3, జనవరి 2013, గురువారం

సమస్యా పూరణం - 926 (కంటి కింపు గొలుపు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కంటి కింపు గొలుపు గాన సుధలు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

30 కామెంట్‌లు:

  1. భక్తి రసము తోడ పరిఢవిల్లుచును ము
    క్కంటి కింపు గొలుపు గాన సుధలు
    సకల లోకములను చాల వ్యాపించుచు
    నాదు నెడద సోకి మోదమొసగె

    రిప్లయితొలగించండి

  2. అవియె ‘త్యాగరాజ ఆరాధనోత్సవ
    మ్ములు’ జరిగెను గద పురములోన
    వాని నెల్లఁ జూడ వచ్చిన యా మచ్చె
    కంటి కింపు గొలుపు గానసుధలు.

    ‘త్యాగరాజ + ఆరాధనోత్సవములు’ ప్రఖ్యాతమైనందున విసంధిగానే వ్రాయడం జరిగిందని గమనించ మనవి.

    రిప్లయితొలగించండి
  3. ప్రాత లవకుశ ' సినిమాను ' పరగ జూడ
    కంటి కింపు గొలుపు, గాన సుధలు
    ఘంటసాలవారి గాత్రంబు చిలుకగ
    చెవిని సోకి హాయి జెందు మనసు

    రిప్లయితొలగించండి
  4. గోలి వారూ,
    మొదటి పాదం తేటగీతి అయింది.
    ‘ప్రాత లవకుశ సినిమా తెరపై జూడ’ అందామా?

    రిప్లయితొలగించండి
  5. వెండి కొండ నుండు విశ్వ నాధు డెపుడు
    సంధ్య వేళ లందు సౌరు విరియ
    ప్రమద గణము లంత ప్రేమ మీరగ జేరి
    కంటి కింపు గొలుపు గాన సుధలు

    రిప్లయితొలగించండి
  6. మాస్టరు గారూ ! తొందరపాటుకు క్షమించండి ..సవరించు చున్నాను.సవరణకు ధన్యవాదములు.

    'లవకుశ' ను కనంగ రామరావు నటన
    కంటి కింపు గొలుపు, గాన సుధలు
    ఘంటసాలవారి గాత్రంబు చిలుకగ
    చెవిని సోకి హాయి జెందు మనసు

    రిప్లయితొలగించండి
  7. గోలి వారూ,
    సవరించారు. బాగానే ఉంది.
    కాని ‘ర-ల’ యతిమైత్రి లేదు. ఈమధ్య కొందరు ప్రయోగిస్తున్నారు కాని అది తప్పు.
    ల-డ లకు యతిమైత్రి ఉంది. (అభేద యతి)

    రిప్లయితొలగించండి
  8. నాట్యమాడు మనిన నడుము గట్టు నెపుడు
    పద్యకవిత లన్న పరుగు లెత్తు
    అభినయమును జేయు నన్ని వేళల; తమ్మి
    కంటి కింపు గొలుపు గానసుధలు

    రిప్లయితొలగించండి
  9. మాస్టరు గారూ ! ..సవరించు చున్నాను...ధన్యవాదములు.

    ప్రాత చిత్ర ములను రామరావు నటన
    కంటి కింపు గొలుపు, గాన సుధలు
    ఘంటసాలవారి గాత్రంబు చిలుకగ
    చెవిని సోకి హాయి జెందు మనసు

    రిప్లయితొలగించండి
  10. యతి విషయమై శ్రీ శంకరయ్య గారి సూచనకు ఒక చిన్న సవరణ:

    ర ల లకు యతిని కొందరు కవులు పాటించుచున్నారు. శ్రీనాథుని కాశీఖండములో కూడ 2 చోట్ల ప్రయోగములు కలవు. ఈ విషయమును తెలుగు అకాడమీ ప్రచురణ యైన ఛందః పదకోశములో చూడ వచ్చును. ఆ విధముగనే నేనును ఈ యతిని పాటించుచున్నాను. స్వర సాన్నిహిత్యము కూడా ర ల లో ప్రస్ఫుటముగా నున్నది కావున ఈ విధమైన యతిని సమ్మతించుటే లెస్స యని నా అభిప్రాయము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. దాశరథీ శతకములో కూడా ఇట్టి ప్రయోగము కలదు:
    ఉదా: రెండవ సాటి దైవమిక లేడనుచున్......
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 03, 2013 8:57:00 AM

    గురువుగార్కి నమస్సులు. రావూరి దొరసామి శర్మ సంపాదకత్వాన ముద్రితమైన పొత్తపి వెంకట రమణ కవి “ లక్షణ శిరోమణి” నందు అభేద యతిగా “ ర,లః ర,ళః ల,ళః ల,డః ళ,డః వ,ప,బ లకు యతి పేర్కొని నారు.
    ఆమోదయోగ్యములు తెలుప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  13. మోహినిగను మారి పోదును నారూపు
    కంటి కింపు గొలుపు గాన! సుధలు
    సురుల కిత్తు మోవి సుధలకై దైత్యులు
    తిరుగ తెలివి మాసి తెగువ మాని.

    రిప్లయితొలగించండి
  14. మంచి చిత్ర మదియ మదిని ము రియ జేసి
    కంటి కింపు గొలుపు ,గాన సుధలు
    కర్ణ భేరి దాకి కర్ణంబు లుప్పొంగి
    చేర్చు మనల నపుడు శివుని దరికి .

    రిప్లయితొలగించండి
  15. మరొక్క చిన్న అనుమానం. ఆటవెలదిలో ప్రాస పాటించితే ఆమోదయోగ్యమేనా ?

    రిప్లయితొలగించండి
  16. మూకపంచశతిని మోహనముగ పాడు
    కవిని మెచ్చుకొనడె గౌరి మొగుడు?
    కామితమ్ముఁ దీర్చు కామాక్షిఁ బొగడ- ము
    క్కంటి కింపు గొలుపు గాన సుధలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ మారెళ్ళ వామన కుమార్ గారు!
    శుభాశీస్సులు.
    ఆటవెలది, తేటగీతి, సీసము మొదలైన వానికి ప్రాస నియమము లేదు. ఎవరైన సరదాగా ప్రాసను వేసుకొందామంటే మంచిదే. ప్రాసలు యతులు పద్యమునకు సొగసును చేకూర్చును కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ మారెళ్ళ వామన కుమార్ గారూ!
    మీ నిన్నటి పద్యము "ధర నీ పాదము నౌక యంచు దలతున్......" గురించి:

    1. ధర అనే శబ్దమును 4 పాదములలోను వాడేరు కదా! 4 వేరు వేరు అర్థములు కలవా? లేకుంటే పునరుక్తి దోషము అగును.
    2. 1వ పాదములో ధారాళమిచ్చున్ .. సరియేనా? ధారాళముగ నిచ్చున్ అని ఉండాలి కదా.
    3. 3వ పాదములో: అనఘా! అని భగవంతుని సంబోధించుట ఉచితము కాదు అని నా భావము.
    4. 4వ పాదములో నీ పాదమును నౌక యని ఎందుకు దలచెదరో అన్వయమును నిరూపించుట లేదు.
    అందుచేత సమస్య సమస్యగనే మిగిలినది. పరిష్కృతము కాలేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. సవరణతో...
    మూకపంచశతిని మోహనమ్ముగ పాడు
    కవిని మెచ్చుకొనడె గౌరి మగడు?
    కామితమ్ముఁ దీర్చు కామాక్షిఁ బొగడ ము
    క్కంటి కింపుఁ గొలుపు గానసుధలు.

    రిప్లయితొలగించండి
  20. అఘము చీల్చు నట్టి యభిషేక మటపైన
    బిల్వపత్రపూజ ప్రియము మరియు
    భవ్యభక్తిభావ భరితంబులైన ము
    క్కంటి కింపు గొలుపు గానసుధలు.

    రిప్లయితొలగించండి
  21. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 03, 2013 4:06:00 PM

    కాంతు లీనెడి సౌధంబు కాంచ గాను
    కంటి కింపు గొలుపు గాన, సుధలు
    వేయ వలెనంత ఇంటికి వేగముగను
    మకర సంక్రమణము మదిని తలచి.

    రిప్లయితొలగించండి
  22. భరత నర్తనమ్ము భామా కలాపమ్ము
    కనుల కింపు గొలుపు ; గాన సుధలు
    చెవుల కింపు గొలుపు చిత్తము నలరించు
    భాగవతము జదువ పరము దొరకు

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని వారూ,
    ర,ల యతి గురించి నా అభిప్రాయం పూర్తిగా తప్పు. తొందరపాటుతో చెప్పింది. మీరు చెప్పిందే సరి యైనది. రెండు రోజుల తరువాత ‘అభేద యతి’ని గురించి ఒక టపా పెడతాను.
    ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  24. మొదటి పద్యమునకు సవరణ :

    నాట్యమాడు మనిన నడుము గట్టు నెపుడు
    పద్యకవిత లన్న పరుగు లెత్తు
    నభినయమును జేయు నన్ని వేళల ; తమ్మి
    కంటి కింపు గొలుపు గానసుధలు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఈనాడు ఒక మంచి ప్రయోగము చేసి చూపించేరు. వారి పద్యములో 1, 3 పాదములు తేటగీతి, 2,4 పాదములు ఆటవెలదిగా నున్నవి. బాగున్నది కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి





  26. సుందరమ్ము నృత్యమందిరమ్మిచ్చట
    కంటికింపుగొల్పు ;గానసుధలు
    వీనులకును గూర్చు విందు మానగరాన
    లలితకళల భవ్య విలసనమ్ము.

    రిప్లయితొలగించండి
  27. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 03, 2013 8:54:00 PM

    శ్రీ పండితులవార్కి నమస్సులు.
    మహాపరాధము జరిగినది. దోషము తెల్పినందులకు ధన్యవాదములు. పునఃప్రయత్నం చేసితిని. దోషములున్న తెలుప ప్రార్థన.

    కాంతు లీను హర్మికహొయలు కాంచగన్
    కంటి కింపు గొలుపు గాన, సుధలు
    వేయ వలయు సౌధవితతికి రాబోవు
    మకర సంక్రమణము మదిని తలచి.

    రిప్లయితొలగించండి
  28. మనోహరంగా వైవిధ్యంగా పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    కమనీయం గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

  29. మనసు మురిసి పోవు మాధుర్య గీతాల!
    తనువు నాట్య మాడు దరువు కుదర!
    మనసు తనువు రెండు మరచి నాట్యంబాడ!
    కంటి కింపు గొలుపు గాన సుధలు!

    రిప్లయితొలగించండి