26, ఫిబ్రవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 631 (పూజలు నిష్ఫలంబు లవి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

32 కామెంట్‌లు:

  1. గురువుగారు,

    నేను వసంత కిశోర్ గారి బాటపట్టలేదండి. క్లిష్టత లేదని చెప్పటానికి కొంత అహంభావముతో వెంటవెంటనే వ్రాసినవి. మన్నించండి.

    ఆ జలజాక్షి భర్త యెడ నింపుగ వర్తిల నేర్వకున్నచో
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు; పాపహేతువుల్
    మోజులు- తీరెనంచు, పతి మోమును చూడక దైవసేవలో
    జాజులు నెఱ్ఱదామరలు చంపక పుష్పములెన్నితెచ్చినన్.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఆరోగ్య సమస్యలూ , నెట్ సమస్యలతో వారంరోజులనుండీ
    మిత్రుల దర్శనానికి దూరమయ్యాను !

    బడి కెళ్ళకుండా పరీక్షలకు మొక్కులు మొక్కే విద్యార్థులకు :

    01)
    ________________________________________________

    ఓజల పాఠముల్వినక - యూరక కాలము వెళ్ళ బుచ్చుచున్
    భోజన భాజనంబులను - మున్‌గుచు తేలుచు ప్రొద్దు పుచ్చుచున్
    మోజగు యాటలన్మునిగి - మూర్ఖపు బాటలనేగువారికిన్
    పూజలు నిష్ఫలంబు లవి - పుణ్య మొసంగవు పాపహేతువుల్ !
    ________________________________________________
    ఓజ = ఉపాధ్యాయుడు
    ***********

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారి పూరణ మొదటి పాదం యతిని సరిజేయవలెను.

    రిప్లయితొలగించండి
  4. మండోదరి రావణాసురునితో :

    02)
    ________________________________________________

    పూజల నెన్నొ,చేసి , పరి - పూర్ణత లేమిని,పూజ్య భావనల్
    స్త్రీ జన మందు జూపకను - చీకటి గా మవి బట్టి నట్లు గా
    భూజను బట్టిదెచ్చి యిట - భోరున నేడ్వగ జేయు నీకిలన్
    పూజలు నిష్ఫలంబు లవి - పుణ్య మొసంగవు పాపహేతువుల్ !
    ________________________________________________
    చీకటి గాము = రాహువు
    అవి = సూర్యుడు
    భూజ = సీత
    ***********

    రిప్లయితొలగించండి
  5. వసంత మహోదయా పునర్దర్శనం సంతోషాన్నిచ్చింది.

    రిప్లయితొలగించండి
  6. భోజనమైనలేక భువి భూసురులెందరొబాధనుండగా
    రాజునునేనటంచునిక రంగుల హంగుల పూజచేసినన్
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు; పాపహేతువుల్
    రాజస తామసంబులును,రాముని చేరును సాత్త్వికాత్ముడే.

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్నగారు,
    ధన్యవాదాలు.
    మొదట ఏ అని వ్రాసి మళ్ళీ మార్చాను.
    ఏ జలజాక్షి భర్త యెడ నింపుగ వర్తిల నేర్వకున్నచో
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు; పాపహేతువుల్
    మోజులు- తీరెనంచు, పతి మోమును చూడక దైవసేవలో
    జాజులు నెఱ్ఱదామరలు చంపక పుష్పములెన్నితెచ్చినన్.

    రిప్లయితొలగించండి
  8. సాజము చిత్తవృత్తికి నసాధ్యము దానిని నిల్పుటొక్కెడన్
    యేజటధారి కైన నని యిష్టము వచ్చిన రీతి డెంద ము--
    న్నే జలజాక్షి పైననొ మరే పర విత్తము పైనొ నిల్పినన్
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న మహాశయా ! నాక్కూడా ! మహదానందముగా నున్నది !
    మిత్రులను కలుసు కోవడం !

    రిప్లయితొలగించండి
  10. ఏజగదీశు డింకొకడు యెవ్వడు దైవము విష్ణు వెవ్వడౌ
    నేజలజాత సంభవుని కెవ్వడు నాయన యెవ్వ డందు వా
    హే జనకా ప్రపంచమున కీశుడు శ్రీహరి కానివారికిన్
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  11. ఈ జగ దేక వీరుడగు నీ దనుజాధిపు డుండ దైవమై
    ఆ జలజాత సంభవుని కయ్యను దేవుడటంచు మ్రొక్కు నీ
    నైజము మారదేమి సుత నమ్ముము దైత్యుల కన్య దైవపుం
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  12. చిత్తం శివుని మీద లేకుండా :

    03)
    ________________________________________________

    యాజక మెక్కినన్ , ఘనత - యాజుల నెన్నియొ జేసి యుండినన్
    తేజము హెచ్చ, మేటి యగు - తేజుల నెన్నిటి నెక్కి యుండినన్
    ఆజుల గెల్చినన్ , మనసు - నా, పరమాత్ముని పైన నిల్పకన్
    పూజలు నిష్ఫలంబు లవి - పుణ్య మొసంగవు పాప హేతువుల్ !
    ________________________________________________
    యాజకము = ఏనుగు
    యాజి = యాగము
    తేజి = గుఱ్ఱము
    ఆజి = యుద్ధము
    ***********

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుబ్యోనమ:

    ఈ జగమంతనేలుటకు నిచ్చ గలంగగనెందరెందరో
    రాజులరాజ్యకాంక్షలకు రాలిన సైనికరక్తధారలన్
    మోజుగ గ్రోలుచున్ జనుల మోసముజేయుచు క్షుద్రశక్తికిన్
    పూజలు నిష్ఫలంబులవి పుణ్యమొసంగవు, పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  14. ఈ జగమంత నొక్కటిగ నెంచక , మానవులందు భేదముల్
    రాజిల జేయు దుష్టుడ ! ధరాతల మందున సాయి వంటి మా
    రాజుల బోధనల్ వినుము , రాజిత ధర్మము వీడి చేయు నీ
    పూజలు నిష్ఫలంబు , లవి పుణ్య మొసంగవు , పాప హేతువుల్

    రిప్లయితొలగించండి
  15. రాజసమొందఁ గోరి నడి రాతిరి వేళ భయంబు లేకయే
    గాజులు చీరయున్ తొడిగి కాటికి వెళ్లి శవంబె పీటగన్
    పూజలు సేసినన్ ఫలము పూజ్యము కాదె? స్మశానమందునన్
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్!!

    రిప్లయితొలగించండి
  16. ఈ జననంబు ధన్యము, మహీతలమందున మోక్షప్రాప్తి సం
    యోజనకారకంబు, ధన యోగమె మేటియటంచు మీదు, ఈ
    ర్ష్యా జవమందునొండొరుల రక్తము గాంచెడునట్టి క్షుద్రమౌ
    పూజలు నిష్ఫలంబులవి పుణ్యమొసంగవు, పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  17. ప్రవరుడు:

    ఓ జగదేక సుందరి దురూహల మానుము నేను విప్రుడన్
    నా జననీ పితాదులను నాదగు పత్నిని నాదు ధర్మమున్
    రాజిలు నీదు కోర్కెకు కరంగి పణమ్ముగ బెట్టితేని నా
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్!!

    రిప్లయితొలగించండి
  18. ఈ జగమెల్ల నేల గల వింద్రుడు సిగ్గిలు వైభవమ్మునన్
    రాజిలి తెల్ల లోకముల రావణ శంభు వర ప్రసాదివై
    యా జగదేక పావనిని యంటి నశించుటదేల వద్దు నీ
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్!!

    రిప్లయితొలగించండి
  19. నా మొదటి పూరణ మొదటి పాదం ఇలా ఉంటే వాక్యనిర్మాణం అర్థవంతంగా ఉంటుందనుకుంటాను.

    ఏ జలజాక్షి యైన పతి కించుక గౌరవమీయకున్నచో
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు; పాపహేతువుల్
    మోజులు- తీరెనంచు, పతి మోమును చూడక దైవసేవలో
    జాజులు నెఱ్ఱదామరలు చంపక పుష్పములెన్నితెచ్చినన్.

    రిప్లయితొలగించండి
  20. చక్కని పూరణలు చేయుచున్న కవి మిత్రులందరకు అభినందనలు.

    బూజులు దుల్పకన్ గడప ముంగిట మ్రుగ్గులు తీర్చ బోకనే
    భోజన శాలనే తుడిచి బుద్దిగ పీఠము వేయ కుండనే
    భూజను లార చిత్తమున బోలెడు కోరుచు జేయ లక్ష్మికిన్
    పూజలు, నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  21. హనుమచ్ఛాస్త్రి గారు,
    అసలు ప్రాథమికమైన విషయాన్ని ప్రస్తావించారు. బాగుంది. అభినందనలు. అన్ని పూరణలూ చక్కగా ఉన్నాయి. మిత్రులందరికీ అభినందనలు.

    భోజన శాల పూజ కాకుండానే అడ్డురావటం ఎందుకు? దానికి బదులుగా పూజకు నింటినిన్ అనవచ్చేమో.
    బోలెడు పదం పద్యాల్లో వస్తుందా అనేది అనుమానమే. దానికి బదులుగా పుణ్యము అంటే అన్వయము సరిగ్గా సరిపోతుందేమో.

    రిప్లయితొలగించండి
  22. మందాకిని గారూ! చక్కని సవరణకు ధన్యవాదములు.
    భోజన శాలలోగత రాత్రి ఎంగిళ్ళు ఎత్త కుండా... అని నాభావం. అయినా చిన్న సవరణ చేయు చున్నాను.

    బూజులు దుల్పకన్ గడప ముంగిట మ్రుగ్గులు తీర్చ బోకనే
    పూజకు శ్రద్ధ లేక మరి బుద్దిగ పీఠము వేయ కుండనే
    భూజను లార! ఎప్పుడిక భోజన మంచును జేయ లక్ష్మికిన్
    పూజలు, నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.

    రిప్లయితొలగించండి
  23. హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో ;

    వ్యాజము నారితేరి మన వంశజు లందఱి మట్టు బెట్టు దా
    నాజికి వెన్నుఁ జూపు వెను కాడును గంటికి గోచరింప నే
    యోజము లేని వాడు మన యొజ్జయ ? దైవమ ? కొల్వ శ్రీహరిన్
    బూజలు నిష్ఫలమ్ము లవి పుణ్య మొసంగవు పాప హేతువుల్ !

    రిప్లయితొలగించండి
  24. పూజలు నిష్ఫలంబు లవి పుణ్యమొసంగవు పాప హేతువుల్
    పూజలు మానుడీ యనుచు మూర్ఖులు నన్య మత ప్రచారకుల్
    వ్యాజమునూని చాటినను పాపపు గాలములందు చిక్కకే
    భూజనులార! భక్తిమెయి పూజలొనర్చి శుభమ్ములొందుడీ

    రిప్లయితొలగించండి
  25. విశ్వామిత్రుని స్వగతం.

    లేజవరాలి సోయగము లేపెను కోర్కుల నా యెడంద లో
    మోజును తీర్చుకొంటి, కట! మోహపు వాంఛల తీరు లిట్టులౌ
    నా జపమున్ తపమ్ము మరి నా యమ నీమము లన్ని యజ్ఞముల్
    పూజలు నిష్ఫలమ్ము, లవి పుణ్య మొసంగవు పాప హేతువుల్ !

    రిప్లయితొలగించండి
  26. గురువర్యులు శ్రీపండిత నేమాని వారికి నమస్సులు. గురువుగారి పూరణ సమయోచితమై కనువిప్పు కలిగించేలా అద్భుతంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  27. తేజము ప్రజ్వరిల్లగను ధారుణి నేలెడు భూసురోత్తమా
    లేజవరాలి కోర్కెనిటు లేశము మాత్రము నిచ్చగించకన్
    రాజిలు నీదు తేజమున రంజిల జేయక యజ్ఞకోటులం
    పూజలు నిష్పలంబులవి పుణ్య మొసంగవు పాపహేతువుల్ !

    రిప్లయితొలగించండి
  28. తే కు, ధా కు యతి కుదరదు కదండీ, ధీరత చూపెడు అంటే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  29. ఇంకా నా నెట్ సమస్యకు పరిష్కారం దొరకలేదు, కొద్దిరోజులుగా ఉదయం కొద్ది సమయం తమ నెట్ ను వినియోగించుకొనడానికి అనుమతిస్తున్న చి. రతన్ కుమార్ కు ధన్యవాదాలు. సమయాభావం వలన నిన్నటి పూరణలను విడివిడిగా ప్రస్తావించలేకున్నాను.
    *
    పూరణలను పంపి, మిత్రుల పూరణల గుణదోషాలను పరామర్శిస్తున్న అందరికీ ధన్యవాదాలు.
    మనోహరమైన పూరణలను పంపిన .....
    మందాకిని గారికి,
    వసంత కిశోర్ గారికి,
    మిస్సన్న గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    లక్కాకుల వెంకట రాజారావు గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు (ముఖ్యంగా నిర్దోషంగా వృత్త రచన చేసినందుకు)
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీరు ఒక వ్యాఖ్యను తొలిగించారు కదా. అలా వ్యాఖ్యలను ఎలా తొలగించ గలిగారో మన మిత్రులకు వివరించండి.

    రిప్లయితొలగించండి
  30. గురువు గారూ ధన్యవాదములు. కంటికిఁ గోచరింప అని అరసున్న అనవసరముగా చేర్చడము వలన ముందు వ్యాఖ్యని తొలగించాను. సరళ స్థిరములకు ముందున్న ద్రుతమునకు బిందు రూపము రాదు కదా ! వ్యాఖ్య తరువాత చిన్న చెత్త బుట్ట కనిపిస్తే దానిపై సూచికను నిలిపి నొక్కుతే వ్యాఖ్య తొలగించాలా అనే పుట కనిపిస్తుంది. దానిపై సూచిక నిలిపి నొక్కి వ్యాఖ్య తొలగించ వచ్చు.

    సమయా భేదము వలన రాత్రిం బవళ్ళకు యింకా శరీరము పూర్తిగా అలవడ లేదు. అర్ధ రాత్రి తెలివి వచ్చి విశాఖా,భాగ్యనగరమా, హ్యూగోవా లేక డాలస్సా అనే అనుమానము కలుగుతోంది. మరి అరసున్నాలలో అనుమానము రాక పోతుందా ?

    రిప్లయితొలగించండి
  31. రోజుకు పాతికౌ గుడుల రొప్పుచు రోజుచు బంతిపూవులున్
    జాజులు చేతబూనుచును జంద్యము నూనుచు వోట్లకోసమై
    మోజున రాహులిండిలను మోహము మీరను చేసినట్టివౌ
    పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్

    రిప్లయితొలగించండి