16, జనవరి 2013, బుధవారం

పద్య రచన - 223

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. గోపాలుడు గోకులమును
    కాపాడెను రాల వాన రయమున రాలన్
    ఆపాకారికి గర్వపు
    తాపంబును దీర్చె గనుడు తా గిరిధారై.

    రిప్లయితొలగించండి
  2. అత్యహంకృతితో నమరాధిపుండు
    కురిసె రాళ్ళవానను గోపకులముపైని
    ఆ విపత్తును దొలగించె నచ్యుతుండు
    శ్రితజనావన దక్షుండు శ్రీవిభుండు

    కురిసెడు రాళ్ళవాన గని గోపకిశోరుడు భూరి సత్త్వుడా
    దరి గల కొండ నెత్తి వడి దాల్చెను ఛత్రమువోలె లీలగా
    హరి! హరి! పల్లెలోని జనులందర నచ్చట జేర్చి బ్రోచె నా
    పరముని రక్ష గల్గునెడ బాధలు బంధములెల్ల ద్రెళ్ళవే?

    హరి లీలను గాంచుచు న
    బ్బురమొందుచు నణగ గర్వమును శక్రుడు సా
    దరమున కృష్ణుని వేడెను
    కరుణింపుము దేవ! తప్పు కావు మటంచున్

    రిప్లయితొలగించండి
  3. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గరూ!
    మీ పద్యములో చివరన "గిరిధారై" అన్నారు. గిరిధరుడై అంటే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారా?
    *
    పండిత నేమాని వారూ,
    ‘పరముని రక్ష గల్గునెడ బాధలు బంధములెల్ల ద్రెళ్ళవ’ అంటూ గోవర్ధన వృత్తాంతంపై అద్భుతమైన పద్యాలు చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమాని గారికి , శంకరార్యులకు ధన్యవాదములు.
    మీ సూచనతో..


    గోపాలుడు గోకులమును
    కాపాడెను రాల వాన రయమున రాలన్
    ఆపాకారికి గర్వపు
    తాపంబును దీర్చె గనుడు తా గిరిధరుడై.

    రిప్లయితొలగించండి

  6. గోవర్ధన గిరి నెత్తియు
    గోవుల కాపాడినావు గోకుల కృష్ణా !
    గోవనితలు గోపాలురు
    గోవిందుని జేర వచ్చె గోగిరి దరికిన్

    రిప్లయితొలగించండి
  7. అదిగో చూడుము నందబాలకుని, సౌహార్దమ్ముమూర్తీభవిం
    ప, దయాశీలత రూపమంద; నదె గోపాలుండు గోవర్ధన
    మ్మిదె తా జేయుట గాంచు భాగ్యమును నేనీరీతి పొందంగ నా
    మది నాహ్లాదము బొందెనే! నతుల సమ్మానింతు శ్రీకృష్ణునిన్.

    రిప్లయితొలగించండి
  8. అదిగో చూడుము నందబాలకుని, సౌహార్దమ్ముమూర్తీభవిం
    ప, దయాశీలత రూపమంద; నదె గోపాలుండు గోవర్ధన
    మ్మిదె తా జేయగ గాంచు భాగ్యమును నేనీరీతి పొందంగ నా
    మది యాహ్లాదము నందెనే! నతుల సమ్మానింతు శ్రీకృష్ణునిన్.

    రిప్లయితొలగించండి
  9. భ్రాంతిం బొంది చరింతురేల గనగా బాలుండు వీడెట్లు దు
    ర్దాంతాభీల మహా మహీధ్రమును ధైర్యానూన శౌర్య ప్రభా
    క్రాంతుండై పయికెత్తునంచు ; జనులారా ! రండు విచ్చేసి వి
    శ్రాంతింబొందుడు బంధు మిత్రులు ! మనస్స్థైర్యంబు పెంపొందగన్ !!!

    రిప్లయితొలగించండి
  10. భీతిలనేల మీరు యదువీరులు మత్సఖు లాత్మబంధువుల్
    ఖ్యాతిని గల్గువార లమరాధిపుగర్వము నేడు గూల్తు, నా
    చేతి కనిష్ఠికన్ గిరిని సేమము గూర్పగ దాల్తు రండు మీ
    చేతము లుల్లసిల్లునని చీరెను కృష్ణుడు పల్లెవారలన్.

    లోకరక్షకుండు శోకార్తులైయున్న
    వారి ననునయించి, భయము బాపి
    గోకులంబు గావ గోవర్ధనాఖ్యమౌ
    గిరిని లేవనెత్తె సరసు డగుచు.

    గోవర్థనగిరి యప్పుడు
    భావింపగ ఛత్రమట్లు భాసిల్లె నటన్
    గోవులు గోపకులంబులు
    గోవిందుని చెంతజేరి కూరిమి మీరన్

    గిరిపంచను సుఖమందుచు
    నరుసంబున వారు చేసి రద్భుతరీతిన్
    కరుణామయుడౌ కృష్ణుని
    వరగుణసంకీర్తనంబు వైభవమొప్పన్.

    రాళ్ళవానయైన ప్రళయాగ్నియైనను
    అవనిజముల గూల్చు పవనమైన
    సర్వభారకుండు సంరక్షకుండౌచు
    చేరదీయ నేమి చేయగలవు?

    తానొనరించిన దొసగును
    మానసమున దలపకుండ మన్నించంగా
    నానావిధముల శక్రుం
    డానారాయణుని వేడె నతిభక్తిమెయిన్.

    హరి ప్రసన్నుడౌచు కరుణార్ద్రదృక్కుల
    జూచె, నింద్రుడంత జోత లొసగె
    ఖేచరాదులెల్ల కీర్తించి రాశౌరి
    లీల గాంచి మేలు మేలటంచు.

    వందనంబు నీకు వైకుంఠ! మాధవ!
    వందనంబు నీకు భవ్యచరిత!
    వందనంబు నీకు నందాత్మసంజాత!
    వందనంబు గొనుము వాసుదేవ!

    రిప్లయితొలగించండి
  11. తనను గాదని పూజించిరి నగము నని
    గోపకులముపై కోపించి గోత్రభిదుడు
    పుష్కలావర్తము లనెడు భూరి మేఘ
    ముల బనుప నవి వ్రజమును ముట్టడించె

    కారుమబ్బులు నభమున క్రమ్ముకొనగ
    కురిసె మిన్ను మన్నొకటిగ కుంభవృష్టి
    నల్లనయ్య గోవర్ధన నగము నెత్తి
    గాచె గోవుల గోపుల గాసి నుండి

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 16, 2013 8:53:00 PM

    యాదఃపతి సురపతి దయలేక పనుపన్ ప
    యోఘన వృష్టి నమోఘరీతి
    కురియింప తాళక గోపకుల్ కులకాంత
    లాలమందలు పిల్లలటునిటు భయ
    భ్రాంతచింతాక్రాంతులై తిరుగుచు
    రక్షణమునకీవె దక్షుడవన
    వర్ధమానుని వేడ వారిన్ దినదిన ప్ర
    వర్ధమానుడగు గోపాల బాలు
    డుద్ధతిన్ దిగ్దిగంతములుత్సహించు
    రీతి గోవర్ధనగిరి దరించి మించి
    చత్రముగనిల్ప నింద్రుడు శరణు శరణు
    పాహి పాహి యనుచు నుండె భయముతోడ

    రిప్లయితొలగించండి
  13. శ్రీ తోపెల్ల....శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ సీసపద్యమును బాగుగ సవరించ వలెను. మొదటి పాదములో ప్రాసయతి నియమములు పాటింపబడలేదు. అన్వయము సరిగా లేదు. సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. డా.విష్ణునందనులవారి పద్యం మంచి ఊపుగా, నాటకరంగ పద్యం లాగా పాడుకోవటానికి వీలుగానున్నది.
    సంతోషం.

    రిప్లయితొలగించండి
  15. బాలుడు వీడు శైలమది భారము మోయుట మాటలేమిలే
    చాలని తల్పబోకుడిది ఛత్రము వోలెను గాచు మిమ్ము నా
    కేలది యల్లలాడ దిక కీడది వట్టిది రాళ్ళ వృష్టి గో-
    పాలుర పాలి ధూళికణ పాతమగున్ చనుదెంచు డందరున్.

    గోవర్ధనగిరి గొడుగుగ
    భావింతుము గోపబాల! పరమ దయాళూ!
    దైవమవై మా యండను
    నీవుండగ మాకు కీడె? నీరజనాభా!

    అన్య చింత మాని యా పరంధాముని
    యెవడు నమ్ము కొనునొ యిహమునందు
    నట్టి వాని క్షేమ మాతడె వహియించు
    ననుట కిది నిదర్శనమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  16. కావగ ప్రాణుల నన్నిటి
    గోవర్ధన గిరిని యెత్తె కొన వ్రేలి పయిన్ !
    గోవులు గోపకు లందరు
    ఆవరణము క్రింద జేరి యాశ్రయ మొందెన్ !

    రిప్లయితొలగించండి
  17. 'మన తెలుగు ' శ్రీ చంద్రశేఖర్ గారికి సాదర ధన్యవాదాలు.
    మిస్సన్న గారి మొదటి పద్యం పోతన కవీంద్రునికి అనుసరణ ప్రాయం చాలా బాగుంది .మూడవ పద్యం మరింతగా బాగుంది భగవద్గీతా స్ఫూర్తితో ' ఆ పరంధాముని నెవడు నమ్ముకొనునొ వాని క్షేమము ' భగవానుడే వహిస్తాడనడం , దానికి గోవర్ధనోద్ధరణానికి ముడిపెట్టడం బాగా కుదిరింది.

    లక్ష్మీదేవి గారి పద్యం చాలా బాగుంది - వారికొక సూచన . పద్య రచనా సంప్రదాయాన్ని అనుసరించి - చేసెనే అంటే చేసెనా ? (అనగా చేయలేదని భావము) .
    ఆనందించెనే అంటే ఆనందించెనా? (అనగా ఆనందించలేదని భావము) .
    పొందెనే అంటే పొందెనా ? (అనగా పొందలేదని భావము) .

    అట్లే పొందదే అనగా పొందదా? (అంటే పొందుతుంది కదా అని భావము)
    చేయదే అంటే చేయదా ? (అంటే చేస్తుంది కదా అని భావము)

    ఈ విధంగా చిన్ననాటి ప్రతిపదార్థ పాఠాల్లో చదువుకుని ఉంటారు .

    ప్రశ్నార్థకాంతాలైన పదాలకు పూర్తిగ వ్యతిరేకార్థము రావడం కద్దు .

    నేనానందింతునే అంటే - ఆనందింపనని , నేనానందింపనే అంటే - ఆనందిస్తానని పూర్తి వ్యతిరేకార్థమైన సమాధానాలు రావడం గమనింపగలరు .

    ఆలెక్కన నా మది యాహ్లాదము నందెనే అంటే వ్యతిరేకార్థమూ ; నా మది యాహ్లాదము నందదే అంటే ఆనుకూల్యార్థమూ వస్తాయి. ఇది యొక సూచన !

    రిప్లయితొలగించండి
  18. చాలా కాలానికి డా. విష్ణునందనుల ప్రశంసను పొందగలగడం చాలా సంతోషాన్నిస్తోంది.

    రిప్లయితొలగించండి
  19. గోవర్ధన గిరిధారి చిత్రాన్ని చూసి స్పందించి మనోహరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు.....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.


    రిప్లయితొలగించండి
  20. గురువు గారికి , విష్ణునందన్ గారికి అనేక ధన్యవాదములు.

    అదిగో చూడుము నందబాలకుని, సౌహార్దమ్ముమూర్తీభవిం
    ప, దయాశీలత రూపమంద; నదె గోపాలుండు గోవర్ధన
    మ్మిదె తా జేయగ గాంచు భాగ్యమును నేనీరీతి పొందంగ నా
    మది యాహ్లాదము నందె, నే నతుల సమ్మానింతు శ్రీకృష్ణునిన్.

    రిప్లయితొలగించండి