1, జులై 2013, సోమవారం

పద్య రచన – 389 (కన్నె కలలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కన్నె కలలు”

12 కామెంట్‌లు:

 1. కన్నె మనసులు కలలందు
  వన్నెల హరివిల్లు సొగసు వలరాజు నకై
  వెన్నెల నీడల వెదకుచు
  కన్నియ విహరించు నెపుడు కలహంస గనై !

  రిప్లయితొలగించండి
 2. కన్నెగ కలలను కనుటది
  కన్నెను కన్నట్టి వారి కామోదమ్మే
  కన్నెగ పిల్లల కనుటది
  హన్నన్నా యేరికైన నామోదమ్మే ?

  రిప్లయితొలగించండి
 3. మేటి నటుడొకండు మెచ్చి చేపట్టగా
  ....గగన వీధుల నాడు మగువ యొకతె
  పరదేశవాసుడు కరము గ్రహింపగా
  ....ననుసరించి సుఖించు నతివ యొకతె
  వివిధ సంపదలతో వెలుగు నొక్కని సతి
  ....యై యూయలలనూగు నామె యొకతె
  రతిరాజు మించిన పతికి నర్ధాంగియై
  ....భోగములందేలు ముదిత యొకతె
  కలలు గనుచుండి కలలందు కరము సుఖము
  ననుభవించుచునుందురు మనములందు
  తేలుచుందు రూహలలోన మేలు మేలు
  కన్నియల కలల్ నిజములౌ గాక లెస్స!

  రిప్లయితొలగించండి
 4. అక్కయ్యా, మొదటి పాదములో గణదోషము సవరించవలెననుకుంటాను.

  కలలను గాంచగా కలువ కన్నుల గల్గిన కన్నెమానసం
  బలరును సంతసమ్మున, నవారుణ పల్లవ కోమలాధర
  మ్మలరగ మందహాసమదె, యామిని రాత్రుల స్వప్నవీధులన్
  చెలువముఁ బెంపుచేయునది, సిగ్గరి బుగ్గల నిగ్గుదేలుచున్.

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. దానిని ‘కన్నె మనమ్మున కలలన్’ అందాం.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ఈకాలపు కన్నెలు కనే కలలను గురించి వివరంగా తెలియజేస్తూ వారి కలలు సాకారం కావాలని ఆశీర్వదించారు కూడా. చాలా బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం ఉత్తమంగా ఉందనడంలో సందేహం లేదు. నృత్త రచనలో మీరు నిష్ణాతులయ్యారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
  మీరు యామిని రాత్రుల అని వాడేరు కదా. యామిని అంటే (1) రాత్రి మరియు (2) పసుపు అని శబ్దరత్నాకరములో నున్నది. మీరు రాత్రి అనే అర్థములో వాడి ఉంటే యామిని రాత్రులు అనుట సాధు ప్రయోగము కాదేమో? పరిశీలించండి. స్వస్తి

  రిప్లయితొలగించండి
 7. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
  మీరు నిష్ణాత అనే శబ్దమును స్త్రీలను సంబోధించుచూ వాడేరు. అది పుంలింగము అనుకొనుచున్నాను. పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. గురువుగారు,
  ధన్యవాదములు. నా నేర్పు అంతయు మీ హృదయపూర్వక ఆశీర్వాదములు మరియు మీరిచ్చు నిరంతర ప్రోత్సాహముల ఫలితము తప్ప ఇంకొకటి కాదు.

  యామిని అనగా చీకటి అనుకొని అట్ల వ్రాసినాను. సవరించిన పద్యము. తెలియచేసినందుకు ధన్యవాదములండి.

  కలలను గాంచగా కలువ కన్నుల గల్గిన కన్నెమానసం
  బలరును సంతసమ్మున, నవారుణ పల్లవ కోమలాధర
  మ్మలరగ మందహాసమదె, యామిని వేళల స్వప్నవీధులన్
  చెలువముఁ బెంపుచేయునది, సిగ్గరి బుగ్గల నిగ్గుదేలుచున్.

  రిప్లయితొలగించండి
 9. సోదరి లక్ష్మీ దేవి గారికి , సోదరులు శంకరయ్య గారికి సవరణ జేసి నందుకు ధన్య వాదములు
  ఆప్యాయత కరువైన ఈ దేశంలో మీరంతా అక్కయ్యా అని ఆప్యాయంగా పిలుస్తుంటే ఎదురుగా నాచెల్లెళ్ళు తమ్ముడు పిలిచినంత పులకింత కృతజ్ఞతగా మరొకసారి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.
  నిజమే... మీ చెప్పిందే సరియైనది.

  రిప్లయితొలగించండి