14, జనవరి 2013, సోమవారం

పద్య రచన - 221

                                                                  
కవిమిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
                                                      

19 కామెంట్‌లు:

  1. కోటి వెలుంగులన్ భువికి గొప్పగ తేజము నిచ్చు భాస్కరున్
    పాటిగ గొల్తు రిద్ధరణిఁ పల్లెల వాసులు నమ్మకమ్ముతో
    సాటియె లేక, కానగను సమ్ముఖమందున తోచువానిగా
    దీటగు దేవుడాతడని దెల్లము జేయుచు జెప్పవచ్చునే!

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. చివరలో జెప్ప వచ్చునే కి బదులుగ .. జెప్పుటొప్పగున్ అంటే మంచిది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. సోదర సోదరీ మణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
    ఏడు గుఱ్ఱాల యాసామి ! వేడు కొందు
    అంధ కారము జగమున నలము కొనియె
    వంద నంబులు వేవేలు గందు కొనుచు
    నీ వు కనిపించు మాకయ్య !రవివ రేణ్య !

    రిప్లయితొలగించండి
  4. మానవాళికి మేల్జేయ మకర రాశి
    జేరి యుత్తరాయణపు విశేష కాల-
    మిచ్చి ధరణిని కరుణతో నేలుకొన
    వచ్చు భాస్కరా! కొనుమివె వందనములు.

    రిప్లయితొలగించండి
  5. ఏడు గుర్రాల రథమున నినుమడించు
    సంతసంబున గూర్చుండి సకలజగతి
    కెల్లవేళల వెలుగుల నిచ్చుచుండు
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    జనుల కానందమును గూర్చి యనవరతము
    లోకహితమును గోరుచు నేకదీక్ష
    నాగకుండగ వినువీధి నేగుదెంచు
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    క్రమత నొక్కొక్క మాసంబు సమత జూపి
    రాశులన్నింట దిరుగుచు రయముతోడ
    మకరరాశికి జేరెడు మాన్యునకును
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    కర్మసాక్షిగ నుండుచు కాలగతిని
    తెలియజేయుచు సర్వదా త్రిజగములకు
    నన్నివిధముల నాత్మీయుడగుచునుండు
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    ఆత్మగతిచేత కాలాన నయనములను
    రెండుగా జేసి జగముల కండయగుచు
    నిప్పు డుత్తరాయనమున కేగుచున్న
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    ధరణివారికి ప్రత్యక్షదైవ మగుచు
    నలుగ కుండగ ప్రతిరోజు పలుకుచుండి
    ధైర్యమొసగుచు వీపును తట్టుచుండు
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    ఎవని యాగమనంబున నవనియంత
    జాగృతంబౌచు పొందును సత్వమెపుడు
    వాని కుష్ణరశ్మికిని ప్రభాకరునకు
    పద్మబంధున కొసగెద ప్రణతిశతము.

    మకరసంక్రాంతి శుభవేళ మాన్యులార!
    సకల శుభములు సుఖములు సద్యశంబు
    లందుచుండంగవలె నంచు నందరకును
    కాంక్ష చేసెద జయములు కలుగు కొరకు.

    రిప్లయితొలగించండి
  6. పద్మ బంధున కొసగుచు ప్రణతి శతము
    హృద్యమగు శైలితో జెప్పి పద్యములను
    మిత్రులకు శుభకామనల్ మించు రీతి
    నంద జేసిన మూర్తికి నగుత శుభము.

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 2:51:00 PM

    అనవరతమనూరుడధివసించి రథము
    నడుపు సారధి గాగ నయముతోడ
    సప్తాశ్వ రథమున సమస్త జీవుల
    జీవచైతన్యము చిగురు కొనగ
    నిత్య కర్మల సాక్షి నియమపాలన యందు
    ననితర సాధ్యుండు నంశుమాలి
    భూపాల రాగాన భువినరుణకిరణ
    వితరణ జేయంగ వీతిహోత్రు

    డుజ్జ్వ లోష్ణ ప్రవిష్టుడు నగుచు మకర
    సంక్ర మణము నందు సంక్ర మింప
    జనుల కానంద భోగముల్ సఖ్యతాను
    రాగ జనిత సౌఖ్య రాశు లెల్ల.

    రిప్లయితొలగించండి
  8. మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    తెల్ల గుఱ్ఱాలవేడున్న తేరునెక్కి
    తెల్ల వారగ వచ్చేవు తేజ మలర
    తెలుపు లోనున్న రంగులే తెలియనేడు
    తెలుగు లోగిళ్ళ రంగులే తెలియ నేడు.

    రిప్లయితొలగించండి
  9. జాగృతమ్మును జేయుచు జగములన్ని
    ఉదయగిరి నుండి వెలుగుచు నుద్యమించి
    సప్త హయముల రథముపై సాగుచుండు
    జగము కన్నుకు మ్రొక్కుదు సన్నుతింతు

    రిప్లయితొలగించండి
  10. శర్మ గారూ ! మీ పద్యం చాలా బాగుంది. ‘సప్తాశ్వ రథమున సమస్త జీవుల ' అనే చోట సమస్త అని జగణం పడింది. చూసుకోగలరు.

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 4:51:00 PM

    మిత్రులు రవీందర గారు! పెద్ద ప్రమాదాన్ని తప్పించినందులకు ధన్యవాదములు. సవరణానంతరం
    అనవరతమనూరుడధివసించి రథము
    నడుపు సారధి గాగ నయముతోడ
    సప్తాశ్వ రథమున సర్వజీవంబుల
    జీవచైతన్యము చిగురు కొనగ
    నిత్య కర్మల సాక్షి నియమపాలన యందు
    ననితర సాధ్యుండు నంశుమాలి
    భూపాల రాగాన భువినరుణకిరణ
    వితరణ జేయంగ వీతిహోత్రు

    డుజ్జ్వ లోష్ణ ప్రవిష్టుడు నగుచు మకర
    సంక్ర మణము నందు సంక్ర మింప
    జనుల కానంద భోగముల్ సఖ్యతాను
    రాగ జనిత సౌఖ్య రాశు లెల్ల.

    రిప్లయితొలగించండి
  12. Daya chesi pamditavaryulaku naadoka chinna korika. Telusunna evaraina karunasri "SWAGATAMOYI SWAYAMVARA SAMAAGATA RAAJAKUMAARULAARA...." PADYANNI (veelaite migilina siva dhanurbhamga padyalu) umchagalarani assistunnanu.

    రిప్లయితొలగించండి
  13. వేదాంత వేద్యాయ నమో నమస్తే
    గ్రహాధినాథాయ నమో నమస్తే
    రాజీవ మిత్రాయ నమో నమస్తే
    చైతన్య రూపాయ నమో నమస్తే

    నమస్తే దేవదేవాయ
    ఆదిత్యాయ నమో నమః
    నమస్తే పద్మమిత్రాయ
    భాస్కరాయ నమో నమః

    నమస్తే సాక్షి రూపాయ
    దినేశాయ నమో నమః
    నమస్తే వేద రూపాయ
    అరుణాయ నమో నమః

    మిత్రులారా! అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
    సూర్యునికి 7 గుర్రాలు ఉంటాయి అని అంటారు. కాని అరుణ పాఠమునకు వ్యాఖ్యలో వేరుగా నున్నది. సూర్యునికి ఒకే గుర్రము ఉన్నది. దాని పేరు "సప్త" అని. వేదములో చెప్పబడిన విషయము కాబట్టి ఒకే గుర్రమనియే నేను భావించుచున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి



  14. సప్తవర్ణములె నీ సప్తాశ్వములు గాగ
    ఏకచక్రము చూడ నిలయెగాగ
    పవలురేలును మాస పక్షమ్ము లయనముల్
    సంవత్సరమ్ముల జాడ గలుగ
    జలశోషణమ్మున జలదమ్ములేర్పరచి
    వర్షధారల భూమి బంటలిచ్చి
    విశ్వమంతటికిని వెలుగును బ్రసరించి
    ప్రాణికోటికినెల్ల బ్రతుకునిచ్చు

    తిమిరహరణ ,దుర్నిరీక్ష్య తేజమాన
    పాపసంహార ,భాస్కర,భాను మూర్తి,
    ఉదయసంధ్యామనోహర,సదయహృదయ
    అంజలి ఘటింతు నిదె నీకు నరుణకిరణ.


    రిప్లయితొలగించండి
  15. నమస్కారములు
    పూజ్య గురువులు పండిరులు శ్రీ నేమాని వారికి ప్రణామములు. గురువులకు ,పండితులకు , అందరికీ సంక్రాంతి శుభా కాంక్షలు
    అవును గురువులు చెప్పిన రీతిగా
    సూర్యుని రధానికి ఒకటే గుఱ్రం , ఒకటే చక్రం. " సప్తా శ్వము అనగా ఆ గుఱ్రం పేరు సప్త . " అని నేను విన్నాను .

    రిప్లయితొలగించండి
  16. సప్తాశ్వరథారూడుం
    డాప్తుండెల్లజగమంతనన్నంబును సం
    ప్రాప్తింప జేసెడు జగ
    ద్వాప్తుని సంక్రాంతినాడు ప్రార్థన జేతున్

    రిప్లయితొలగించండి
  17. మకరరాశిలో ప్రవేశిస్తున్న సూర్యభగవానుని గురించి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్యారావు గారికి,
    మిస్సన్న గారికి,
    హరి వేంకట సత్యనారాయణ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    పండిత నేమాని వారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    పండిత నేమాని వారూ,
    సూర్యుని రథానికి ఉన్నది ఒకే గుఱ్ఱమనీ, దాని పేరు ‘సప్త’ అనీ మాకు తెలియని విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.
    విష్ణు పురాణంలో...
    గాయత్రీ చ బృహ త్యుష్ణి గ్జగతీ త్రిష్టు పేవ చ|
    అనుష్టు ప్పంక్తి రిత్యుక్తా ఛందాంసి హరయో రవిః||
    (గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అని సూర్యుని సప్తాశ్వాల పేర్లని, అవే వేదచ్ఛందాలు) అనీ తెలుపబడింది.
    In the Viṣṇu Purāṇa it is stated:

    gāyatrī ca bṛhaty uṣṇig
    jagatī triṣṭup eva ca
    anuṣṭup pańktir ity uktāś
    chandāḿsi harayo raveḥ

    The seven horses yoked to the sun-god's chariot are named Gāyatrī, Bṛhati, Uṣṇik, Jagatī, Triṣṭup, Anuṣṭup and Pańkti. These names of various Vedic meters designate the seven horses that carry the sun-god's chariot.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ తోపెల్ల...శర్మ గారూ!
    శుభాశీస్సులు.
    సంస్కృతములో ఒక శ్లోకములో 2 రకముల ఛందస్సులు ఉపయోగించి ఉపజాతి అనే రీతిగా శ్లోకములు రచించుతారు. అటువంటి ప్రయోగములు మీరు తెలుగులో తరచుగా చేయుచున్నారు కాబోలు. మీ సీస పద్యము తరువాతి పద్యము తేటగీతి & ఆటవెలది పాదములను కలిగి అదొక ఉపజాతిగా భాసించు చున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ పండితార్యులకు నమఃపూర్వక కృతజ్ఞతాభివందనములు.ఒకటికి పదిసార్లు వ్రాసిన పద్యాన్ని తరచి చూసికొనవలెనన్న జ్ఞానోదయమైనది. ఆ.వె. ప్రథమపాదంలో యతిగూడ తప్పినది. మీకు మిక్కిలి ధన్యవాదములు. సవరణానంతరం
    అనవరతమనూరుడధివసించి రథము
    నడుపు సారధి గాగ నయముతోడ
    సప్తాశ్వ రథమున సర్వజీవంబుల
    జీవచైతన్యము చిగురు కొనగ
    నిత్య కర్మల సాక్షి నియమపాలన యందు
    ననితర సాధ్యుండు నంశుమాలి
    భూపాల రాగాన భువినరుణకిరణ
    వితరణ జేయంగ వీతిహోత్రు
    డుజ్జ్వ లోష్ణ మిడగ నొలయగ నీమకర
    సంక్ర మణము నందు సంక్ర మింప
    జనుల జీవితాన సరసంపు సఖ్యతాను
    రాగ జనిత సౌఖ్య రాశు లెల్ల.

    రిప్లయితొలగించండి