4, ఫిబ్రవరి 2012, శనివారం

సమస్యాపూరణం - 612 (కన్నకుమారుండు మగఁడు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్
(`తెలుగులో సమస్యాపూరణలు’ పుస్తకం నుండి)

25 కామెంట్‌లు:

  1. పన్నగ ధర శివ చాపము
    పన్నగ శయ నుండు విరిచె పదుగురు చూడన్
    కన్న రమ సీత దశరథ
    కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ నందించారు. అభినందనలు.
    ‘దశరథ’శబ్దాన్ని విభక్తి లేకుండా ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  3. మాస్టారు గారూ! ధన్యవాదములు.

    పోస్ట్ చేసిన తరువాత దోషాన్ని గమనించాను. నిజమే...
    సవరణ తో..

    పన్నగ ధర శివ చాపము
    పన్నగ శయ నుండు విరిచె పదుగురు చూడన్
    కన్న రమ సీత దశరథు
    కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్

    రిప్లయితొలగించండి
  4. కన్నియ రుక్మిణి చేసిన
    విన్నపమున కాత్మ బొంగి వే జని గుణ సం
    పన్నుడు కృష్ణుడు దేవకి
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన భావం, అత్యద్భుతమైన నడక. సర్వోత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. వివాహానంతరము రుక్మిణీ దేవి తన చెలికత్తెతో............

    హృనీరేజనివాసుం
    డన్నను రణరంగమందునద్భుతరీతిన్,
    బన్నము జేసిన దేవకి
    కన్నకుమారుండు మగడుగాగ వరించెన్.

    బన్నము = ఓటమి,

    రిప్లయితొలగించండి
  7. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశనివారం, ఫిబ్రవరి 04, 2012 11:25:00 AM

    మన్ననగొని భువి దల్లిగ
    నెన్నిన మనుజుండు పుడమి కేలిక యగుచో
    కన్నట్టి వారలనరో
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్

    రిప్లయితొలగించండి
  8. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశనివారం, ఫిబ్రవరి 04, 2012 11:32:00 AM

    కన్నట్టి తల్లిగా భువి
    నెన్నిన మనుజుండు పుడమి కేలికయగుచో
    కన్నట్టి వారలనరో
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్

    తొలి పద్యం కన్నా ఇది కొంచెం సరళంగా ఉన్నదనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని ఊహతో పూరణ చెప్పారు బాగుంది. అభినందనలు.
    రుక్మిణి మాట అయితే ‘వరించితిన్’ అని ఉండవలసి వస్తుంది. కాబట్టి పైమాటను కుండిన నగర పౌరులు అనుకున్నట్లు చెప్తే సరి!
    ‘హృన్నీరేజం’ టైపాటు వల్ల ‘హృనీరేజం’ అయింది.
    *
    శ్రీఅదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    నిజమే రెండవది ప్రశస్తంగా ఉంది. మీరూహించిన భావం ఉదాత్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. "హన్నా! పులితో నాడెను
    కన్నకుమారుండు, మగఁడు గాఁగ వరించెన్
    మన్నడు , రక్తంబిదియౌ!"
    యన్నుల మిన్నగు శకుంతలచ్చెరువొందెన్.

    తనని వరించిన వాడు వీరుడు _ వాని రక్తము గాన ఈ బిడ్డ ఇంత వీరుడని తలుచుట.....

    రిప్లయితొలగించండి
  11. అన్నా వదినల ముద్దుల
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్
    వెన్నెల విరియగ నగవులు
    మిన్నగ పంచెడు యతివను, మెఱుపుల కన్యన్.

    పన్నగ శయనుని గారపు
    కన్న కుమారుండు మగడు గాగ; వరించెన్,
    వన్నెలు కురిపించెను రతి,
    యెన్నడు వీడక ననంగు నిల్లాలగుచున్.

    రిప్లయితొలగించండి
  12. వెన్నెల రాతురు లందున
    వన్నెలు కురిపించి యతడు వాంచించి మదిన్ !
    యెన్నగ నాతడు మేనత్త
    కన్న కుమారుండు మగఁడు గాఁగ వరించెన్ !

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారి పద్యం లో కర్త కృష్ణుడైనట్టున్నాడు కాబట్టి అన్వయం అంత సరిగ్గా కుదరలేదేమో అనిపిస్తుంది. రుక్మిణి , దేవకి కన్నకొడుకైన కృష్ణుడిని వరించింది అని రుక్మిణిపరంగా చెప్పాలనుకుంటాను

    రిప్లయితొలగించండి
  14. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, ఫిబ్రవరి 04, 2012 8:47:00 PM

    కన్నట్టి తల్లిగా భువి
    నెన్నిన జనపతుల తండ్రి యెట్లున్ హరియే
    నన్నా! యెటులందురు? భువి
    గన్న కుమారుండు మగడుగాగ వరించెన్

    రిప్లయితొలగించండి
  15. పన్నగ శయనుడు శ్రీహరి
    కన్న కుమారుండు మగఁడు గాఁగ వరించెన్ !
    యెన్నగ నాతడు నలువయె
    కన్నియగా ధన్యు రాలు గాన వాగ్దేవయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  16. చివరికి “...వెం-కన్నకుమారుండు...” నాకు వదిలేసినందుకు ధన్యవాదాలతో:
    మిన్నులరాయడు మన
    సున్నమనిషి పూర్వభాషి సొగసరి గుణసం
    పన్నుడు, పండిత శ్రీ వెం
    కన్నకుమారుండు, మగఁడు గాఁగ వరించెన్!

    రిప్లయితొలగించండి
  17. మిన్నయగు దేవగురు బృహస్పతి
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్ !
    మన్నించు మనగ కచుడిని
    మన్నన యెరుగని దేవయాని యాగ్రహ మొందెన్ !

    రిప్లయితొలగించండి
  18. మందాకిని గారూ,
    మీ మూడు పూరణలూ దేనికదే వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా మూడవది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    నిజమే! మీరు చెప్పింది సరైనదే. ధన్యవాదాలు.
    రెండవపాదంలో ‘వే జని’ ని ‘వే జనె’ అని మార్చితే అన్వయం కుదురుతుందనుకుంటాను. ఆ పద్యాన్ని ఇప్పుడు చూడండి.
    కన్నియ రుక్మిణి చేసిన
    విన్నపమున కాత్మ బొంగి వే జనె గుణ సం
    పన్నుడు కృష్ణుడు; దేవకి
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ మూడు పూరణలూ భావవైవిధ్యంతో అలరిస్తున్నాయి. అభినందనలు.
    మూడు పద్యాల్లోను గణదోషా లున్నాయి. నా సవరణలు ....
    మొదటి పూరణ ........
    వెన్నెల రాతురు లందున
    వన్నెలు కురిపించి యతడు వాంచించె గదా !
    యెన్నగ నా మేనత్తకు
    కన్న కుమారుండు మగఁడు గాఁగ వరించెన్ !
    రెండవ పూరణ ....
    పన్నగ శయనుడు శ్రీహరి
    కన్న కుమారుండు మగఁడు గాఁగ వరించెన్ !
    పన్నుగ నాతడు నలువయె
    కన్నియగా ధన్యు రాలు గద వాక్సతియే !
    మూడవ పూరణ .....
    మిన్నయగు నా బృహస్పతి
    కన్న కుమారుండు మగడు గాగ వరించెన్ !
    మన్నించు మనగ కచుడిని
    మన్నన విడి దేవయాని మటమట లాడెన్ !
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    విష్ణ్వంశ ఉన్నవాడే రాజవుతాడు కదా! చక్కని పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మంచి పట్టే పట్టారు. ‘వెం/కప్పను గని పాము ...’ పూరణను గుర్తుకు తెచ్చారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, ఫిబ్రవరి 05, 2012 9:04:00 AM

    ఇచ్చట నేను ప్రస్తావించినది భూమిని తల్లిగా భావించే రాజుల సంగతి ...

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:

    నన్నే వలచినవాడై
    వన్నెల చెలికాడు నాకు వరుడైనాడే
    చిన్నతనంబున కలలో
    కన్న కుమారుండు మగఁడు గాఁగ వరించెన్

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘కలలో కన్న కుమారుడా?’ అద్భుతమూ, వినూత్నమూ ఐన భావం. ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    " మాయాబజార్ " సినిమాలో శశిరేఖ :

    01)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_____________________________

    కన్న జనకుడే కాదన;
    కన్నె కలువగు శశిరేఖ - కళవళ బడుచున్
    కన్నఱ దీరగ , యత్తకు
    కన్నకుమారుండు మగఁడు - గాఁగ వరించెన్ !
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________________________
    కన్నఱ = దుఃఖము

    రిప్లయితొలగించండి
  23. తల్లి మనోవేదన:

    అన్న కుమార్తెకయో నా
    కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్
    మిన్నగు నాస్తిని కోరుచు
    తన్నుల కోర్చంగ నోపి తడబడకుండన్

    రిప్లయితొలగించండి