20, జనవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం - 943 (కరుణ సెలంగ సర్పము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

13 కామెంట్‌లు:

  1. శృంగేరీ మఠస్థాపన సమయములో పడగ నీడన కప్ప సుఖముగా ఉండుట గమనించి అదే ఊర్లో శంకరాచార్యులు మఠం స్థాపించారని అంటారు.

    ధరణిని శంకరాఖ్యుడు సుధర్మము గావగ జన్మనెత్తి, శ్రీ
    కరము సనాతనమ్ము ఘన కావ్యము లందున స్తుత్యమైనదౌ
    పరహితమెప్డు కోరు మన భారత ధర్మపు రక్షణమ్ముకై
    స్థిరమగు చోటు జూడు తఱి శృంగపురమ్మునె యెంచె; నచ్చటన్
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  2. పునరుక్తిదోష నివారణకు.

    స్థిరమగు చోటు జూడు తఱి శృంగపురమ్మునె యెంచె; గాంచగా

    రిప్లయితొలగించండి
  3. పరమ శివావతారమన భాసిలు శంకర దేశికేంద్రుడా
    దరమతి పర్యటించుచును దక్షిణ భారత దేశమందు శ్రీ
    కరమగు శృంగశైలమున గాంచె మహాద్భుత మొండు మెండుగా
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్

    రిప్లయితొలగించండి
  4. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, జనవరి 20, 2013 2:50:00 PM

    మరణము తప్పదెన్నటికి మానవ దేహమునందె మాధవున్
    తరుణము చూపుమంచు మును తత్వముతెల్సిన మౌనివేడెనీ
    ధరణిని ధర్మనిష్టకును తగ్గ ఫలంబిది చూడుడంచునన్
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 20, 2013 5:34:00 PM

    కరుణకు మారుపేరనగ కణ్వుని యాశ్రమంబునం
    దరుదగు దృశ్యమాలికల నంచిత సత్త్వ రూపమున్
    భరతుని తండ్రి కాంచెనట వైరి శరారువు లంత శాంతమై
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితిని గురించి ఫోన్, మెయిల్ తదితర మాధ్యమాల ద్వారా తెలుసుకొంటూ, తగిన సలహాల నిస్తున్న శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.
    ఈనాటి సమస్యకు ఇప్పటి వరకు కేవలం నాలుగే పూరణలు వచ్చాయి. ఈమధ్య కాలంలో ఎన్నడూ ఇలా జరగలేదు...
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    "చోటు జూచు తఱి" టైపాటు వల్ల - చోటు జూడు తఱి - అయిందనుకుంటున్నాను.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    చూడుడంచునన్ - అన్నది.... చూడుడంచు సత్కరుణ... లేదా... చూడుడం చనన్.. అంటే బాగుంటుందేమో?
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    పూరణకు మంచి విషయాన్ని స్వీకరించారు. బాగుంది. అభినందనలు.
    కాకుంటే మొదటి రెండు పాదాల్లో గణదోషం ఉంది. నా సవరణ....

    కరుణకు మారుపేరనగ కణ్వమునీంద్రుని యాశ్రమంబునం
    దరుదగు దృశ్యమాలికల నంచిత సుందర సత్త్వ రూపమున్
    భరతుని తండ్రి కాంచెనట వైరి శరారువు(?) లంత శాంతమై
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్.
    అన్నట్టు 'వైరి శరారువులు ' ....?

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 20, 2013 9:53:00 PM

    గురువుగారికి నమస్సులు. దూరశ్రవణం ద్వారా మీతో మాట్లాడుటకు ప్రయత్నించినాను.మీరు పనిబడి బయటకు వెళ్ళినారని మీశ్రీమతిగారు తెల్పిరి.మీ ఆరోగ్యం జాగ్రత్త.
    విరోధ (వైరి) క్రూర మృగములు (శరారువులు) అన్న భావనతో వ్రాసితిని అన్వయలోపమున్నచో తెలియజేయ మనవి.ధన్యవాదములతో

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 20, 2013 10:57:00 PM

    గురువుగారూ! 1,2, పాదాల్లో చెరొక జగణం తప్పుకుని నాకు జగడం తెచ్చాయి. దోషనివృత్తికి మిక్కిలి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, జనవరి 20, 2013 11:43:00 PM

    గురువుగారికి నమస్సులు.సవరణకు మిక్కిలి ధన్యవాదములు.
    మరణము తప్పదెన్నటికి మానవ దేహమునందె మాధవున్
    తరుణము చూపుమంచు మును తత్వముతెల్సిన మౌనివేడెనీ
    ధరణిని ధర్మనిష్టకును తగ్గ ఫలంబిది చూడుడం చనన్
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్

    రిప్లయితొలగించండి
  10. బురదను గప్పి నీచమగు మూలల యందున దాగి దాగి తాన్
    పురుగులె మేతగా తినుచు పుట్టిన పుట్టువుకున్ తపించుచున్
    మరణమె సౌఖ్యమంచు తన మానసమందు తలంచు చుండగన్
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్!!

    రిప్లయితొలగించండి
  11. జిగురు సత్యనారాయణ గారూ,
    కప్పకు మోక్షాన్ని ప్రసాదించిన పాము పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నరులకు నుండు మానవత, న్యాయము, ధర్మము నీతినీమముల్
    మరుగున వైచి బూటకపు మాటల తోడుత రాజ్యమేలుచున్
    దురితముగా జనమ్ములను దోచగ, కానలలో వసించుచున్
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్పకయ్యెడన్!

    రిప్లయితొలగించండి
  13. చెరుపగ శాంతి భద్రతలు చెన్నుగ దీపిలు భారతమ్మునన్
    విరువగ కాశ్మిరమ్మునట విందును జేయుచు పాకి నేతయే
    బరువగు తీవ్రవాదనకు వాసిగ రక్షణ నిచ్చుచుండెనే...
    కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్
    వెరచెడి కప్ప పారుచును భీతిని వీడుచు ధిక్కరించగా 🐸

    రిప్లయితొలగించండి