6, మే 2016, శుక్రవారం

ఖండకావ్యము - 19

విఘ్నేశ్వర స్తుతి  

రచన : గురుమూర్తి ఆచారి

శ్రీకర! సత్కరుణా మధు
శీకర సేచక! సురగణ శేఖర వినుతా!
లోకాధిప! గణనాయక!
ప్రాకట మగు భక్తితోడ భావి౦తు మదిన్

కుడుములను  వడల నిడగనె
యిడుముల గిరి పొడుము జేసి యెడపక దయతో
పొడగను నొడయడు గణపతి,
పుడమి విడిది నిడెను నడుము ముదముగ  కొలువన్

అరయ నిఖిలవిద్యల కాదిపురుషు డగుచు
నెలుక వాహన మెక్కి తా నెలమి మీర
న౦చితమ్ముగ జగతి పాలి౦చు నట్టి
విఘ్ననాధుని మదిలోన వినుతి జేతు.

ద౦డము ద౦డమయ్య విహిత ప్రతిబ౦ధక జాల శోషణా!
ద౦డము ద౦డమయ్య  వినుత స్ఫుట సౌమ్య కళా విభూషణా!
ద౦డము ద౦డమయ్య జనిత శ్రమ పాపతమోనివారణా!
ద౦డము ద౦డమయ్య నిరత౦బు దయ౦గను విఘ్ననాయకా!

"ము౦ దల విఘ్ననాయకుడు పూజితు డౌ " నని  డె౦దమ౦దు   మే
ము౦  దలపోయుచు౦టిమి; విభుత్వ మహోజ్జ్వల మూర్తి! శాశ్వతా
న౦ద మయ స్వరూప! సుగుణప్రియ! దీనశరణ్య! పార్వతీ
న౦దన!  చల్లనైన కరుణన్ వెద జల్లుము విఘ్ననాయకా!

అనయముల బాపు దొరవని
వినయముతో గొలుచు చు౦టి విఘ్నాద్రి పవీ!
అనునయ మారగ తావక
తనయుని మొరలాలకి౦చి  దయజూడుమయా

భావమున౦ బ్రియ౦ బలర బ్రత్యహమున్ భవదీయ లోక స౦
భావిత దివ్య భవ్య పద పద్మయుగమ్మును గొల్చు సేవకున్
భావితు జేయ నీ కగును బావ్యము; కాన కృపాధనమ్ము  స౦
భావనగా నొస౦గి  పరిపాలన జేయవె విఘ్ననాయకా!

11 కామెంట్‌లు:

  1. ఆచారి గారూ నమస్కారములు...మీ పద్యములు మిగుల భక్తి భావనతో నలరారుతున్నాయి

    రిప్లయితొలగించండి
  2. ఆచారి గారూ నమస్కారములు...మీ పద్యములు మిగుల భక్తి భావనతో నలరారుతున్నాయి

    రిప్లయితొలగించండి

  3. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గురువుగారికి పాద నమస్కారములు
    విఘ్నేశ్వర స్తుతి పద్యాలను
    స్వీకరి౦చిన౦దుకు
    కృతఙ్ఞతలు

    రిప్లయితొలగించండి
  4. గురుమూర్తి ఆచారి గార్కి నమస్కారములు మీ విఘ్నేశ్వర స్తుతి బాగుంది

    రిప్లయితొలగించండి
  5. గురుమూర్తి ఆచారి గారు మీ విఘ్నేశ్వర స్తుతి అత్యద్భుతముగ నున్నది. అభినందనలు. ప్రత్యేకముగా నాల్గవ పద్యము బృహదార్తి తో శోభిల్లుచున్నది. నాల్గవ పాదముగూడ పై మూడు పాదముల సరళి లో నా సూచన.
    “దండము దండమయ్య వితతక్షమ గావుము విఘ్ననాయకా!”

    రిప్లయితొలగించండి
  6. గురు మూర్తి గారి చేతను
    సరళంబగు రీతి తోడ సాం బునిదనయు
    న్నిరవుగ గణు తించగ మది
    గరముం సంతోష మయ్యె గాంచిన విధమై

    రిప్లయితొలగించండి
  7. గురుమూర్తి గారిరచనలు
    గురుతర బాధ్యతలు బంచు గురువుల గురువౌ
    మరువని గణపతి|” పద్యపు
    విరులనుబూయించినారు విజ్ఞులు మెచ్చన్”.

    రిప్లయితొలగించండి
  8. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నా ఖ౦డకావ్యమును చూచిన కవివరు ల౦దరికి
    ధన్యవాదములు
    శ్రీమతి.లక్ష్మిదేవి గారికి , శ్రీ S శర్మ గారికి శ్రీ V. రామక్రిష్ణ గారికి , శ్రీసుబ్బారావుగారికి
    శ్రీ P.కామేశ్వర రావు గారికి , శ్రీ ఈశ్వరప్ప గారికి
    ధన్యవాదములు & నమస్సులు
    ి

    రిప్లయితొలగించండి
  9. ఆచారి గారూ అద్భుతంగా ఉన్నాయి గణేశస్తుతి పద్యాలు.రెండవపద్యం మరీ ముచ్చటగాఉంది.

    రిప్లయితొలగించండి
  10. ఆచారి గారూ అద్భుతంగా ఉన్నాయి గణేశస్తుతి పద్యాలు.రెండవపద్యం మరీ ముచ్చటగాఉంది.

    రిప్లయితొలగించండి