27, ఫిబ్రవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 632 (వర్ణములను వదలివేయ)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

వర్ణములను వదలివేయ వైభవ మగునే.

ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. ఆర్యా ! ధన్యవాదములు. నా పూరణను చివరలో పోస్ట్ చేస్తాను. అదే భావ్య మనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. కర్ణములకు, నాసికకును,
    వర్ణవిభిన్నత కలిగిన వజ్రమ్ములతో
    పర్ణపు చిత్రములమరు సు
    వర్ణములను వదలివేయ వైభవ మగునే?

    రిప్లయితొలగించండి
  3. హనుమంతుని పూరణలెప్పుడూ ఆద్యములే. వదలండి మీ పూరణ శాస్త్రిగారూ:-)

    రిప్లయితొలగించండి
  4. మందాకినీ గారు చక్కని ' సువర్ణ రంజిత ' మైన పూరణ చేశారు. అబినందనలు.
    మన చంద్ర శేఖర్ గారూ ! మీరు కూడా వర్ణములను వదల కుండా పూరించారు. భేష్. నా పూరణ భావం కూడా అదే..రెండు మూడు పాదాలు ఒక్కసారి సరిచేయాలి.

    రిప్లయితొలగించండి
  5. వర్ణాశ్రయ ధర్మంబులు ,
    వర్ణంబులు దైవ సృష్ఠి , పాటింప దగున్
    నిర్ణాయక సంకరమున
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే ?

    వర్ణాశ్రయ ధర్మంబులు ,
    వర్ణంబులు వదలి వేయ వైభవ మగు , నే
    డర్ణవము దాటి జనులు
    నిర్ణాయక సంకరముల నెగడుట వలనన్

    రిప్లయితొలగించండి
  6. వర్ణము ప్రాణము భాషకు
    వర్ణము లేనట్టి భాష వసుధను కలదే
    వర్ణములగు ఋ ఱ లు మరి సు-
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే ?

    రిప్లయితొలగించండి
  7. వర్ణములు వేద విహితము
    వర్ణము లేలేని నాడు వరుసలు మారున్
    వర్ణము లుండుట ముఖ్యము
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే .

    రిప్లయితొలగించండి
  8. వర్ణములు కనుల విందగు (రంగులు)
    వర్ణములే యంగములకు వాగ్దేవతకున్ (అక్షరములు)
    వర్ణములు తెలుపు జాతిని (కులము)
    వర్ణములను వదలివేయ వైభవ మగునే?

    రిప్లయితొలగించండి
  9. నా పద్యము 2వ పాదములో టైపు తప్పు దొరలినది. సవరణతో పద్యమును ఇలాగ చదువుకొందాము.

    వర్ణములు కనుల విందగు
    వర్ణములే యంగములగు వాగ్దేవతకున్
    వర్ణములు తెలుపు జాతిని
    వర్ణములను వదలివేయ వైభవమగునే?

    రిప్లయితొలగించండి
  10. వర్ణములన్ కృతులను తగ
    వర్ణించెను త్యాగరాజు వరదాయకు భ-
    క్త్యర్ణవమై సంగీతపు
    వర్ణములను వదలివేయ వైభవమగునే?

    రిప్లయితొలగించండి
  11. వర్ణము నీలమ్మగును మ
    హార్ణవమునకు,నరుణంబు నా తూరుపుకున్,
    పర్ణములకు హరితంబగు;
    వర్ణములను వదలివేయ వైభవ మగునే.

    రిప్లయితొలగించండి
  12. వర్ణమ్ములు గానమునకు,
    వర్ణముల కలయిక చిత్ర పటముల యందున్,
    వర్ణములె ప్రకృతి కందము
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే
    ----------------

    రిప్లయితొలగించండి
  13. వర్ణము లింపగు సృష్టికి
    వర్ణము లేడింద్రధనువు వంకను గనుమా
    వర్ణము లిముడును తెలుపున
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే

    రిప్లయితొలగించండి
  14. మిత్రుల పూరణలు అలరారుచున్నవి.

    అర్ణవమె యాంధ్ర భాషయు
    కర్ణమ్ముల ప్రీతిఁ గొలుపు కైతలు తెలుగున్
    వర్ణములొ ? మౌక్తికమ్ములె
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే !

    రిప్లయితొలగించండి
  15. వర్ణపటిమ మెరయు తెలుగు
    వర్ణోచ్చారణల కష్టపడవల దనుచున్
    వర్ణసరళినా సొంపగు
    వర్ణములను వదలివేయ వైభవ మగునే?

    రిప్లయితొలగించండి
  16. ఋ ఱ సువర్ణములను వదల రాదని మిస్సన్న గారు లెస్స బలికిరి. పాఠశాలలలో తెలుగు ప్రాముఖ్యము ప్రాచుర్యములను తగ్గించడానికి ఒక పథకము బట్టి కుట్ర జరుగుతున్నదా అనే అనుమానము కలుగు తున్నది.
    అయ్యలార ! ఓపిక లేకపోతే నేర్చుకోకండి. నేర్చుకొందామనుకొనే వారు తెలుగు భాషాప్రియులు ఉంటారు. మా భాషను మాకు వదలి వేయండి. తెలుగు తియ్యని భాష. దీనిపై మీ కత్తి సాము పని చేయదు

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    వర్ణములు భాష నేర్పును !
    వర్ణములే విద్యనేర్పు ! - వీనుల విందౌ
    వర్ణములే సంగీతము !
    వర్ణములను వదలివేయ వైభవ మగునే ???
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  18. 02)

    రంగులు :

    _____________________________________________

    వర్ణము కన్నుల కింపగు !
    వర్ణముచే జంతు కోటి - వైభవ మలరున్ !
    వర్ణములు సృష్టి మూలము !
    వర్ణములను వదలివేయ - వైభవ మగునే ???
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  19. వర్ణములే ముఖ్యమగును
    నిర్ణయముల కెన్నికలను నేతల కవె సం
    కీర్ణమ్ముల నిలకడ కిల
    వర్ణములను వదలివేయ వైభవ మగునే?

    రిప్లయితొలగించండి
  20. 03)

    _____________________________________________

    వర్ణము నీలపు కృష్ణుని
    వర్ణములను వందనీయు - వంశీ ధరునిన్
    వర్ణింపగ నెవరి తరము?
    వర్ణములను వదలివేయ - వైభవ మగునే ???
    _____________________________________________
    వర్ణము = రంగు = గుణము = స్తుతి

    రిప్లయితొలగించండి
  21. వర్ణములు పలు రకమ్ములు
    వర్ణించుట కెవరి తరము వాసవు కైనన్ !
    వర్ణితము కాని దేదన ?
    వర్ణములను వదలి వేయ వైభవ మగునే ?

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిసోమవారం, ఫిబ్రవరి 27, 2012 9:09:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కర్ణునకు కుండలంబులు
    పర్ణములకు శోభగూర్చు పచ్చనిదనముల్
    కర్ణములకు నింపుగూర్చు
    వర్ణములను వదలివేయ వైభవ మగునే.

    రిప్లయితొలగించండి
  23. చక్కని పద్యము లతో నేటి పూరణలను 'సువర్ణ ' మయము చేసిన శ్రీ లక్కాకుల వారికీ, సుబ్బారావు గారికి,కమనీయం గారికి, పండిత నేమాని వారికి, వసంతకిశోర్ గారికి, మూర్తి గారికి, మిస్సన్న గారికి, కవివరులన్దరకు అభినందనలు.

    నా పూరణ....

    వర్ణము లేబది యారు సు
    వర్ణములే నేర్వ నీకు భారమ చెపుమా
    కర్ణము లో నాలింపుమ
    వర్ణము లను వదలివేయ వైభవ మగునే?

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతిశాస్త్రిసోమవారం, ఫిబ్రవరి 27, 2012 9:14:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    సవరణతో

    కర్ణునకు కుండలంబులు
    పర్ణములకు శోభగూర్చు పచ్చనిదనముల్
    కర్ణములకు నింపొసగెడు
    వర్ణములను వదలివేయ వైభవ మగునే.

    రిప్లయితొలగించండి
  25. రాజేశ్వరి గారూ ! శ్రీపతి గారూ ! చక్కని పూరణలు.. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మూర్తి మిత్రమా అవును. తెలుగు భాష పటిమకు పెద్దపీట వేసే కొన్ని వార్తా పత్రికలు కూడా (ఉదా: ఈనాడు) ఋ కు బదులుగా రు ను వాడుతూంటే చదువుతున్నప్పుడు మనసు బాధతో మూల్గుతూ ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందరి పూరణలూ మనోహరంగా ఉన్నాయి.
    చివరిగా ..........

    వర్ణమన రంగు తెలియుము,
    వర్ణమనన్ కులము గూడ, వాగ్గేయులకున్
    వర్ణము ప్రియమగు ప్రక్రియ
    వర్ణములను వదలివేయ వైభవ మగునే.

    రిప్లయితొలగించండి
  28. అయ్యా శ్రీపతి శాస్త్రి గారూ!
    మీ పద్యములో 2వ పాదములో చిన్న సవరణ:
    "పచ్చనిదనముల్" కి బదులుగా 'పచ్చదనంబుల్ ' అందాము.

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్న గారూ ! మీరు చెప్పినది నిజమే ..ముఖ్యముగా దంత్యములు
    (చ జ ) ప్రస్తుతము వ్రాయలేక పోవుచున్నాము. క్రొత్త తరం వాళ్ళు కొంత మంది పలక లేక పోవు చున్నారు. కొన్నాళ్ళకు అదేస్థితికి వస్తారేమో..వాటిని అలా పలకక పొతే.ళ అక్షరం కూడా కొంతమంది పలక లేక పోవు చున్నారు. అలాటి మాటలు విన్నప్పుడు మనస్సు చివుక్కు మంటుంది.
    ఆంగ్లం లో ఒకే విధంగా వుండే అక్షరాలను నాలుగు రకాలుగా వ్రాయటం నేర్పుతాం. కాని మన దౌర్భాగ్య మేమో ఒకే రకంగా ఉన్నాయని బరువు తగ్గిస్తున్నామనే భ్రమతో అక్షరాలను తగ్గిస్తున్నాం.

    రిప్లయితొలగించండి
  30. వర్ణములేబది యారవి
    పూర్ణముగా తెలుగు భాష పుష్టిని తెలుపున్
    వర్ణములిన్నెందుకనుచు
    వర్ణములను వదలివేయ వైభవమగునే?

    రిప్లయితొలగించండి
  31. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఫిబ్రవరి 28, 2012 12:57:00 AM

    వర్ణముల నేరికూర్చుచు
    కర్ణములకు నింపుగూర్చు కమ్మని కవితన్,
    వర్ణణలు,వర్షధారల్,
    వర్ణములను వదలివేయ వైభవ మగునే

    రిప్లయితొలగించండి
  32. మిత్రు లందరికీ శుభోదయం!
    ఇంకా నా నెట్ సమస్య అలాగే ఉంది.
    గోలి వారు చాలా కాలం క్రితం పంపిన సమస్య ఇది. "ర్ణ" ప్రాస ఇబ్బందికరమేమో అని ఇంతకాలం ఇవ్వలేదు. కాని ఇన్ని చక్కని పూరణలు వస్తాయని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది.
    పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    మరో రెండు రోజులు ఇలాగే మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  33. వర్ణంబన బంగారము
    వర్ణములన యక్షరములు వర్ణము గుణముల్
    వర్ణింపనలవి కాని యీ
    వర్ణములను వదలి వేయ వైభవమగునే?

    రిప్లయితొలగించండి
  34. పూర్ణపు బూరెలు తినుచున్
    వర్ణములను పాడ బోవ పంకజ నేత్రుల్
    కర్ణకఠోరము లివియని
    వర్ణములను వదలివేయ వైభవ మగునే?

    రిప్లయితొలగించండి