6, ఫిబ్రవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 614 (శాసన ధిక్కారమే)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

31 కామెంట్‌లు:

  1. శాసన కర్తల స్వార్థము
    మోసముకలిగించ మనకు ముందుగ గని యా
    శాసనమెదిరించ వలయు.
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  2. వాసి గల పాలకుల యెడ
    శాసనధిక్కారమే? ప్రశస్తము గాదా
    శాసన బద్ధుడయి మనుట!
    బాసను జేయుమిపుడిట నపాయము తప్పున్.

    రిప్లయితొలగించండి
  3. సాహితీ ప్రియులారా! మీమీ బ్లాగులలో ఈ క్రింది వివరాలు ఉంచి 12వ తేదీన మియాపూర్, జయప్రకాశ్ నారాయణ్ నగర్, శ్రీ వేంకటేశ్వరస్వామివారి కోవెల ప్రాంగణంలో మధ్యాహ్మం 3 గంటలకు జరుగబోవుచున్న శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధానిగారి అష్టావధానమునకు రసజ్ఞులు తప్పక వచ్చే విధంగా బహుళ ప్రచారము చేయ వలసినదిగా మనవి చేయుచున్నాను.
    ఈ ప్రకటనకు అవకాశం కల్పించిన శ్రీ కందిశంకరయ్యగారికి , ప్రచార కార్యక్రమాన్ని చేపట్టుట ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్న మీకు నాయొక్క కృతజ్ఞతాంజలులు.
    మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.
    http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_04.html

    రిప్లయితొలగించండి
  4. రావణుని శాసనాన్నిధిక్కరిస్తూ హరి భక్తులు ఎవరికి వారు ఇలా అనుకున్నట్లు .......

    శ్రీ సతి పతికే పూజలు
    చేసినచో రావణుండు చేతులు నరుకున్
    పాసెద ప్రాణము లైనను
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  5. ఈసునఁ గౌరవసభలో
    వాసిఁ గనిన ద్రుపదరాజ వరపుత్రికనే
    గాసిలఁ జేసిన యా దు
    శ్శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  6. గురువు గారు,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. చాలా బాగుంది.
    మీకొక సూచన.
    మీ బ్లాగ్ డాష్ బోర్డ్ లో భాషని తెలుగు గా ఎంపిక చేసుకుంటే, కామెంట్స్/రీడ్ మోర్ / పబ్లిష్ ఇవన్నీ వ్యాఖ్యలు/ ఇంకా చదవండి/ ప్రచురించు గా కనిపిస్తాయి.
    లేదా సెట్టింగ్స్ లో భాష మరియు ఆకృతీకరణ లో కూడా తెలుగు ని ఎంపిక చేసుకోండి.

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతిశాస్త్రిసోమవారం, ఫిబ్రవరి 06, 2012 9:29:00 AM

    శ్రీగురుభ్యోనం:

    ఆసగ శరణము వేడిన
    ఈ సఖునకు ప్రాణభిక్ష నీవలదనుచున్
    శాసించుచు నృపు జేసిన
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  8. శాసనము సేయ సులభము
    శాసనముల మంచి చెడ్డ సారూ ప్యము లో
    శాసనములు సరి కాని చొ
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా !

    రిప్లయితొలగించండి
  9. వాసవు ననుజుడు కంసుని
    శాసన ధిక్కారమే ప్రశస్తముగా, దా
    భాసిల్లె దుష్ట శిక్షకు
    డై సజ్జనలోక వంద్యుడై కవివర్యా!

    రిప్లయితొలగించండి
  10. గ్రాసము సమకూర్చని,ఆ
    వాసములేర్పరచ లేని,వస్త్రంబులపై
    వేసిన మోసపు పన్నుల
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  11. ఆ సామీరుడు జానకిఁ
    జూసియు సూచింపనెంచి సుందరకాండన్
    జేసిన భీకర రావణ
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ చంద్రశేఖర్ గారి పూరణలో 1, 2 పాదములలో ఈ సవరణలు చేస్తే బాగుంటుంది:

    ఆ సామీరి మహీజకు
    సూచింపగనెంచి లీల ........

    రిప్లయితొలగించండి
  13. ఈసున జేసిన దగుచో
    గాసిని బడుచున్న ప్రజల గావనిదగుచో
    మోసము డాచిన దగుచో
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  14. శ్రీ చంద్రశేఖర్ గారి పద్యమునకు సవరణ 1, 2 పద్యములలో ఈ విధముగా చేస్తే సరిపోతుంది:

    ఆ సామీరి మహీజకు
    భాసురమతి లీల జూప భావించి వెసన్

    క్రిందటి నా సవరణలో ప్రాస నియమము నేను చూడలేదు. అందుచేత ఈ పై సవరణను చేయమని నా సలహా.

    రిప్లయితొలగించండి
  15. చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చక్కని విరుపుతో బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మీరు చెప్పినట్లే మార్చాను. ఇప్పుడు తెలుగు అక్షరాలే కనిపిస్తున్నాయి కదా!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    శరణాగతులను కాపాడడానికి శాసనాన్ని ధిక్కరించ వచ్చన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    తృతీయపాదాంతంలో ‘చొ’ అని హ్రస్వప్రయోగం చేసారు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘ప్రశస్తముగా, దా’ అని వైవిధ్యమైన విరుపుతో ఉత్తమమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    చక్కని భావంతో సుందరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    అయితే ‘చూచియు’ అనేది ‘చూసియు’ అనవచ్చా అని ధర్మసందేహం!
    *
    శ్యామల రావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మోసముతో వచ్చెను హరి
    దోసమగును మనకు మాట తూలిన వేళన్
    వాసవ సోదరుడైన కు
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!


    కుశాసన = కుశ + ఆసన = కుశలను ఆసనముగా కలిగిన వాడు (వామనుఁడు)

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా! ధన్యవాదములు.
    జీ యస్ యన్ గారు ! మీ పూరణకు శాసనమును ' కుశాసనము' గా మలచుకొన్న విధము... భేష్.. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. డి.నిరంజన్ కుమార్సోమవారం, ఫిబ్రవరి 06, 2012 11:34:00 PM

    ఆసనమెక్కిన నేతలు
    శాసించుతు పెంపుజేయ సర్దుకుపోతూ
    బాసించెడి సచివులకీ
    శాసన ధిక్కారమే ప్రశస్తము కాదా!

    రిప్లయితొలగించండి
  19. గురువుగారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  20. హనుమ:

    డాసిన చుట్టముకాడట
    దాసుండునుకాడు, రామ! తానైనంబోఁ
    బాసను వీడుట కంటెన్
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  21. ఈసున కైకేయి కోరిక
    క్లేశము కలిగించె మిగుల కౌసల్య మదిన్ !
    రోసేను కొమరుని దలచుచు
    శాసన ధిక్కారమే ప్రశ స్తము గాదా !
    --------------------------
    మోసము జేయుచు జనులను
    వాసిగ చట్టములు జేసి బాధించుట కై !
    పాసెము బిగియించు తుదకు
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా !

    రిప్లయితొలగించండి
  22. అంబరీషోపాఖ్యానం

    చేసెను జలపారణ, దు-
    ర్వాసుడు కోపించి రాజు పైనను కృత్యన్
    వేసెను, హరి కాచెను సుకు-
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    దండి సత్యాగ్రహం

    వేసిరి యుప్పుకు పన్నును
    త్రోసిరి కాదన్నవారి దొరలే జైళ్ళన్
    చేసిరి యాత్రను దండికి
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  23. జిగురు సత్యనారాయణ గారూ,
    బలికి శుక్రుని ఉపదేశంగా కుశ + ఆసన అనే ప్రయోగంతో వినూత్నమైన, ప్రశంసనీయమైన పూరణ చేసారు. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    కాకుంటే వ్యావహారిక పదప్రయోగా లున్నాయి. నా సవరణ ....
    ఆసనమెక్కిన నేతలు
    శాసించు(చు) పెంపుజేయ సర్దుకుపో(వన్)
    బాసించెడి సచివుల(కున్)
    శాసన ధిక్కారమే ప్రశస్తము కాదా!
    *
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ద్వితీయపాదాంతంలో అర్ధానుస్వారం ఎందుకో?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పద్యం నిర్దోషం. మొదటి పద్యం మొదటి పాదంలో గణదోషం, రెండవపాదంలో యతిదోషం. నా సవరణ ...
    ఈసున కై(క యభీష్టము)
    (కౌసల్యకు కలుగజేసె కష్టమ్ము) మదిన్
    రో(సె)ను కొమరుని దలచుచు
    శాసన ధిక్కారమే ప్రశ స్తము గాదా !
    *
    మిస్సన్న గారూ,
    కుశ శబ్దానికి ఉన్న జలమనే అర్థాన్ని గ్రహించి ఉత్తమమైన పూరణ చేసారు. చాలా బాగుంది.
    గాంధీ శాసనోల్లంఘన అంశాన్ని ఎవరు పూరణకు స్వీకరిస్తారా అని చూసాను. చివరికి అది మీకు చిక్కింది.
    రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    హరి పూజ నిషేదించిన హిరణ్యకశిపుని శాసనమును :

    01)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________

    ఆ సిరివరుణుని పూజల
    నే, సేయ వలదని , నాడు - నిర్దేశించన్
    దోసము కలిగెడి దౌటను
    శాసన ధిక్కారమే ప్ర - శస్తము గాదా !
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________
    దోసము = పాపము

    రిప్లయితొలగించండి
  25. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    హరిపూజ నిషేదించిన హిరణ్యకశిపుని శాసనమును వినిన మునులు తోటి వారితో :
    01అ )
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________
    ఆ సిరివరుణుని పూజల
    నే, సేయ వలదని వాడు - నిర్దేశించన్
    దోసము కలిగెడి దౌటను
    శాసన ధిక్కారమే ప్ర - శస్తము గాదా !
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________
    దోసము = పాపము

    రిప్లయితొలగించండి
  26. వసంత కిశోర్ గారూ,
    మంచి విషయాన్ని ఎంచుకున్నారు పూరణకు. చాలా బాగుంది. అభినందనలు.
    ‘సిరివరుణుని పూజలు’? ‘ఆ సిరిమగనికి పూజల’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  27. గురువు గారు, ధన్యవాదాలండి.
    ఇప్పుడు కొన్ని తెలుగులోకి మారాయి.
    నెట్ సమస్యల వల్ల వెంటనే స్పందించలేక పోయినందుకు క్షంతవ్యురాలను.

    రిప్లయితొలగించండి
  28. గ్రాసము లాలూజి తినగ
    శాసన సభలోన రాహ్లు చల్లగ తూగన్
    దాసోహమ్మన మోహను...
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి
  29. గాంధీయము:

    రోసియు బానిస బ్రతుకును
    తీసి విదేశపు వలువలు దీటుగ వీధిన్
    వాసిగ మంటల నిడెడిన్
    శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

    రిప్లయితొలగించండి