15, మే 2016, ఆదివారం

ఖండకావ్యము - 23

జలరక్షణ
రచన : అమరవాది రాజశేఖర శర్మ

తే.         నీరు పంట కాధారము నీరు దేహ
దాహమును తీర్చి బ్రతికించు ధరణిలోన
నీరు లేకున్న నే ప్రాణి నిలువలేదు
కాన నీటిని కాపాడ గనుము దీక్ష

తే.         ప్రాణికోటి దాహము దీర్చి పాడిపంట
వృద్ధి సేయగ పుడమి నీరద్ది తడిపి
మే లొనర్చు నదీమాత జాలువారి
కడలి కలియంగ ఫలమేమి గానరాదె

తే.         మేఘమంబుధి జలములన్ మిగులదాచి
ప్రాణకోటికి జీవమై వాననిచ్చు
వాననీటిని భూమాత వాంఛదీర
గుండెలో దాచి కోరగా కూర్మి నిచ్చు

సీ.         వానలు గురియగా వలపులు చిలికించు
తరువులు భువిలోన పెరుగ వలదె
వనములు ఖండించి వాసము లేర్పర్చ
నింటింటి కొక వృక్ష మిమడ వలదె
నిత్యావసరమున నీడనిచ్చెడి చెట్టు
మమత వీడుచు గొట్ట మానవలదె
చెట్ల వైశిష్ట్యము చెవి చెవి నందించ
నడవులఁ గాపాడ నరుగ వలదె
తే.         తరువు గలదేని జనులకు కరువు లేదు
తరువు నాటక యేనాడు పరువు రాదు
తరువు ఫలముల సుమముల సిరులె గాదు
తరువు నీటికి మూలమౌ తరచి చూడ

తే.         ఒక్క బొట్టైన భూమిలో నొదిగిపోక
వాన నీరంత కాల్వగా పరుగు దీసి
యూరి బయటకు చేరిన కారణమున
నేడు నగరాలలో నుండె నీటికొరత

కం.       ఇంకుడు గుంతల గృహమున
నింకను మన వీథిలోన నేర్పడ సేయన్
శంకర గంగయు భువిలో
నింకిన భూగర్భ జలము హితమును గూర్చున్.
*********************


11 కామెంట్‌లు:

  1. "తరువులతిరస ఫలభార గురుత గాంచు"అన్నట్లు బాగుగా నుడివితిరి అరాశన్నయ్య గారూ..!!

    రిప్లయితొలగించండి
  2. "తరువులతిరస ఫలభార గురుత గాంచు"అన్నట్లు బాగుగా నుడివితిరి అరాశన్నయ్య గారూ..!!

    రిప్లయితొలగించండి
  3. జలరక్షణ గూరిచి దా
    నలవోకగ వ్రాసె గృతిని హాహా యనగన్
    దలచగ శేఖర శర్మకు
    నిల సా టియె లే రుభువిని నీశుని దయచేన్

    రిప్లయితొలగించండి
  4. తరువు బెంచంగ వనముల హరువు నిండు
    కరవు దీరును వర్షంబు గురియ గాను
    వీటి సంరక్షణమె నేటి మేటి మాట
    పుడమిపై నొక మొక్క నీ పూట నాటు!

    మీ ఖండిక నేటి అవసరాన్ని చూపెడుతూ బాగున్నదండీ...

    రిప్లయితొలగించండి
  5. తరువు బెంచంగ వనముల హరువు నిండు
    కరవు దీరును వర్షంబు గురియ గాను
    వీటి సంరక్షణమె నేటి మేటి మాట
    పుడమిపై నొక మొక్క నీ పూట నాటు!

    మీ ఖండిక నేటి అవసరాన్ని చూపెడుతూ బాగున్నదండీ...

    రిప్లయితొలగించండి
  6. తరువు గలదేని జనులకు కరువు లేదు-వృక్షో రక్షతి రక్షితః
    బాగుందండి.

    రిప్లయితొలగించండి
  7. రాజశేకరశర్మ యేరోజు కైన
    నీటియిక్కట్లు దెలుపుచు చాటెరచన
    చెట్లు,వర్షాల మూలమౌ|చేటుమాన్పు
    అన్నసత్యంబు దెలిపెను మిన్నగాను

    రిప్లయితొలగించండి