22, ఫిబ్రవరి 2012, బుధవారం

సమస్యాపూరణం - 627 (పరదారేషణము మేలు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పరదారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్.

19 కామెంట్‌లు:

  1. కరమును పట్టిన చో శుభ
    కరముగ బ్రతుకంత జంట కలిసుండ వలెన్
    పరువుగ జీవించుచు చూ
    పర ! దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  2. నరులకు చేటగు నెప్పుడు
    పరదారేషణము; మేలు ప్రాజ్ఞుల కెల్లన్
    వరపుత్రేషణ మెన్నగ
    పరవిత్తేషణము పాపపంకిలమేరా!

    రిప్లయితొలగించండి
  3. వరవంశ జననము , మనో
    హర రూపము , గుణ గణమ్ము లమరు మనో సౌంద
    ర్య రమాన్విత శుభలక్షణా
    పర – దారేషణము మేలు ప్రాఙ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  4. అరయగ చతురాశ్రమముల,
    పరులకు దానంబు, ధర్మ వర్తనములచే
    ధరణిన్ వెల్గునుగా,గొ
    ప్పర! దారేషణము మేలు ప్రాజ్ఞులకెల్లన్.

    చర్తురాశ్రమములలో గృహస్తాశ్రమము మంచిదని చెప్తారు కదా ( సన్యాసము ఉత్కృష్టమైనదిలెండి )!! ఆ ఉద్దేశ్యముతో వ్రాశాను.

    దారేషణము = గృహస్తు అనే అర్థములో.......

    రిప్లయితొలగించండి
  5. సవరణతో,

    వరవంశ జననము , మనో
    హర రూపము , గుణ గణమ్ము లమరు మనో మం
    దిరము , సకల శుభలక్షణా
    పర – దారేషణము మేలు ప్రాఙ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  6. లోపాలు చూపినందుకు కృతజ్ఞతలు.
    నెట్ డిస్కనెక్ట్ అయినందువలన వెంటనే ప్రతిస్పందించలేకపోయాను.
    మన్నించండి.

    గురువు గారు,
    పై పూరణకు బదులుగా మరొకపూరణ

    మంచియు మర్యాద విడిచి
    యించుక నింగితము వీడిరిక నేమగునో,
    కంచెయె చేనును మేసిన
    వంచన రీతి తమ పల్కు వలదను పల్కుల్.

    శ్యామలీయం గారు,
    తెలుగుతల్లి మీద దండకం ఎప్పుడూ చదవలేదు.
    చాలా బాగా వ్రాశారు. అభినందనలు మీకు.

    రిప్లయితొలగించండి
  7. సురలకు నైనను కీడగు
    పరదారేషణము, మేలు ప్రాఙ్ఞుల కెల్లన్
    నరులకు మరియు సురులకున
    సురలకు నిజదారతోడ శుభములు కలుగున్.

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారు,
    తెలుగు తల్లి దండకం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ఇది చాలా చిన్న దండకం. తెలుగు తల్లిని ప్రస్తుతిస్తూ ఇంతకు ముందేమయినా దండకాలున్నాయేమో తెలియదు. ఉండే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  9. కం. ఉరక నుపరిస్న్యాసము
    నిరయకరం బనుచు బుధ్ధి నెఱిగి విషయముల్
    విరియం ధర్మార్థము దయా
    పర దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  10. అక్షరదోషం మొదటిపాదంలో. సరి జేసిన పధ్యం:
    కం. ఉరక నుపరి సన్యాసము
    నిరయకరం బనుచు బుధ్ధి నెఱిగి విషయముల్
    విరియం ధర్మార్థము దయా
    పర దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  11. సరిసరి రమ్మిక రంభా
    విరిబోడుల రావణుండు విడువడు నలకూ-
    బరు డేల చాలు నీతులు
    పర దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఫిబ్రవరి 22, 2012 9:30:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    మహాశివరాత్రి పర్వదినమున కవిపండితుల పద్యములు సుధారసధారలు కురిపించుచున్నవి. అందరికి అభినందనలు. పద్యముల ద్వారా పరమేశ్వరుని స్మరణ చేయించిన మీ అందరికి ధన్యవాదములు. నాడు నాలో కలిగిన భావమును నేడు వినిపిస్తున్నాను. (గురువుగారూ యడాగమము .......మన్నింపగలరు)

    స్థిరుడవు నీవు స్థాణుడవు శ్రీకర శేఖర చంద్రశేఖరా
    హరిహృదయాంతరంగుడవు యాది యనాదియులేనివాడవున్
    శరణమటంచు మ్రొక్కెదను శంకర కావర భక్తవత్సలా
    పరహితమొప్పు కార్యములు పాయక జేయ ననుగ్రహింపుమా

    రిప్లయితొలగించండి
  13. సురలకు పరదారల మది
    నరులకు నియమంబులెన్నొ నౌరా యనగా !
    పొరబడిన పెండ్లి కన్నను
    పరదారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్ !

    రిప్లయితొలగించండి
  14. పొరబడుచు ముద్దు గుమ్మని
    పరికింపక ముదిత మదిని పరిణయ మాడన్ !
    వెఱగు పడి తరచి చూడగ
    పరదారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్ !

    రిప్లయితొలగించండి
  15. శ్రీగురుభ్యోనమ:

    సరికాదుర లంకేశ్వర
    పర దారేషణము, మేలు ప్రాజ్ఞుల కెల్లన్
    హరినామస్మరణంబే
    పరికింపగ ననుచు పల్కె పవనసుతుండున్

    రిప్లయితొలగించండి
  16. దరహాస శోభితాస్యయు
    సరస గుణాన్వితయు సకల శోభాఢ్యయు సుం
    దర రూపయు, సేవా త
    త్పర దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  17. నేమని పండితార్యా చక్కగా అతికినట్లు మనోజ్ఞమైన పూరననిచ్చారు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులారా,
    నా నెట్ కనెక్షన్ సమస్య ఇంకా పరిష్కరింపబడలేదు. పొరుగింటివాళ్ళు ఉదయం కాసేపు వాళ్ళ నెట్ వినియోగించుకొనడానికి అవకాశం ఇస్తున్నారు. అందువల్ల చమత్కార పద్యాలు కాని, మీ వ్యాఖ్యలకు వెంట వెంట స్పందనలను కాని ప్రకటించలేక పోతున్నాను. మరో రెండు రోజులు ఈ సమస్య ఉండవచ్చు.
    దయచేసి పూరణల పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేను ఊహించని విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    `కలిసి + ఉండవలెన్" అన్నప్పుడు సంధి లేదు. దానిని `కలిసి మనవలెన్" అని సవరిద్దాం.
    *
    మన తెలుగు చంద్ర శేఖర్ గారూ,
    చక్కని విరుపుతో ఈషణత్రయాన్ని ఇమిడించారు మీ పూరణలో. ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో `లక్షణా' అన్నచోట గణభంగం జరిగింది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    పై పూరణకు బదులు... అన్నారు. పైన ఏ పూరణ లేదుకదా! ఈ `మంచియు మర్యాద...." పద్యం దేనికి సంబంధించిందో అర్థం కాలేదు.
    ప్రస్తుత సమస్యకు మీ పూరణ చక్కని విరుపుతో బాగుంది. అభినందనలు.
    *
    శ్యామలీయం గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. `ధర్మార్థము" లోని ముప్రత్యయాన్ని తొలగిస్తే సరిపోతుందనుకుంటా.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని నడకతో బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ శంకర స్తుతి మనోహరంగా ఉంది. అభినందనలు.
    `హరిహృదయాంతరంగుడ వనాదియు నాదియులేనివాడవున్" అంటే యడాగమ దోషం పోతుంది కదా!
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అత్యుత్తమైన పూరణ అందించారు. ధన్యవాదాలు.
    *
    కవి మిత్రులారా,
    పునర్దర్శనం రేపు ఉదయమే. సెలవు.

    రిప్లయితొలగించండి
  19. సరియౌ నిల్లరికమ్మున
    కరముల్ జోడించి మ్రొక్కి కాపాడుమనన్
    వరముల్ "బంపర"నిడు "సూ
    పర" దారేషణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్

    రిప్లయితొలగించండి