కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది గణ యతి ప్రాసలే లేని కైత మేలు.కవిమిత్రులారా,
ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ‘వ్యాఖ్యను పోస్ట్ చేయండి’ అనే సూచన కూడా మాయమయింది. అది ఉంటేనే మీరు మీ వ్యాఖ్యలను పంపగలరు. ప్రస్తుతానికి మీ పూరణలను, వ్యాఖ్యలను క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణలు ... రసము లూరుచు జెప్పెడి రమ్య కవిత
మనము నాహ్లాద పరచెడి మల్లె మొగ్గ
సరస లాలిత్య సంపద కొఱత గంటె
గణ యతి ప్రాసలే లేని కైత మేలు !
భావ విభవమె ప్రాణము పద్యములకు
గణము యతి ప్రాస లొప్పును గమనమునకు
ప్రాణమే లేని మరబొమ్మ పలుకు కంటె
గణ యతి ప్రాసలే లేని కైత మేలు !
వసంత కిశోర్ గారి పూరణ ... గణ యతి ప్రాసలే లేని - కైత, మేలు
గద్య మగుగాని , జగతిని - కైత గాదు !
గణ యతిప్రాస లెగ మేలు - కైత కెపుడు
గణ గణ మని చదువుకొన - గలుగుటకును !
లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణ ...ఘనము పద్యమునకు గణ యతి ప్రాసలే,
లేని కైత-మేలు లేని కైత,
వచన కవిత యనగ వర్ధిల్లు చున్నది
దేని గొప్పదనము దానిది మరి !
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ...పద్య మన్నది వ్రాయంగ భయ మననెడి
ద్రాక్ష పండైన నమలగ దవడ లేని
చంటి వారికి పాల సీసాల వంటి
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ ...బుధులు మెచ్చనలంకారభూషితమగు
ప్రౌఢమత్తేభ శార్దూల స్రగ్ధరలును,
సర్వజనసమ్మతమునొంద నుర్వియందు
గణయతిప్రాసలే లేని కైత - మేలు.
పండిత నేమాని వారి పూరణ ....గణ యతి ప్రాసలే లేని కైత మేలు
వ్యాకరణ మేదియును లేని భాష మేలు
నీతి సంస్కృతియు లేని జాతి మేలు
మేలు మేలను టేలనో చాలు చాలు