29, ఫిబ్రవరి 2012, బుధవారం

దత్తపది - 20 (రాకు, పోకు, తేకు, మేకు)

కవిమిత్రులారా,

"రాకు - పోకు - తేకు - మేకు"

పై పదాలను ఉపయోగించి

భారతార్థంలో

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. దుర్యోధనుడు భీష్ముని తో...

  మేకులు పాండవు లే మరి
  తేకుమ మా మధ్య వారి తేజపు మెప్పుల్
  రాకుమ తాతా వారికి
  పోకుండగ రాజ్య మీయ బోధలు చేయన్.

  రిప్లయితొలగించండి
 2. అర్జునుడు సుభద్రతో ఏకాంతమున.

  రాకులవంద్యుడ, పార్థుడ!
  పోకుమనుచు నానతిచ్చి పొమ్మనుటలు విం
  తే? కుసుమకోమలులకును
  మేకుల వంటిదయె పల్కు, మృదువుగ ననుమా!

  రిప్లయితొలగించండి
 3. తేకువ జూపి యుద్ధమున, తీవ్రతరంబగు బాణ తంపరల్
  మేకుల వోలె గ్రుచ్చుకొన మేదినిపైబడె భీష్ముడంతటౌ
  రా!కురుసైన్యమంతయుపలాయనగీతముపాడెభీతితోన్
  పోకుమటంచు, వేర్లుచనిపోయిన వృక్షము వృద్ధిచెందునే.

  కురువృక్షానిని వేరు వంటివాడు భీష్మపితామహుడు, అటువంటి వేరు పడిపోతే పోతే కురువృక్షము నిలువగలదా అని నా అభిప్రాయము?.

  రిప్లయితొలగించండి
 4. మిత్రులారా! మన వాక్కు ఒక దైవ ప్రసాదము, చాల పవిత్రమైనది. దానిని ఎంత సున్నితముగా వాడుకొంటే అంత మంచిది. భావ స్వాతంత్ర్యము ఉన్నది కదా అని అదే పనిగా సంప్రదాయ పద్య విద్యను, భాషకు ప్రధాన మూలము వంటి వ్యాకరణమును కొందరు పదే పదే ఎగతాళి చేస్తూంటే చాలా బాధగా ఉంటోంది. ఛందస్సు అంటేనే వేదము. మనము మాటాడే ప్రతి శబ్దమునూ ఏదో ఒక ఛందస్సునకు చెందును అని ఆర్యోక్తి. అందుచేత అట్టి ధోరణులు మారే వరకు దూరముగా ఉండుటే మేలనిపించుచున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. రాకుల మందు బుట్టిన పరాక్రమ వీరుల యస్త్ర విద్యలన్
  తేకువ జూపి పాల్గొనుట తీవ్రముగా నిరసించి పెద్దలే
  పో కుల హీనుడా ! యనిరి , పూని సుయోధను డంగ రాజ్యమున్
  మీకిడి గౌరవించె , తరమే కురు రాజు నుతింప కర్ణుడా !

  రిప్లయితొలగించండి
 6. రాకుమారుల మధ్య స్పర్థలు రాజ్యలక్ష్మికి చేటగున్
  పోకు పోరుకు నాశనమ్మగు పొందు మేలు సుయోధనా
  తేకు మచ్చను తొల్లి పెద్దల దివ్య కీర్తికి పాపమౌ
  మేకువై మన వంశ కుడ్యపు మేలు బాపకు మూర్ఖతన్.

  రిప్లయితొలగించండి
 7. శ్రీనేమానివారికి,
  మీకు చెప్పగలవాడను కాను. భాషయొక్క సుష్టుస్వరూపమును తెలుపు వ్యాకరణము నిస్సందేహముగా వేదసమ్మితమైనదే. తెలుగువారికి స్వభాష పట్లగల నిర్లక్ష్యధోరణి కారణ్ముగా భాషకు జరుగుచున్న అపకారము కేవలము ఒక భాషకే కాక ఒక్ జాతిగా తెలుగువారి ఉనికికే ప్రమాదము తెచ్చుచున్నది. కాని అట్టి ప్రమాదమును నివారించుటకు తప్పక ప్రయత్నము చేయవలసి యుండగా, దానికి సమర్థులైన వారిలో తమవంటి కవిపండితులు ఉదాసీనత వహించుట అసలే కునారిల్లుతున్న భాషకు మరింత చేటు తెచ్చును.

  దయచేసి తమ ప్రయత్నమును యథాప్రకారముగా కొనసాగించగలరు.

  రిప్లయితొలగించండి
 8. పోకు వారి నెదుర్కొన బూని ,పాండు
  రాకుమారులజేయులు రణము నందు,
  తేకు వంశ క్షయము ;సఖ్యమేకుమార
  అందరికి శుభ కారక మ్మాలకింపు.
  ----------------

  రిప్లయితొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  భీష్ముడు సుయోధనునితో :

  01)
  _____________________________________________

  పాండు పుత్రుల పట్ల , నీ - పగను విడుము !
  తేకువన్ విడి, తెలుసు కో ! - తెలివి నడుము !
  భారమే కుమార ? వారికి - భాగ మిడుము !
  రాకుమారా ! సుయోధనా ! - రణము మృతము !
  వలదుపో ! కుల నాశనం ! - బంధు లయము !
  _____________________________________________
  తేకువ = గర్వము
  మృతము = చావు

  రిప్లయితొలగించండి
 10. శ్రీ నేమానిమహాశయా! ఎన్నోదినములుగా చెబుదామనుకొంటున్న మాట. మీ అమూల్యమైన సంప్రదాయసహిత సలహాలు, వ్యాఖ్యలు, కొండొకచో హెచ్చరికలు మా గురువులు పౌరాణికవిశారద, రామాయణ సుధాసాగర బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహావధానీపాకయాజీ గారిని తలపింపజేయునట్లు వుంటాయి. మీరు మాకు దూరమైతే ఆ పాటి బెత్తం ఝుళిపించేవారు కూడా వుండరు. అప్పుడు మా లాంటి వారు దిశాదశ లేకుండా పోవటానికి ఆస్కారమున్నది. "చీమలు నడవగా నడవగా బండరాతి మీదకూడా అచ్చుపడుతుంది" అన్నట్లు మీరు చెబుతూంటే ఒకనాటికి నేర్చుకొనే వారు నేర్చుకొంటారు అని నా సవినయ మనవి.

  రిప్లయితొలగించండి
 11. (రాకు) వొమిక్రాన్ యిచటికి
  (పోకు)ము యెవ్వరి గృహముకు పొరబడి నైనన్
  (తేకు)ము కష్టము జనులకు
  (మేకు)లు గుచ్చిన విధముగ మేనికి యెపుడున్!

  రిప్లయితొలగించండి