20, ఫిబ్రవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 626 (రాముని భజన లలరు)


అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

49 కామెంట్‌లు:

  1. గ్రామమున రామ నవమికి
    ధీమంతులు భక్తజనులు దేవాలయమం
    దామంత్రణమ్ము సేసిరి
    రాముని పూజ లలరు శివ! రాత్రికిఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  2. సోముని, సర్వ శుభప్రద
    ధాముని, సంస్తుత్య నాము, ధరణీధరజా
    రాముని, భీము, మదాత్మా
    రాముని పూజలలరు శివరాత్రికి గనుమా

    రిప్లయితొలగించండి
  3. అందరికీ శివరాత్రి ' శివాకాంక్షలు'.

    హరుడా ! సంకట సర్వ పాప హరుడా ! హైమావతీ వల్లభా !
    గరుడా రూఢుని డెంద మందు స్థిరుడా ! గంగా ధరా ! శంకరా !
    పురుగున్ పామును బోయ వాని భువిలో బ్రోవంగ లేదా భవా !
    కరుణా మూర్తివి నీయె యంచు దలుతున్ కావంగ రారా శివా !

    రిప్లయితొలగించండి
  4. నాల్గవ పాదంలో సవరణ తో..

    హరుడా ! సంకట సర్వ పాప హరుడా ! హైమావతీ వల్లభా !
    గరుడా రూఢుని డెంద మందు స్థిరుడా ! గంగా ధరా ! శంకరా !
    పురుగున్ పామును బోయ వాని భువిలో బ్రోవంగ లేదా భవా !
    కరుణా మూర్తివి నీవటంచు దలుతున్ కావంగ రారా శివా !

    రిప్లయితొలగించండి
  5. సోముని తలపై దాల్చెడి
    మా మల్లేశుని ధరిత్రి మాతగ వెలిగే
    కామాక్షీ పతి యౌ యభి
    రాముని పూజ లలరు శివరాత్రికిఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  6. రాముని, మునిజన హృదయా
    రాముని గుణధాముని త్రిపురారిని సీతా
    రాముని బంటౌ గిరిజా
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! శివరాత్రిని రామనవమికి అన్వయించిన మీ పూరణ అలరించినది.
    ఆత్మా రాముని తలచిన శ్రీ నేమాని వారి పూరణ, అభి రాముని పూజ సలిపిన మందాకినీ గారి పూరణలు బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  8. గురువులకూ పెద్దలకూ కవిమిత్రులందరికీ మహాశివరాత్రి పవిత్రాకామ్క్షలు.

    పార్వతి పద్మ హస్తముల పండిన గోరిట కెంపు చాయకున్
    శర్వుని నీల కేశముల చాయకు తెల్లని మేని చాయకున్
    సర్వము మారె వర్ణములు చక్కగ ముత్తెపు సేస లల్లదే
    పర్వపు శోభలీనుచు కపర్ది వివాహపు వేళ కమ్రమై.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సదాశివుడే సదా రామ నామ జపం చేస్తున్నప్పుడు :

    01)
    _____________________________________________

    రాముని నామము , శివుడు, వి
    రామము నెరుగక జపించ - రాత్రింబవలున్
    రామా, శ్రీరామా ,యని
    రాముని భజన లలరు శివ - రాత్రికిఁ గనుమా !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  10. కాముని జంపిన నీశుని
    భామను తనువున సగముగ భరియించు సతీ
    హైమా పవిత్ర దేహా
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  11. హోమాగ్నిని దేహమ్మును
    హేమావతి తా విడిచిన హేలను- గిరిజా
    భామను మనువాడిన శివ
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  13. రాముడు శివుడును నొకరే
    రాముని భజన లలరు శివ రాత్రికి గనుమా
    రాముని ప్రతిష్ఠ వలన నె
    రామేశ్వర మిలను లోక రంజిత మయ్యెన్ .

    రిప్లయితొలగించండి
  14. హరిహర భవులకు నమములు
    హరి హర భవులార మీ ర లారాధ్యలరౌ
    హరియించుడు పాతకములు
    హరియింప గ వేడుకొందు హరి హర యనుచున్

    రిప్లయితొలగించండి
  15. శంకరు నిల సేవించిన
    శంకరుడే రక్ష జేయు సతతము మనలన్
    శంకరు మించిన దైవము
    నెక్కడ మఱి గానరాడు నెరుగుము నరుడా !

    రిప్లయితొలగించండి
  16. కం. ఏమని చెప్పగ వచ్చును
    మామాహృదయంబులందు మసలెడు భక్తిన్
    భూమిని నగజాహృదయా
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా

    కం. మేమా నిరతము గొల్వగ
    లేమే యేడాది కొక్క రేయిని మాత్రం
    బాముష్మికమున కాత్మా
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా

    కం. కామితఫలవితరణకరు
    ణామూర్తియు లోకరక్షశీలుండౌ
    శ్రీమత్కైలాసశుభా
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా

    రిప్లయితొలగించండి
  17. ఒక అక్షరం టైపుకాలేదు రెండవపాదంలో. సరిజేసిన పద్యం:

    కం. కామితఫలవితరణకరు
    ణామూర్తియు లోకరక్షణాశీలుండౌ
    శ్రీమత్కైలాసశుభా
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా

    రిప్లయితొలగించండి
  18. శంకరకృత శ్రీఅర్ధనారీశ్వర స్తోత్రము
    చాంపేయగౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ
    ధమ్మిల్లికాయైచ జటాధరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 1
    కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజఃపుంజ విచర్చితాయ
    కృతస్మరాయై వికృతస్మరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 2
    చలత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ
    హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 3
    విశాలనీలోత్పల లోచనాయై వికాశిపంకేరుహలోచనాయ
    సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 4
    మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ
    దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 5
    అంబోధరశ్శ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్ర జటాధరాయ
    నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 6
    ప్రపంచసృష్టోన్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయ
    జగజ్జనన్న్యై జగదేకపిత్రే నమశ్శివాయైచ నమశ్శివాయ 7
    ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై స్ఫురన్మహా పన్నగభూషణాయ
    శివాన్వితాయైచ శివాన్వితాయ నమశ్శివాయైచ నమశ్శివాయ 8

    రిప్లయితొలగించండి
  19. శ్రీఅర్ధనారీశ్వర స్తోత్రము:
    సవరణ: పాత పాఠం: సృష్టోన్ముఖ సరియైన పాఠం: సృష్ట్యోన్ముఖ
    (సృష్టి + ఉన్ముఖ --> సృష్ట్యోన్ముఖ యణాదేశసంధి.)

    రిప్లయితొలగించండి
  20. అయ్యా శ్రీ శ్యామలరావు గారూ!
    అర్థ నారీశ్వర స్తోత్రమును మాచే చదివించేరు. సంతోషము. సృష్టి + ఉన్ముఖ = సృష్ట్యున్ముఖ అవుతుంది కదా. పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  21. అయ్యా! శుబ్బారావు గారూ!
    మీకు ప్రాస నియమము తెలియదనుకొంటాను. శంకరునిల సేవించిన అనే పద్యములో 4వ పాదములో ప్రాసనియమము మీరు పాటించలేదు. 4 పాదములలోను బిందు పూర్వక క కారము రావాలి కదా. సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. అయ్యా! శంకరయ్య గారూ!

    రామ నవమి పూజల శివరాత్రి నాడు
    చూపితో శంకరయ్య! విశుద్ధ భావ!
    జానకీ రాములును శైలజా మహేశు
    లొక్కరని తెల్పు మీ భావ ముత్తమంబు

    రిప్లయితొలగించండి
  23. నేమానివారూ, నేనే పొరబడ్డాను. సృష్టి + ఉన్ముఖ = సృష్ట్యున్ముఖ correct.

    రిప్లయితొలగించండి
  24. Webలో శ్రీఅర్ధనారీశ్వర స్తోత్రమును వెదకితీ యీ లింక్ దొరికింది:
    http://prasad-akkiraju.blogspot.in/2010/11/blog-post_3791.html

    ఇక్కడ మరికొన్ని చక్కని శివస్తోత్రములు కూడా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  25. పార్వతీ కళ్యాణము:

    పరమేశుండును పార్వతీసతియు నుద్వాహ ప్రభా పూర్ణులై
    పరగన్ మంగళ తూర్య నాద మయ దీవ్యద్వేదిపై భక్తితో
    నరవిందాసన ముఖ్య దేవతలు జేయంచున్ బ్రశంసింపగా
    కరమొప్పారును పెండ్లి వేడుకలు లోకశ్రేయముల్ గూర్చుచున్

    రిప్లయితొలగించండి
  26. అయ్యా! మిస్సన్న గారూ!

    మీ పార్వతీ కళ్యాణము వర్ణన బాగున్నది. జానక్యాః కమలామలాంజలి అనే ప్రసిద్ధమైన శ్లోకమును అనుకరించేరు. అభినందనలు. శివుని కేశపాశము నీలవర్ణములో ఉండదు. కపిల వర్ణములో నుంటుంది అని నాకు జ్ఞాపకము. ఆ స్వామి వ్యోమకేశుడు అంటే ఆకాశమే సిగగా గలవాడు అని ప్రసిద్ధి.

    రిప్లయితొలగించండి
  27. ఈనాడు శివరాత్రి కదా! అందరి పద్యములు అందచందాలతో సందడిచేస్తూ తాండవమాడుచున్నవి. మిత్రులందరికి పేరు పేరునా శుభాభినందనలు.
    సర్వం శివమయం జగత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. మహా శివ రాత్రి శుభా కాంక్షలతో
    ------
    శివ రాత్రి పర్వ దినమున
    శివ శివ యని బలికి నంత శివ సాయుజ్యం
    భవ! యని బలుకును భవు డును
    శివ శివ యని బలుక రాదె ?శీఘ్రము గాగన్

    రిప్లయితొలగించండి
  29. గురువులకు మరియు కవిమిత్రులకు శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

    ఆముష్మిక భావంబు శి
    వామృతనామములచేతనభ్యుదయంబౌ,
    రామార్చిత కైలాసా
    రాముని భజన లలరు శివరాత్రికి గనుమా.

    రిప్లయితొలగించండి
  30. కం. ప్రామికొని జీవులెల్లరు
    కామేశ్వరు భజన చేయు కాలము నందా
    కామవిరోధి మనంబున
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా

    రిప్లయితొలగించండి
  31. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    అయితే నా పద్యంలో శర్వుని నీల కేశముల బదులుగా శర్వుని వ్యోమకేశముల అనవచ్చునంటారా. ఆకాశం నీల వర్ణంలో ఉంటుంది కదా.

    రిప్లయితొలగించండి
  32. పండిత నేమాని వారూ,
    ఆత్మారామునిపై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    నా పూరణను మెచ్చుకుంటూ బహుమతిగా ఇచ్చిన పద్యానికి ధన్యవాదాలు.
    పార్వతీ కళ్యాణం గురించిన మీ పద్యం శోభాయమానంగా ఉంది.
    మిత్రుల పూరణల గుణదోషాలను తెలిపినందుకు ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ శివస్తోస్త్రం మనోహరంగా ఉంది. ధ్న్యవాదాలు.
    మి గిరిజారాముని పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ మూడు పూరణలూ అందంగా ప్రశంసనీయంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    మీ శివరాత్రి పద్యాలు మనోహరంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    ప్రాస తప్పిన పద్యంలో `నింకెక్కడ జూడగలమె యెరుగుము నరుడా' అందాంఆ?
    *
    శ్యామలీయం గారూ,
    మీ నాలుగు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    మీరు అందించిన అర్ధనారీశ్వర స్తోత్రానికి ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. శ్రీ సుబ్బా రావు గారి పద్యమును చిన్న మార్పులతో ఈ విధముగా చదువుకొందాము:

    శంకరు గొలిచెద నా యభ
    యంకరుడే రక్ష గూర్చు ననిశము భవనా
    శంకరుడే త్రిజగత్పతి
    పంకజభవ ముఖ్య నుతుడు భద్రంకరుడున్
    (టైపు తప్పును సరిజేసిన పద్యము)

    రిప్లయితొలగించండి
  34. అయ్యా మిస్సన్న గారూ!

    శివుని జటాజూటము కపిల/పింగళ/తామ్ర వర్ణములో ఉంటుంది. అందుచేత నీలం ప్రసక్తే రాదు. ఆయన పంచభూతాత్మకుడు కావున ఆకాశము ఆయన జటాజూటముగా చెప్పబడు చున్నది.

    రిప్లయితొలగించండి
  35. నేమాని పండితార్యా ధన్యవాదములు. పట్టును వదల లేకున్నాను.
    అయితే శివుని తామ్ర కేశుడన వచ్చునా? అప్పుడు తలబ్రాలు తామ్రవర్ణము లోనికి మారుతాయి.

    రిప్లయితొలగించండి
  36. పునరుక్తి దోషము:

    మిత్రులారా!
    ఒక పద్యములో ఒకే పదమును ఒకటి కంటె ఎక్కువ సారులు ప్రయోగించుటను పునరుక్తి అంటారు. దానిని దోషముగా చెప్పుతారు. మనకు ప్రతి పదమునకు అనేక పర్యాయ పదములు ఉండునపుడు పునరుక్తి దోషము లేకుండా జాగ్రత్త పడగలము. అప్పుడప్పుడు అట్టి అవకాశము లేకపోవచ్చును. భక్తి రస ప్రధానమైన పద్యములలో పునరుక్తి దోషము కాదు. ఈ విషయములో ఇంకనూ విపులముగా మనము శ్రీ శంకరయ్య గారి నుండి ఒక ప్రత్యేక పాఠముగా తెలుసుకొన గలము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  37. అయ్యా! మిస్సన్న గారూ!
    భక్తిః కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అని శ్రీ మదాది శంకరులే సెలవిచ్చేరు. భక్తి భావముతో ఎలా వర్ణించిననూ దోషము కాదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  38. 1.కామహరుడు,ఫాలాక్షుడు
    కామేశ్వరి పతి ,కపర్ది,గంగాధరుడున్ ,
    సోమేశుడు,కైలాసా
    రాముని భజన లలరు శివ రాత్రికి గనుమా.

    --------------
    2.కామేశ్వరుడైనను ,శ్రీ
    రాముండైనను ,గనగ పరాత్పరుడే యౌ
    నీమముతో జేసిన చాలును
    రాముని భజన లలరు శివరాత్రికి గనుమా .
    ----------------

    రిప్లయితొలగించండి
  39. అయ్యా! గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! హరుడా అని ప్రారంభించిన మీ పద్యమును చూచేను. హరుడా!, స్థిరుడా! మొదలైన సంబోధనలు వ్యాకరణపరముగా సాధువులే గాని, వినుటకింపుగా నుండవు. అందుచేత కొన్ని మార్పులు చేస్తూ మీ పద్యమును ఈ క్రింద వ్రాస్తున్నాను:

    హర! విశ్వంభర! సర్వ పాపహర! హేమాద్రీశజా వల్లభా!
    గరుడస్యందను డెందమందలరు నో గంగాధరా! శంకరా!
    పురుగున్, పామును, బోయవానిని కరిన్ బ్రోవంగలేదా భవా!
    కరుణామూర్తిని నిన్ను వేడుదును నన్ గావంగ రావా శివా!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  40. అయ్యా కమనీయం గారూ!
    మీ పద్యములు బాగుగ నున్నవి. అందులో ఒక పద్యములో 3వ పాదములో గణములు సరిగా లేవు, సరిజేయండి. (నీమముతో చేసిన చాలును)
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  41. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    నా పద్యాన్ని యిలా సవరించాను.

    పార్వతి పద్మ హస్తముల పండిన గోరిట కెంపు చాయకున్,
    శర్వుని తామ్ర కేశముల చాయకు, తెల్లని మేని చాయకున్
    సర్వము మారె వర్ణములు చక్కగ ముత్తెపు సేస లల్లదే
    పర్వపు శోభలీనుచు కపర్ది వివాహపు వేళ కమ్రమై!

    రిప్లయితొలగించండి
  42. ఆముని శివముని యనబడు
    స్వామిగ వినుతింతు రతని సర్వులు వీటన్
    గ్రామము నందున జాతర
    రా! ముని భజన లలరు శివరాత్రికి గనుమా .

    రిప్లయితొలగించండి
  43. శ్రీ మహిమాన్విత శిరిడీ
    ధామమ్మున సాయి నాధు తత్త్వమ్ములతో
    రోమాంచితముగ భక్త వ
    రా! ముని పూజ లలరు శివ రాత్రికి గనుమా

    శ్రీ కళ్యాణ మహేశ్వరుండు నుమ రాశీభూత ప్రేమామృ తా
    స్తోక శ్రీకరులై వివాహ మాడిరి కడున్ శోభాయ మానంబుగా
    నా కళ్యాణ శుభాంగు లాలు మగలై యైరర్థ నారీశ్వరుల్
    లోకారాధ్యులు పూజనీయమయి గ్రాలున్ వారి దాంపత్యముల్

    రిప్లయితొలగించండి
  44. ఆహా, ఈపద్యాలు మొన్న నిషిద్దాక్షరి పద్యాలు చదువుకుంటూ చక్కగా జాగరణ చేయవచ్చండీ.

    విష్ణునందన్ గారి పద్యములు, దండకము కూడా అందరూ చదివి ఉంటారని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  45. ఆర్యా ! నేమాని వారూ ! నే వ్రాసిన శివస్తుతి పద్యమును సొగసైన మార్పులతో శ్రావ్యముగా భక్తి రస ముప్పొంగునట్లు చేసిన మీకు ధన్యవాదములు.
    శంకరార్యా ! ధన్యవాదములు.
    కవిమిత్రుల పద్యములన్నీ శివ మయంగా వెలుగు చున్నవి.

    రిప్లయితొలగించండి
  46. సవరణ…..
    శ్రీ కళ్యాణ మహేశ్వరుండు నుమ రాశీభూత ప్రేమామృ తా
    స్తోక శ్రీకరులై వివాహ విధులన్ శోభాయ మానమ్ము గా
    నా కళ్యాణ శుభాంగు లాలు మగలై యైరర్థ నారీశ్వరుల్
    లోకారాధ్యులు పూజనీయమయి గ్రాలున్ వారి దాంపత్యముల్

    రిప్లయితొలగించండి
  47. పండిత నేమానిగారూ,మీ సూచన మేరకు ఆ పాదాన్ని ఇలా సవరిస్తున్నాను.
    'నీమమె ముఖ్యము కద శ్రీ'
    రాముని ' -అని ధన్యవాదాలు.-కమనీయం.

    రిప్లయితొలగించండి
  48. శ్రీగురుభ్యోనమ:

    రాముని యుత్సవమూర్తికి
    సోముని రూపంబు దిద్ది శోభిల్లంగన్
    గ్రామంబంతయు ద్రిప్పగ
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా

    సోమ = స + ఉమ (పార్వతీ సమేతుడు)

    మా ఊరిలో శివరాత్రికి సీతరాముల విగ్రహములను పార్వతిపరమేశ్వరులుగా అలంకరించి పుష్పపల్లకి ఉత్సవమును, శ్రీరామనవమికి సీతరామలక్ష్మణహనుమంతుల వారికి రథోత్సవము నిర్వహిస్తారు.

    రిప్లయితొలగించండి
  49. సోముని గారాబు సుతుడు
    ధీమంతుడు భాగ్యనగర దిక్పాలకుడౌ
    భీముండు కల్వకుంటడు
    రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా!

    రిప్లయితొలగించండి