25, జూన్ 2013, మంగళవారం

పద్య రచన – 383 (గంగోద్ధృతి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
గంగోద్ధృతి

12 కామెంట్‌లు:

  1. శివుని కొరకు వెళ్ళి గంగ పాలైన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ...

    గంగవెర్రులెత్తి గంగమ్మ యుప్పొంగె
    వరద వచ్చె మిగుల వరదు ముందె
    మూడు కనుల ముందె మూడెగా జనులకు
    శవములెన్నొ దేలె శివునిముందె.


    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘ఎన్నొ’ తరువాతి కచటతపలకు సరళాదేశం కానీ గసడదవాదేశం కానీ రాదు. ‘ఎన్నొ తేలె’ అనే ఉండాలి.

    రిప్లయితొలగించండి
  3. మందాకినీ యని యందు రేలనొ గాని
    ....అతి తీవ్రముగ పొంగి యరుగసాగె
    అవియేమి యురకలోనదియేమి వేగమో
    ....అతి భయంకరమయి యడల జేసె
    పర్వతాలను గూల్చె పత్తనాలను ముంచె
    ....భగ్నమొనర్చెను వారధులను
    మార్గమ్ములను ద్రుంచె మనుజుల జంతుల
    ....వేలాదిగా పొట్ట బెట్టుకొనెను
    ఏల కోపమ్మొ గంగమ్మ కేమొగాని
    తీర్థ యాత్రికులెందరో దిక్కులేక
    యలమటించిరి మడిసిరి యార్తితోడ
    పుణ్యలోకాల కేగిరి భువిని వీడి

    రిప్లయితొలగించండి
  4. మాస్టరుగారూ ! ధన్యవాదములు..సవరణతో..

    గంగవెర్రులెత్తి గంగమ్మ యుప్పొంగె
    వరద వచ్చె మిగుల వరదు ముందె
    మూడు కనుల ముందె మూడెగా జనులకు
    శవములెన్నొ తేలె శివునిముందె.

    కట్టగ లేదా గంగను
    గట్టిగ నీ జుట్టునందు గంగే తానై
    నెట్టుక వచ్చెన చెపుమా
    ఇట్టుల జరిగెను హర !హర ! యిల ఘోరంబే !

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    హృదయ విదారకమైన ఆ విపత్తును వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండవ పద్యం కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ప్రకృతి జయించి చూపుటకు పట్టునుఁ బట్టిన స్వార్థ బుద్ధిపై
    వికృత కరాళ రూపమున వెల్లువ లెత్తుచు గంగ పొంగె; నే
    సుకృతమొ గాచె కొందరిని; సొక్కిరి గంగ మహోద్ధృతిలో;
    ప్రకృతియె వందనీయమగు, పట్టుకుఁ జిక్కునె, పంతమేలనో?

    రిప్లయితొలగించండి
  7. మంద గమనము గలదిగ మహిత కెక్కి
    ఉధ్ధృ తం బయి మనుజుల యుసురు దీ సె
    ఏమి పాపము జేసిరో యిలను వారు
    గంగ పాలైరి యక్కట భర్గు నెదుట .

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
    మూడవ పాదం చివర గణభంగం.... "మహోద్ధృతిన్ గనన్" అందామా?
    *
    సూబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నాల్గవ పాదంలో యతి తప్పింది...
    "గంగ పాలైరి యకట ముక్కంటి యెదుట" అందామా?

    రిప్లయితొలగించండి
  9. గురువు గారు,
    ఈ మధ్య పొరబాట్లు ఎక్కువ చేస్తున్నట్టున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. గంగా! విజ్ఝృంభత్తరంగా!

    శ్రీ దివ్య గంగా! ప్రపుణ్యాంతరంగా! మహావిష్ణు పాదోద్భవా! శ్రీమహాదేవ రాజజ్జటాజూట సంస్థా! మహాపాప ప్రక్షాళినీ! దివ్యరూపా! కృపాశాలినీ! శీతలక్ష్మాధరాగ్రంబునందుండి యానంబు సాగించి వేవేల తీర్థమ్ములన్ దాకుచున్ భక్తులన్ బ్రోచుచున్ పంటలన్ వృద్ధి నొందించుచున్ జీవనాధారమై యొప్పుచున్ మమ్ము బోషించునో మాత! దీవ్యద్గుణోపేత! భాస్వన్మునివ్రాత సంసేవితా!

    మహాదుఃఖ సంసార తాపంబులన్ బొంది శుష్కించు వారెల్ల నీ సన్నిధిన్ జేరి నీ యర్చనల్ సేసి నీలోన స్నానంబు గావించి యా దుఃఖముల్ తీరగా మోదమున్ బొంది నీ దివ్య తీర్థంబులన్ గ్రోలి పాపంబులన్ బాసి జ్ఞానమ్మునున్ బొంది వెల్గొందరే!

    ఉద్ధృతాకారమున్ దాల్చి యుప్పొంగు నీ క్రోధ మేమందు నమ్మా? మహాభీల కల్లోల జృంభత్తరంగా! మహోగ్రాకృతిన్ దాల్చి భీభత్సముల్ చాల కల్పించి శైలమ్ములన్ గూల్చి గ్రామమ్ములన్ ముంచి వేవేలుగా మర్త్యులన్ జంతులన్ ముంచి నీలోన లీనమ్ము గావించినావమ్మ! శాంతించుమమ్మా!

    నినున్ శాంతరూపా యటంచున్ దలంతున్ కృపావర్షిణీ! వేగ నీ యుగ్రరూపంబు చాలించి మా విన్నపమ్మెల్ల నాలించి పాలింపుమా మమ్ము భాగీరథీ! జాహ్నవీ! జ్ఞానతేజోమయీ! ప్రాణదాత్రీ! నమస్తే నమస్తే నమః

    రిప్లయితొలగించండి
  11. గంగా జలముల యందున
    పొంగారుచు మునిగి నంత పోవును నఘముల్ !
    గంగమ్మ శివుని శిరమున
    సింగారపు సుడులు దిరిగి చిట చిట లాడన్ 1

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    గంగా దండకాన్ని ప్రసాదింతి మమ్మల్ని పునీతులను చేసారు. అద్భుతంగా ఉంది. అభినందనలు. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి