20, ఫిబ్రవరి 2012, సోమవారం

శివానందలహరి - 5త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రిణయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరం |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే
||

శ్రీ పండిత నెమాని రామజోగి సన్యాసి రావు గారి స్వేఛ్ఛానువాదం

ఆద్యు, త్రిలోక పూజ్యు, త్రిపురాంతకు, త్ర్యంబకు, శంకరున్, త్రయీ
వేద్యుని, వ్యోమకేశు, పృథివీధరజేశు, భుజంగ భూషణున్,
హృద్యు, కురంగపాణి, పరమేశ్వరు, జ్ఞాననిధానునిన్, మహా
విద్యకు నొజ్జయైన శివు, వేల్పుల వేలుపునున్ భజించెదన్

11 కామెంట్‌లు:

 1. గంగమ్మ తలపైన గంతులేయుచు నుండ
  .......................కలత లేదా నీల కంఠ నీకు ?
  పార్వతి సగమేను పంచుకొన్నను గాని
  ......................వెలితి లేదా నీకు విశ్వనాథ ?
  పాములు మేనిపై ప్రాకుచున్నను నీకు
  .....................వెలపరమ్మే లేద వేదవేద్య ?
  చితిబూది పూసుక చిందు లేసెడి నీకు
  ....................చింతలే లేవేమి చిచ్చుకంటి ?

  మంచు కొండ గూడు! మంచినీరు విషమ్ము!
  భూత ప్రేత తతులు భూరి జనము !
  చేత భిక్ష పాత్ర ! చిరునగ వెట్లౌను
  శివము లిచ్చు టెట్లు శివశివయన ?

  రిప్లయితొలగించండి
 2. శివరాత్రినాడు నేమానివారి శివ స్తుతి అద్భుతం !

  మిస్సన్న మహాశయా ! శివుడికి తలంటు పోసేసారుగా !
  వేరే అభిషేకాలెందుకు ?

  రిప్లయితొలగించండి
 3. మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 5. పండితులవారికి నమోవాకములు.
  మీ అనువాదం చదివాను. చాలా బాగున్నది. అందులో కలవు మదంతరంగంబున అంటూ చెప్పిన పద్యం చాలా బాగున్నది. మోహాది మృగాదుల వేటాడమని శివుని అభ్యర్థించుట చక్కగానున్నది.

  మిస్సన్నగారు,
  శివుని గూర్చి మీ మనస్సులో ఇన్ని చింతలున్నాయన్నమాట.

  గురువుగారు,
  పండితుల వారు నిన్న గౌరీకళ్యాణము గూర్చి పాడదామన్నారు.
  అందుకే ఒక చిన్న ప్రయత్నం.

  సింగారమొప్పగా చిఱునవ్వు మెఱువగ
  శ్రీగౌరి సిగ్గుల చిలికె గనుము.
  ప్రియమార గౌరిని పెండ్లాడు నీశుండు
  పిలిచేము రారండి ప్రీతి తోడ.
  చుక్కలు పువ్వులై చూడముచ్చటగను
  శుభతలంబ్రాలైన సోకు గనుము.
  బుగ్గన నల్లటి బొట్టుగా నమరెను
  పున్నమి తెలుపులు పోగ చంద్రు

  డాదిదేవునికిట పెండ్లి యంగరంగ
  వైభవమ్ముతోడ జరిగె, వాయనమ్ము
  లంది తృప్తిగా భుజియించిరందరిపుడు.
  సర్వజగతికి రక్షణ శాశ్వతముగ.
  శుభమ్||

  రిప్లయితొలగించండి
 6. అయ్యా మిస్సన్న గారూ! శివుని మీద సొగసైన పద్యము చెప్పేరు. అభినందనలు.

  అమ్మా మందాకినీ గారూ!
  శివుని గూర్చి మీరు రచించిన పద్యములన్నీ చదువుచున్నాను. చాల బాగున్నాయి.

  గౌరీ కళ్యాణము పద్యములో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది.
  (1) చిరునవ్వు మెరయగ అందాము.
  (2) పిలిచేముకి బదులుగా : పిలిచితి లేక పిలిచెను అనిగాని బాగుంటుంది.
  (3) శుభ తలంబ్రాలు - దుష్ట సమాసము అవుతుంది.
  తగ తలంబ్రాలయ్యె సొగసు గనుడి అందాము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. ధన్యవాదాలండి.
  మీ సవరణలతో నా పద్యము.
  (చివరి సవరణ లో ప్రాసయతి ఉన్నది. దాని బదులుగా నేను ఒక సవరణ చేయటానికి ప్రయత్నించాను. ఎటూ వీలుకాని పక్షంలోనే ప్రాసయతి తప్ప మామూలుగా బాగుండదని నా అభిమతం.)
  సింగారమొప్పగా చిఱునవ్వు మెరయగ
  శ్రీగౌరి సిగ్గుల చిలికె గనుము.
  ప్రియమార గౌరిని పెండ్లాడు నీశుండు
  పిలిచెను రారండి ప్రీతి తోడ.
  చుక్కలు పువ్వులై చూడముచ్చటగను
  జలజలా రాలెను జంట పైన
  బుగ్గన నల్లటి బొట్టుగా నమరెను
  పున్నమి తెలుపులు పోగ చంద్రు

  డాదిదేవునికిట పెండ్లి యంగరంగ
  వైభవమ్ముతోడ జరిగె, వాయనమ్ము
  లంది తృప్తిగా భుజియించిరందరిపుడు.
  సర్వజగతికి రక్షణ శాశ్వతముగ.
  శుభమ్||
  ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 8. అమ్మా! మందాకినీ గారూ! చక్కని సవరణలు చేసేరు. అభినందనలు. ప్రాస యతులు కూడ పద్యమునకు అందమును చేకూర్చుతాయి. ఇందులో సందేహము లేదు. సీస పద్యమునకు అన్ని పాదములలోను ప్రాసయతులు వేస్తే ఇంకా ఎంతో బాగుంటుంది. ప్రాస యతులకు ఎట్టి నిషేధమునూ లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. పండిత నేమాని వారూ,
  అనువాదమే కష్టం. అందులోనూ "ద్య" ప్రాసతో వృత్త రచన. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ సీసపద్యం నిజంగా శివంకరమే. మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  మందాకిని గారూ,
  మీ శివపార్వతీ కళ్యాణం మనోరంజకంగా ఉంది. అభినందనలు, ధవ్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. నేమాని పండితార్యా ధన్యుడను.
  గురువుగారూ ధన్యవాదములు.
  అమ్మా మందాకిని గారూ ధన్యవాదాలు.
  మీ శివ కల్యాణం శుభంకరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 11. సీస పద్యమును మొదటిసారి ప్రయత్నించిన నాకు ఈ శివరాత్రి నాడు ధన్యత కలిగినది. అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి