25, జనవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 948

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తెలివి లేనివారలు గదా  తెలుఁగువారు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. పరుల సేవలు చేయగా బడును తపన
    పరుల భాషను ప్రేమించి పైకి దెచ్చు
    తనదు వారిని భాషను దరికి జేర్చు
    తెలివి లేనివారలు గదా తెలుఁగువారు.

    రిప్లయితొలగించండి
  2. తెలివిలేని వారలు గదా తెలుగు వార
    లనెడు కారు కూతలు కూయునట్టి వారి
    తీట దీర్చెడు వారలు తెలుగు వారు
    దేశ రత్నభూషణములు తెలుగు వారు

    రిప్లయితొలగించండి
  3. తెలుగు వారిని కించ పరచుట నాఉద్దేశ్యము కాదు.మన తెలుగు వారు భారత ప్రభుత్వమును నిలబెట్ట గలిగినంత యెక్కువ మంది యం.పి.లు ఉండి కూడా మన రాష్ట్రానికి సంబంధించిన పనులు అడిగి చేయించు కొనరు.ఢిల్లీ పెద్దల ప్రాపకం కోసం ప్రాకులాడి వారి సేవలు చేస్తారు.
    ఇక తెలుగును యెక్కువ ప్రేమించే వారే అయితే తెలుగును కాపాడండీ అనే నేటి పరిస్థితి రాదు కదా ?

    రిప్లయితొలగించండి
  4. మాతృ భాషాభిమానమ్ము మరచి నారు
    బంధు మిత్ర సంబంధాల భాష మారి
    నిత్య వ్యవహారముల తెల్గు నేల జేయు
    తెలివి లేనివారలు గదా తెలుగు వారు

    రిప్లయితొలగించండి
  5. నరుని నమ్మించి యదలించి సిరులు దోచి
    బానిసత్వాన బంధించి మానమడచి
    వరుస నటపైని జీవచ్ఛవముగ జేయు
    తెలివి లేనివారలుగదా తెలుగువారు.

    రిప్లయితొలగించండి
  6. తెలివి లేని వారలు గదా తెలుగు వారు
    అనుట సత్య దూ రమ్మును ననుచితమును
    కాన బలుకంగ వలదు మా యాన సుమ్ము
    తెలివి గల వారు వారలు దెలియు మార్య !

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 25, 2013 11:08:00 AM

    తెలివి తేటలు రోషంబు తేజ మందు
    కార్య దక్షత యందున శౌర్య మందు
    తెలివి యున్నవా రెందున తెలియ గనతి
    తెలివి లేని వారలు గాదె తెలుగు వారు.

    శ్రీ గోలి వారి బాధను భావాన్ని గ్రహించి సమర్థించుచూ

    తమిళ కర్నాట మహరాష్ట్ర తమ్ములేమొ
    తెలివి జూపి నిధులనొక తీరు బట్ట
    తీపి మాటల మోసంబు తెలియ కున్న
    తెలివి లేని వారలు గాదె తెలుగు వారు.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా!
    ఈ నాటి సమస్య ఎవరికీ రుచించే రీతిలో లేదు. కాని సమస్య సమస్యే. ఒకొక్కరు ఒకొక్కలా పూరించుతారు. ఇందులో వ్యక్తిగత దూషణలు కానీ భూషణలు కానీ ఉండవు. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు అనవసరముగా కంగారు పడి తమ ఆవేదనను తెలిపేరు. శ్రీ గోలి వారి పై నాకు ఎటువంటి దోషభావము లేదు - కలుగదు కూడా. మనము అంతా బ్లాగులో మిత్రులమే కదా. ఇక్కడితో ఈ విషయమునకు స్వస్తి పలుకుదాము.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా,
    "సమస్య" అనగానే అది అసత్యమో, అసంభవమో, అసంగతమో, అసందర్భమో, అశ్లీలమో, అనుమానమో (కొండొకచో కొందరికి అవమానమో) అయిన భావాన్ని స్ఫురింపజేయవచ్చు. వినగానే చెవులు మూసికొని "రామ రామ... ఎంతమాట వినవలసి వచ్చింది" అనిపించిన సమస్యలు గతంలో అవధానాలలో పృచ్ఛకులు అడిగిన సందర్భాలు పెక్కు ఉన్నాయి. మన బ్లాగులో ఇప్పటి వరకూ అశ్లీలానికి అవకాశం ఇవ్వలేదు. ఒకరిద్దరు కవిమిత్రులు అశ్లీలార్థం స్ఫురించే సమస్యలను సూచించినప్పుడు మర్యాదగా తిరస్కరించాను.
    సమస్యను సమస్యగానే స్వీకరించి సర్వజనామోదం, మనోరంజకంగా పూరించి మన సంస్కారాన్ని చాటుదాం.
    సర్వేజనా స్సుఖినో భవంతు.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భావదాస్యం, పరభాషా వ్యామోహంలో చిక్కిన తెలుగువారిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి పూరణ మిమ్మల్ని లక్ష్యంగా చేసికొని చెప్పింది కాదు. గమనించండి.
    *
    పండిత నేమాని వారూ,
    దేశ రత్నభూషణాలు తెలుగువారు అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    దుష్టమైన తెలివి లేనివారు తెలుగువారన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    అతితెలివి లేనివారన్న మీ మొదటి పూరణ, నిధులు సాధించుకొనే తెలివి లేని తెలుగు వారిపై రెండవ పూరణ... రెండూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! ధన్యవాదములు.
    శ్రీ నేమాని వారి పూరణమును పూరణముగానే చూచాను.
    అపార్థము చేసుకొన వలదని వారికి నా మనవి. వారి పూరణను చూడగానే నా భావమును వ్యక్తీకరించాలనిపించి అలా వ్రాశాను. అంతే..

    రిప్లయితొలగించండి

  12. ఓ వైపు మా తెలుగు తల్లి మరోవైపు ఆంద్రా,నాది,రాయలసీమ నీది,
    జై తెలంగాణా అంటారే,అయ్యారే
    తెలివి లేనివారలు గదా తెలుఁగువారు

    జిలేబి.
    (పరారే పరార్)

    రిప్లయితొలగించండి
  13. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, జనవరి 25, 2013 10:21:00 PM

    పొట్టిశ్రీరాములానాటి పుణ్యమూర్తి
    ఆంధ్రరాష్ట్రము ఆంధ్రులకందజేసె
    త్యాగఫలమును తమముతో తన్నునట్టి
    తెలివిలేని వారలు గదా తెలుఁగువారు

    రిప్లయితొలగించండి
  14. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, జనవరి 25, 2013 10:31:00 PM

    గురువుగారి వ్యాఖ్య "సమస్యను సమస్యగానే స్వీకరించి సర్వజనామోదం, మనోరంజకంగా పూరించి మన సంస్కారాన్ని చాటుదాం" అని ఇచ్చిన ధైర్యంతో భావాన్ని గ్రహించి వ్రాశాను.

    రిప్లయితొలగించండి




  15. తల్లి బాసను విడచి యితరములైన
    భాష లందు మోజును జూపు వారు,మరియు
    తగవులాడుచు దమలోన దడవ తడవ
    హస్తినకు బరువెత్తెడి యల్పులైన
    తెలివి లేని వారలు గదా తెలుగువారు.

    రిప్లయితొలగించండి
  16. అచ్చపువిమర్శ లిలలేని ఇచ్చకములు
    పెచ్చుమీరిన రోషము పిచ్చి ప్రేమ
    వర్రవర్రని వంటలు వడ్డనలట
    తనకు మాలిన ధర్మము దానగుణము
    అమిత భక్తియాపై విదేశాభిలాష
    కలిసి బ్రతుకము విడిపోయి కష్ట పడెద
    మన్నదమ్ములైనను, పదహారణాల
    తెలివి లేనివారలు గదా తెలుఁగువారు!

    రిప్లయితొలగించండి
  17. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది మీ పూరణ. బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    నేటి రాజకీయ నాయకులను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి