31, మే 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1068 (కలుగు సత్త్వనిరతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలుగు సత్త్వనిరతి చేత కార్య సిద్ధి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు. 

10 కామెంట్‌లు:

  1. తేటగీతి గర్భిత ఉత్సాహ:

    కలదనంగు చేత చెఱకు గడ ధనువుగ మెత్తగా
    నలరు పూలు తూపులగుచు నయ్యు జగతి నెంతయున్
    సులభముగ జయించు నతడు సుజనతతికి నవ్విధిన్
    కలుగు సత్త్వ నిరతి చేత కార్యసిద్ధి ధీనిధీ!

    రిప్లయితొలగించండి




  2. వెంటనే ఫలితము కనుపించకున్న
    దీర్ఘకాలమ్మునన్ సత్యదీక్ష ,శీల
    సంపదలు సమకూర్చును జయము,తృప్తి,
    కలుగు సత్త్వనిరతి చేత కార్యసిద్ధి.

    రిప్లయితొలగించండి
  3. నేమాని పండితార్యా! గర్భకవిత్వంలో పూరణ ఉత్సాహభరితంగా ఉంది.

    ఈషణ త్రయ మందున నెన్న మిన్న
    సత్త్వ, మది భారతీయాత్మ తత్త్వ మసలు,
    ధర్మ రాజాదు లేగిరా దారి నాడు,
    కలుగు సత్త్వ నిరతి చేత కార్యసిద్ధి

    రిప్లయితొలగించండి
  4. కలుగు సత్త్వ నిరతి చేత కార్య సిద్ధి
    కాక , ప్రజల కవసరముల్ గలుగు నట్టి
    జయము ,సుఖమును మఱియును సంత సంబు
    లన్ని యొన గూర్చు సత్త్వమ యార్య ! నిజము .

    రిప్లయితొలగించండి
  5. ముక్తి కాముకుడైనచో మొక్కవోని
    దీక్షఁ బూనిన వాడయి దేవదేవుఁ
    గొలుచు చున్న నాతని కోర్కె తీరు;
    కలుగు సత్త్వనిరతి చేత కార్య సిద్ధి.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి సమస్య - "క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే" అనే సంస్కృత సాహిత్యములోని సమస్యకు అనుసరణ. సంస్కృత సమస్యను ఒక పండిత కుటుంబములోని 4గురు వ్యక్తులు 4 విధములుగ పూరించేరు. అందులో ఒక పూరణ సౌందర్యలహరిలోని "ధనుః పౌష్పం మౌర్వీ......" అనే శ్లోకముపై ఆధారపడినది. అదే విధముగా నేను చేసిన ఈ క్రింది పూరణను చూడండి:

    మానస సంజాతుడైన యనంగుడు
    ....బహు సుకుమారుడై పరగుచుండు
    వివిధ పుష్పాళితో వెలయు నాతని విల్లు
    ....భృంగంబు లాతని వింటి నారి
    అతిమృదుల సుమమ్ము లైదే శరమ్ములు
    ....స్యందనమ్మగు మలయానిలమ్ము
    ఋతురాజగు వసంతు డతని సామంతుడు
    ....సాయ మొక్కించుక చేయుచుండు
    జగము లంతట దిరుగుచు జయము నొందు
    నతడు సుకరముగా గదా! యనవరతము
    కలుగు సత్త్వ నిరతి చేత కార్యసిద్ధి
    ఘనుల కిక నేల వివిధోపకరణ చయము?

    రిప్లయితొలగించండి
  7. మనమున దృఢ సంకల్పము, వెను దిరుగని
    ఆత్మ విశ్వాసము, కడు సాహసము , చిత్త
    శుద్ధి గల వారల కెపుడ శుభము లేదు
    కలుగు సత్త్వనిరతి చేత కార్యసిద్ధి.

    రిప్లయితొలగించండి
  8. మున్ను మునులంత తపియించె ముక్తి కొఱకు
    దివ్య శక్తులు సాధించె దివిజు లిడగ
    లోక కళ్యాణ్ మునకంచు నేక జితము
    కలుగు సత్త్వ నిరతి చేత కార్య సిద్ధి ~

    రిప్లయితొలగించండి
  9. రామకార్యము చేయగ లాఘవముగ
    నూఱు యోజనములు దాటి చేరి లంక
    కనుగొనె హనుమ సీతను కడగి తానె
    కలుగు సత్త్వనిరతి చేత కార్యసిద్ధి

    రిప్లయితొలగించండి
  10. చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు.....
    పండిత నేమాని వారికి,
    కమనీయం గారికి,
    మిస్సన్న గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి