14, జనవరి 2013, సోమవారం

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

                     సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

సీ. 
ఎండమావులు రైతు గుండె లవియజేసి
          మడికట్లు సైతమ్మునడుగుపెట్టె
చినుకు రాలదటంచు సిగలెల్ల సారించి
          గగనతలముజూచి వగచు రైతు
కన్నీరె వర్షమై మన్ను తడుపునేమొ ?
          కరుణించి మేఘాలు కురవవాయె
ఏ మొగమ్మును బెట్టి ఝాము ప్రొద్దులొ నిన్ను
          సంక్రాంతి లక్ష్మి ! సుస్వాగతించు
ఆ.వె. 

మ్రింగ ముద్ద లేదు ముంగిట రంగుల
ముగ్గులెట్లు వేయ ముదితకగును
కరుణజూపవమ్మ తరుణీ లలామ ! సం
క్రాంతి లక్ష్మి ! తగు ప్రశాంతినిమ్మ .


ఆ.వె. 
మంచు కురియు వేళ సంచిత భక్తితో
ముగ్గులేయబోవు ముదిత పుస్తె
మ్రుచ్చిలించి పారిపోవును దొంగ , సం
క్రాంతి లక్ష్మి ! తెలియరావె తల్లి !


ఆ.వె. 
అంబరాన్ని తాకినట్టి సరుకులధ
రలను జూచి కండ్ల రంగులీను
మరల రంగుముగ్గు కరువైనదా తల్లి !
మకర సంక్రమణము మార్పునిడునె ?


ఆ.వె. 
ప్రాంగణాలు లేవు పైపైన మిద్దెలే
మా నివాసమయ్యె పూనుకొనుచు
గడపలందు మెచ్చ కళ్ళాపి చల్లి , గొ
బ్బెమ్మల నిలుప సుకరమ్మె మాకు ?


ఆ.వె. 
బుడతల తలలకని భోగి పండ్లనుపోయ
బుట్ట రేగుపండ్లు పుత్తడయ్యె
మండుటెండలవియె మహి భోగి మంటలై
ధాత్రినేలుచుండె తరుణి ! కనుమ .


తే.గీ. 
పసిడి గజ్జెల సవ్వడి పరిఢవిల్ల
కాంతులేపార యింట సంక్రాంతి లక్ష్మి !
అడుగుపెట్టవే మేలైన గడపలందు
స్వాగతించెదమమ్మ సౌభాగ్య లక్ష్మి !


డాక్టర్ మాడుగుల అనిల్ కుమర్
తిరుపతి

11 కామెంట్‌లు:

  1. శ్రీ మాడుగుల అనిల కుమార్ గారికి శుభాశీస్సులు.

    మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. టైపు పొరపాట్లు 2 దిద్దవలెను.
    1. శిగలెల్ల కి బదులుగా .... సిగలెల్ల
    2. మేఘాలు కురవదాయె కి బదులుగా .... మేఘాలు కురవవాయె అని.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. మాదు ముంగిట ముగ్గుల మౌన స్వాగ
    తమును గొనుమింక మా పాలి ధాన్యలక్ష్మి!
    పాడి పంటలనిచ్చి గావ సిరులొలుక
    కదలి రావమ్మ సంక్రాంతి కానుకగను

    రిప్లయితొలగించండి
  3. ఆర్యా ! నమస్కారములు. తప్పు సరిచూపినందుకు ధన్యవాదములు. నా వ్యక్తిగత పత్రములో సవరించుకోనగాలను. దీనిని శంకరయ్య గారు ఉంచారు. మరొకమారు కృతజ్ఞతా నమస్కారములతో - మీ విధేయుడు - మా అ కు

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    డా. మాడుగుల వారూ,
    మీరు సూచించిన టైపాట్లను సవరించాను. వ్యాఖ్యగా ఇచ్చిన పాఠాన్ని తొలగిస్తున్నాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. పండుగ పూట సామాన్యుని హృదయవేదనను కళ్ళకు కట్టేలా వర్ణించిన మాడుగుల వారికి అభినందనలు.

    సామాన్యులు మాన్యులుగా
    నేమాత్రము బాధలేక నెప్పుడు ధరలో
    తాముందురొ యవ్వేళను
    భూమికి సంక్రాంతి గాదె పూత చరిత్రా!

    రిప్లయితొలగించండి
  6. గౌరవనీయులగు మిస్సన్న గారికి నమస్సులు. ధరలో అనే మీ శ్లేష చమత్కారంగా ఉండడం ఆనందాన్ని కలిగిస్తున్నది. ధర = విలువ , భూమి . చాలా సంతోషం .

    రిప్లయితొలగించండి
  7. అనిల కుమారా నిజమే
    ఘనమగు సంక్రాంతి తరచి కనగా నేడీ
    జనమున కేదీ ఖుషి భో
    జనమునకే వెదకు చుండ సంబర మేదీ.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 6:26:00 PM

    ప్రప్రథమ అంతర్జాల అవధానము సమర్థవంతంగా పూర్తిచేసిన
    మాన్యశ్రీ డా. మాడుల అనిల్ కుమార్ గారి “ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం” మనోహర పద్య సుమాలు సుగంధభరిమై యలరారుచున్నవి. మీ కివే నాశుభాకాంక్షలు. మాడుల అనిల్ కుమార్ అనగా

    మా = ధారణ గల బుద్ధి యనే
    డు (డ+ఉ) = దేశానికి + రాజై
    గు (గ+ఉ) = సంతోష వాక్యము ల + పిలచుటచే
    ల్ (ల) = చంద్రుడగుచు
    అ = (సరస్వతీ) భూషణముగ
    ని = మిక్కిలి
    ల = గ్రహించుటకు
    కు = భూమికి గల ఓరిమి యంత
    మా = ప్రమాణ మనే
    ర్ (ర) = వజ్రము.
    చివరగా
    కూడు గూడు గుడ్డ కూర్పెద మంచును
    రాజ కీయ శుష్క రాజ్య మందు
    సగటు మనిషి బ్రతుక సరిపడు సొమ్ములు
    చాల కున్న నెట్లు జరుగును పండుగల్.

    రిప్లయితొలగించండి
  9. పద్యాలనగానే పొగడటానికనే గాక, మాడుగుల వారు నేటి సంక్రాంతి పండుగ స్థితిగతులను చక్కగా పద్యరూపంలో కూర్చారు. బాగు బాగు.

    రిప్లయితొలగించండి
  10. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్న ఈ కవితాఖండికను ప్రకటించడానికి అనుమతించిన డా. మాడుగుల అనిల్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదములు.
    ఖండికను ప్రశంసించిన...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    మిస్సన్న గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి