21, ఫిబ్రవరి 2012, మంగళవారం

దత్తపది - 19 (హరి - చక్రి - విష్ణు - రామ)

కవిమిత్రులారా,

"హరి - చక్రి - విష్ణు - రామ"

పై పదాలను ఉపయోగించి

శివస్తుతిని చేస్తూ

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. సర్వ పాప సంఘంబుల సంహరించి
  చెలఁగు నీచక్రియాటోపములను ద్రుంచి
  వెలుఁగుచున్నాఁడ వంతట విష్ణుఁడ వయి
  నన్ను బ్రోవరా మదనారి! నాగహార!

  రిప్లయితొలగించండి
 2. తరలము:
  పరిహరింపుము నాదు శాత్రవవర్గమున్ పరమేశ్వరా!
  సరసిజాసన విష్ణు వాసవ సన్నుతా! త్రిపురాంతకా!
  సరసవాఙ్మయ వైభవప్రద! చక్రిభూషణ! శంకరా!
  హర! ధరాధరనందినీశ! కృపాకరా! మము బ్రోవరా

  (చక్రి = పాము)

  రిప్లయితొలగించండి
 3. శంకరార్యా ! హరి నామములను హరుని లో చక్కగా కలిపారు.

  రారా మదనారి శరణు
  నేరము లెంచకు సలిపితి నీచక్రియలన్
  తీరుగ హరించు వాటిని
  వేరే గతి లేరు విష్ణు వల్లభ నీవే !

  రిప్లయితొలగించండి
 4. ఆనందలహరి యనుచును
  గానంబొనరించి చక్రి గామించిన నిత్
  త్యానందుని, విష్ణు వినతు
  డౌ, నందీశుని భజింపుడా రామమునన్.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ నేమాని వారు విష్ణు నామములను శివ స్తుతి లోనికి చక్కగా ' తరలిం ' చారు.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా గోలి వారూ!
  మీ పద్యము బాగున్నది. అభినందనలు. మీ స్పందన గురించి సంతోషము. మీ పద్యమును మరొక్క చూచి 4వ పాదములో యతిని సరి చేయండి.

  రిప్లయితొలగించండి
 7. నేమాని పండితార్యా మీ పద్యం అద్భుతం.
  గురువుగారూ మీ పద్యం మనోజ్ఞం.

  హరియింపంగను రావె నాదు మదిలో నాటాడు షడ్వైరులన్
  భరియింపంగ నశక్తుడన్ భవలతల్ బంధించె ద్రుంచ క్రియా-
  పరిరంభంబును జూప వేడెద హరా ! బ్రహ్మాదులున్ విష్ణువున్
  మరి సుత్రాములె నిన్ను గొల్తు రనినన్ మర్త్యుండ నేనెంతయా?

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ మీ ప్రయత్నము భావము చాల బాగున్నవి. మత్తేభము 2వ పాదాంతములో గణభంగము కనిపించుచున్నది. ద్రుంచ క్రియా అనేవి 2 వేరువేరు పదములు కాబట్టి చ గురువు కాలేదు. పరిశీలించండి.

  రిప్లయితొలగించండి
 9. అమ్మా మందాకినీ గారూ! అద్భుతము మీ పద్యము - ఆనందలహరిపై ఓలలాడించుచున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. అందమ్ముగ కందమ్మును
  మందాకిని గారు చెప్పి మా హృదయమునా
  నందలహరిపై దేల్చుచు
  విందులనొనరించిరనుచు వినుతింతు బళా!

  రిప్లయితొలగించండి
 11. చక్క దనము లీన చక్రిని శూలిని
  నొక్క రూపు జేసి తిక్క యజ్వ
  విష్ణు రూప శివుని వెలయించి రామాడ్కి
  శ్రీ హరి హరు నాధు చేరి కొలుతు

  రిప్లయితొలగించండి
 12. చాలా సంతోషమండి.
  ఎందరో మహానుభావులీ శంకరాభరణమందున అందంగా పద్యాలు చెప్పుచున్న వారందరికీ వందనములు.

  రిప్లయితొలగించండి
 13. నేమాని పండితార్యా ఇపుడెలా ఉందంటారు?

  హరియింపంగను రావె నాదు మదిలో నాటాడు షడ్వైరులన్
  భరియింపంగ నశక్తుడన్ భవలతల్ బంధించె విష్ణుండవే
  చరియింపంగ భవాజ్ఞ మేరకు సదా స్రష్టాదులున్ చక్రియున్
  స్మరియింపంగను రావదేలను హరా ! మర్త్యుండ నేనెంతరా?

  రిప్లయితొలగించండి
 14. అయ్యా! మిస్సన్న గారూ! అభినందనలు. చతుష్ప్రాసను వేసేరు - మనోహరముగా నున్నది.

  రిప్లయితొలగించండి
 15. హరియింపంగలదెల్ల పాతకములన్ ధ్యానింప పంచాక్షరీ
  వర మంత్రమ్ము ; విరామముం గనక యవ్యాజానురాగమ్ముతో
  జరియింపందగు శైవభక్తి - గన నీశానుండు విష్ణుండె యీ
  శ్వరలింగమ్మును శ్రద్ద్ధ గొల్తునికపై శౌచక్రియా ధోరణిన్ !!!

  రిప్లయితొలగించండి
 16. నేమాని వారికి ధన్యవాదములు.కార్యాలయమునకు వెడలు తొందరలో మార్పులు చేర్పుల వలన జరిగిన దోషము... సవరణ తో...

  రారా మదనారి శరణు
  నేరము లెంచకు సలిపితి నీచక్రియలన్
  తీరుగ హరించు వాటిని
  వేరే గతి లేరు నాకు విష్ణుని సఖుడా !

  రిప్లయితొలగించండి
 17. భక్త సులభుడు రాముడు ముక్తి నియగ
  హరిని సేవించి తరియించ పాప హారము
  చక్రి గొలిచిన తొలగును వక్ర బుద్ధి
  వేరు నామము లెన్నైన విష్ణు మయమె

  రిప్లయితొలగించండి
 18. రెండు రోజులుగా నా నెట్ కనెక్షన్ ఇబ్బంది పెడుతోంది. అందువల్ల మిత్రుల పూరణలపై వెంట వెంటనే స్పందించలేక పోయాను. మన్నించాలి.
  *
  పండిత నేమాని వారూ,
  తరల వృత్తంలో మీ పూరణ సర్వాంగసుందరంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛస్త్రి గారూ,
  కందంలో అందంగా సాగింది మీ పూరణ. అభినందనలు.
  నాల్గవ పాదం `వేరే గతి లేరు విష్ణువినుత! పురారీ!" అని సూచించాలను కున్నాను. ఈలోగా మీరే సవరించారు. బాగుంది.
  *
  మందాకిని గారూ,
  నేమాని వారి ప్రశంసలు పొందింది మీ పూరణ. దానిని మించిన యోగ్యతాపత్రం ఇంకేమి ఉంటుంది. చాలా సంతోషం. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  నేమాని వారి సూచనను అనుసరించి చేసిన సవరణ బాగుంది.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  హరిహరాద్వైతాన్ని తెలిపిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  డా. విష్ణు నందన్ గారూ,
  అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  శివనామం విష్ణుమయమే అంటారు. `శివాయ విష్ణు రూపాయ..." అన్నట్టు. బాగుంది పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఫిబ్రవరి 22, 2012 9:00:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  శూలి చక్రికి బేధము చూప వలదు
  హరిహరాద్వైత తత్వమే హాయి గొలుపు
  రామలింగేశ్వరస్వామి రక్ష మాకు
  విష్ణువల్లభు స్మరణయే విశ్వహితము

  రిప్లయితొలగించండి
 20. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి