3, మే 2016, మంగళవారం

ఖండకావ్యము - 16

ఋతుచక్రము
రచన : లక్ష్మీదేవి

వసంతఋతువు -
ఉ. 
వేచె విభుండు వచ్చునని వేయి నిరాశలఁ గాలఁ దన్నుచున్
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
గ్రీష్మఋతువు -
చం. 
భగభగ మండు టెండలకు బావులు, కాలువలెండిపోవగా,
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
వర్షఋతువు -
చ. 
చిటపట సద్దు చేయుచును చేరును జల్లులు నింగి వీడుచున్,
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
శరదృతువు -
ఉ. 
చల్లని వెన్నెలెల్ల యెడ సైయను జంటల కాంక్షమాడ్కినిన్,
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
హేమంతఋతువు -
చం. 
చలిపులి మెత్త కత్తులనుఁ జంపుచునుండగ వృద్ధకోటి, లో
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
శిశిరఋతువు -
ఉ. 
పత్రములెల్ల రాల్చి నవపల్లవ కోమల శోభఁ గోరుచున్
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.

32 కామెంట్‌లు:

  1. తెలి విరులెల్ల దీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.....బాగుందండి....అభినందనలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఔనండి. ఆ ఊహ నాకూ బాగా నచ్చింది. ఆ వాక్యములో చీకటి కూడా వచ్చి ఉంటే ఇంకా స్పష్టంగా ఉండేది. నల్లని ఆకాశంలో తెల్లని చుక్కల్లా, చీకటి నిండిన భూమిపై తెల్లని పువ్వులు.

      తొలగించండి
    2. నింగిలో చుక్కలు రాత్రులందే కనిపిస్తాయి గనుక...అదియొప్పునని నా భావన

      తొలగించండి
    3. నింగిలో చుక్కలు రాత్రులందే కనిపిస్తాయి గనుక...అదియొప్పునని నా భావన

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఋతుచక్ర మను మీ ఖ౦డిక లోని వృత్తములు

    ఆ లక్ష్మీదేవి మ౦దస్మిత కా౦తు లనగ

    శోభిల్లు చున్నవి

    రిప్లయితొలగించండి
  4. ఆరు ఋతువుల సొగసును నంద ముగను
    దనదు ధీశక్తి వర్ణించి తనరె లక్ష్మి
    యాహ ,యేమిర చనయది యద్భు తంబ
    యామె కామెయే సాటి యో యార్యులార !

    రిప్లయితొలగించండి
  5. ఋతువుల క్రతువునుదెల్పుచు
    అతులిత నాదర్శమందుననుకరణలతో
    హితమును బంచెడిప్రతులే
    జతజేసెను లక్ష్మిదేవి చక్కటికృతులే|

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారు చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు. సహృదయముతో నీక్రింది సూచనలు గమనించగోర్తాను.
    “కోయిలన్/ దాచిన గొంతులోపలికె” “గొంతుతో బలికె” అంటే బాగుంటుందేమో?
    “భగభగ మండు నెండలకు”: “భగభగ మండు టెండలకు” అంటే బాగుంటుంది.
    “తాళజాలకను జీవులవెల్ల తపింప”: “జీవులనెల్ల” యనా మీభావన?
    “వర్ష ఋతమ్ము జీవుకున్.” ఋతము; ఋతువు వేరు వేరు పదములు. “వర్షపు వేళ జీవికిన్” అంటే బాగుంటుంది.
    “వర్షఋతువు” విసంధిగా వ్రాసారు. వర్షర్తువు గుణ సంధి “సప్తర్షులు” లా. అలాగే వసంతర్తువు; గ్రీష్మర్తువు; హేమంతర్తువు; శిశిరర్తువు లు. పద్యాలలో వాడలేదులెండి మీరీ ఋతువులు. సాధారణముగా చాలమంది యీ పొరపాటు చేస్తారు.
    సాధారణముగా ద్రుతసంధులను విస్మరిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా,
    మీ సూచనలు శిరోధార్యము. నేను పద్యాలు వ్రాస్తున్నదే పదాల సరైన వాడుక తెలుసుకోవాలనే. వ్యాకరణము మీద సాధికారకత నాకు లేదు.
    మీ సవరణలను తగినట్లుగా గురువుగారు పోస్ట్ లో మార్పులు చేస్తే సంతోషము.
    గొంతుతో పలికె.
    మండుటెండలు గా మారిస్తే మండుటెండలను అని రావాల్సి ఉంటుందేమో సూచించగలరు.
    జీవులు అవెల్ల అనే వ్రాశాను. జీవులనెల్ల అని మారిస్తే పాదమంతా ఇలా సవరించవలసి ఉంటుందా?
    సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప..
    వర్షపు వేళ జీవికిన్. ఋతము..ఇవన్నీ గుర్తుంచుకుంటాను.
    ద్రుతసంధుల గూర్చి పూర్తి అవగాహన లేదండి. వీలున్నప్పుడు వివరించ మనవి.
    గురువుగారూ, శ్రమగా భావింపక తగిన సవరణలు చేయగలరు.
    ధన్యవాదములతో.
    లక్ష్మీదేవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారు “భగభగ మండు టెండలకు” సరిపోతుంది.
      “జీవులవియెల్ల” సాధువు. “సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప” సవరణ బాగుంది.

      తొలగించండి
  8. నడక దెబ్బ తినకుండా ఇంకొక సవరణ. పరిశీలించ మనవి.
    రెండవ పద్యము-
    -------- కాలువలెండిపోవగా,
    దగ గొని ఛత్రితోడ రహదారులఁ సాగెడు గడ్డురోజులన్

    రిప్లయితొలగించండి
  9. "ఛత్రి" అన్యదేశము. గొని తోడ పునరుక్తి. "దగగొనిఛత్రమింక..." అంటే బాగుంటుంది. "ఛత్రము" సంస్కృతసమము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్న ఇలా సవరించుకున్నానండి. కానీ నెట్ లేక మీ సూచనను గమనించలేక ఇక్కడ పోస్ట్ కూడా చేయలేకపోయాను.
      దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్

      తొలగించండి
  10. ఋతువు లను గూర్చి అద్భుతంగావర్ణించిన లక్ష్మీ దేవిగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ మీ ఋతు చక్ర పరిభ్రమణము లయబద్ధంగా మనోహరంగా సాగుతోంది.

    రిప్లయితొలగించండి
  12. బంగారు కణికెలని చేయితిరిగిన మిత్రులు ఇంకొంచెం మెరుగు పెడితే ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తాయి.
    లక్ష్మీ దేవి గారూ మీరు ఖండకావ్యమును సరి చేసి గురువుగారికి పంపిస్తే పోస్ట్ update చేస్తారు.

    రిప్లయితొలగించండి
  13. సోదరి లక్ష్మీదేవి గారి షడృతు వర్ణన చాల మనోజ్ఞముగా , సహజ సుందరముగా సాగినది. కామేశ్వరరావు గారి చక్కని సూచనలు శిరోధార్యములు.

    రిప్లయితొలగించండి
  14. సోదరి లక్ష్మీదేవి గారి షడృతు వర్ణన చాల మనోజ్ఞముగా , సహజ సుందరముగా సాగినది. కామేశ్వరరావు గారి చక్కని సూచనలు శిరోధార్యములు.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా, ధన్యురాలను. ఔను, వారి ద్వారా చక్కని సూచనలందుకోవడం ముదావహం.

    రిప్లయితొలగించండి
  16. సవరించిన ఖండికను ఇప్పుడే పోస్ట్ చేశాను.

    రిప్లయితొలగించండి