18, ఫిబ్రవరి 2012, శనివారం

సమస్యాపూరణం - 624 (శాంతచిత్తుఁడు కుపితుఁడై)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.

31 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    పరీక్షిత్తును శపించిన శృంగి :
    01)
    ___________________________________

    సర్పమును తండ్రి మెడమీద - జాలిమాలి
    సార్వ భౌముండు వైచిన - నోర్వలేక
    శాంతచిత్తుఁడు కుపితుఁడై - శాప మొసఁగె
    " సర్ప క్షతమున మరణించు -శరణు లేక " !
    ___________________________________
    శరణు = రక్షణ

    రిప్లయితొలగించండి
  2. ముగురు మూర్తుల జూడగా భ్రుగువు వెడలె
    భవుడు బ్రహ్మయు తనరాక పట్ట కుండ
    నుండ కలతను జెందుచు నోప లేక
    శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.

    రిప్లయితొలగించండి
  3. తపమునన్ మగ్న చిత్తుడౌ తండ్రి మెడను
    మృత భుజంగము గాంచిన సుతుడు శృంగి
    నిగ్రహమ్మును గోల్పోయె నుగ్రుడయె న-
    శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.

    రిప్లయితొలగించండి
  4. టైపాటు సవరణ తో...

    ముగురు మూర్తుల జూడగా భృగువు వెడలె
    భవుడు బ్రహ్మయు తనరాక పట్ట కుండ
    నుండ కలతను జెందుచు నోప లేక
    శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుభ్యోనమ:

    సీత యొడిలోన దలవాల్చి సేదదీర
    రామభద్రుండు నిదురింప రాక్షసుండు
    కాకి రూపము దాల్చుచు గాయపరుచ
    శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    కోడి రూపము దాల్చుచు కొక్కరోకొ
    యనుచు నింద్రుడు కూయగా నాత్ర ముగను
    సంధ్య వార్చగ కాదది సమయమనుచు
    శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె

    రిప్లయితొలగించండి
  7. కామవాంఛలు ప్రబలస్వర్గమ్మువీడి
    దశశతాక్షుండహల్యకై తరలివచ్చె,
    కలుష కార్యంబు కన్నట్టి గౌతముడు, ప్ర
    శాంతచిత్తుడు, కుపితుడై శాపమొసగె.

    రిప్లయితొలగించండి
  8. కామవాంఛలు ప్రబల స్వర్గమ్మువీడి
    దశశతాక్షుండహల్యకై తరలివచ్చె,
    కలుష కార్యంబు కన్నట్టి గౌతముడు, ప్ర
    శాంతచిత్తుడు, కుపితుడై శాపమొసగె.

    రిప్లయితొలగించండి
  9. కోడి కూతన గౌతముండ డవి కేగ
    మారు వేషంబు నొందియు మరుత విభుడు
    పొంద కామాన నాహల్య బొందు చేర
    శాంత చిత్తుడు కుపితుడై శాప మొసగె .

    రిప్లయితొలగించండి
  10. పూని " యుమ " మహేశ్వరునికి పూజ చేయ
    మరుల విరితూపు సంధించె మదను డపుడు
    చలన మెరుగని మానస మలలు రేగి
    శాంత చిత్తుండు కుపితుడై శాప మొసగె

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అప్పటికి అతడు దశశతాక్షుండు కాడేమో!

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ, మీ పద్యం లో మొదటి పాదం లో యతి ఒప్పలేదు.

    రిప్లయితొలగించండి
  13. నేతి బీరకాయలలోని నేయి యట్లు
    నిగమశర్మయునున్ గుణనిధియునట్లు
    పేళ్ళు వ్యతిరేక భావాన వెలయు రీతి
    శాంతచిత్తుడు కుపితుడై శాపమొసగె

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాతగారూ, నిజమే మీరన్నది. కానీ ఆ సందర్భములోనే కదా ఇంద్రునికి ఆ పేరు వచ్చినది. అందుకే కావాలనే అలా వ్రాసినాను. మార్చాలనుకుంటే........

    దైవతవిభుండహల్యకై ........ అంటే సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    భ్రుగువు అని మీరు వాడేరు అది తప్పు. భృగువు (ఒప్పు). కాస్త పద్యమును సరిచేయండి.

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాతగారూ, నిజమే మీరన్నది. కానీ ఆ సందర్భములోనే కదా ఇంద్రునికి ఆ పేరు వచ్చినది. అందుకే కావాలనే అలా వ్రాసినాను. మార్చాలనుకుంటే........

    దైవతవిభుండహల్యకై ........ అంటే సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా శ్రీ వసంత కిశోర్ గారూ!
    సర్ప క్షతమున అని వాడినప్పుడు క్ష వలన ఆ ముందరి ర్ప గురువు అయినది. కాస్త సవరించాలి ఆ ప్రయోగమును.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! హనుమఛాస్త్రి గారూ! మీ టైపాటును, సవరణను చూచేను. నేను కూడా తొందర పడ్డాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా శ్రీ శ్యామలరావు గారూ!
    క్ష సంయుక్తాక్షరమా?
    క్ష సంయుక్తాక్షరమే. సంస్కృతములోని 50 వర్ణములలో గాని అచ్చ తెనుగున కున్న 37 వర్ణములలో గాని క్ష అనే వర్ణము లేదు. సౌలభ్యము కొరకు క్ష అనే సంయుక్తాక్షరమునకు సంజ్ఞను మన వర్ణమాలలలో ప్రత్యేకముగా చెప్పుచున్నను అది ప్రత్యేకమైన వర్ణము గాని శబ్దముగాని సంజ్ఞగాని కాదు. క ష ల సంయోగమే క్ష. తెలుగులోని క్ష యొక్క సంజ్ఞ కూడా లిపిలో క ష ల సంయోగమే. హిందీ భాషలోనే క్ష, త్ర, జ్ఞ లకు ప్రత్యేక సంజ్ఞలు ఉన్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నేమాని వారికి ధన్యవాదములతో :

    పరీక్షిత్తును శపించిన శృంగి :
    01అ)
    ___________________________________

    సర్పమును తండ్రి మెడమీద - జాలిమాలి
    సార్వ భౌముండు వైచిన - నోర్వలేక
    శాంతచిత్తుఁడు కుపితుఁడై - శాప మొసఁగె
    " సర్ప ఘాతము మరణించు -శరణు లేక " !
    ___________________________________
    శరణు = రక్షణ

    రిప్లయితొలగించండి
  21. అయ్యా ! ఆంధ్రభారతి నిఘంటువు లో
    యే పదము type చేసినా అక్కడ windowలో
    type చెయ్యబడడం లేదు
    యేతావాతా అది పని చెయ్యడం లేదు !
    ఈ సమస్య నాకేనా ? అందరికీ నా ?

    రిప్లయితొలగించండి
  22. నిన్న టీశ్వర స్తుతుల మిస్సన్నగారి,
    శ్రీ వసంతుల , శ్యామల రావు గార్ల ,
    తక్కుగల కవిమిత్ర పద్యాలు జదువ
    మరుపు నకు రావు ‘ శంకరాభరణ ‘ మహిమ

    రిప్లయితొలగించండి
  23. మీరు తక్కువ తినినారె మిత్ర రాజ
    జనన మరణాల మర్మము చక్కగాను
    శివుని స్తుతిలోన నిమిడించి కవిత జెప్పి
    మాదు మనముల దోచరే మాననీయ?

    రిప్లయితొలగించండి
  24. వసంత మహోదయా నాకైతే ఆంద్ర నిఘంటువు బాగానే పనిచేస్తోంది.

    రిప్లయితొలగించండి
  25. నేమానివారికి
    ఈ 'క్ష' అనేది సంయుక్తాక్షరమేనని నిష్కర్ష చేసినందుకు ధన్యవాదాలు.

    వసంత కిశోర్ గారికి
    మీ రన్నది నిజమే. ఒక్కొక సారి ఆంధ్రభారతి నిఘంటువు మొరాయిస్తుంది. పేజీని రీ-లోడ్ చేస్తే సరిపోతుంది. నేను గమనించినంత వరకు చాలా సేపు వాడకుండా వదిలేస్తేనే ఈ పేజీలో సమస్య వస్తున్నది.

    రిప్లయితొలగించండి
  26. అటమటమ్మున నిందీవరాక్షు డొక్క
    మునిని శాంబరీవిద్యచే మోసగించి
    ఎక్కసెక్కెంబులాడగా నింక విసివి
    శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె

    రిప్లయితొలగించండి
  27. అయ్యా! మిస్సన్న గారూ!
    "దుగాగమ సంధిని" నీ, నా, తనలకే పరిమితము చేయండి. మాదు అని వాడేరు ఒక పద్యములో. ఆ పాదాన్ని ఈ విధముగ సరిజేస్తే మంచిది."మా మనమ్ముల దోచరే మాననీయ!".

    రిప్లయితొలగించండి
  28. నేమాని పండితార్యా సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. వసంత కిశోర్ గారూ,
    పరీక్షిత్తు శాపగ్రస్తుడైన సందర్భాన్ని వినియోగించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘సర్పఘాతము’ అని సవరించిన దానిని ‘సర్పఘాతియై’ అంటే ఎలా ఉంటుందంటారు?
    ‘ఆంధ్రభారతి’ నాకైతే ఇబ్బంది లేకుండా తెరుచుకుంటున్నది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీరూ వసంత కిశోర్ గారు చెప్పిన వృత్తాంతాన్నే స్వీకరించినా పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    రాజారావు గారిని ప్రశంసించిన మీ పద్యం సుందరంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    కాకాసుర వృత్తాంతంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అహల్యా శాపవృత్తాంతంతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    అజ్ఞాత గారి వ్యాఖ్యలో వాస్తవం ఉంది. సవరించినందుకు ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరూ అహల్యా శాపవృత్తాంతాన్నే స్వీకరించారు. బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలోని యతిదోషాన్ని ఇలా సవరిస్తున్నాను ‘కోడి కూయ గౌతము డిలు వీడి యేగ’.
    ‘ఆహల్య’ అన్నారు. ‘కామమున నహల్య’ అంటే బాగుంటుందేమో?
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    కామదహన వృత్తాంతంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని శివుడు మన్మథుని దహించాడే కాని శపించలేదు కదా!
    శివస్తోత్ర పద్యాలు చెప్పిన కవిమిత్రులను ప్రశంసించిన మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
    ‘నిన్నటి + ఈశ్వర’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘నిన్న యీశ్వర’ అన్నా సరిపోతుంది కదా!
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    శ్యామలీయం గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    పెద్దన గారి ‘అటమటమ్మున విద్య గొనుటయుం గాక గుటగుటలు గురువుతోనా యని కటకటంబడి’ వచనం గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. శంకరయ్యగారూ
    ధన్యవాదాలండీ.
    అనుకోకుండా మనుచరిత్రంలో మాటలతోనే పద్యం వచ్చేసినట్లుంది!
    బాగా గుర్తుచేసారు.

    రిప్లయితొలగించండి
  31. ఆంధ్రభారతి ఇబ్బంది లేకుండా తెరుచుకుంటున్నది IE లో !
    కాని ఇబ్బందంతా OPERA లోనే !

    రిప్లయితొలగించండి