14, ఫిబ్రవరి 2012, మంగళవారం

శ్రీ రాంభట్ల వారి అవధానం - 1

శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం
12-02-2012 వ తేదీ సాయంత్రం
విశాఖపట్నం లలితానగర్ శ్రీ లలితాపీఠంలో
కవి పండిత రంజకంగా జరిగింది.


మొదటి అంశం సమస్యా పూరణం:
సమస్య: ప్రాణము దీతురేమొ నిజభార్యను గావుము పద్మసంభవా!
అవధాని పూరణ:
వేణువు నూద వెల్వడెడి వేదపు నాదము గాగ కఛ్ఛపీ
వీణను మీటుచుండగను విద్యల తల్లిని దుష్టవర్తనుల్
జాణవె యంచు దెప్పుదురు చంపగ జూచెద రన్య భాషచే
ప్రాణము దీతురేమొ నిజభార్యను గావుము పద్మసంభవా!


రెండవ అంశం : దత్తపది
'కైపు, టైపు, పైపు, రైపు' ఈ పదాల నుపయోగించి స్వేఛ్ఛా ఛందంలో ఏ వేల్పునైన స్తుతిస్తూ పద్యం చెప్పాలి.
అవధాని పద్యం:
నీవిడు ముక్తికై పుడమి నిత్యము భక్తులు గొల్చు చుందురే
రావొకొ జన్మ కీల నివురై పులుపైన దటంచు వేదనన్
పావన యన్నమాదు పిలుపై పులుగెక్కియు చేర రావె మా
ఠావులు దప్ప నిన్ను నొకటై పులకించగ మానసమ్ములే.


మూడవ అంశం వర్ణన:
అరసవల్లి (హర్షవల్లి) క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ మూర్తిని వర్ణిస్తూ స్వేచ్చా ఛందంలో పద్యం చెప్పాలి.

అవధాని చెప్పిన పద్యం:
అంధత్వము సంధిల్లదు
బంధించదు వ్యాధి సూర్య భగవానుని సం-
బంధమునన్ విలసిల్లగ
బంధురుడై జనుల కెల్ల బాటను జూపున్.

సశేషం.......
అవధాన విశేషాలను పంపించిన ‘మిస్సన్న’ గారికి ధన్యవాదాలు.

3 కామెంట్‌లు:

 1. శ్రీ రాంభట్ల గారి అష్టావధానం గురించిన విషయములను తెలిపి నందులకు శంకరయ్య గారి బ్లాగ్ ముఖం మూలం గా శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదములు.

  జిలేబి.

  రిప్లయితొలగించండి
 2. ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయంబాహ్లాదదంబయ్యెనో
  ప్రోత్సాహంబుగ నూతనోద్యమ లసత్పూరంపుసారంబునై,
  ఊహాతీత విశేష పద్యరచనా వ్యూహంబునందొప్పు, నే
  జోహారందును "శంకరాభరణ" విస్ఫూర్తి క్రియా వ్యాప్తికిన్!!

  - "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ .

  రిప్లయితొలగించండి
 3. సవరణ

  ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయంబాహ్లాదదంబయ్యె ప్రో
  త్సాహంబట్లుగ నూతనోద్యమ లసస్సారంపు పూరంబునై,
  ఊహాతీత విశేష పద్యరచనా వ్యూహంబునందొప్పు, నే
  జోహారందును "శంకరాభరణ" విస్ఫూర్తి క్రియా వ్యాప్తికిన్!!

  రాంభట్ల పార్వతీశ్వర శర్మ
  "అష్టావధాని"

  రిప్లయితొలగించండి