15, ఫిబ్రవరి 2012, బుధవారం

సమస్యాపూరణం - 622 (పేదలు నిరు పేద లగుట)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్.

(ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు)

19 కామెంట్‌లు:

  1. చేదగు బాధనిపించును
    పేదలు నిరు పేద లగుట, ప్రియమొనరించు
    న్నాదము లెప్పుడు తీయని
    మోదములిచ్చునని యెంచు మోహము విడుమా!

    ఇది తీపి యని, ఇది బాధ యని యెన్ను మోహాన్ని విడుమనుట.

    రిప్లయితొలగించండి
  2. సత్సాధువుల గురించి............

    మోదంబొనరించెడు సం
    వాదంబులజేసి భక్తిభావంబుల నా
    పాదించుచు, దుర్బుద్ధికి
    పేదలు నిరుపేదలగుట ప్రియమొనరించున్.

    దుర్బుద్ధి కి పేదలు , దుర్బుద్ధికి నిరుపేదలు

    రిప్లయితొలగించండి
  3. పేదలు పెద్దగ మారగ
    నూదర గొట్టుచు నెవరిని ఓట్లని యడుగున్
    జూదము లాడెడి ప్రభుతకు
    పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్.

    రిప్లయితొలగించండి
  4. ఖేదకరము మనలకు నా
    పేదలు నిరుపేద లగుట; ప్రియమొనరించున్
    ప్రోదిగొను నాయకులకున్
    ఆదారిద్ర్యము గెలుచుట కాయువు పట్టై!

    రిప్లయితొలగించండి
  5. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, ఫిబ్రవరి 15, 2012 9:57:00 AM

    మేదిని సంపద యంతయు
    మాదేయను భూర్జువాల మానస విధముల్
    ప్రోదిపడి దోచు వారికి
    పేదలు నిరు పేదలగుట ప్రియ మొనరించున్

    రిప్లయితొలగించండి
  6. దుర్భుధ్ధి గల నాయకులున్న
    ఈ స్ద్బుధ్ధి గల లోకమున
    పేదలు నిరుపేదలగుట ప్రియమొనరించునన్న
    భావ్యము హేయము కాదగునా..

    రిప్లయితొలగించండి
  7. వేదన కలిగెడివిషయము
    పేదలు నిరు పేద లగుట , ప్రియ మొనరించున్
    పేదలకు సాయ పడిన చొ
    పేదలు లేకుండ జేయ మెచ్చును శివుడున్ .

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి నమస్కారములు
    గురువు గారికి నమస్కారములు
    రాజకీయనాయకులకు
    --------
    పేదలు రాళ్ళను గొట్టిన
    పాదము వద్దకు పరుగున పైసలకొచ్చున్|
    సాధన లేకనె వారికి
    పేదలు నిరుపేదలగుట ప్రియమొనరించున్|

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    సోదరులారా మోదమె
    పేదలు నిరుపేదలగుట? ప్రియమొనరించున్
    చేదోడుగ సాయంబుల
    నాదరముగ జేసినంత హ్లాదన కలుగున్

    రిప్లయితొలగించండి
  10. డి.నిరంజన్ కుమార్బుధవారం, ఫిబ్రవరి 15, 2012 4:34:00 PM

    పేదలు నిరుపేదలకే
    సాదర ఆహ్వానమదియు సముచితరీతిన్
    ఆదర సత్కారములన
    పేదలు నిరుపేదలగుట ప్రియమొనరించున్

    రిప్లయితొలగించండి
  11. డి.నిరంజన్ కుమార్బుధవారం, ఫిబ్రవరి 15, 2012 5:05:00 PM

    పోదురు, మీఆశికములు
    పేదలు నిరుపేదలగుట ప్రియమెటులౌ? మీ
    వాదన నిజమా! ఆహా!
    పేదలు నిరుపేదలగుట ప్రియమనిపించున్

    రిప్లయితొలగించండి
  12. ఖేదము మిక్కిలి హెచ్చును
    మోదము లడుగంట, వస్తువులు దొరకమిచే
    వేదన కల్గును, ధరలును
    పేదలు నిరుపేదలగుట ప్రియమనిపించున్

    రిప్లయితొలగించండి
  13. మోదము పొందెడి ప్రభుతకు
    బాధలు పెట్టంగ జనుల బేధము లేకన్ !
    ఖేదము మరచుట దెలిసిన
    పేదలు నిరు పేదలగుట ప్రియ మొనరిం చున్ !

    రిప్లయితొలగించండి
  14. డి.నిరంజన్ కుమార్గురువారం, ఫిబ్రవరి 16, 2012 7:36:00 AM

    ఆదరణయె మోదమనుచు
    సాదరముగ గలసిమెలసి సతతము మెలిగే
    పేదరికమునకు ధనికులు
    పేదలు నిరుపేదలగుట ప్రియమొనరించున్

    రిప్లయితొలగించండి
  15. మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘బాధ + అనిపించును’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘చేదగు బాధయె తోచును’ అందామా?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం చక్కని నడకతో అలరిస్తున్నది. మంచి పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    మీ భావం బాగుంది. కవిమిత్రులెవరైనా దానిని ఛందోబద్ధం చేస్తారేమోనని చూసాను. వీలైతే ఈ సాయంత్రం వరకు దానిని పద్యంగా వ్రాస్తాను.
    *
    సుబ్బారావు గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పడినచో’ అనవలసింది ‘చొ’ అని హ్రస్వాన్ని ప్రయోగించారు. అక్కడ ‘పడినన్’ అంటే సరి!
    *
    వరప్రసాద్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘పైసలకొచ్చున్’ అన్నచోట ‘ఒచ్చున్’ ప్రయోగం తప్పు. ‘పైసల కేగున్’ అందాం.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    మీ మూడు పూరణలూ ముచ్చటగా ఉన్నాయి. సంతోషం! అభినందనలు.
    మీ పద్యాలలో అక్కడక్కడ పాదం మధ్య అచ్చులను ప్రయోగించారు. అది దోషమే.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాకుంటే రెండవ పాదంలో యతి తప్పింది. ‘జనులు పల్లట లేకన్’ అందాం.

    రిప్లయితొలగించండి
  16. మీ సవరణ శిరోధార్యము.

    చేదగు బాధగ తోచును,
    పేదలు నిరు పేద లగుట; ప్రియమొనరించు
    న్నాదము లెప్పుడు తీయని
    మోదములిచ్చునని యెంచు మోహము విడుమా!

    రిప్లయితొలగించండి
  17. వాదుకు దిగి యిట్లాడిన
    నేదో సరిపెట్ట వచ్చు నిజముగ జూడన్
    కాదే యసత్య మెట్టుల
    పేదలు నిరుపేద లగుట ప్రియ మొనరించున్?
    -----------

    రిప్లయితొలగించండి
  18. గేదెలు మంత్రులు కాగా
    యాదవ బీహారు నందు హాహాయనుచున్
    దాదాలు దొంగి లించగ
    పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్

    రిప్లయితొలగించండి
  19. అమిత్ షా:

    సోదరి ధనమును గ్రోలగ
    బాదుచు గుండెలను నేటి బంగాలందున్
    చీదరతో దీదినిగని
    పేదలు నిరు పేద లగుట ప్రియమొనరించున్

    రిప్లయితొలగించండి