19, ఫిబ్రవరి 2012, ఆదివారం

శివానందలహరి - 4



గళంతీ శంభో! త్వచ్చరిత సరితః కిల్బిషరజో

దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం
దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రద భువి శివానంద లహరీ

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి అనువాదం.....
సీ.
శంకరాచార్య సత్సంకల్ప మహిమతో
భవచరిత్రమునుండి ప్రభవమొంది
ప్రవహించుచును పాప రజమెల్ల నణచుచు
సద్బుద్ధి కుల్యల సరణి జేరి
ఆదరభావాన నాశ్రయించిన వార్కి
సంసార తాపోపశమన మిడుచు
నిమ్ముగా నా మానసమ్మను హ్రదమును
జేరి సుస్థిరముగా చెలగుచుండు
తే.గీ.
నట్టి శ్రీ శివానంద లహరి యనబడు
సత్కృతి విశేష వైభవ సహిత యగుచు
పుడమి నాచంద్రతారార్కముగ సమస్త
వాఙ్మయ విభూషణమ్ముగా పరగు గాక!

16 కామెంట్‌లు:

  1. గౌరీనాథుని మనమున
    నారాధింపగ నవిద్య నజ్ఞానములున్
    చేరక నిర్మలమగునట,
    ఆరాటమ్ములు తొలగునటంచును చెపుమా!

    నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
    ననువిడిపోవు తత్క్షణమె, నాకములన్నియు నన్నుచేరునే!
    మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
    వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!

    ఇంటికి నీవె దైవమయి యెప్పుడు బ్రోచుచు నుండువానివే!
    కంటికి రెప్పవై మముల కాచెడు జంగమవీవు దేవరా!
    మంటను కంటిలో గలిగి మన్మథ మాయను గెల్చువానిగా
    బంటుల తోడునీడవయి భక్తిని పెంచుము రక్తి వీడగన్.

    మాయామర్మమెఱుంగమయ్యనభవా! మమ్మేల రావేలనో
    కాయమ్మందున లావు తగ్గెనిక నాకై జాలి చూపించవో!
    న్యాయమ్మీ భువి లేదులేదు, నరులన్యాయంబునే నమ్మిరే!
    చేయూతమ్మిడి,భక్తిభావములనే చిత్తమ్ములో నింపుమా!

    నరుడా పొద్దున కొట్టబోయినను బాణాలిచ్చి దీవించవే! (దీవించలేదా అని భావము)
    కరువా ముద్దకు నన్నపూర్ణపతి, శాకమ్మెట్లు యెంగిళ్ళయెన్?
    వరముల్ కోరుచు నిన్ను వేడగనె పాపాలెంచబోవందురే!
    గురువే నీవని నమ్మియుంటినిను; నే కోరంగ లేదందువా! (లేదనవు అని భావము)

    రిప్లయితొలగించండి
  2. గురువు గారు,
    ధన్యవాదాలు. అప్పుడు తత్క్షణమె అన్న పదాన్ని నిక్కముగ అని మారుస్తున్నాను. ఇంకా మత్తేభము, శార్దూలము ల్లో వ్రాశాను. నచ్చిన అన్ని ఛందాల్లో అని అన్వయించుకున్నాను ఈ శివరాత్రి సందర్భంగా. శివానందలహరి ఈ రోజుటి పోస్ట్ లో ప్రకటించాను. అన్నీ కలిపి.

    రిప్లయితొలగించండి
  3. మత్తేభము రెండవ పాదం లో శ రాకూడదని సవరణ.

    కరువా ముద్దకు నన్నపూర్ణ మగడా! గైకొంటి యెంగిళ్ళనున్,

    రిప్లయితొలగించండి
  4. చక్కగా శివస్తోత్రం చేసిన

    నేమాని వారికి ధన్యవాదములు !
    మందాకినిగారికి ధన్యవాదములు !

    శంకరార్యా ! ధన్యవాదములు !
    "మత్తేభము రెండవ పాదం లో శ రాకూడదని సవరణ. "
    ఇదెక్కడి సూత్రం? ఎక్కడా విన్నట్టు లేదే ?

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా నమోన్నమః
    మందాకిని గారూ శివుణ్ణి నిలబెట్టేశారు. అభినందనలు.
    కిశోర మహోదయా బహుశా మందాకినిగారు నిషిద్ధాక్షరి-౩ కోసం వ్రాశారేమో.

    రిప్లయితొలగించండి
  6. తొలి యరు ణా చల లింగము
    కలిగెను ధనువు నెల నార్ద్ర ఘన లింగమునన్
    వెలివడు శివుని హరి సురలు
    గొలిచిన దినమె శివరాత్రి కుంభపు నెలనౌ.

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్నగారు,
    ధన్యవాదాలు.
    మీరు సరిగ్గా గ్రహించారు.
    వసంతకిశోర్ గారు, మిస్సన్నగారు చెప్పినట్టు నేను నిషిద్ధాక్షరి రోజు వ్రాసినవి ఈరోజు ప్రచురించాను. రెండు రోజులు నెట్ లేక. ఆ విషయాన్ని నేను విశదంగా వ్రాయలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  8. మందాకినీ గారూ మరొక్క మారు అభినందనలు.
    అయితే మీ పద్యాలలో క్ష, శ ల ప్రయోగం జరిగింది.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారు,
    ఎక్కడండీ?
    తత్క్షణమె అని వ్రాశానని గురువు గారు సూచించినందుకే దానిని నిక్కముగ అని మార్చాను.
    శ ప్రయోగం శాకమ్మెట్లు లో నేను గమనించుకొని దాని సవరించి పైన ఒక వ్యాఖ్యగా పెట్టాను.
    కరువా ముద్దకు నన్నపూర్ణ మగడా! గైకొంటి యెంగిళ్ళనున్
    ఇవి కాక ఇంకేమి ఉన్నాయంటారు?

    రిప్లయితొలగించండి
  10. శివానందలహరి

    మిత్రులారా! మనలో ఎక్కువమందికి శివానందలహరి గురించి తెలుసును అనుకొనుచున్నాను. అయినను దానిని గురించి కొన్ని విషయములను వ్రాయుచున్నాను. శ్రీమదాది శంకరాచార్యులు వారు రచించిన పెక్కు స్తోత్రములలో శివానందలహరి ఒకటి. ఇందులో 100 శ్లోకములు కలవు. అందు మొదటి 27 శ్లోకములును శిఖరిణీ వృత్తములు. తరువాత ఎక్కువగా శార్దూలములు, ఇతర వృత్తములు వివిధములైన ఛందములలో నుండును. భక్తి జ్ఞాన యోగముల సమ్మేళనములై నవరసభరితములైనవే ఇందులోని శ్లోకములు. శ్లేష కూడిన రూపక అలంకారములు శబ్దాలంకారములు కూడ ఇందు కలవు. ఇందలి కొన్ని కొన్ని శ్లోకములను నేను స్వేఛ్ఛానువాదము చేయుచున్నాను. మంచి మంచి వర్ణనలతో నిండిన ఈ స్తోత్రములను అందరూ బాగుగా అధ్యయనము చేయవచ్చును. శివరాత్రి సందర్భముగా ఈ స్తోత్రములను పారాయణ చేయుట వలన మంచి ఫలితముండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా!
    శివానందలహరి చాలా అద్భుతమైనది.
    నేను చదువుతుంటాను.
    మీరు వ్రాయటం చూసినప్పుడు నేను చాలా సంతోషించాను.
    కొంత సమయం దొరకక నేను ఇంకా చదవక పోవుటతో స్పందించలేకపోయాను.
    ఇక్కడ మీరు వ్రాయటం వలన మీరు మమ్మల్ని ధన్యులను చేయుచున్నారు.
    పాదాభివందనములు.
    శివరాత్రినాడు తప్పక చదివే భాగ్యం కలగాలని శివుని ప్రార్థిస్తూ...

    రిప్లయితొలగించండి
  12. అవునుకదా మందాకిని గారూ! నేనే పొరపాటు పడ్డాను. మీ పద్యాలు నిర్దోషంగా భక్తి ప్రపూరితంగా ఉన్నాయి. అభినందన మందారాలు.

    రిప్లయితొలగించండి
  13. శివానందలహరి గురించి బాగుగా స్పందించిన మన మిత్రులందరికీ పేరు పేరునా శుభాభినందనలు. సమస్త సన్మంగళాని భవంతు. తన్మే మనశ్శివ సంకల్పమస్తు. స్వస్తి.

    మిత్రులారా! రేపు శివరాత్రి సందర్భముగా పార్వతీ కళ్యాణము ఇతివృత్తముగా కొన్ని పద్యములను వ్రాయడానికి ప్రయత్నము చేద్దాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !
    రక్షించారు !నేను ఆ వాక్యం చదివి
    మత్తేభం లోనే శ నిషేదమని పొరబడ్డాను !
    పొరబడడం కాదు కంగారు పడ్డాను
    ఎవరికీ (అంటే లాక్షణికులకు కూడా) తెలియని ఈ నిషేధం ఎక్కడిదా యని !

    రిప్లయితొలగించండి
  15. మందాకినిగారూ ! ధన్యవాదములు !
    రక్షించారు !నేను ఆ వాక్యం చదివి
    మత్తేభం లోనే శ నిషేదమని పొరబడ్డాను !
    పొరబడడం కాదు కంగారు పడ్డాను
    ఎవరికీ (అంటే లాక్షణికులకు కూడా) తెలియని ఈ నిషేధం ఎక్కడిదా యని !

    అయినా మమ్మల్ని కంగారు పెట్టడానికి కాకపోతే మీరు
    నిషిద్ధాక్షరి లో శ్ నిషేధమని చెప్పాలి గాని
    మత్తేభంలోనే శ రాకూడదంటే ఎలా ?
    పైగా వేదిక కూడా ఇది కాదు !
    ఏమైనా నా సందేహం తీర్చినందులకు మరీ మరీ ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి