విఘ్నేశ్వర జననము
రచన : గుండా వేంకట
సుబ్బ సహదేవుడు
కం. అజునిన్ ఘోర తపమ్మున
నజరామరమౌ విధమ్ము నందెడుఁ గోర్కెన్
భజియించి వరముఁ బడయుచు
గజాసురు డుదరమున గొనెఁ గైలాసపతిన్!
సీ. నాడు భస్మాసురు దాడినిన్ దప్పించి
యాదిదేవు నొసఁగి యాదుకొన్న
మోహనాకారుని పూజించి పార్వతి
యభయమ్ము నందగ నార్తితోడ
బ్రహ్మాది దేవతల్ వాయిద్యముల్ గూర్చ
నందీశ్వరుండట నాట్యమాడ
గంగిరెద్దుల వానిఁ గామిత మ్మడిగిన
దనుజునిన్ శివునికై వినతిఁ జేయ
తే. గీ. హరియె యేతెంచెనని దెల్సి మరణమెంచి
తనదు చర్మమ్ము ధరియించఁ ద్ర్యక్షుఁగోరి
శిరము లోకమ్ము లర్చించు వరములంది
నందికొమ్ములఁ జీలె నా నరభుజుండు!
ఆ.వె. సతియు నంత మురిసి ప్రతిమనొక్కటిఁ జేసి
జీవమందఁ జేసి కావలి నిడి
తానమాడఁ బోవ,
ధవుని నిల్పగ వాని
దునిమి శివుఁడు గృహముఁ ద్రొక్కె నపుడు!
తే.గీ. శిశువు మృతిఁజెంద వగచెడు శ్రీమతిఁగని
యా గజాసురుని శిరమ్ము నతుకఁజేయ
నాదిదేవుండు! పార్వతి మోదమందె!
విఘ్ననాయక జననమ్ము వినగరండు!
****************************
విఘ్న నాధుని జననపు వింత కధను
రిప్లయితొలగించండిజక్క వర్ణించు తీరును జదువ మదికి
సంత సంబును గలిగెను నెంత గానొ
సుబ్బ సహదేవ !నామాట సూ నృ తంబు
వేంకట సుబ్బ సహదేవుడు గారు విఘ్నేశ్వర జననము నత్యంత మనోహరముగ నావిష్కరించారు. అభినందనలు.
రిప్లయితొలగించండివేంకట సుబ్బసహదేవుడు గారు. చక్కని, చిక్కని పదముల కూర్పుతో సాగిన గణనాధుని జనన వృత్తాంతము మనోహరము, ముక్తిప్రదము.అలరించినది.
రిప్లయితొలగించండివేంకట సుబ్బసహదేవుడు గారు. చక్కని, చిక్కని పదముల కూర్పుతో సాగిన గణనాధుని జనన వృత్తాంతము మనోహరము, ముక్తిప్రదము.అలరించినది.
రిప్లయితొలగించండివిఘ్నేశ్వర జననాన్ని చక్కగా వర్ణించిన వేంకట సుబ్బ సహదేవుడు గారికి అభినందనలు.
రిప్లయితొలగించండి.సహదేవుని సాక్ష్యంబున
రిప్లయితొలగించండిఅహమునుగన శిశువు ద్రుంచి?ఆశివు డెంతో
సహనమున”గజాసురుని”వి
ధిహక్కునునిలుపశివుడట?ద్విముఖాయనుడే|{ద్విముఖాయనుడు=రెండుముఖాలవిఘ్నేశ్వరుడు|మొదటిముఖముశివుడుద్రుంచగారెండవముఖము గజాసురుడిది}
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండిి
సహ దేవు డు గారూ ! విఘ్నేశ్వర జనన మను మీ ఖ౦డిక శ్లాఘ నీయము
.……………………………………………
👏🏼 క ర తా ళ ధ్వ ను ల తో 👏🏼
…………………………………………...
🙏🏼 న మ స్కా ర ము ల తో 🙏🏼
…………………………………………....
ఖండకావ్యము ప్రచురించిన గురుదేవులకు మరియు నచ్చిన వారలందరకూ పేరు పేరునా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ మవోజ్ఞంగా ఉన్నది వినాయకోత్పత్తి. అభినందనలు.
రిప్లయితొలగించండిపెద్దలు మిస్సన్న గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండి