదవన్.
    2.గోపికలకు ముదంబయ్యె గోప బాలు
    గన రాసక్రీడ సలుప కలిసి రచట
    శిష్ట రక్షకుడౌ శౌరి హృష్టుడగుచు
    కిలకిల నగుచును వారితొ కేళి సలిపె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపద్యం 2,4 పాదాలలో గణదోషం. ‘గనగ రాసక్రీడ..., కిలకిల నగుచు...’ అనండి.

      తొలగించండి
  17. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    న౦ద౦ బొ౦దుచు నాట్యమాడెను గదా
    న౦దవ్రజ శ్రేణి , యా

    బృ౦ద౦ బ౦దున - వేణుగాన రవళిన్ విన్న౦తనే |
    యాహ ! గో

    వి౦దు౦ డొక్కక గోపి కొక్కకరుడై విన్యాసముల్
    జేసె | క

    న్వి౦దు౦ గూర్చె సమస్తమౌ పకృతికిన్
    నీలా౦బుధిశ్యాముడే !

    { బృ౦దము = బృ౦దావనము ; గోపి = గోపిక ;
    ఒక్కొకరుడు = ఒక్కొక్కడు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘నీలాంబుదశ్యాముడే’ అనండి. మీరు అంబుధి (సముద్రం) అన్నారు అది అంబుదం (మేఘం) కదా!

      తొలగించండి
  18. రాధతో నొక వంక రాసలీలలు జేయు
    .....నీలతో నొక పరి మేల మాడు
    తపతి తో నొకవైపు తైతక్క లాడును
    .....మల్లికతో కొంటె మాటలాడు
    సుందరి నొక ప్రక్క సూటిగా ముద్దాడు
    .....భామతో పరిహాస పదము లాడు
    జలజతో నొక చోట సయ్యాట లాడును
    .....రమణిని మురళితో రవ్వ సేయు

    నారి నారికి నడుమ మురారి నిలచె
    ఒక్క గోపిక కొక్కడై యుల్లసిల్లె
    పూర్ణ చంద్రుడు యామినిన్ పొంగుచుండ
    మధుర బృందావనీ సీమ మాధవుండు.

    రాస లీల జేయ రాధికా చోరుండు
    సర్వ భూత తతులు సంబరమున
    మేను లెల్ల మరచి స్థాణువు లైనవి
    ప్రకృతి పులకరించె పరవశమున.






    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకృష్ణుని రాసకేళీ లీలావిలాసాన్ని మనోహరంగా వర్ణించిన మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  19. బృందావనిలో వెలసిన
    నంద కిశోరుని సరసన నర్తన మాడన్,
    అందాలొలుకుచు వెన్నెల
    విందుల గోప రమణులను వెలుగులు చిందెన్!

    రిప్లయితొలగించండి
  20. వెన్నెలవేడికిన్ నలుగ?వేదన మాన్పగ వేణునాదమే
    కన్నెల కర్ణ నాదముల కామితసిద్దిగకృష్ణ లీలలే
    తిన్నగ జేర?మైమరచి తీరికచేతనునాట్య మాడుచున్
    యున్న శరీరముల్మరచి యూహల నూయలలూగి రందరున్|.
    2.వెన్నెలకాంతి బ్రాంతి తమవేదన బెంచగ?వెన్న దొంగయే
    తిన్నగ రాగరంజిత నదీ తట మందున వేణునాదమే
    కన్నియలందు జేర్చ? తమకంబున నాట్య మయూరు లైన?తా
    విన్నది కన్న దేదియని విస్మయ మందిరి కృష్ణ లీలకున్.|

    ౩. మనముననెంచ గోపికల మానస మందున దూరి నట్లు|వే
    దనమును మాన్పగా రవళి దగ్గర జేరియు మాన్పునట్లు,కా
    దనకను కృష్ణ లీలలచె తన్వయ తత్వము జేర్చు నట్లు స
    జ్జనుడు, రసజ్ఞ శేఖరుడు|కాచిన వెన్నెల గాదె కృష్ణుడే?

    రిప్లయితొలగించండి
  21. బృందావనమున కృష్ణుడు
    విందును జేయగ కనులకు విడ్డూరముగా....
    బృందావనమున హోళిని
    మందల నాడించి హేమ మాలిని మురిసెన్!

    రిప్లయితొలగించండి