14, ఫిబ్రవరి 2015, శనివారం

సమస్యా పూరణం - 1597 (దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?

22 కామెంట్‌లు:

  1. మనగా కోరిక గలదా ?
    దనుజా ! యే తీరుగ నను దయ జూచెదవో ?
    యనుచును రాముని వేడిన
    న నయము రక్షించు నిన్ను హర్షము తోడన్

    రిప్లయితొలగించండి
  2. కనుమా! చేసిన యప్పులు
    నిను పోషింపగ చదువులు నేర్పింపగ నీ
    అనివార్యపుటిక్కట్లం
    దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?

    రిప్లయితొలగించండి
  3. వినుమా! నాప్రార్ధన లనిటు
    కనులా ! పఠియించగ నిను కనుపించవుగా
    మనసే నిలువదు నినుగన
    దనుజా! యేతీరుగ ననుదయ జూచెదవో
    ఇక్కడ దనుజ = తొలి వేల్పు , పూజితుడు

    రిప్లయితొలగించండి
  4. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్కారములతో,

    వనజాతనయన! రక్షిత
    మునిజాతచయన! విదేహభూభృత్తనుజా
    వనజాగరితపురస్సర
    దనుజా! యే తీరుగ నను దయజూచెదవో?

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. అనువైన పెండ్లిలగ్నము
    కనరావెట చూతమన్న కన్నుల యెదుటన్
    గొనవలె మాయింటను విం
    దనుజా!యే తీరుగ నను దయజూచెదవో!

    రిప్లయితొలగించండి
  6. అనుదినమడుగునుకట్నము
    మనుగడలోమగని-ప్రేమమసిబారంగా
    దినదినగండంబాయెను
    దనుజా|యేతీరుగననుదయజూచెదవో

    రిప్లయితొలగించండి
  7. ఘనమగు విద్యను గరపగ
    దినకూలిగ పనులఁ జేసి తిని మరచితివా!
    మనుగడయును కష్టంబయెఁ
    దనుజా! యేతీరుగ నను దయఁజూచెదవో!

    రిప్లయితొలగించండి
  8. మనలేను జీవితాంతము
    వినుమొంటిగ ముసలివాన్ని విన కన నెరుగన్
    తనయుడు తనయవు నీవే
    దనుజా!యే తీరుగ నను దయజూచెదవో!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో....ధన్యవాదములతో...
    కవి పండితు లందరికి వందనములు..
    నేడు నీటి కొరకు రైతు
    ===============*=================
    దినదిన గండంబగు పుడ
    మిని వ్యవసాయమును నమ్మి మిణుగుఱు నైతిన్ !
    ఘనుడవు, జగ మొండివి యగు
    దనుజా!యే తీరుగ నను దయజూచెదవో!
    (మిణుగుఱు=మిణుగుఱుపురుగు )

    రిప్లయితొలగించండి
  10. సునయనముఁ గోరె జనకి
    వనమున పరికించి దెత్తు, వదినను కాపా
    డననయమెటకున్ పోవల
    దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
    (శ్రీరామచంద్రుడు తమ్ముడు లక్ష్మణుని యిలా కోరతాడా? అనే సంశయముతో ప్రచురించడమైనది.బుధజనుల అభిప్రాయం తెలియజేయ ప్రార్థన.)

    రిప్లయితొలగించండి
  11. మల్లెల వారిపూరణలు
    వనమాలివౌచు వెలుగుచు
    నిను నమ్మినవారి కిడవె నిఖిలార్ధమ్ముల్
    వినుతం బయ్యెడి శిక్షిత
    దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
    2.తను ప్రహ్లాదుడు వీడడు
    అనయంబునువిష్ణు పదము నాపద గొన్నన్
    తను తండ్రికి తెలిపియు నను
    దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?

    రిప్లయితొలగించండి

  12. కెఎస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    వినయజనావన!! శాసిత
    దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
    యినవంశోత్తమ రామా
    యని భక్తిన్ రామదాసు ప్రార్థించె గదా

    రిప్లయితొలగించండి
  13. "మననిమ్ము దైత్యకులమును
    దనుజా!యేతీరుగ,నను దయ జూచెదవో,
    కినుక గనుచు శిక్షి౦తువొ,"
    యనుచు విభీషణుడు పల్కె నగ్రజు తోడన్

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీవీరభద్రేశ్వర దేవాలయానికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల మిత్రుల పూరణలను, పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టి.బి.యస్. శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    ‘దనుజుడు’ శబ్దానికి ‘తొలివేల్పు = రాక్షసుడు’ అనే అర్థం తప్ప పూజితుడు అన్న అర్థం లేదు.
    మొదటి పాదంలో గణదోషం. ‘నా ప్రార్థన నిటు...’ అంటే సరి!
    *****
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘దినదిన గండము ధృతి లే|దనుజా...’ అంటే బాగుంటుందేమో?
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    దకారాన్ని ఆదేశ సరళంగా మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు ‘దనుజా’ అని ఏ అర్థంలో ప్రయోగించారో అర్థం కాలేదు. అది భగవంతునికి విన్నపమైతే ‘తనయుడవు పితవు నిర్జిత| దనుజా..’ అంటే బాగుంటుందని నా సలహా.
    *****
    కందుల వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జగమొండివి జిత| దనుజా...’ అంటే బాగుంటుందనుకుంటాను.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    సందేహించవలసిన పని లేదు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    రామదాసు ప్రస్తావనతో మీ పూరణ సార్థకమయింది. ఇటువంటి పూరణకొరకే ఎదురుచూస్తున్నా. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ కంది శంకరయ్య గురువులకు నమస్కారములు
    తండ్రి తనకూతురును వేడుకున్నటుల వ్రాసినాను
    తనుజా అర్థము కూతురని ఆంధ్రభారతి నిఘంటువులో ఉన్నది

    రిప్లయితొలగించండి
  16. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ‘నీవే + తనుజా’ అన్నప్పుడు ద్రుతకార్యం కాని, సరళాదేశం కాని జరగదు. అక్కడ ‘నీవే తనుజా’ అని ఉంటుంది. కాని సమస్య ‘దనుజా’ అని కదా ఉన్నది. అందువల్ల సందేహం వచ్చి సవరణను సూచించాను.

    రిప్లయితొలగించండి
  17. వినగా ఆజా భయ్యా
    సునియే రాందాసు పాట సోంచో బాద్ మే
    ఘనముగ గాతా హూ , బా
    దను, జా ! " యే తీరుగ నను దయ జూచెదవో ? "

    రిప్లయితొలగించండి
  18. వినగా ఆజా భయ్యా
    సునియే రాందాసు పాట సోంచో బాద్ మే
    ఘనముగ గాతా హూ , మీ
    దను, జా ! " యే తీరుగ నను దయ జూచెదవో ? "

    రిప్లయితొలగించండి
  19. కనివిని యెరుగని రాబడి
    మునుపటి సమయమున నేను మూతన్ బెడితిన్
    వినుమా! ప్రార్థన! పన్నుల
    దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?

    రిప్లయితొలగించండి
  20. అనువుగ చదివెడు వేళన్
    కనుగొని నా నెత్తినెక్కు గాడిదవీవే!
    కనగను తల్లిని వోలెడు
    దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?

    రిప్లయితొలగించండి