8, జనవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం - 931 (అది విన్నన్ గనినంత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.
ఆకాశవాణి సౌజన్యంతో
సమస్యను సూచించిన తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.

29 కామెంట్‌లు:

  1. సీతాపహరణ దృశ్యమాలిక చూచినప్పుడు మనోభావనలు.


    మది మోహమ్ము మునుంగురీతినట నా మాయామృగమ్ముండ, దా
    హృదయేశున్ గని సీత కోర, నపుడే హేలాగతిన్ రాముడున్
    కదిలెన్, ధూర్తుని యోచనమ్ములవి యా కాంతామణిన్ జేర! న
    య్యది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  2. అది క్రూరత్వము గడ్డ కట్టిన మహాహంకార పూర్ణంబు దు
    ర్మద మాత్సర్య సమన్వితంబు జన సామాన్యంబునున్ ద్రొక్కి సం
    పదలన్ స్వార్థరతిన్ గడించు పదవీ వ్యామోహవఛ్ఛ్రేణి నే
    నది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 8:19:00 AM

    ఇవ్వబడిన సమస్య “ అధి విన్నన్ కనినంత మండునొడలత్యంతాగ్రహోదగ్రతన్ “
    1983 లో ప్రథమ ప్రయత్నంగా NTR మీద వ్రాసిన ఆకాశవాణి సమస్యా పూరణం. ఆనాటి శాసన సభా కార్యక్రమానికి అద్దం పడుతున్నదని ప్రశంసిస్తూ చదువబడినది. పద్యమందలి దోషాలు తెలియవు. కాని చదువబడినది. పెద్దలు తెలియ జేయుదురని మరల చూపుచున్నాను.

    అధికా రంబును చేతబ ట్టినటు డత్యంతో ద్ధతిన్ జూ ప న
    య్యధికా రంబిల నిల్వ జా లదను చహ్హహ్హంచు మూల్గంగ న
    య్యధిపుం జూచి విపక్షులాతనిని దుయ్యంబట్టనెంచన్ సభన్
    అధివిన్నన్ కనినంతమం డునొడ లత్యంతా గ్రహోద గ్రతన్

    రిప్లయితొలగించండి
  4. శర్మ గారు,
    అధి అదిగా పొరబాటున పడిందా?
    నేను పొల్లు లేదనుకునే పూరణ చేసినాను.
    ఇంతకీ మీరు అధి ని ఏ అర్థంలో వాడినారనేది అన్యథా భావించక కొంచెం వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 12:08:00 PM

    లక్ష్మీదేవిగారికి నమస్సులు. అమ్మా! మీపూరణ అత్యద్భుతం. ఇక్కడ నేచూపినది ఆకాశవాణి 1983లో ఇచ్చినదానికి అప్పటి నా పూరణ.
    ప్రస్తుతము గురువుగారిచ్చినది "అది" "అధి" కాదు.
    కనుక మీపూరణ సరియైనదే. ఇక అధి శబ్దాన్ని "మిక్కిలి" అనే అర్థంలో తీసికుని పూరించాను. సాధు అసాధు విషయమైతే నాకుతెలియదు. ఆంధ్ర వాచస్పత్యంలో చూచిన గుర్తు.

    రిప్లయితొలగించండి

  6. శర్మగారు,
    ధన్యురాలను.
    పొల్లుతో ఉన్న అక్షరముతో పూరణ......

    రత్నాకరమైనా సముద్రము తాగడానికి పనికిరానట్టు, విద్యావంతుడౌ రావణుని బుద్ధి పెడదారి పట్టెనే!


    విధిగా విద్యల నేర్చియున్ జగములన్ వేధింప బూనెన్ కదా?
    సుధియై నేమొకొ? లాభమే, నడతలో శుద్ధత్వమింతేనియున్
    బుధులన్ గాంచియు నేర్వకున్న; రుచి యేమున్నట్టులో, నా మహో
    దధి? విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 1:14:00 PM

    విదితం బైనది శాస్త్ర సన్నుత చతుర్వేదాభినందంబుల
    య్యది గోమాతగ హైందవాభ్యుతికి శ్రేయస్సుల్ సదా యిచ్చున
    య్యదిగాగన్ కదనంబు ముష్కరులు జేయన్ దుర్వచోక్తాదుల
    య్యది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! శుభాశీస్సులు.
    నేటి సమస్య "అది" అనే పదముతోనే మొదలయింది; "అధి" తో కాదు. కేవలము అధి అనే 2 అక్షరములతో వేరుగా ఏ అర్థవంతమైన పదమును లేదు. అందుచేత "అది" తోనే పూరించుట లెస్స. ద ధ లకు ప్రాస మైత్రి అక్కడక్కడ వాడుచున్నారు కాని ద కి ద తోను, మరియు ధ కి ధ తోను మాత్రమే ప్రాస వేయుట శ్రేష్ఠము. స్వస్తి

    అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    మీరు 2వ మారు పూరించిన పద్యములో చివరి పాదము దధి (ఉదధిలో భాగము) తో ప్రారంభించి పూర్తి చేసేరు. ఉత్ + అధి అని ఉదధిని విడదీయదగునా? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ తోపెల్ల వారికి నమస్కారం!

    వృత్తిలోనే కానీ "అధి"కి వ్యస్తంగా ప్రయోగం సాధ్యం కాదు. అందువల్ల "సభన్నధి విన్నన్" అని సంధిని ఒకవేళ అంగీకరించినా అర్థం పొందుపడదు కనుక సమస్య పూరణను పరిష్కరించాలి. ఆకాశవాణి వారిచ్చిన సమస్య సరిగానే ఉన్నది.

    శ్రీమతి లక్ష్మీదేవి గారికి అభివందనం!

    ఎప్పటివలెనే మీ రెండు పూరణలలోని భావాలూ అద్భుతంగా ఉన్నాయి. మొదటి పూరణలో "మది మోహమ్ము మునుంగు రీతి" అన్నచోట "మది మోహమ్మున మునుంగు రీతి" అన్న అర్థం ఏర్పడదు కనుక "మది మోహాబ్ధి మునుంగు రీతి" అని సవరించుకొంటే సరిపోతుంది.

    రెండవ పూరణలో "సుధియైన+ఏమొకో" కంటె "సుధియై యేమొకొ" అంటే అన్వయం సులభం. అయితే, "మహోదధి" అన్నప్పుడు "మహా+ఉద+ధి" అన్న పదచ్ఛేదం కారణాన యతి సరిపడదు.

    విధిగా విద్యల నేర్చియున్ జగములన్ వేధింపఁ బూనెన్ కదా?
    సుధియై యేమొకొ? లాభమే, నడతలో శుద్ధత్వ మింతేనియున్
    బుధులన్ గాంచియు నేర్వకున్న; రుచి యేమున్నట్టులో గాని తో
    యధి! విన్నన్, గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.

    అని కాని, వేఱొక విధంగా కాని అనవచ్చునేమో, చూడండి.

    శ్రీ గురువుల పద్యధార, పూరణ తీరు అమోఘంగా ఉన్నాయని వేఱే చెప్పాలా? "నమోవాకం ప్రశాస్మహే".

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. అది చిన్నారులు తెల్గువారలొకటై యాంధ్రోత్సవం బొక్కచో
    ముదమారంగ నొనర్చునట్టి సభ, నమ్ముండా సభాధ్యక్షు డా
    పద సృష్టించుచు నాంగ్లభాష గొని సంభాషించుచున్నాడు తా
    నది విన్నన్ కనినంత మండు నొడలత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  11. ఇరువురు పండితులకు నా ప్రణామములు.
    మీరలు సూచించిన సవరణలు శిరోధార్యము.

    ఇటీవలి మూర్ఖప్రేలాపనల గురించి..

    మదమాత్సర్యములన్నఁ జూపుచునదే మైకమ్ముదానుండెనో
    వదరంగా నొకమూర్ఖుడిచ్చటను, గర్వాంధుండుగా నుండగా
    హృదయంబందున శాంతమేది? కల సౌహృద్యంబు మాయమ్ము,నే
    డ;ది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.

    అధికారమ్మును జూపనెంచ, జనులున్ హాహారవమ్మిట్లహో,
    విధి! యంచున్ పలురీతులందిటుల నన్వేషించు దుర్భాగ్యమే
    యధిపుండై జన రక్ష జేయునని నయ్యాపన్నుడివ్వేళ శే
    వధి! విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  12. మదమున్ కామవికార భావజనితోన్మాదంబుతో నాడు దు
    ర్మదులై కీచకకార్యలోలురు నిశిన్ లజ్జావిహీనాత్ములై
    రొదలన్ గానక పాడుఁజేసిరి గదా! రూపాంగినిన్ తుచ్చులై
    యది విన్నన్ గనినంత మండునొడలత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  13. కదనంబంచును కౌరవుల్ దెలుప కంగారేమియున్ లేక తా
    చిదుమన్ దూకుచు రేగుచుండి 'యభి' విజృంబించగన్ వైరులా
    పదునున్నోర్వకఁగత్తిదూసిరతి కోపావేశులై భీరులై
    యది విన్నన్ గనినంత మండు నొడలత్యంతాగ్రహోదగ్రతన్!

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. అదె విద్యుత్తును జూడుమా ! ధరలు నీలాకాశ మంటెన్, భువిన్
    బ్రదుకే భారము తోచెడిన్ ప్రజకు సంప్రాప్తించె కష్టమ్ములే !
    ఇదియే బాదు డనంగ పేదలకు నిందే శంకయున్ లేదు వా
    రది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 7:57:00 PM

    రవీందర్ జీ! ప్రస్తుత సగటు మనిషిని గూర్చి దుమ్ము దులిపారు. చాల బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. సంపత్ కుమార్ శాస్త్రి జీ! ఢిల్లీ ఉదంతాన్ని చాల బాగ చెప్పిరి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 8:50:00 PM

    ఈ రోజు నాకు మరపురాని మధురమైన రోజు. లేఖినీ రూప మాధ్యమమున మాత్రమే నే దర్శించు చున్న పండిత నేమాని వారి ఆశీఃపూర్వక భాషణ శ్రవణానందమును గూర్చినది. పుంభావ సరస్వతిగా భాసిల్లు మాన్యశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి అమూల్య సూచనలు గ్రహించే మహద్భాగ్యం గల్గినది.
    10 వ తరగతి వరకుమాత్రమే గురుముఖతః విద్యనేర్వగల్గితిని. విధాత రాతచే కౌటుంబిక బాధ్యతలచే చదువు మానకూడదనే సంకల్పంతో ప్రయివేటుగా కేవలం పుస్తకమే గురువుగా నా బుద్ధికి అర్థమైనట్లు చదివిన చదువుకు పట్టా వచ్చినది గాని పొట్టనందక్కరములేదు.
    ప్రస్తుత విషయమై సందేహం తీర్చ ప్రార్థన.
    శ్రీ కొట్ర శ్యామల కామశాస్త్రి గారి ఆంధ్రవాచస్పత్యంలో “ అధి” అన్న పదానికి

    1. అధి ఉపసర్గ తో జేరిన అక్షరములు-అహికరణము, అధ్యయనము.
    2. అధికము. చూ. హేరాళము. 3.శివుడు. 4. కార్యము. 5. నడవడి.౬. ఉదకము.
    కావిన “అధి విన్నన్” అనగా పదే పదే లేదా ఎక్కువగా వినగా అనే అర్థం వచ్చునా?
    పెద్దలకు ప్రణామములు. ఇది నా అజ్ఞానంతో అడుగుతున్నది.( సందేహం)

    రిప్లయితొలగించండి
  19. మధ్యలో "జీ" ఎందుకండీ. అచ్చతెలుగులో "గారూ" అందాం.

    రిప్లయితొలగించండి
  20. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 8:53:00 PM

    టై పాటున అహికరణము అని పడినది. అధికరణము గా చూడ మనవి.

    రిప్లయితొలగించండి
  21. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    నమస్కృతులు.
    ‘అధి’ అనడం మీ టైపాటేమో అని సందేహించి ‘అది’ అన్నాను. ఈ విషయమై నేమాని వారి, ఏల్చూరి అభిప్రాయాలు స్వీకరింపదగినవి. నాకేమో అంతగా సంస్కృత భాషా పరిజ్ఞానం లేదు...
    పృచ్ఛకుడు సమస్యను ఎలాగైనా ఇవ్వవచ్చు. దానిని సమర్థంగా పూరించటంలోనే ప్రతిభ ప్రస్ఫుటమౌతుంది. ‘అధి’ని స్వీకరించి పూరణలు చేసిన వారికి అభినందనలు.
    *
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు...
    లక్ష్మీదేవి గారికి,
    పండిత నేమాని వారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, మిత్రశ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు.

    ముందుగా, శ్రీ తోపెల్ల వారి ప్రశ్నకు వక్తవ్యం: ("అధి" ఉపసర్గ తో చేరిన పదాలు కనుక) "అధి" ముందుచేర్చి కరణము, ఆయనము, క (స్వార్థమునందలి క ప్రత్యయం) ఇత్యాదులను - అధికరణము, అధ్యయనము, అధికము (అధి+క) అని వాడాలని వాచస్పత్య భావం. "అధి" అన్న ఉపసర్గను వ్యస్తంగా "అధికము" అన్న అర్థంలో వాడలేము.

    "అధి" అన్న ఒక్క వ్యస్త ప్రయోగవిషయం అటుంచితే, ఆకాశవాణి కార్యక్రమానికి మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉన్నది.

    శ్రీ తోపెల్ల వారి విద్యావ్యాసంగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. "విధాత వ్రాతచే కౌటుంబికబాధ్యతలచే చదువు మానకూడదనే సంకల్పంతో ప్రయివేటుగా, కేవలం పుస్తకమే గురువుగా, నా బుద్ధికి అర్థమైనట్లు చదివిన చదువు" అన్న వాక్యంలోని దీక్ష దక్షతగా మాఱి వారికి పద్యవిద్యను ప్రసాదించినదని భావిస్తున్నాను.

    నేనేదో ఔపచారికంగా అనటం లేదు. నా లాగా మిఠాయి కొట్లో కూర్చొని కారాకిళ్ళీ వేసుకోవటం కాక - పట్టుదలతో, ఉత్సాహోత్సవాలతో కొనసాగిస్తున్న మీ సాధన "శంకరాభరణం"లో ఫలించి కావ్యరచనగా పర్యవసించి మఱింత రాణింపుకు రాగలదని నా దృఢవిశ్వాసం.

    భవతు!

    రిప్లయితొలగించండి




  23. మదిరాపానము జేసి మోహవశులై మంచన్నదేలేని దు
    ర్మదులా రాతిరి రాక్షసాధములు కామాంధుల్ పశుప్రాయులై
    సుదతిన్ హింసల పాలుజేసిరిమహాశోకార్తిలో ముంచిరే
    అది విన్నన్ ,గనినంత మండునొడలత్యంతాగ్రహోదగ్రతన్.

    రిప్లయితొలగించండి

  24. అంచలవిడిది అర్ధరేతిరి మైల పడి బోరుమంటే,
    ఆడది సూరీడి తాపాన భస్మీ పటల మైతే
    అనాగాతవేది 'అదిని' దానికి కారణమై చూపితే,
    అది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  25. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదములు.
    *
    కమనీయం గారూ,
    మీ సమయోచిత పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘మంచి + అన్నది’ అన్నప్పుడు సంధి లేదు. ‘మంచి యన్నది’ అని యడాగమం వస్తుంది. ‘మంచన్నదే లేని’ అన్నదానిని ‘మర్యాదయే లేని’ అందామా?
    *
    జిలేబీ గారూ,
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 09, 2013 1:39:00 PM

    శ్రీ ఏల్చూరి మురళీధరరావు మహోదయులకు నమస్సులు. మీ అప్యాతాపూర్వక వివరణ, ఆశీఃపూర్వక నూతనోత్సాహము కల్గించినందులకు వందనశతములర్పించుచూ సదా మీ దృక్కులు నాపై ప్రసరించి ఏకల్వ్య శిష్యునిగా జేకొన ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  27. "అధివిన్నన్ కనినంతమం డునొడ లత్యంతా గ్రహోదగ్రతన్"
    ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి మాటలలో ఈ సమస్య గురుంచి వినమని మనవి ( 15:23 వద్ద నుంచి):
    http://www.youtube.com/watch?v=CzaLPzsfeec

    రిప్లయితొలగించండి
  28. వదలన్ జాలక రోమునందు ప్రియమౌ బంగారు బొమ్మన్ సఖిన్
    బ్రదరుం డొక్కడు పెండ్లియాడి చనగా ప్రారబ్ధ కర్మంబునన్
    చదువుల్ రాకయె రాణియమ్మ ఘనులన్ శాసించెనే యయ్యయో
    యది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్

    రిప్లయితొలగించండి