18, మే 2016, బుధవారం

ఖండకావ్యము - 25 (భృగుమహర్షి)

భృగుమహర్షి బృహత్శోధన

రచన : పోచిరాజు కామేశ్వర రావు

ధర్మతత్వజ్ఞులు దమలోనఁ దాము
మర్మ మెరుఁగ నెంచి మథియించి రిట్టు
లంభోజగర్భాచ్యుతాంబరాంబరుల
దంభవిహీనుఁడు దానెవ్వఁ డనుచు
శాంత మక్రోధము క్షమముల నెవరు
సంతత ముందురు సక్కఁగ ననుచు   
తర్కంబుఁ జేసిరి ధరణిసుర వరు
లర్కసదృశతేజు లన్యోన్య మంత
పరమపవిత్రుఁడు పాదాక్ష భృగు వ
డరెను శోధింప నటన్ సత్వగుణుని
నల్పకార్యం బని యాత్మలోఁ దలఁచి
సల్పెను మార్గణ సాహస యాత్ర   
కాంచెను సత్యలోకమున పద్మభవు
నంచిత వాణీ సమాశ్రిత లీలు   
నిజగురు ద్రుహిణుని నిలిచె మౌనముగ
నజుఁ గని వందన మాచరింపకనె
యవిధేయ మునిఁ గని యాగ్రహ మొందె
ను విరించి తనయుఁ డనుచు శాంతుఁడయ్యె
ధాత నిజ జనకు తాపముఁ జూచి
వీత సంభావన వెడలె భూసురుఁడు
హిమగిరి తదుపరి యేగెను ధృతిని 
ప్రమథాధిపతిఁ జూడ పౌరుష మొప్పఁ
గనియెన్ భృగుమహర్షి గరళోగ్రకంఠు
ననలాంబకు గిరీశు నంగజహరుని
భృగుఁ గని సోదరప్రేమ మూర్కొనఁగఁ
దగ నెదురేగె నథర్వుఁడు నంత
నల సత్వగుణముఁ దా నరయఁ దలంచి
యలసత్వమున నుండె నంత భూసురుఁడు
ద్విజు వర్తనముఁ గని తీవ్ర రోషమున
నజుఁడు శూలం బేయ నడర నాపె నుమ
రోషాకలితవేషు రుద్రునిఁ జూచి
భాషా విహీనుఁడై పఱగె ద్విజుండు
శీఘ్ర కోపోద్రిక్త చేతస్కుఁ గాంచి
శీఘ్రమ మరలెను శీతాద్రి నతఁడు
చనిచని కాంచెను సంయమీద్రుండు
వనజాక్ష విలసిత వైకుంఠమునను
వైకుంఠ పురవాసు వందిత శక్రు
లోకైక రక్షకు రుచిరాంతరంగు
ఘన నీలవర్ణుని కౌస్తుభాభరణు
ఘన చక్ర హస్తుని కౌశేయవస్త్రు
హర్యక్షనిభమధ్యు నఖిలాండనాథు
పర్యంక ఫణిరాజు పద్మాయతాక్షు
సురగణ సేవితు సుందరాకారు
హరిని రమావినో ద్యచ్యు తానంతుఁ
గని గుణశోధన కాంక్ష మీరంగ
ఘన వామపాద విఘాతోరుఁ జేసె
లక్ష్మీ నివాసస్థలం బది నేడు
సూక్ష్మీకృతం బయ్యె చోద్యముగఁ దృటి
పరమాత్మ గుణగణ పరిశోధన ముని
వరునకు తగునెట్లు వర గర్వ మకట
భాగవ తోత్తమ పావన గాథ
లీ గతి వింతలు హితకరములును
దరహాస వదనుఁడై తాపసిఁ జేరి
హరి శాంతుఁ జేసి ప్రేమాతిశయమునఁ
బలికెను భవదీయ పదము నాదయిన
పలుసంపు రొమ్మునఁ బడి కందె నేమొ
శాంతింపు మయ్య విశ్రాంతి నిచ్చోట
సుంత యేమరచితిఁ జూడ నే నిన్ను
మధుసూద నాస్య సుమధుర భాషల న
వధరించి ముద మొందె భట్టారకుండు
అగ్నిముఖుని గర్వ మణచ నెంచి హరి
భగ్నపాదాక్షుగ వానిఁ జేసె నిక
ముక్తాతిశయ ఘన ముదితాంతరంగ
భక్త శిఖామణి పద్మాక్షుఁ గొలిచె.

17 కామెంట్‌లు:

  1. భృగు మహర్షి బృ హత్శోధన గురిచి యిట
    చక్కగా వ్రాసినట్టి రచయిత కిత్తు
    వేల కొలదిగ నాశిసుల్ బ్రియము తోడ
    నందు కొనుముర సోదర ! యందు కొనుము

    రిప్లయితొలగించండి
  2. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    విదేశీ వస్త్రాల౦కరణ అను నిన్నటి నా ఖ౦డికను చదివిన. శ్రీ మిస్సన్న గారికి
    ధన్యవాదములు మరియు నమస్సులు

    రిప్లయితొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    భృగుమహర్షి శోధన. యను మీ ఖ౦డిక
    అద్భుతమై యలరారు చున్నది

    రిప్లయితొలగించండి
  4. శ్రీపోచిరాజుకామేశ్వరరావుకవివరులకు తమరురచించిన భృగుమహర్షిభ్రుహత్శోధనద్విపదఅలతిపదాలతోచాలాబాగున్నది

    రిప్లయితొలగించండి
  5. కామేశ్వరీ కరుణాకటాక్ష వీక్షణల మునుంగు శ్రీ కామేశ్వరా!
    గీర్వాణ భాషా పదవిలసితంబుగ అధ్బుత ధారాశుద్ధితో
    కథాగమనాంతరాయమించుకలేక పూర్వకవీశ్వర స్థాయి నందుచు
    సాగిన మీ ఖండకావ్యము చదివినంతనె మానసికానందము పొందితిని.
    అందుకొనుడు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు ధన్యవాదములండి. ఇది యిటీవల నేను రచించిన "పద్మావతీ శ్రీనివాసము" యను ద్విపద కావ్యము లో ప్రథమాశ్వాసములోని ఘట్టము. మొత్తము 7 ఆశ్వాసములు. వరాహ పురాణమాధారముగా వ్రాసినది.

      తొలగించండి
  6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “భృగుమహర్షి బృహత్శోధన” ప్రచురించినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. భృగువు రొమ్ము పైన పొగరుగఁ దన్నినన్
    పాద సేవఁ జేసి యాదరించ
    నతివ సత్య తన్నె నటుపైనఁ దలమీద
    సిగ్గు లేని వాడు శ్రీవిభుండు!
    (గతంలో మన బ్లాగులో నొసఁగిన సమస్యకు నా పూరణ)

    రిప్లయితొలగించండి
  8. వేంకట సుబ్బ సహదేవుడు నమస్కారములు, ధన్యవాదములు. మీ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. కామేశ్వర రావుగారూ మీ ద్విపద ఖండిక చాల బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కవి మిత్రులు కామేశ్వరరావు గారికినమస్సులు.మీ కవితాధార బహుధాప్రశంంసనీయము.

    రిప్లయితొలగించండి
  11. కవి మిత్రులు కామేశ్వరరావు గారికినమస్సులు.మీ కవితాధార బహుధాప్రశంంసనీయము.

    రిప్లయితొలగించండి