23, ఫిబ్రవరి 2012, గురువారం

సమస్యాపూరణం - 628 (పతిని హింసించు కాంతయే)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.

23 కామెంట్‌లు:

  1. పతి బ్లాగ్ లోకమున
    గతి తెలియక మునిగి ఉండగ
    కొంటె కామెంట్లతో జిలేబీ అయి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ధనకనకముల కొఱకును ధరను తనదు
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి
    యనుచు పొగడుట! యది పాడి యగునె? పతిని
    కష్ట పెట్టని గుణవతి కాంత సాధ్వి

    రిప్లయితొలగించండి
  3. స్వార్థ గుణములున్న వనిత జంకు లేక
    పతిని హింసించు; కాంతయే పరమ సాధ్వి
    యగుచు పతిదేవు సేవించి, యాతని మది
    పొంగ, సర్వ సౌఖ్యంబుల పొందగలదు.

    రిప్లయితొలగించండి
  4. ఔర! గయ్యాళి యనబడు ననవరతము
    పతిని హింసించు కాంతయే, పరమ సాధ్వి
    సకల సద్గుణ శీలయై సహనమెసగ
    పతికి ననుకూలవతియయి పరగుచుండు

    రిప్లయితొలగించండి
  5. పట్టమేలు రాజువయిన పట్టుమిపుడు
    ననుచు రయమున పరుగిడి అగ్ని లోన
    దూకి మానసికంబుగ దుష్టుడగు నృ
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి!!

    రిప్లయితొలగించండి
  6. మారె లోకమ్ము మహిళలో మార్పు వచ్చె
    సతియు పతియును నన్నిట సములు నేడు
    తమ్ముడా ! నోరు జాగ్రత్త ! తాట తీసి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  7. ఈ మధ్య కొన్ని పెళ్ళిళ్ళు జరిగిన పధ్ధతి, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నలు అడిగిన వైనం చూస్తే దిమ్మ తిరిగింది. అదే నా పూరణకి స్ఫూర్తి.
    సాప్టువేరుల పెళ్ళిళ్ళు జరుగు రీతిఁ
    ప్లాటు ఫారము ప్యాకేజి పట్టి చూచి
    పెళ్లి చేసుక, ప్యాకేజు పెంచు కొనని
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి!!
    మనవి: సందర్భాన్ని బట్టి ఆంగ్ల పదములు, పునరుక్తి తప్పలేదు.

    రిప్లయితొలగించండి
  8. పరమ గయ్యాళి యనబడు ప్రజల చేత
    పతిని హింసించు కాంతయే, పరమ సాధ్వి
    భర్త వాక్కుల బాటించి భక్తి తోడ
    ఘనత కెక్కును భువిలోన వినుము నిజము.

    రిప్లయితొలగించండి
  9. నిజపతికి మేలు గోరియనేక మార్లు
    స్త్రోత్రపాఠాలు జదువుచు రోజురోజు
    పట్టు వదలక చెవినిల్లు గట్టి లోక
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి!

    రిప్లయితొలగించండి
  10. పరిపరివిధములన్వేడి, పతికి తిరిగి
    ప్రాణమునువోయునట్టుల పలుకు జార,
    స్త్రీసహజగుణంబులనుదక్షిణదిశాధి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి!

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందరికీ నమస్కారం. పద్యాలు పసందుగా వస్తునాయి.

    రిప్లయితొలగించండి
  12. పతిని దైవముగా నెంచు పడతి సాధ్వి
    పతిని యెడబాయ నోపని పడతి సాధ్వి
    పతియె లోకముగా మను పడతి సాధ్వి
    పతిని హింసించు కాంత యే పరమ సాధ్వి?

    రిప్లయితొలగించండి
  13. పతి గతిని జూచి వైదర్భి పలికెనిట్లు
    అకట మునికిడె నాథుని యామె సత్య
    బానిసను జేసి నవ్వుల పాలు జేసి
    పతిని హింసించు కాంత యే పరమ సాధ్వి?

    రిప్లయితొలగించండి
  14. అలిగి ప్రణయంపు కలహాన పలుక రాక
    కొంటె భావమ్ము మదిలోన కొసరె గాన
    కడకు కవ్వించి మురిపింఛి జడను విసరి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి . !

    రిప్లయితొలగించండి
  15. డి.నిరంజన్ కుమార్గురువారం, ఫిబ్రవరి 23, 2012 7:36:00 PM

    పతియె ప్రత్యక్ష దైవమ్ము అతివ కెపుడు
    అన్న నానుడి కాలమ్ము అంతరించె
    నింద జేయుచు నిరతమ్ము నీచపరచి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  16. సత్య భామను బోలిన నిత్య భార్య
    ధనము నందున ముంచిన ఘనము గాను
    కలియు గమ్మున నిలచిన కలికి మహిమ
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి .!

    రిప్లయితొలగించండి
  17. డి.నిరంజన్ కుమార్గురువారం, ఫిబ్రవరి 23, 2012 8:11:00 PM

    రాము మాటను బాటించి రమణి సీత
    అగ్ని దూకిన దానాడు నచ్చముగను
    కాని యీనాడు నాతీరు గరళమనుచు
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  18. ఆటవెలదులఁ దాఁజూచు నదనునీక
    తేటగీతుల ప్రేముడి తెల్లజేసి
    కలుగ నెడము- గతజ్ఞాపకముల వలన
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  19. వలదు పద్యములు,వలదు వ్యాఖ్యలున్ను
    వలదు రాని ఛందమ్ములు వ్యాకరణము
    వలదు నడిరేయి విహరణ వలను* యనచు
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి!!!

    (*వలను = net=internet)

    రిప్లయితొలగించండి
  20. సత్యవంతుని ప్రాణాల సంగ్రహించి
    వెడలు సమవర్తి వలదన్న వెంటబడుచు -
    ''నా పతికి నాయు విడు''మంచు, నరక లోక
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  21. జిలేబీ గారూ,
    మీ భావానికి ఇదిగో నా పద్యరూపం.....

    పతియె బ్లాగులోకమ్మున గతి తెలియక
    మునిగియుండ జిలేబియై ముద్దు లొలుక
    కొంటె కామెంట్లతో సదా వెంట నంటి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    హైదరాబాదు వచ్చి బంధు మిత్రులను కలవడంలో వ్యస్తులై కూడా `శంకరాభరణానికి" సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.
    మీ పూరణ ఎప్పటిలాగే ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    కన్యక వృత్తాంతాన్ని ప్రస్తావించిన మీ పూరణ సర్వ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్ర శేఖర్ గారూ,
    మీ `ప్యాకేజీ" పూరణ చమత్కారపూరితమై అలరిస్తున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్యామలీయం గారూ,
    `లోకపతిని హింసించడమా? బాగుంది. అద్భుతమైన పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    `దక్షిణ దిశాధిపతి" ప్రయోగం బాగుంది. చక్కని పూరణ.
    మీ మిగిలిన రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    ప్రశ్నార్థకంగా ఉన్న మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని శృంగార భావాన్ని ఒలికించిన మీ పూరణ సుందరంగా ఉంది.
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    పద్యం మధ్యలో అచ్చులను ప్రయోగించరాదు కదా!
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. కట్టు కొన్నట్టి భర్త నాకట్టు కొనుచు
    అన్ని వేళల సహకార మంద జేసి
    చెడ్డ త్రోవల బోజూడ చేయి జూపి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.

    రిప్లయితొలగించండి
  23. పతిని వెంటాడి కానలో పంకజాక్షి
    మాయ లేడిని తెమ్మని మంకు పట్టి
    భీతి లేక మాయావికి భిక్ష మిచ్చి
    పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి