2, మే 2016, సోమవారం

ఖండకావ్యము - 15

తెలుఁగు వెలుఁగు.
రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట సరసింహ సుబ్బారావు)

పాప నవ్వువోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుఁగు పలుకు.

వేమనార్యుఁడన్న విలువైన మాటలు
సుమతి శతక కర్త సూక్తి సుధలు
భవిత తీర్చి దిద్దు బంగరు బాటలై
తెలుఁగు జాతి రీతి తెలియఁ జెప్పు.

తేటగీతి సీస మాటవెలందియు
నందమైన కంద చందములును
కృష్ణ రాయ విభుడు కీర్తించె హర్షించి
దేశ భాషలందు తెలుఁగు లెస్స.

అమ్ములేసి నిలిపె నల్లూరి దొరలను
సింగమట్లు దూకె టంగుటూరి
అమరజీవి యాయె నా పొట్టి రాములు
తెలుఁగు కీర్తి దిశలఁ దేజరిల్ల.

భోజనమ్ము నందు బొబ్బట్లు పులిహార
పనసపొట్టు కూర పచ్చిపులుసు
ఆవకాయ ఘాటు లాపైన గోంగూర
తినిన జిహ్వ లేచు తెలుఁగు రుచుల.

అట్లతద్ది భోగి యాపైన సంక్రాంతి
కనుమ బొమ్మనోము ఘన యుగాది
చవితి దశమి దివిలి శివరాత్రి బతుకమ్మ
తెలుఁగు పండుగలకు తీరు మిన్న,

అతిథి నాదరించు నయ్యల పూజించు
నమ్మ నాన్నలన్న నమిత భక్తి
అన్నదమ్ములందు నైకమత్యమ్మును
తెలుఁగు నేల నంత వెలుఁగుచుండు.

ఆంధ్రమందునైన అమెరికాలో నైన
వెలుఁగులీను చుండు తెలుఁగు పలుకు
మనిషి దూరమైన మమతలు మాయునా
మైత్రి మహిమ మిన్న ధాత్రి లోన.

19 కామెంట్‌లు:

  1. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    తెలుగు వెలుగును గూరిచి తేనెలూర

    ఆటవెలది ఛ౦దమ్మున. న౦దమైన --

    పదసుమ౦బుల గూరిచి వ్రాసి నట్టి

    సత్కవీ ! వ౦దనములు మిస్సన్న గారు !

    రిప్లయితొలగించండి
  2. అన్ని పద్యాలూ బాగున్నాయి.
    అన్నదమ్ముల మధ్య ఐక్యతకు మాత్రం వ్యతిరేకార్థాలే చెప్పాము మనము. హ్మ్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనం విడిపోక ముందు వ్రాశాను లక్ష్మి గారూ. భ్రమ పడ్డాను.

      తొలగించండి
    2. మనం విడిపోక ముందు వ్రాశాను లక్ష్మి గారూ. భ్రమ పడ్డాను.

      తొలగించండి
  3. తెలుగు బాషవోలె తేనెలూరునటుల
    ఆటవెలది పదము లద్భుతముగ
    మధుర భావములను మామంచిగా గూర్చ
    మీకు మీరె సాటి మిస్సనకవి!!!

    రిప్లయితొలగించండి
  4. సరసకవిసింహ నరసింహ సుబ్బారావు గారు పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  5. తేట తెనుగు పదము తోటలందు విరియు
    మేటి పదము లాట‌ లాడి యిచట!
    నలరు చుండె కవిత నమరంగ జూడుడు
    తెలుగు వారి తీరు దెన్ను లెరిగి!

    సుకవులకు నమస్కారములు.... పులిహోర....అంటే బాగుంటుందేమో

    రిప్లయితొలగించండి

  6. తేట తెనుగు పదము తోటలందు విరియు
    మేటి పదము లాట‌ లాడి యిచట!
    నలరు చుండె కవిత నమరంగ జూడుడు
    తెలుగు వారి తీరు దెన్ను లెరిగి!

    సుకవులకు నమస్కారములు.... పులిహోర....అంటే బాగుంటుందేమో

    రిప్లయితొలగించండి
  7. తెలుగు వెలుగును తేటతెల్లము జేసిన మీ పద్యములు సలలితంగా ధారాశుద్ధితో అలరారుచున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. తెలుగు వెలుగుల దువ్వూరి వెలుగులెన్నొ
    వేంకట నరసింహ రచన విలువలొసగ?
    ఆటవెలదుల నాడించ యద్బుతంబు|
    చిన్నిపదముల చిన్నారి చిలిపిలాగ|

    రిప్లయితొలగించండి
  10. తెలుగుభాషకుగలతియ్యదనమ్మును
    నాటవెలదిలోననచ్చుగుద్ది
    చదువరులకుసంతసమ్మునుగలిగించు
    సఖుడ,సుబ్బరావ!శతమునతులు

    రిప్లయితొలగించండి
  11. దిగ్దిగంత వ్యాప్త తెలుగు తేజఃపుంజ్యములను సుందర దరహాస వీచికల వోలె బగు చక్కగ చెప్పిన

    తెనుగు మధుర పరిమళము తెలిసి కొనగ
    అలతి అలతి పద కవిత లతి సులువుగ
    సృజిత మయినది కలమున చిరునగవుల
    అన్న! మిస్సన్న! వందన మందు కొనుము.

    రిప్లయితొలగించండి
  12. పాప నవ్వువోలె పాల మీగడ వోలె....చక్కని తేట తెలుగున ఆటవెలదులందించారండీ...అభినందనలు మిస్సన్నగారూ!

    రిప్లయితొలగించండి
  13. గురుమూర్తి ఆచారి గొప్ప పొగడ్తలు
    .....లక్ష్మికి తోచిన రమ్య శంస
    శైలజ ఘన ప్రశంసయు పోచిరాజుల
    .....సరసంపు పలుకుల సన్నుతులును
    శర్మ శిష్ట్లా వారి సబబౌ ప్రశస్తియు
    .....సహదేవ మిత్రుని శ్లాఘనమ్ము
    ఈశ్వరప్ప యొనర్చు నింపైన కొనియాట
    .....సఖుడు సుబ్బారావు సంస్తవమ్ము

    శర్మతమ్ముడు చేసిన చక్కని నుతి
    గోలివారిచ్చు మెఱమెచ్చు గొప్ప దనము
    మదికి నింపుగ దోచెను మరల మరల
    వందనము లీవె సన్మిత్రు లందు కొనుడు.

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రులు మిస్సన్న గారికి.. మధుర మంజుల సుకుమార సులలిత రసాన్విత తేటతేట తెలుగు కవిత మీ మృదు మధుర హృదయాన్ని ఆవిష్కరిస్తున్నది. చాల సంతోషము.

    రిప్లయితొలగించండి
  15. కవి మిత్రులు మిస్సన్న గారికి.. మధుర మంజుల సుకుమార సులలిత రసాన్విత తేటతేట తెలుగు కవిత మీ మృదు మధుర హృదయాన్ని ఆవిష్కరిస్తున్నది. చాల సంతోషము.

    రిప్లయితొలగించండి