10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 618 (రావణుఁ డా సీతమగఁడు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

రావణుఁ డా సీతమగఁడు రక్షించు మిమున్.

(జాలపత్రిక ‘ఈమాట’ సౌజన్యంతో)

28 కామెంట్‌లు:

  1. కాలము చెల్లె రావణునికిన్
    మాకెవ్వరు దిక్కన లంకాపురి వాసుల్
    రాజ్య ప్రజలకు కడపటి సందేశం ఇచ్చె
    రావణు,డా సీతమగడు రక్షించు మిమున్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. దేవతలారా చూడుం
    డా వసుధను బుట్టె విష్ణు వసురుల వధకై
    చావది లేనసురుండీ
    రావణుఁ డా? సీతమగఁడు రక్షించు మిమున్.

    రిప్లయితొలగించండి
  3. హనుమ లంకలో రావణ సభలో అన్న మాటలు.

    చావును కొనితెచ్చు కొన-
    న్నీవిధి మీకౌనె రామునే శరణన్నన్
    బ్రోవడె రక్కసులారా!
    రావణుఁ డా! సీతమగఁడు రక్షించు మిమున్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    ఆవానర సైన్యముతో
    ఈవారిధి దాటి వచ్చు నెన్నటికైనన్
    నీవిక వగవకు, కూలును
    రావణుఁ,డా సీతమగఁడు రక్షించు మిమున్.

    రిప్లయితొలగించండి
  5. రావణసంహారకుడును
    దేవగణార్చితుడు పరమతేజోనిధియున్
    శ్రీవరదుడు శాత్రవవి
    ద్రావణు డాసీత మగడు రక్షించు మిమున్

    రిప్లయితొలగించండి
  6. పండితుల వారు చాలా బాగా శాత్రవవిద్రావణుడని పూరణ చేశారు. ధన్యులము.

    రిప్లయితొలగించండి
  7. కావుమనుచు వేడినచో
    దేవుడయి నిలుచునని విని, దెలిసియు, తానే
    చావును కొనితెచ్చు కొనెను
    రావణు, డాసీత మగడు రక్షించు మిమున్.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి ధన్యవాధములు,
    రావణుని పెంపుడు పావురము ఈ రీతిన జెప్పుచుండెను
    --------
    " పావురము జెప్పె ముందుగ
    నీవిక గర్వమును వీడి నిఖిల జగతికిన్
    మావటిని శరణు వేడిన
    రావణుడా, సీత మగడు రక్షించు మిమున్|

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రావణునికి హనుమ హితబోధ :

    01)
    _____________________________________________
    రావించి , రాము , లంకకు
    రావణి , సోదర సహితము - లయ మొందకుమా !
    రావము జేసిన శరణని
    రావణుఁ డా, సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________
    రావణి = ఇంద్రజిత్తు

    రిప్లయితొలగించండి
  10. రాముని కాళ్ళట్టుకోమని రావణునికి హనుమ హితబోధ :

    02)
    _____________________________________________

    రావించకుమీ , రాముని
    గావించకు మీ నగరిని - కాష్ఠము వలెనే !
    సేవించినచో పదముల
    రావణుఁ డా ! సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  11. ఏ దేవతలూ నిన్ను రక్షించ లేరని రావణునికి హనుమ హితబోధ :
    03)
    _____________________________________________

    నా వినతిని విన వైతివొ ?
    చావే , నిను కోరి జేరు - సర్వము మాయున్
    యే వేలుపు నీకు వలన ?
    రావణుఁ డా ! సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________
    వలన = రక్షణ

    రిప్లయితొలగించండి
  12. ఏ వేళనైతే సీతను తెచ్చావో ఆవేళే నీకు మూడిందని రావణునికి
    హనుమ హితబోధ :
    04)
    _____________________________________________

    ఏ వేళను మా , మాతను
    కావాలని దెచ్చితీవు ! -కౌశికు పాలౌ
    నా వేళనె లంకా పురి
    రావణుఁ డా ! సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________
    కౌశికము = గుడ్లగూబ

    ,

    రిప్లయితొలగించండి
  13. హనుమ మాటలు వినుమని , రావణునికి విభీషణుని హితబోధ :
    05)
    _____________________________________________

    ఈ వీరుని మాటలు విను !
    నా వినతిని చెవిని బెట్టు - నయమును గనుమా !
    బ్రోవుమని శరణు గోరిన
    రావణుఁ డా ! సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________
    నయము = లాభము = శుభము

    రిప్లయితొలగించండి
  14. భార్య నెవరైనా యెత్తుకు పోతే యే స్థితి కలుగుతుందో ఊహించుకొని వర్తించమని రావణునికి విభీషణుని హితబోధ :
    06)
    _____________________________________________

    ఈ విధముగ నీ సతినే
    ఏ వీరుడొ దొంగిలింప - యే విధి గలుగు ?
    న్నా విధముగ కళవళ పడు
    రావణుఁ డా, సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  15. కొంచెము శాంతముగా , ఆలోచించి రాబోయే నాశనాన్ని , ఆపమని
    రావణునికి విభీషణుని హితబోధ :

    07)
    _____________________________________________

    ఆవేశము మాని , కుదురు
    గా , వీక్షింపుము జరిగెడి - క్షయమును నయమున్ !
    నీ వాసము నిలబడు , నో
    రావణుఁ డా, సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________
    నయము = మృదువు
    వాసము = ఇల్లు

    రిప్లయితొలగించండి
  16. దేవతలం నిర్జించిన
    రావణుడా , సీత మగడు రక్షించు మిమున్
    రవ్వంత సేవ చేసిన
    సేవించిన వారి కతడు సేవకు డౌనున్ .

    రిప్లయితొలగించండి
  17. సీతను విడచిపుచ్చుమని రావణునికి విభీషణుని సలహా :

    08)
    _____________________________________________

    సేవింపగ ,సుతులు , సతులు
    భావించుము నీదు రాజ్య - భాగ్యము కొఱకై
    నీ వింకను, సీతను విడు !
    రావణుఁ డా, సీతమగఁడు - రక్షించు మిమున్ !
    _____________________________________________
    భావించు = ఆలోచించు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సుబ్బా రావు గారూ!
    మీ పద్యము భావమును కొంచెము మార్చుతూ నేను ఇలా సరిచేస్తున్నాను:

    దేవతలను నిర్జించిన
    రావణుడా! సీత మగడు రక్షించు నినున్
    నీ వెరుగవె? యా రాముడు
    శ్రీవరదుడు శరణమొసగు రిపులకు నేనిన్

    మీరు ప్రాస నియమమును అవగాహన చేసుకొన్నట్లు లేదు. మీ 3వ పాదములో ప్రాస సరికాదు.

    అమ్మా! మందాకినీ! నా పూరణ గురించి స్పందించినందులకు ధన్యవాదములు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి ధన్యవాధములు,
    పండిత నేమాని వారు పట్టు పంచెను గట్టుచున్నారు ప్రతీ పద్యమునకు , ధన్యులమైతిమి శంకరాభరణ బ్లాగునందు వారి కవితలు చదివి.
    వసంత కిశోర్ గారి యన్ని పద్యములు బహు చక్కగానున్నవి.
    సరదాగా మరి యొకటి
    ---------
    కావుమని కాకి తోడను
    తావుకొనిన స్థితిని బంపి దమ లంకేయుల్
    చావున్ గోరక వేడుము
    రావణుడా, సీత మగడు రక్షించుమిమున్|
    ( తావుకొనిన = నెలకొనిన)

    రిప్లయితొలగించండి
  20. దేవునిగా రావణు గని,
    నీవెందుకు మోసపోవ? నిజమునెఱుగుమా.
    భావింపుము. కావగ నా
    రావణుఁడా? సీత మగఁడు రక్షించు మిమున్.

    రిప్లయితొలగించండి
  21. మిత్రులారా! ఈనాటి పూరణలు అన్నియును అలరించుచున్నవి.
    జిలేబీ గారికి, గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, మిస్సన్న గారికి, శ్రీపతి శాస్త్రి గారికి, మందాకిని గారికి, వరప్రసాద్ గారికి, వసంతకిశోర్ గారికి, సుబ్బారావు గారికి, చింతా రామకృష్ణారావు గారికి పేరు పేరునా అభినందనలు. శ్రీ వసంత కిశోర్ గారు ప్రతి నిత్యము ఒక్కొక్క సమస్యతో ఒక పద్య సంపుటిని చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు.

    జిలేబి గారి భావమునకు ఈ విధముగా పద్యరూపము నిచ్చుచున్నాను:
    నీవే గతివను మాకిక
    నేవారగు దిక్కనంగ నిటులనె నా లం
    కావాసులతో జల్లగ
    రావణు డా సీత మగడు రక్షించు మిమున్

    రిప్లయితొలగించండి
  22. గురువర్యులు శ్రీపండిత నేమానివారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  23. శ్రీ వాల్మీకి రచిత నిజ
    పావన శుభ చరితుడు రఘు వంశ తిలకుడున్
    సేవిత మారుతియు నిహత
    రావణు డా సీత మగడు రక్షించు మిమున్

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులారా,
    అందరి పూరణలూ చదివాను. బాగున్నాయి. అసలే జ్వరపీడితుణ్ణి. ఆపై మా బావగారి తిథికార్యానికి వెళ్ళి రావడం వల్ల అలసి ఉన్నాను. రేపు ఉదయం మీ మీ పూరణలను పరామర్శిస్తాను.
    అయినా పండిత నేమాని వారు అందరి పూరణలను ప్రస్తావించి ప్రశసించారు కదా!
    వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. జిలేబీ గారూ,
    ఉదాత్తమైన భావాన్ని అందించారు. ఆ భావానికి పండిత నేమాని వారు మనోహరమైన పద్యరూపం ఇచ్చారు. అదృష్టవంతులు మీరు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘లేని + అసురుడు’ అన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది. అందువల్ల దానిని ‘చావది లేని దనుజుడీ’ అందాం.
    *
    మిస్సన్న గారూ,
    ప్రశంసనీయమైన పూరణ మీది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    కాని ఆ మాటలు ఎవరు ఎవరితో అన్నారో చెప్పి ఉంటే బాగుండేది.
    *
    పండిత నేమాని వారూ,
    శాత్రవ విద్రావణుడైన రాముని గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మిత్రుల పూరణలపై స్పందించినందుకు ధన్యవాదాలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణలు రెండూ బాగున్నాయి. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఎనిమిది పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు. (ఇంత ఓపిక ఎక్కడిదండీ బాబూ! :-)
    మూడవ పూరణ మూడవ పాదాదిని యడాగమం అవసరం లేదు. వాక్యారంభం కనుక అచ్చు వేయవచ్చు.
    నాల్గవ పూరణలో ‘కావాలని’ని ‘కావలెనని’ అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    వరప్రసాదు గారూ ! ధన్యవాదములు !
    పండిత నేమాని వారూ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !
    ఓపికా !!! !! మీకన్నానా ??? ??

    రిప్లయితొలగించండి
  27. శ్రీ నేమాని వారికి నమస్సులు!

    భావానికి మీదైన శైలి లో మంచి పద్యాన్ని అందించారు.

    శ్రీ శంకరయ్య గారు,

    అవునండీ, మీరన్నట్టు అదృష్ట వంతులం మేమందరమూ!

    ఇంత మంది కవీశ్వరులు ఈ పంచ దశ లోకం లో కొలువై వుండండం తెలుగు వాళ్ళ సుకృతం.

    నెనర్లు


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  28. ద్రావిడ నాస్తికు లారా !
    రావణుఁ డా సీతమగఁడు? రక్షించు మిమున్
    మీ వారలనా రాముడు
    భావోద్వేగమున వేడి ప్రార్ధన జేయన్

    రిప్లయితొలగించండి