14, మే 2016, శనివారం

ఖండకావ్యము - 23

పనస పొట్టు కూర
రచన : భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్

ఆ.వె.     ఆంధ్ర ప్రాంతమందు అదిరెడు కూరండి !
కోనసీమ రుచులు కోరుకొనిన
మోజుపడుచు తినగ భోజనప్రియు లెల్ల
పనసపొట్టు కూర మనసు నింపు!

ఆ.వె.     సన్న సెగల పైన సబబుగా నుడికించి
పుల్ల బెల్లమునకు పొట్టు కలిపి
పోపు కలుప చాలు పొట్టుపై ఘుమఘుమ
పనస పొట్టు కూర మనసు నింపు!

ఆ.వె.     మంచి దిటము మించి మటను కీమాలకు
మాంస క్రుత్తు లెల్ల మహతి గూర్చు
పుష్టి నిచ్చు గట్టి  పోషకాహారము
పనస పొట్టు కూర మనసు నింపు !

ఆ.వె.     శుభదినమ్ము లందు శోభగా వడ్డించ
బంధుకోటి కెల్ల బహు పసందు
జోడుగాను కలుప జీడి పలుకు గూడ
పనస పొట్టు కూర మనసు నింపు !

********

12 కామెంట్‌లు:

  1. పనసపొట్టు కూర బహు పసందుగనుండు
    నావ బెట్టి వండ నార్యు లార !
    శుభమ శుభములకును శుచిగను ,చక్కని
    రచన నిచ్చె శంకర య్య మనకు

    రిప్లయితొలగించండి
  2. పనసకాయ దెచ్చి పదునైన కత్తితో
    జీలకర్ర వోలె చితుక కొట్టి
    ఆవ బెట్టి వండ నదరదా ఆకూర
    లొట్ట లేసి తినమ పట్టుబట్టి.

    భళ్లమూడివారూ పసందైన కూరలరుచి చూపించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. బాగుందయ్యా శంకరూ-మా చిన్నప్పుడు మా నాన్నగారు తిరగేసిన పీటమీద చెక్కు తీసిన పనస కాయను కైమా లాగ నరకడం గుర్తుకొస్తోంది.1982 లో నేను పాలకొల్లు ఆడిట్ పని మీద వెళ్తే అక్కడ పది రోజుల పాటు రోజూ హోటల్లో పనస పొట్టు కూరే తిన్నాను.

    రిప్లయితొలగించండి
  4. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారు మీ రచన బాగుంది.
    చిన్న సంశయం!
    మొదటి పద్యము మొదటి పాదంలో "ఆంధ్రప్రాంతము" లో
    "ధ్ర" గురువవుతుందేమోనని !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమాసంలో ఉత్తరపదం రకారసంయుక్తాక్షరంతో ప్రారంభమైనపుడు పూర్వపదం చివరి అక్షరం అవసరాన్ని బట్టి గురువు గాను, లఘువు గాను స్వీకరించే వెసులుబాటుంది. (వ్యక్తిగతంగా నేనుమాత్రం గురువుగానే ప్రయోగిస్తాను).

      తొలగించండి
  5. "పనస పొట్టు కూర రుచి, కొత్తావకాయ ఘాటు, కొత్త పెళ్ళాము మోజు - ఆ వరసే వేరురా" అని మా తెలుగు మాష్టారు ఆకెళ్ళ సత్యనారాయణ గారు మా చిన్నప్పుడు అంటుంటే ఏమిటో తెలిసేది గాదు. దాని అర్థం తెలియ వచ్చె సరికి అన్నీ పాతబడిపోయినాయి. మిస్సన్న మిత్రులు కొంటె పద్యాలు వ్రాయటం మానుకొన్నారు. శంకరప్రసాదు గారు పనసపొట్టుకూర రుచి చూపించారు. వారిబావగారు హోటలులో పనస పొట్టు కూర తిన్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. హోటలు వాడు అంత శ్రమకోర్చి చేశాడు. మంచివాడు.

    రిప్లయితొలగించండి