17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 3


నిషిద్ధాక్షరి - 3
, , , అక్షరాలను ఉపయోగించకుండా
శివుని స్తోత్రం చేస్తూ
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.


30 కామెంట్‌లు:

  1. డమరుకమును మ్రోగించుచు
    నమరించెను మానవులకు నక్షర మాలన్
    కమనీయముగా వ్రాయగ
    నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.

    రిప్లయితొలగించండి
  2. పరమానందనిధాన! మామక మనఃపద్మాలయా! చిన్మయా!
    గిరిజానాయక! నీ మహా విభవమున్ గీర్తింతు వాగ్దీప్తితో
    పరమార్థప్రద! భక్తపాలక! కృపాపారీణ! మృత్యుంజయా!
    అరివర్గాంతక! ముక్తిదాయక! నినున్ బ్రార్థింతు దేవార్చితా!

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    మూడు కన్నులు కల మూర్తివి నీవు
    మూడు రేఖలు ఫాలమున మాకు ముక్తి

    మార్గము చూపగా, మా మ్రొక్కు తీర్చ
    భర్గుని పూజింతు భక్తితో నేను

    రిప్లయితొలగించండి
  4. నిన్నటి పోస్టులోని శ్రీ నేమాని వారి, ("...ప్రతిదినము ఒక సమస్య ఇచ్చుట అనే విధానమును కూడా మార్పు చేస్తే ఎలా ఉంటుంది? ప్రయత్నించండి మిగతా అనేక ప్రక్రియలు ఉన్నవి కదా") సూచన మేరకు నా స్పందన. రోజుకొక సమస్య అనే దానిని "మీ పద్య పూరణ" అని మార్చి, ఇచ్చే పద్యపాదంలో కొన్ని "సమస్యలు" కానివి కూడా చేర్చవచ్చు. ఉదాహరణకి మాస్టారి చివరి మాటే "తెలుగు పద్య కవిత్వమ్ము వెలుగు గాక". ఇటువంటివాటికి కూడా మంచి భావనాత్మకమైన పూరణలు వస్తాయి. ఏతావాత, ప్రతిదినమూ ఒక క్రొత్త పద్య రచనని ప్రోత్సహించటమే మన ద్యేయం కదా!

    రిప్లయితొలగించండి
  5. గౌరీనాథుని మనమున
    నారాధింపగ నవిద్య నజ్ఞానములున్
    చేరక నిర్మలమగునట,
    ఆరాటమ్ములు తొలగునటంచును చెపుమా!

    రిప్లయితొలగించండి
  6. నిన్నటి మాటకు నేనూ పూరణ సరదాగా చేసి పేస్ట్ చేస్తుండగా కరెంటు పోయింది. ఈనాటి పూరణ మాత్రమే ప్రచురింపబడింది. ఇప్పుడు గురువుగారి మాటకు...

    చతురతను పూరణల చేయు సదయ రూపి
    శంకరుండిట గురువుగ సాయపడుచు
    పద్యరచనలు నేర్పగ పామరులకు
    తెలుగు పద్యకవిత్వమ్ము వెలుగుగాక.

    రిప్లయితొలగించండి
  7. మూడు కన్నులు గలిగిన మూర్తి వాని
    గొలువ భక్తిని , భూతిని గూర్చు మనకు
    ఫాల నేత్రుని గొలువ ఫలము మెండు
    భజన జేయుడు నిరతము భక్తు లార!

    రిప్లయితొలగించండి
  8. కం. భవబంధవిమోచనచణ
    ధవళాచలనిలయ దైత్యదర్పాంతక ఫా
    లవిలోచన గిరిజావర
    అవదాతాంభోజగాత్ర హర కరుణాబ్దీ.

    రిప్లయితొలగించండి
  9. హర అనేశాను గాని 'హ' నిషిధ్ధంగదా. ఈ బ్లాగులో కామెంటును తీసి వేయటం ప్రస్తుతం అసాధ్యంగా ఉంది. అందుచేత అదలాగే వదలి, 'హ'ను పరిహరించి సరిజేసిన పద్యం:

    కం. భవబంధవిమోచనచణ
    ధవళాచలనిలయ దైత్యదర్పాంతక ఫా
    లవిలోచన గిరిజావర
    అవదాతాంభోజగాత్ర యమనిర్మథనా

    రిప్లయితొలగించండి
  10. బ్రతికి నన్నాళ్లు మాకంట బడవు గాని
    చచ్చి బూడిద యైనంత వచ్చి చితిని
    బూది వళ్లంత పులుముకు బోదు , విదియ
    జనన మరణాల మర్మంబు? జంగమయ్య!

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె. నుదుట మూడు కనులు నెదుట దేవ మునులు
    నెత్తి మీద నోటి నీటి కుండ
    వెండికొండ యున్కి భిక్షంబు తోమన్కి
    కలిగి లోక మెల్ల కాచు భవుడు

    రిప్లయితొలగించండి
  12. ఆర్తుల రక్ష జేయు, జగమంతయు నిండిన వేల్పు, నిర్మలా
    పూర్తి దయాంతరంగుడు, విభూతినమేయుడు, వేదరూపుడై
    కార్తికమందు పూజలనఖండముగాగొనుచున్న దక్షిణా
    మూర్తికి మ్రొక్కెదన్, భవవిమోచన దేవునకాదిదేవుకున్.

    ఆపూర్తి = పరిపూర్ణమైన,

    రిప్లయితొలగించండి
  13. నా పద్యము 2వ పాదములో "హా" అనే అక్షరమును గమనించలేదు. చిన్న మార్పుతో ఆ పద్యమును మళ్ళీ వ్రాస్తున్నాను:

    పరమానందనిధాన! మామక మనః పద్మాలయా! చిన్మయా!
    గిరిజానాయక! నీదు వైభవములన్ గీర్తింతు వాగ్దీప్తితో
    పరమార్థప్రద! భక్తపాలక! కృపాపారీణ! మృత్యుంజయా!
    అరివర్గాంతక! ముక్తిదాయక! నినున్ బ్రార్థింతు దేవార్చితా!

    రిప్లయితొలగించండి
  14. నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
    ననువిడిపోవు తత్క్షణమె, నాకములన్నియు నన్నుచేరునే!
    మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
    వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!

    ఇంటికి నీవె దైవమయి యెప్పుడు బ్రోచుచు నుండువానివే!
    కంటికి రెప్పవై మముల కాచెడు జంగమవీవు దేవరా!
    మంటను కంటిలో గలిగి మన్మథ మాయను గెల్చువానిగా
    బంటుల తోడునీడవయి భక్తిని పెంచుము రక్తి వీడగన్.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా! అందరికీ అభినందనలు.
    ఈనాటి పద్యాలు శివభక్తి రంగస్థలముపై మనోహరంగా తాండవమాడు చున్నవి.
    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీపతి శాస్త్రి గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి మందాకిని గారికి, శ్రీ సుబ్బారావు గారికి, శ్రీ శ్యామలరావు గారికి, శ్రీ రాజారావు గారికి, శ్రీ సంపత్కుమార్ శాస్త్రి గారికి హార్దిక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మరొక పూరణ చిత్తగించండి:

    మ. నిను పూజింపని వారు వెఱ్ఱు లకటా నీయందు చిత్తంబు ని
    ల్పినవా డెన్నడు నెట్టి దుర్గతులు నే చీకాకులుం బొందకం
    గను నీ బుద్బుద ప్రాయమైన తనువుం కాలంబు గా ద్రోచి ము
    క్తిని ముక్కంటి త్వదంఘ్రియగ్మమును భక్తిం గొల్తు నేవేళలన్

    రిప్లయితొలగించండి
  17. మిత్రులారా,
    నేమాని వారన్నట్లు ఈరోజు బ్లాగంతా శివమయమే అయింది. పూరణలను పంపిన కవులకు, చదివి ఆనందిస్తున్న బ్లాగు వీక్షకులకు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదిందు గాక!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మాహేశ్వర సూత్రాలను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘వాగ్దీప్తి’ నిండిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘శంకరాభరణం’లో మొట్టమొదటి ద్విపద మీదే అనుకుంటా.
    అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ప్రతిదినం ఒక సమస్య ఇవ్వడం నాకొక వ్యసనంగా మారిందనిపిస్తున్నది. ఎందుకంటే కారణాంతరాల వల్ల ఏరోజైనా సమస్య ఇవ్వకుంటే ఏదో అపరాధభావం, వెలితి ఆ రోజంతా నన్ను బాధిస్తాయి. ఎన్ని ముఖ్యమైన పనులున్నా, ఆరోగ్యం సహకరించకున్నా, మనస్సును కలతపెట్టే సమస్యలు వచ్చినా, మరో ఊళ్ళో ఉన్నా ప్రతిరోజు ఉదయం ఆరున్నర - ఏడు గంటల మధ్య సమస్యను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. కాకుంటే కొంతకాలంగా తీరిక లేక, మనస్సు బాగా లేక మిత్రుల పూరణలను వెంటవెంటనే సమీక్షించలేక పోతున్నాను. పండిత నేమాని వారు, శ్యామలీయం గారు (అప్పుడప్పుడు డా. విష్ణునందన్ గారు) మిత్రుల పూరణల గుణదోషాల గురించి వ్యాఖ్యానిస్తూ సలహాలు ఇస్తూ నాకు కొంత శ్రమ తగ్గిస్తున్నారు. వారి కెంతగానో ఋణపడి ఉన్నాను.
    మిత్రులలో కూడా రోజూ సమస్యలను పూరించాలనే ఆసక్తి, ఉత్సాహం, శక్తి ఉండి క్రమంతప్పకుండా పూరణలు చేసున్నవారు ఉన్నారు. ఏరోజైనా సమస్యను ఇవ్వకుంటే నిరుత్సాహపడేవాళ్ళూ ఉన్నారు.
    కాబట్టి ఇది ఇలా కొనసాగనీయండి.
    ‘పద్యరచన’ అనే శీర్షికను ప్రారంభించాలన్న ప్రయత్నం ఇంకా కార్యరూపం దాల్చలేదు. చూద్దాం..
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ, పద్యం రెండూ చాలా బాగున్నాయి.
    రెండు వృత్తాలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి వృత్తంలో ‘క్ష’ ప్రయోగించారు. అది కకార, షకార సంయుక్తం కదా!
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరన ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘గొలువ’ అన్నచోట ‘గొలుగవ/ గొలిచిన’ అంటే సరి!
    *
    ‘శ్యామలీయం’ గారూ,
    ఫాలవిలోచనుడిపై మీ మొదటి పూరణ ఉత్తమంగా ఉంది.
    మీ రెండవ పూరణ శబ్దాలంకార శోభితమై అలరిస్తున్నది.
    మూడవ పూరణ సర్వాంగశోభితమై అలరారుతున్నది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    జంగమయ్య మీద మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మనోహర శబ్ద సంపత్తుతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు.మీ అభిప్రాయము సరియైనదే. కాకుంటే రోజుకొక్క సమస్యను రకరకాలుగా...దత్తపది ..నిషిద్ధాక్షరి..వర్ణన... క్రొత్త ఛందస్సును పరిచయం చేస్తూ... మాకు వాటిని వ్రాసే అవకాశం ఇస్తూంటే ...

    'క్ష 'వాడకూడదని చెప్పారు. నా పూరణ లో కూడా 'క్ష' ఉన్నది.కనుక సవరణ తో..

    డమరుకమును మ్రోగించుచు
    నమరించె ' అ ఆ ' ల నన్ని నరులకు, పదముల్
    కమనీయముగా వ్రాయగ
    నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.

    రిప్లయితొలగించండి
  19. తలను సెలయేరు తనువున తరుణి మేన
    పాము లన్నము గరళము బట్ట తోలు
    భటులు భూతాలు కాడిల్లు వామదేవు
    డొక్కడేగాక వేరొకండుండు నొక్కొ!

    రిప్లయితొలగించండి
  20. సవరించిన పద్యము:

    తలను గంగమ్మ తనువున తరుణి మేన
    పాము లన్నము గరళము బట్ట తోలు
    భటులు భూతాలు కాడిల్లు వామదేవు
    డొక్కడేగాక వేరొకండుండు నొక్కొ!

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమ:

    ఫాలవిభూతిరేఖలను పాముల మాలలు కంఠమందునన్,
    నేలను నింగి తానగుచు నిల్చిన దేవుడు దివ్యతేజుడై
    యాలలితాంబనాథునకు నంజలి జేతు వినమ్ర చిత్తుడై
    వ్రాలెద భక్తి భావమున పాదము చెంతన పార్వతీపతీ

    గురువుగారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. గుగ్గిలం నాయనారట
    గుగ్గిలపు పొగను ముంచి గోపతి ప్రీతిన్ !
    గగ్గోలు పడుచు భక్తిని
    గుగ్గిల మే గుడిని నింపి కపర్ధిని గొలిచెన్ !
    -------------------------------------------------
    గుగ్గిలం నాయనార్ = కలయ నాయనార్
    ---------------------------------------------------
    ఇతర దేశము లందున హితము గాను
    అతిశయ మ్ముగ నేర్చెద రాదరమున
    మధుర మైనట్టి సంపద మాతృ భాష
    తెలుగు పద్య కవిత్వమ్ము వెలుగు గాక !

    రిప్లయితొలగించండి
  23. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ___________________________________

    కాలి చెప్పుల తోడ - కసుమాలమును దీయ
    కరుణాంత రంగమ్ము - గాచు వాని

    నోటితో దెచ్చిన - నీటినే తలనిడ
    పులకాంకితుండయి - ప్రోచు వాని

    రుచిచూచి పలలంబు - రోతగా నిడినను
    నిత్య కైవల్యంబు - నిచ్చువాని

    అడవిలో తిరుగాడు - యా బోయ తిన్నడి
    యార్తికే తలయూచి - యరయు వాని

    వాకదాలుపు, వర్ధను - వామదేవు
    వాడు వీడని దలపక - తోడు నిలచు
    వాని బ్రార్థింతు , మనమున - పూనియుండి
    వార్థి దాటించ మంచప - మర్థ మొలుక !
    ___________________________________
    అరయు = రక్షించు
    అపమర్థము = ఆర్తి

    రిప్లయితొలగించండి
  24. 02)
    ___________________________________

    విల్లుతో తలమీద - వేగంగ మ్రోదంగ
    ముదితుడై భక్తుల - మొనయు వాని

    ఆ లింగమును భక్తి - నాలింగనము జేయ
    కాలునే నిర్జించి - కాచు వాని

    కరములతో బట్టి - కరువనే యెత్తంగ
    కోరిన వరములన్ - గూర్చు వాని

    కనుమూయు పాపియే - కడముట్ట్తు కోరంగ
    కరి చర్మమును గట్టి - తిరుగు వాని

    కాలకాలుని , కామారి - కాల కంఠు
    గంగ ధరుని, గజరిపువు; - కరుణ జూపి
    కలుష జన్ముల మమ్ముల - గావు మనుచు
    కరువు దీరంగ ప్రార్థింతు - కంఠమెత్తి !
    ___________________________________
    ముదితుడు = సంతోషించిన వాడు
    మొనయు = ప్రత్యక్షమగు
    కరువ = కొండ(కైలాసము)
    కడముట్ట్తు = సిద్ధించు

    రిప్లయితొలగించండి
  25. 02అ)
    ___________________________________

    విల్లుతో తలమీద - వేగంగ మ్రోదంగ
    ముదితుడై భక్తుల - మొనయు వాని

    ఆ లింగమును భక్తి - నాలింగనము జేయ
    కాలునే నిర్జించి - కాచు వాని

    కరములతో బట్టి - కరువనే యెత్తంగ
    కోరిన వరములన్ - గూర్చు వాని

    కనుమూయు పాపియే - కడముట్టుకోరంగ
    కరి చర్మమును గట్టి - తిరుగు వాని

    కాలకాలుని , కామారి - కాల కంఠు
    గంగ ధరుని, గజరిపువు; - కరుణ జూపి
    కలుష జన్ముల మమ్ముల - గావు మనుచు
    కరువు దీరంగ ప్రార్థింతు - కంఠమెత్తి !
    ___________________________________
    ముదితుడు = సంతోషించిన వాడు
    మొనయు = ప్రత్యక్షమగు
    కరువ = కొండ(కైలాసము)
    కడముట్టు = సిద్ధి

    రిప్లయితొలగించండి
  26. 02ఆ)
    ___________________________________

    విల్లుతో తలమీద - వేగంగ మ్రోదంగ
    ముదితుడై భక్తుల - మొనయు వాని

    ఆ లింగమును భక్తి - నాలింగనము జేయ
    కాలునే నిర్జించి - కాచు వాని

    కరములతో బట్టి - కరువనే యెత్తంగ
    కోరిన వరములన్ - గూర్చు వాని

    కనుమూయు పాపియే - కడముట్టుకోరంగ
    కరి చర్మమును గట్టి - తిరుగు వాని

    కాలకాలుని , కామారి - కాల కంఠు
    గంగ ధరుని, గజరిపువు; - కరుణ జూపి
    కలక జన్ముల మమ్ముల - గావు మనుచు
    కరువు దీరంగ ప్రార్థింతు - కంఠ మెత్తి !

    ___________________________________
    ముదితుడు = సంతోషించిన వాడు
    మొనయు = ప్రత్యక్షమగు
    కరువ = కొండ(కైలాసము)
    కడముట్టు = సిద్ధి
    కలక = కలుషము

    రిప్లయితొలగించండి
  27. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సూచనను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను.
    మీ పూరణలోని ‘క్ష’ను నేను గమనించనేలేదు సుమండీ!
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా అందంగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘చేతు వినమ్రచిత్తుడై’ అన్న దానిని ‘చేతు వినమ్రచిత్తతన్’ అంటే బాగుంటుందేమో?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    మొదటి రెండవ పాదాలలో గణదోషం, నాల్గవ పాదంలో యతిదోషం. నా సవరణలతో మీ పద్యం ....
    గుగ్గిలము నాయనారట
    గుగ్గిలపుం బొగను ముంచి గోపతి ప్రీతిన్ !
    గగ్గోలు పడుచు భక్తిని
    గుగ్గిల మే గుడిని నింపి గొలిచె కపర్దిన్.

    ఇక మీ ‘తెలుగు పద్యకవిత్వ’ పద్యం సూపర్! ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. శంకరార్యా
    నమస్కారం
    వినమ్ర చిత్తతన్ అనడం సాధుప్రయోగమేనా?? చిత్తతన్ అనే ప్రయోగం సబబేనా?? దయచేసి కాస్త వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  29. నేను కూడా నా రెండవ పద్యంలో "భిక్షంబు తోమన్కి" అని 'క్ష' ను ఉపయోగించాను. ఈ 'క్ష' అనేది ప్రత్యేకాక్షరమా లేక సంయక్తాక్షరమా అన్న ప్రశ్న వస్తున్నది. ఒకవేళ సంయక్తాక్షరమే అయితే వర్ణమాలలో దానికొక ప్రత్యేక స్థానం దేనికి? ఈ చర్చ అలాగు ఉంచి, 'క్ష'ను పరిహరించాలనుకుంటే, "బిచ్చంబు తోమన్కి" అని మారిస్తే పద్యం నియమానుసారిగా సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  30. గురువు గారు,
    ధన్యవాదాలు. అప్పుడు తత్క్షణమె అన్న పదాన్ని నిక్కముగ అని మారుస్తున్నాను. ఇంకా మత్తేభము, శార్దూలము ల్లో వ్రాశాను. నచ్చిన అన్ని ఛందాల్లో అని అన్వయించుకున్నాను ఈ శివరాత్రి సందర్భంగా. శివానందలహరి ఈ రోజుటి పోస్ట్ లో ప్రచురిస్తాను. అన్నీ కలిపి.

    రిప్లయితొలగించండి